1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

113, 114 - నీతిసారం

రాజు తన భృత్యుల శీలం విషయంలో బాగా నిక్కచ్చిగా వుండాలి.ఎవరిలో లోపం కనిపించినా వెంటనే తొలగించాలి. పనిలో నిర్లక్ష్యం చూపిన వారిని కఠినంగా శిక్షించాలి.

సద్భిరా సీత సతతం సద్భిః కుర్వీత సంగతిం ।

సద్భిర్వివాదం మైత్రీంచ నా సద్భిః కీంచీ రాచరేత్ ॥

పండితైశ్చ వినీతైశ్చ ధర్మజ్ఞే సత్యవాది భిః ।

బంధనస్తోఽపి తిష్ఠేశ్చ నతు రాజేఖలైః సవా ॥ (ఆచార..113/ఽ,3)

నిరంతరం మంచివారితోనే వుండాలి. వివాదం, మైత్రీ కూడా వారితోనే చేయాలి. మంచివారితో కలసి అడవులలోనైనా సుఖించవచ్చు గాని చెడ్డవారితో కలిస్తే రాజ్యభోగం కలుగుతుందన్నా అంగీకరించరాదు.

ఏ పనినీ సగంలో ఆపడం, విడువడం మంచిలక్షణం కాదు. పనిని సంపూర్ణంగా చేయగలిగితేనే ఒప్పుకోవాలి. చేసేదాకా అన్ని కర్మలూ ఆ పనివైపే సాగాలి. రాజులైనా ప్రజలైనా ఆశపోతూలూ, తొందరపాటు మనుష్యులూ కారాదు. పుట్ట, తేనెతుట్టె, చంద్రుని వెన్నెల ఎలాగైతే క్రమక్రమంగా పెరుగుతాయో స్థిరంగా నిలిచే సొమ్ము కూడా కొంచెం కొంచెంగా పెరుగుతుందనే జ్ఞానాన్ని కలిగివుండాలి.

అర్జితస్య క్షయం దృష్ట్వా సంప్రదత్తస్య సంచయం ।

అవంధ్యం దివసం కుర్యాద్ధానాధ్యన కర్మసు ॥ (ఆచార..113/8)

దానం చేస్తే ధనం తరిగిపోతుందని, కష్టపడి ధనం సంపాదించి దానాలకీ, అధ్యయనాలకీ ఖర్చు పెట్టి వేస్తే మళ్ళా దరిద్రులమై పోతామని కొందరు భయపడుతుంటారు గానీ దానం వల్ల, విద్య వల్ల ధనం పెరుగుతుందే కాని తరగదు. ఇంద్రియ నిగ్రహం గలవాడు నగరంలో నివసిస్తున్నా నష్టపోడుగాని అదిలేని వాడిని అడవిలో పడేసినా బాగుపడడు. ఇంద్రియ నిగ్రహం కలిగి గృహస్థాశ్రమాన్ని పాటించేవాడు ఏ తపస్వికీ తీసిపోడు. వానికి ఇల్లే తపోవనం. కర్మే భగవంతుడు.

సత్యమును పాలించడమే ధర్మాన్ని రక్షించడం కూడా అవుతుంది. అభ్యాసం విద్యనీ, కడిగి తోమి కడుగుట పాత్రనీ శీలం వ్యక్తి యొక్క వంశాన్నీ రక్షిస్తాయి.

సత్యేన రక్ష్యతే ధర్మో విద్యాయోగేన రక్ష్యతే ।

మృజయా రక్ష్యతే పాత్రం కులం శీలేన రక్ష్యతే ॥( ఆచార..113/10)

బంధువులనో ఆత్మీయులనో ధనం అడుక్కు తిని బతకడం కంటే నూతిలోపడి కాని, పాముల చేత కరిపించుకొని గాని చావడమే మేలు. దానికి ధైర్యం చాలకపోతే ఏ వింధ్యాటవిలోనో నివసించుట మంచిది.

సంపదలు దానం వల్లనో భోగం వల్లనో నశింపవు. పూర్వజన్మ పాపం వల్ల నశిస్తాయి. అర్జిత పుణ్యమున్న వాని సంపద వృద్ధి చెందుతుంది.

బ్రాహ్మణునికి విద్యా, పృథ్వికీ రాజు, ఆకాశానికి చంద్రుడూ, సమస్త చరాచరాలకూ శ్రీలలమూ ఆభూషణాలు.

