1 - గరుడ పురాణము - ఆచార కాండము
183 - గ్రహణి, అతిసార, అగ్నిమాంద్య ఛర్ది, అర్శాది రోగాల చికిత్స
హే చంద్రమౌళీశ్వరా! నల్లమిరప, శృంగబేర, కుటజం బెరడులను త్రాగడం ద్వారా (అతిగ్రహణిని, సాగను) ఆపవచ్చును. అతిసార రోగాన్ని వినష్టం చేసే మందును పిప్పలి, దానివేరు, నల్లమిరప, తగర, పచ, దేవదారు రసం, పాఠామూలములను పాలలో పిసికి తయారుచేయవచ్చును. మరిచ, తిలలతో చేసిన మందు తాపాన్ని పోగొడుతుంది. (ఇందులో నువ్వులను కాకుండా నువ్వు పువ్వులను వాడాలి.) సమపాళ్ళలో హరీతకి, బెల్లంలను గైకొని తేనెతో కలిపి తీసుకుంటే విరేచనం అవుతుంది. తొడల పక్షవాతం (ఊరుష్టంభం) త్రిఫల, చిత్రక, చిత్ర, కటుక రోహిణిల మిశ్రమాన్ని సేవిస్తే తగ్గుతుంది. ఈ మందు కడుపుని కడిగేస్తుంది. మరీ మొండి ఊరుష్టంభమైతే హరీతకి, శృంగవెర, దేవదారు, చందనాలను అపామార్గ లేదా జయంతి వేగులను మేకపాలతో కలిపి చేసిన ద్రవంతో కలిపి కషాయం చేసి వారం రోజుల పాటు తాగితే పూర్తిగా తగ్గిపోతుంది.
అనంత, శృంగవెరలను బాగా చూర్ణించి గుగ్గిలం, బెల్లాలను సమపాళ్ళలో తీసుకొని దానికి కలిపి ఆ మిశ్రమం నుండి గుళికలను తయారుచేసుకొని తింటే వాయుదోషాలు, నరములపై ఒత్తిడులు, ఎముకలలో తేడాలు, అజీర్ణం బాగా తగ్గుతాయి.
పుష్య నక్షత్రంలో చంద్రుడున్న వేళ శంఖపుష్టి మొక్కను వేళ్ళతో ఆకులతో సహా నూరి మేకపాలలో వండి వుంచుకొని ఆవేశంతోనో దుఃఖంతోనూ అరుస్తూ పడిపోయే1 మూర్ఛజబ్బు గలవారికి వేస్తే వారు పూర్తిగా స్వస్థులవుతారు. సమపాళ్ళలో అశ్వగంధ, అభయాలను తీసుకొని తయారుచేసిన కషాయం రక్తపిత్త రోగాన్ని బాగా కుదర్చగలదు. కుష్ఠ, హరీతకిలను కలిపి చూర్ణంచేసి ఓ గుప్పెడు నోట్లో వేసుకొని మంచినీళ్ళు తాగేస్తే ఎంత మొండి వాంతులైనా ఆగిపోతాయి. గుడూచి, పద్మక, అరిష్ట, ధన్యాక, రక్తచందనాల కషాయం, పిత్తజనిత జ్వరాన్నీ, కఫజ్వరాన్నీ, వాంతులనీ, మంటనీ, దాహాన్నీ నివారించి జీర్ణవ్యవస్థను మెరుగుపఱుస్తుంది.
(1. దీనిని ప్రస్తుత భాషలో హిస్టీరియా అంటారు.)
ఓంహుం నమః అనే మంత్రాన్ని మననం చేస్తూ శంఖపుష్పిని రెండు చెవులకూ ధరించాలి. తరువాత చాతుర్థక వంటి తీవ్ర జ్వరాలతో బాధపడుతున్న రోగి వద్దకు పోయి ఒక చెవి నుండి పుష్పాన్ని తీసి చేత బట్టుకొని
ఓం జంభినీ స్తంభినీ మోహయ సర్వవ్యాధిన్
మే వజ్రేణ ఠఃఠః సర్వ వ్యాధిన్ మే వజ్రేణ ఫట్
అనే మంత్రాన్ని ఎనిమిది వందలమార్లు పఠించి ఆ పూలపును రోగి చేతికిచ్చి రోగి గోరును ముట్టుకుంటే ఏ జ్వరమైనా వెంటనే దిగిపోతుంది. జంబూఫల, హరిద్రాలను పాము కుబుసంతో కలిపి కాపడం పెడితే అన్ని రకాల జ్వరాలూ నశిస్తాయి. కరవవీర, భృంగపత్ర, లవణ, కుష్ఠ, కర్కటాలను ముద్దచేసి నూనెతో మరగించి తీసి దానికి నాలుగింతల పరిమాణంలో గోమూత్రాన్ని కలిపి బాగా కుదిపి శరీరంపై చిలకరిస్తే దురదలు నశిస్తాయి. విచర్చిక, కుష్టలకూ ఇది మంచి మందే. లోపలి 2కురుపులూ పోతాయి.
(2.దీనిని ప్రస్తుత భాషలో అల్సర్స్ అంటుంటారు.)
ప్లీహ వ్యాకోచానికి పిప్పలి తేనెలను కలిపి గాని, శూరణ దుంపవేరు గాని మంచి నివారణనిస్తాయి. పిప్పలి, హరిద్రలను గోమూత్రంతో కలిపి ముద్దగా జేసి గుదము ద్వారా వీలైనంత లోనికి జోనిపితే మొలలు3 పోతాయి. ఆర్ద్రకాన్ని మేకపాలతో కలిపి తాగినా ప్లీహవ్యాకోచం నిమ్మళిస్తుంది. సైంధవ, విడంగ, సోమరాజి, సర్షప, రెండు రకాల రజని, విషాలను గోమూత్రంతో కలిపి ముద్ద చేసి కుష్ఠురోగికి ఆకురుపులపై వేసి వేపాకుతో కప్పి వుంచితే ఆ రోగం తగ్గుతుంది.
(3.దీనిని ప్రస్తుత భాషలో పైల్సు అంటుంటారు.)
