1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

188 - 189 -  ప్రణ, నేత్రరోగ, దంతక్రిమి, విషాదిక, వివిధ జ్వరాదిక చికిత్స

సూదిగా మొనదేలిన ఆయుధం వల్ల శరీరంపై ఏర్పడిన కోతగాయాలలో వెంటనే వెన్నకూరితే వాచకుండా, చీముపట్టకుండా వుండి త్వరగానే మానిపోతాయి. రక్తం మరీ ఎక్కువగా పోతుంటే అపామార్గవేళ్ళను అరచేతుల మధ్య నిడుకొని గట్టిగా పిండుతూ, వచ్చేరసాన్ని గాయంమీద పడేలా పోస్తే రక్తం కారడం ఆగుతుంది.

ఓ రుద్రదేవా! ఏదేనా ఆయుధపు మొనగాని మరే బాహ్యవస్తువుగాని మనిషి గాయంలో ఇరుక్కుని వుండిపోతే లాంగలిక, హిజ్జల మూలాలను బాగా పిండి ఆ రసం గాయంపై పడేలా వేయాలి. ఆ బాహ్య వస్తువు లోపలికి వెళ్ళీ ఎంతకాలమైనా గాని, వెంటనే పైకి వస్తుంది. గాయాలు కాని, కురుపులుగాని చర్మంపై ఏర్పరచిన రంధ్రములు, గోతులు, చీలికలు మున్నగువాటి పై బలవేళ్ళనుగాని మేషశృంగిని గాని గుండచేసి నీటితో పలాస్తిని తయారుచేసి దానిని అద్దితే అవి తగ్గిపోయి చర్మం మరింతగా శోభిస్తుంది. అలాగే కంకుమూలపు గుoడ కూడా. గోగికి ఈ దశలో కోద్రమ అన్నాన్నీ, గేదెపెరుగునూ మాత్రమే ఆహారంగా ఇవ్వాలి.

రక్తంలో మాలిన్యాలేర్పడితే శరీరంపై కురుపులు, మచ్చలు పుట్టుకొస్తాయి. అవి పూర్తిగా తగ్గిపోయి రక్తం మరల బాగుపడాలంటే బ్రహ్మయష్టి పండ్లను నూరి, గుండచేసి నీటితో ముద్దచేసి ఒంటికి పట్టించాలి. రాచపుండు, గడ్డ వంటి మొండి కురుపులు సైతం యవ, విడంగ, గంధపాషాణ, శొంఠిలను గుండ నూరి దానికి తొండ లేదా ఊసరవెల్లి రక్తాన్ని కలిపి ముద్దజేసి రాస్తే పోతాయి. హే గరళకంఠా! అగస్త్య పుష్పాలపొడీ, మిరియాలపొడి కలిపి సేవిస్తే కడుపునొప్పులన్ని రకాలూ నశిస్తాయి. పాముకుబుసం, హింగు, వేపాకులు, యవలు, తెల్లావాలు, కలిపి పటాస్తి చేసి వాడితే భూతప్రేతాల వల్ల వచ్చేరోగాలు తగ్గుతాయి. గోరోచన, మరిచ, పిప్పలి, సైంధవ, తేనెల మీశ్రమంతో కాటుకను తయారుచేసి వాడినా భూతప్రేతాల ప్రభావం పడదు. గుడ్లగూబ తోకను గుగ్గిలంతో ధూపం వేస్తే దుష్టగ్రహపీడ వదలిపోతుంది. చాతుర్థక జ్వరంతో బాధపడుతున్న వానికీ నల్లగుడ్డను కప్పి ఇందాకటిలాగే ధూపం వేస్తే ఆ జ్వరం తగ్గిపోతుంది.

తెల్ల అపరాజిత పూల రసాన్ని కంటిలోకీ జారిస్తే దాని చుట్టు నున్న వలయాలు మాయమవుతాయి. ఓ నీలలోహితా, ఓ సురాసుర విమర్దనా! గోక్షుర మూలాలను నమలడం ద్వారా దంతములలో చేరు క్రిములను సమూలంగా నాశనం చేయవచ్చు. వృశ్చిక వేరుని నీటిలో కలిపి రాత్రంతా అలాగే వుంచి తెల్లారగానే తాగితే జ్వరం వలన వచ్చే మంటలు ఆరతాయి. దానినే వాస్యను కడిగిన నీటితో కలిపి తాగితే ఏ విషమైనా విరిగిపోతుంది. లజ్జాలుక వేరుని తన వీర్యంలోనే ముంచి ఎవరి చేతిలోనైనా పెడితే వానికి వారి వల్ల ఎటువంటి ఆపదా రాదు.

పాఠవేళ్ళను ముందుకు తగినట్లుగా శుద్ధిచేసి ఆవు వెన్నతో కలిపి తాగిన వానిపై ఏ విషమూ పనిచేయదు. రక్తచిత్రకవేరు, శిరీష రసాలను వాస్యజలంతో కలిపి చెవిలో వేస్తే పచ్చకామెర్లూ, సర్వతాపజ్వరాలు తగ్గిపోతాయి. క్షయరోగానికి మూడురోజులపాటు కోకిలాక్షను మేకపాలతో కలిపి త్రాగడం మంచి మందు.

మూడురకాల వాత రక్తవ్యాధులూ కొబ్బరిపూవును మేకపాలతో కలిపి స్వీకరిస్తే సమసిపోతాయి. సుదర్శన మూలాలను దండగుచ్చి మెడలో వేసుకుంటే త్ర్యాహిక జ్వరం పోతుంది. గ్రహదోషాలనుండీ, దెయ్యాలనుండీ రక్షణ లభిస్తుంది. అలాగే చంద్రుడు పుష్యనక్షత్రంలో ప్రవేశించినపుడు గుంజవేళ్ళను సేకరించి నోటిలో పెట్టుకుంటే విషాలన్నీ విరిగిపోతాయి. గుంజమొక్క వేళ్ళతో పాటు కాండాలను మణికట్టుకి గానీ, మెడకు గానీ చుట్టుకుంటే దుష్టగ్రహాల, శక్తుల ప్రభావం సోకదు - కృష్ణపక్ష చతుర్దశినాడు ఈ గుంజ ప్రభావం ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఆ రోజు ఆ వేళ్ళనూ కాండాలనూ వాడడం ప్రశస్తం.