విప్రాణాం భూషణం విద్యా పృథివ్యా భూషణం నృపః ।

నభసో భూషణం చంద్రః శీలం సర్వస్వ భూషణం ॥ (ఆచార..113/13)

ఇతిహాస ప్రసిద్ధులు ధర్మవీరులునైన రాజపుత్రులు ధర్మజా పంచపాండవులు. వీరంతా చంద్రసమాన కాంతిమంతులు, సాటిలేని పరాక్రమశీలురు, సూర్యప్రతాపులు. పైగా స్వయంగా విష్ణువేయైన శ్రీకృష్ణ పరమాత్మకు మిక్కిలి ఇష్టులు. అయినా అంతటి వారూ భిక్షాటన చేసుకున్నారే గాని ధర్మాన్ని తప్పలేదు, కర్మాన్ని వదులుకోలేదు. ఇదీ శీలమంటే. దుష్టగ్రహాలెంత బాధించినా ధర్మాన్ని త్యజించరాదు.

ధర్మానికి లోబడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే శ్రమకోర్చి సృష్టి, స్థితి లయలను క్రమం తప్పకుండా చేస్తూ, వారి కర్మను వారు సంపన్నం చేస్తున్నారు. మనమంతా ఆ కర్మకు కూడా నమస్కరించి కర్మాధీనులమై జీవించవలసినదే.

బ్రహ్మాయేన కులాలవన్నియ మీతో

బ్రహ్మాండ భాండోదరే

విష్ణుర్యేన దశావతారగహనే

క్షిప్తో మహాసంకటే ।

రుద్రోయేన కపాల పాణి పుటకే

భిక్షాటనం కారితః

సూర్యోభ్రామ్యతి నిత్యమేవ

గగనే తస్మై నమః కర్మణే ॥ (ఆచార113/15)

దానం, దానివల్ల కలిగే కష్టసుఖాలూ కూడా కర్మాధీనాలే. విష్ణువంతటివాడు దానాన్ని అడగడానికి వామనుడైపోయాడు. అంతవఱకూ ముల్లోకాలనూ ఏకచ్ఛత్రాధిపత్యంగా యేలిన బలిచక్రవర్తి మూడడుగుల దానమిచ్చి ముల్లోకాలనూ కోల్పోయాడు. ఇదంతా భగవంతుని క్రీడ. ఆ ఆడించేవానికి నమస్కారము.

దాతా బలి ర్యాచకకో మురారిర్జానం మహీం

విప్రముఖస్య మధ్యే ।

దత్త్వాఫలం బంధనమేవ లబ్దం నమోఽస్తుతే

దైవయ భేష్టకారిణే ॥ (ఆచార..113/16)

పాపానికి శిక్ష తప్పదు. ఈ శిక్ష, పాపి యొక్క పాపాన్నే తప్ప వంశప్రతిష్టనూ చూడదు, తల్లిదండ్రులనూ చూసి భయపడదు. సాక్షాత్తూ లక్ష్మీనారాయణుల సంతానమైనా పాపం చేస్తే దండన తప్పదు.(మన్మథుడు దండింపబడినాడు కదా!)

కొంతమంది ‘నేను ఏ పాపమూ చేయలేదు. అయినా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనీ ‘మా వూగి పెత్తందారు ఎన్ని పాపాలు చేశాడో లెక్కేలేదు. అయినా వాడు తెగ సుఖపడిపోతున్నాడు. దేవుడేం చేస్తున్నాడో మరి’ అనీ వాపోతారు. పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం చెబుతోంది.

త్రికూట పర్వతం పెట్టనికోటై, సముద్రమే పరిఖగా వుండీ, రాక్షసగణంచే రక్షితుడై, సాటిలేని బలపరాక్రమ సంపన్నుడై, స్వయంగా విశుద్దాచరణా కోటిలింగార్చనా సముపేతుడై, అద్భుత తపశ్శక్తి సంపన్నుడైన రావణాసురుడే కాలం కలసి రాకపోవడంతో కూలిపోయాడు. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది?

ఏ క్షణాన, ఏ అవస్థలో ఏది జరగాలో అదే జరుగుతుంది.మరోటీ, మరోలా జరగదు.

