1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

72 - ఇంద్రనీలమణి లక్షణాలు, పరీక్షావిధి

ఎక్కడ సింహళ దేశపు రమణులు లవలీ అనే సుగంధిత పుష్పాలతో వాటి వాసనలతో మనసును దోచే వృక్షాలనూ, పొగడలనూ తమ కరాగ్రాల స్పర్శచే కరుణిస్తుంటారో అక్కడ మహాదాత బలాసురుని వికసిత కమల సదృశ శోభలతో వెలిగే కన్నులు వచ్చి పడినవి. రత్న సమాన కాంతులీను ఆ నేత్రప్రభతో సముద్రతీరమంతా వెలుగులమయమై భాసించింది. అక్కడొక విశాలమైన క్షేత్ర మేర్పడింది. అక్కడే ఇంద్రనీలమణులకు గని కూడా ఏర్పడింది. అయితే అక్కడ అన్ని మణులూ లభిస్తాయి. ముఖ్యంగా అక్కడి మరకతమణులు అన్ని రంగుల్లోనూ వుంటాయి. - శ్రీ కృష్ణబలరాములు ధరించే పట్టుపంచెల వలె పచ్చగా, నీలంగా, నల్ల తుమ్మెద రంగులోనూ, శారంగధనుడ్యుక్తమైన విష్ణు భగవానుని భుజకాంతులతో, హాలాహలధరమైన శివుని కంఠం రంగులో కూడా వుంటాయి.

ఆ సాగర తీరానికీ అక్కడ పర్వతానికీ నడుము నున్న క్షేత్రం ఎన్నో జాతి రత్నాలకు నెలవుగా మారింది. వాటిలో కొన్ని తేట నీటి తరంగాలు తెలుపుతో ప్రకాశించగా కొన్ని మయూర వర్ణంలో దర్శనమిస్తాయి. మరికొన్ని నీటి బుడగల వలె నుండగా ఇంకొన్ని కోయిల గొంతు వలె నిగనిగలాడతాయి. వీటన్నిటిలోనూ సమానమైన నిర్మలతా, ప్రభాశక్తుల భాస్కరతా బలీయంగా వుంటాయి. అయితే, ఆ పర్వత రత్నగర్భంలో దొరికే అన్ని రకాల రత్నాలలోకీ పరమశ్రేష్టము, అత్యధిక గుణశాలియైనది ఇంద్రనీలమణి.

ఈ మణులలో మట్టిమరకలు, మలినాలు ఉండిపోయినవి, కరకరమని శబ్దం వచ్చేవీ, నీలాకాశాన్ని కప్పే నల్లమబ్బుల రంగున్నవి మంచివి కావు. అవి వర్ణదోషదూషితాలు. వీటి మధ్యలోనే రత్నశాస్త్ర కోవిదులు ప్రశంసలతో ముంచెత్తే ఇంద్రనీలమణులు ఎక్కువగా జన్మిస్తాయి.

 పద్మరాగమణిని ధరిస్తే కలిగే సత్ఫలితాలన్నీ ఇంద్రనీలమణిని ధరించినవారికీ కలుగుతాయి. ఈ మణిలో కూడా మూడు జాతులు కనిపిస్తున్నాయి. మణి యొక్క రత్న పరీక్ష కూడా రెండింటికీ ఒక్కటే.

అగ్ని పరీక్ష మణి నిర్దారణకి మాత్రమే చేయాలి గానీ మణిని మరింత వన్నెచిన్నెలతో శోభిల్లేలా చేయడానికి అగ్నిలో పడవేయరాదు. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. సద్గుణయుక్తమైన మణి దోషదూషితమై తనను అగ్నిలో అశిగా వేయించిన వానికీ వేసినవానికీ కీడును కలిగించవచ్చు.

గాజు, కలువ, గన్నేరు, స్పటిక, వైఢూర్యాది మణులు (ఇవన్నీ మణుల్లో రకాలే) ఇంద్రనీలమణి యొక్క పోలికలతో, గుణాలతో వున్నా కూడా రత్నశాస్త్రజ్ఞులు, ఇంద్రనీలమణే వైపే మొగ్గు చూపుతారు. అందుచేత వీటిని క్షుణ్ణంగా పరీక్షించాలి. ముఖ్యంగా గురుత్వ కఠినత్వాలను చూడాలి. ఇంద్రనీలమణికి  మధ్యలో ఇంద్రాయుధమైన వజ్రాయుధం కనిపిస్తే ఇక దానిని మించిన రత్నమే లేదు.

ఒక ఇంద్రనీలమణిని తీసుకొని దానికి  వందరెట్లు పరిమాణమున్న స్వచ్ఛమైన పాలలో పడేస్తే, ఆ పాలన్నీ నీలవర్ణంలోకి వచ్చివేస్తే అది అచ్చమైన మణి. దీనిని మహా నీలమణి అని కూడా అంటారు. ఎలాగైతే మాశాడులతో మహాగుణశాలియైన పద్మ రాగమని తూస్తారో అలాగే సువర్ణ పరిమాణ (ఎనభై రత్తీలు) ములతో మహా గుణశాలియైన ఇంద్రనీలమణిని తూస్తారు”.