1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

126 - విష్ణుమండల పూజావిధి

 “భుక్తి ముక్తిప్రదాయకం, పరమగతి ప్రాప్తిదం ఐన మరొక శ్రేష్ఠ పూజను విధి విధానయుక్తంగా వర్ణిస్తాను వినండి” అంటూ బ్రహ్మదేవుడు విష్ణుమండల పూజను వర్ణించసాగాడు.

ప్రతి ముందొక సామాన్య పూజామండలాన్నే నిర్మించి దాని ద్వారం దగ్గర పూజను మొదలుపెట్టాలి. ద్వారప్రదేశంలోనే ముందుగా ధాత, విధాత, గంగా యమునలనూ తరువాత శ్రీ, దండ, ప్రచండ, వాస్తు పురుషులనూ పూజించాలి.

తరువాత మండల మధ్యభాగంలో ఆధారశక్తి కూర్మదేవ, అనంతులను పూజించాలి.

పిమ్మట పృథ్వీ, ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, అధర్మ అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కంద, నాళ, పద్మ, కర్ణిక, కేసరాది భాగాలపై పూజించి, సత్వ రజస్తమో గుణాలను కూడా పూజించాలి. తరువాత యథావిహిత స్థానాల్లో సూర్యాదిగ్రహాలనూ, విమలాది శక్తులనూ అర్చించాలి.

తరువాత మండల కోణ భాగాలలో దుర్గ, గణేశ, సరస్వతి, క్షేత్ర పాలుడగు స్వామీలను పూజించాలి. అప్పుడు వాసుదేవుని ఆసనాన్నీ దానిపై వుంచిన మూర్తులనూ పూజించి వాసుదేవ, బలభద్రుల స్మరణను కొంతసేపు గావించి ఆపై అనిరుద్ధునీ, నారాయణఖునీ పూజించాలి. అపుడు నారాయణుని సంపూర్ణ పూజను -అనగా హృదయాది సర్వాంగములనూ, శంఖ చక్రగదా ఆయుధాలనూ అర్చీంచాలి. అనంతరం శ్రీ, పుష్టి, గరుడ, గురు, పరమగురువులనూ, ఇంద్రాది అష్టదిక్పాలకులనూ (వారి వారి దిశలలోనే) పూజించి మండల పైభాగంలో బ్రహ్మనీ, క్రింది భాగంలో నాగదేవతనీ పూజించాలి. ఆగమశాస్త్రంలో చెప్పబడిన విధంగా చోటును చూసి ఈశానకోణంలో విష్వక్సేనుని పూజించడంతో మంగళకరమైన మండలపూజ సంపూర్ణమవుతుంది.

ఈ విధంగా విష్ణుమండలపూజను గావించినవారు మహాత్ములవుతారు. వారికీ పునర్జన్మ వుండదు.

(ఇందులో పేర్కొనబడిన దేవతలందరినీ మంత్ర సహితంగా ఎలా పూజించాలో ఈ పురాణంలోనే అధ్యాయాలలో చెప్పబడింది)