యస్మిన్వయసి యత్కాలో యద్దివ్యచ్చ వా నిశి ।

యన్ముహూర్తే క్షణేవాపి తత్తథా న తదన్యథా ॥ (ఆచార..11/ఽఽ)

భగవంతుడు మనకివ్వని దానిని అప్రదత్తమంటారు. మనం మన సామర్థ్యంతో అంతరిక్షంలోకైనా పోవచ్చు, భూగర్భంలోనైనా ప్రవేశింపవచ్చు, దశదిశలనూ మోయగలగ వచ్చు కాని అప్రదత్త వస్తువును పొందలేము.

పురాధీతా చయా విద్యా పురాదత్తశ్చ యద్దనం ।

పురాకృతానికర్మాణి హ్యగ్రే ధావతి ధావతి ॥ (ఆచార..113/ఽ4)

మనకబ్బిన విద్యా, మనను చేరిన ధనమూ కూడా పూర్వజన్మకృత పుణ్యఫలాలే. మనం ధర్మం చేస్తున్న కొద్దీ ఇవీ మనను అనుసరిస్తూనే వుంటాయి.

అన్ని శుభలక్షణాల నుండి బ్రహ్మాండమైన ముహూర్తంలో వివాహం జరిగి సీతవంటి భార్య భరత సౌమిత్రుల వంటి తమ్ములు ఉండి కూడా వారూ, శ్రీరాముడు *పదునాలుగేళ్ళ పాటు సుఖపడలేదు. ఇక సామాన్యుల గతి ఏమి? ఇదీ పురాకృతమనగా.

(*ఇక్కడ శ్రీరాముడు పూర్మజన్మలో చేసిన పాపమేమిటని అనుమానం రావచ్చు. శ్రీరాముడు విష్ణువు. విష్ణువు అంబరీషుని శరీరంలో ప్రవేశించి దుర్వాసుని ద్వారా పుడమిపై పుట్టాలనే శాపాన్ని పొందాడు. రావణని ఆవేశించీ ఆత్మలింగానికి బదులు తనను కోరేలా చేసినందుకు పార్వతీదేవి విష్ణువుని భార్యా వియోగంతో బాధపడమని శపించింది.)

కర్మాణ్యత్ర ప్రధాని సమ్యగజై శుభగ్రహే ।

వనిష్ఠకృత లగ్నేఽపీ జానకీ దుఃఖభాజనం ॥

స్థూల జంఘాయదారామః శబ్ద గామీ చలక్ష్మణః ।

మన కేశీయదాసీతా త్రయస్తే దుఃఖభాజనం ॥

నపితుః కర్మణా పుత్రః పితా వా పుత్ర కర్మణా ।

స్వయంకృతే న గచ్ఛంతి స్వయం బద్ధాః స్వకర్మణా ॥(ఆచార..113/ఽ5-ఽ7)

మునులారా! ఇందులో ఇంకో విశేషంకూడా వుంది. తండ్రి పాప పుణ్యాలలో కొడుకుకి గానీ కొడుకు పాపపుణ్యాలలో తండ్రికి గానీ వాటా వుండదు. ఈ దేశంలో వుంటేనే ఈ పూర్వజన్మ పాపాలు వెంటాడతాయనుకోవడం భ్రమ. మనిషి ఎక్కడ పుట్టినా ఆ పాపం దుఃఖ రోగరూపంలో కట్టి కుడుపుతుంది.

ప్రాప్తవ్యమర్థం లభతేమనుష్యో

దేవోఽపితం వారయితుం న శక్తః ।

అతో న శోచామి న విస్మయో మే

యదస్మదీయం నతు తత్పరేషాం ॥ (ఆచార..113/3ఽ)

సర్పము, ఎలుక, ఏనుగు పారిపోవలసి వస్తే ఎక్కడిదాకా పోగలవు? పుట్ట, కన్నం, అడవి... అంతదాకానే కదా! అలాగే మన ఐశ్వర్యం కూడా మన పూర్వజన్మ సుకృతం అయిపోయేదాకానే వుంటుంది. మనం కర్మను దాటిపోలేము.

నూతి నుండి నీరు తోడుతున్న కొద్దీ ఊరుతుంటుంది. సద్విద్య ఎవరికైనా ఇస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. ధర్మమార్గంలో సంపాదించిన ధనమే ధనం. అది దానం చేస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. అధర్మాచరణ ద్వారా ఆర్జింపబడిన ఐశ్వర్యం తాను మీగలదు గానీ ఆ మనిషికీ పాపాన్ని మాత్రం మిగిల్చిపోతుంది.

సత్యపాలనం, మనఃశుద్ది, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, జలప్రక్షాళన - ఇవి పంచశుచి మార్గాలు. సత్యపాలన శుచి గలవానికి స్వర్గప్రాప్తి సులభమే. సత్యమునే మాట్లాడువాడు. అశ్వమేధ యాగం చేసినవానికన్నా గొప్పవాడు.

సత్యం శాచం మనఃశౌచం శాచమింద్రియ నిగ్రహః ।

సర్వభూతేదయా శౌచం ఆలశౌచంచ పంచమం ॥

యస్య సత్యం హీ శౌచం చ తస్య స్వర్గో న దుర్లభః ।

సత్యం హి వచనం యస్య స్యోఽశ్వమేధాద్విశిష్యతే ॥(ఆచార..113/38,39)

దుష్టస్వభావులు, ఆత్మవంచకులు, వంచకులు అంతరాత్మ గొంతు నొక్కేసి దురాచారమే చేసేవారు ఎన్నిమార్లు పుట్టనన్ను నంటించి మరీ శరీరాన్ని తోముకున్నా పవిత్రులు కానేరరు. చేతులు, పాదాలు, మనస్సు మకీలి లేకుండా వున్నవారు, ధర్మపాలకులు, ఆధ్యాత్మ విద్యా సంపన్నులు, సతీర్తి నార్జించినవారు తీర్ధాలలో మునగక పోయినా పవిత్రులుగానే వుంటారు. తీర్థఫలాన్నీ అందుతారు.

యస్యహస్తౌచ పాదౌచ మనశ్చైవ సుసంయతం ।

విద్యాతపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్నుతే ॥ (ఆచార... 113/41)

సన్మానానికి పొంగిపోకుండా, అవమానానికి కోపించకుండా, ఎదుటివాడు కోపం తెప్పించడానికెంత ప్రయత్నించినా పరుషవాక్కు లాడకుండా వుండేవానినే సాధు పురుషుడంటారు.

నప్రహృష్యతి సమ్మానైర్నావమానైః ప్రకుప్యతి ।

నక్రుద్ధః పరుషం బ్రూయాదేతత్ సాధోస్తు లక్షణం ॥ (ఆచార... 113/4ఽ)

మనిషి దేనికైనా ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అది ఫలించకపోతే బాధపడరాదు. కోపం తెచ్చుకోరాదు. విద్వాంసుడూ మధురభాషీ యైన వ్యక్తి దరిద్రునిగా జీవితాన్ని ప్రారంభించి ధనార్జనకై ప్రయత్నించినా అతని దారిద్ర్యం తీరకపోవచ్చు. బుద్ధి, పౌరుషం, బలం, మంత్రశక్తీ వుండి కూడా అలభ్య - అదృష్ట వస్తువు కోసం ప్రయత్నించి, ఒక వ్యక్తి భంగపడవచ్చు. నిరాశచెందరాదు,

అయాచితంగా వచ్చిన దానిని అనుభవించి అది పోయినపుడు విపరీతంగా బాధపడిపోవడం అనవసరం. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికే పోతుంది. ఎలా వచ్చింది అలాగే పోతుంది. బాగా పెరిగిన చెట్టు పై కొన్నివందల పక్షులు రాత్రంతా కాపుర ముంటాయి. తెల్లారగానే పోతాయి. ఒకవేళ ఆ చెట్టు కూలిపోతే అవి దుఃఖిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ కూర్చోవు. ఈ మాత్రం ఇంగితం మనిషికెందుకుండదో?

శౌనకాచార్యా! పుట్టడానికి పూర్వం మనకేమీలేదు. గాలిలో ఎగురుతూ వచ్చాం. అలాగే పోయిన తరువాత కూడా మనకేమీ వుండదు. మనకున్నవన్నీ మధ్యలో వచ్చి పోయేవేగా!

అవ్యక్తా దీని భూతాని వ్యక్తమధ్యారి శౌనక ।

అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవనా ॥ (ఆచార... 113/48)

పోయేకాలం వచ్చినవాడు సూదిగుచ్చుకున్నా పోతాడు. అది రానివాడు అంటే ఇంకా ఆయువున్నవాడు యుద్ధంలో శరీరం నిండా సందు లేకుండా బాణాలు కూరీసినా బతికేస్తాడు. కాబట్టి చావుకి భయపడనక్కరలేదు. అలాగే ఎవరికెంత ప్రాప్తమో అంతే వస్తుంది, వుంటుంది. ప్రాప్తించిన దానికి సంతోషించరు కానీ అప్రాప్య వస్తువుకై అంగలారుస్తారు, అలమటిస్తారు. ఇది అనవసరం. ప్రయత్నం మంచిదే; దుఃఖం కాదు.

వృక్షాలు ఏ పూజలు చేశాయని,ఏ ప్రార్థనలు సలిపాయని వాటికి సమయం వచ్చేసరికి పూత, కాత, పంట వస్తున్నాయి? మానవులకు కూడా పూర్వ జన్మ పుణ్య, పాపకర్మల ఫలాలు ఆయా సమయాల్లో అందుతాయి. పూజలు, ప్రార్థనలు మనిషికి ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ వచ్చే ఫలాల విషయంలో మార్పులు తేగలవు. శీలం, వంశం, విద్య, జ్ఞానం, గుణం, శుద్ధత - ఇవేవీ పూర్వకర్మమును మార్చలేవు. పూర్వజన్మతపః ఫలమే చెట్టుకి సర్వాంగ శోభనిచ్చినట్లు మనిషికి సర్వాంగసౌందర్యాన్నీ, అన్ని సంపదలనూ ఇస్తుంది.

ప్రాణియొక్క మృత్యువు ఆ మృత్యుకారణమున్న చోటే వుంటుంది. లక్ష్మి ఎక్కడుం టుంది? సంపదలున్నచోటే కదా! మన కర్మ చేత ప్రేరేపింపబడి మనమే ఆయా ఫలానున్న చోటికి వెళ్తాము. గోశాలలో ఎన్ని గోవులున్నా దూడ తన తల్లి వద్దకే పోయినట్లు ప్రపంచంలో ఇంతమంది వున్నా నీ పూర్వకర్మఫలం నిన్నే చేరుకుంటుంది.

తత్రమృత్యుర్యత్ర హంతా తత్ర శ్రీర్యత్ర సంపదః ।

తత్ర తత్ర స్వయం యాతి ప్రేర్యమాణః స్వకర్మభిః ॥

భూతపూర్వం కృతం కర్మ కర్తార మనుతిష్ఠతి ।

యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం ॥ (ఆచార... 113/53,54)

మూర్ఖ ప్రాణులకు తెలియదు. చెప్పినా వినరు. తమకు కలిగిన దుఃఖాలకు కనలి*  దేవుని నిందిస్తారు. మనుజులపై కక్ష పెట్టుకుంటారు. ఫలితంగా మరిన్ని పాపాలుచేసి వచ్చే జన్మలో కూడా ఇలాగే తగలడతారు. తన సుఖదుఃఖాలతో ప్రమేయం లేకుండా పుణ్యకార్యాలు చేసినవాడే ఇప్పుడు సుఖంగా బతుకుతున్నాడని తెలుసుకోవాలి.

(*కనలి = కోపించి)

ఇతరుల దోషాలను వెతికి పట్టుకోవడంలో గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తూ తనుచేసే తప్పులను మాత్రం కానుకోలేనివాడు గేదెలాంటివాడు.

నీచః సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యతి ।

ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యతి” (ఆచార... 113/57)

రాగద్వేషాల నంటిపెట్టుకొని బతికే జీవికి ఎక్కడా సుఖముండదు. సంతోషమున్న చోటనే సుఖముంటుంది. స్నేహమున్న చోట ఆ స్నేహమేమైపోతుందో, తను ప్రేమించిన వారి గతి ఏమిటోనని భయముంటుంది. ఇదే మమకారం. దీనిని విసర్జించినవాడే సుఖపడగలడు. ఈ శరీరమే సుఖదుఃఖాల నిలయం. అవి శరీరంతోనే పుడతాయి.

పరాధీనతయే దుఃఖం, స్వాధీనతయే సుఖం. మనిషికి సుఖదుఃఖాలు ఒకదాని వెంటనొకటి చక్రంలోని కర్రలలాగా వస్తూనే వుంటాయి; పోతూనే వుంటాయి. అనాసక్త భావంతో అన్ని పనులూ చేసుకొనే వాడొక్కడే నిత్యసుఖి.

సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం ।

ఏ తద్విద్యాత్ సమాసేన లక్షణం సుఖదుఃఖయోః ।

సుఖస్యానంతరం దుఃఖం దుఃఖ స్యానంతరం సుఖం ।

సుఖం దుఃఖం మనుష్యాణాం చక్రవత్ పరివర్తతే ।

యద్గతింతదతిక్రాంతం యది స్యాత్ తచ్చదూరతః ।

వర్తమానేన వర్తేత నస శోకేన బాధ్యతే ॥ (ఆచార... 113/61-63)

మునులారా! ఎవరూ ఎవరికీ పుట్టుకతోనే మిత్రులుగానీ శత్రువులు గానీ కారు. కారణంవల్లనే ఆ బంధాలేర్పడుతున్నాయి. ఈ ‘మిత్ర’ శబ్దం అక్షర రూపంలోనున్న రత్నమే. ఈ శబ్దం మనిషికి సుఖాన్ని కలిగిస్తుంది. ప్రాణికోటికి ప్రేమను కురిపించేవాడూ విశ్వాసాన్ని చూపించేవాడూ మిత్రుడొక్కడే. స్వార్థం లేని బంధం కూడా ఇదొక్కటేనేమో!

ఇంతకన్న పవిత్రమైన శబ్దం ‘హరి’. ఈ శబ్దాన్నుచ్చగించేవాడు బట్టలు వేసుకొని బత్తాములు పెట్టుకొని బయటికి బయలుదేరినంత సుఖంగా మోక్షపదవినందడానికి లోకం నుండి పైకి వెళతాడు.

సకృదుచ్చరితం యేన హరిరిత్యక్షర ద్వయం ।

బద్ధః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి ॥ (ఆచార... 114/3)

అన్ని విధాలా తన తోటివాడేయైన మిత్రుని మీద వున్న నమ్మకం మనకి తల్లిదండ్రుల మీద భార్యాపుత్రుల మీద కూడా వుండదు. మిత్రత్వాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోదలచుకున్నవారు ఒకరితో నొకరు జూదమాడకూడదు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకూడదు, ఒకరి భార్యకింకొకరు దూరంగా వుండాలి.

మధుర పదార్థాల ద్వారా చిన్నపిల్లలనూ వినమ్రభావంతో సజ్జన పురుషులనూ, ధనం ఇస్తానని చెప్పి స్త్రీనీ, తపస్సు చేసి దేవతలనూ, చక్కని, కమ్మని మాట తీరును చూపించి (అనగా సద్వ్యవహార విశేషాన) సమస్తలోకాన్నీ వశపఱచుకోగలిగినవాడే నిజమైన పండితుడు.

కపటం ద్వారా మిత్రులనూ, పాపపు సొమ్ము ద్వారా ధర్మాన్నీ, ఇతరులను పీడించి ధనాన్నీ, పెద్దగా శ్రమించకుండా సుఖంగా విద్యనూ, కఠోర వ్యవహారం ద్వారా క్రూరంగా భయపెట్టి స్త్రీనీ వశం చేసుకోదలచినవాడు వివేకవంతుడు కాడు. ఇవేవీ తెలివైన పనులు కావు. ఆ కపటం, ఆ భయం, ఆ ధనం, ఆ బలం పోగానే ఆయా సంపదలూ పోతాయి.

పండ్లకోసం చెట్టును పెకలించేవాడు దుర్భుద్ధి. ఎంత ప్రయత్నమైనా చేసి పండ్లు కోసుకోవాలేగాని చెట్టుని నాశనం చేయడం అవివేకం.

నమ్మకూడని వానిని నమ్ముకోకూడదు. లోకంలో అందరి నమ్మకాన్నీ వమ్ము చేసినవాడు తనకు మాత్రం నమ్మకస్తుడెలా అవుతాడు? ఆ మాటకొస్తే మిత్రుని కూడా అతిగా విశ్వసించరాదు.

న విశ్వసే దవిశ్వస్తే మిత్రస్యాపి న విశ్వసేత్ ।

కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్ ॥ (ఆచార... 114/ఽఽ)

మిత్రునికి కోపం వస్తే మన రహస్యాలు బయటపెట్టే ప్రమాదముంది కావున ఎవరినీ నమ్మవద్దని సామాన్యులకు పెద్దలు చెప్తారు కానీ అన్ని ప్రాణులనూ విశ్వసించడం, అన్నింటి పట్లా సాత్త్వికభావాన్నే కలిగియుండడం, తమదైన సాత్త్విక స్వభావాన్ని యెల్లవేళలా సంరక్షించుకోవడం సజ్జన పురుషుల లక్షణాలు.

దరిద్రునికీ ‘గోష్ఠి’ అనేది విషంతో సమానం.(గోష్ఠి అంటే నేటి పార్టీలిచ్చుట) అలాగే వృద్ధునికి నవయువతీ సంగమం, మిడిమిడి జ్ఞానంతో ఆపేసిన చదువు, అజీర్ణంగా నున్నపుడు చేసే విందు భోజనం కూడా విషంతో సమానాలే.

మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి ఆరు కారణాలుంటాయి. ఎక్కువగా నీరు త్రాగుట, అతిగా తినుట, ధాతు క్షీణత మలమూత్ర విసర్జనను తొందర తొందరగా కానిచ్చి వేయుట లేదా ఆపుకొనుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ - వీటిలో ఒక్కటి చాలు... శరీరం లోకి రోగం ప్రవేశించడానికి.

తెల్లవారకుండానే వేసే ధూపం, అతిగా రతి, శ్మశానం పొగలను పీల్చుట, అగ్నిలో చేతిని పెడుతూ తీస్తూ ఆడుట, రజస్వలతో సంభాషణ - ఇవి దీర్ఘాయుష్కుల ఆయువునే తగ్గించే శక్తి కలిగి వుంటాయి. ఇలాగే ఆయువును నాశనం చేసేవి మరో ఆరున్నాయి: ఎండిన మాంసం, వృద్ధ స్త్రీ, బాలసూర్యుడు, రాత్రి పెరుగు సేవనం, ప్రభాతకాలంలో మైథునం మరియు నిద్ర.

అప్పుడే తయారైన నెయ్యి, ద్రాక్షపండ్లు, వయసులో నున్న స్త్రీ, పాలు, వేడినీరు, చెట్టు నీడ - వీటిని అనుభవించగానే ప్రాణశక్తి బలపడుతుంది. నూతినీరు, మఱ్ఱి చెట్టు నీడ శీతాకాలంలో వెచ్చగానూ వేసవిలో చల్లగానూ వుంటాయి. తైలమర్థనం, సుందర భోజనం పొందగానే శక్తి కలుగుతుంది. మార్గాయాసం, మైథునం, జ్వరం తాత్కాలికంగా మనిషిని నీరసపెడతాయి.

మాసిన బట్టలు ధరించేవారు, పళ్ళు శ్రద్ధగా తోముకోనివారు, అధికంగా తినేవారు, కఠోరంగా మాట్లాడేవారు, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవారు - సాక్షాత్తూ విష్ణు సమానులైనా సరే వారికడ లక్ష్మి నిలువదు.

కుచైలినం దంతమలోపధారిణం

బహ్వాశినం నిష్ఠుర వాక్య భాషిణం ।

సూర్యోదయే హస్త మయేఽ పిశాయినం

విముంచతి శ్రీరపి చక్రపాణిం ॥

తన గోళ్ళతో గడ్డిని చీల్చువాడు, నేలపై వ్రాసే వాడు, కాళ్ళు కడుక్కోనివాడు, దంతాలను స్వచ్ఛందంగా ఉంచుకోనివాడు, నగ్నంగా శయనించువాడు, భోజన పరిహాసాలతిగా చేయువాడు, తన అంగాలపై ఆసనంపై మద్దెల కొట్టుకొనువాడు, కేశసంస్కారం చేసుకోనివాడు, ప్రాతస్సాయం సంధ్యలలో నిదురించువాడు, కుచైలుడు - ఇలాంటి వారి కడకూడా లక్ష్మి నిలువదు.

తలంటి విరళంగా పోసుకోవడం, పాదాలు అవసరం మేరకు కడుక్కుంటుండడం, వేశ్యను సంపూర్ణంగా వర్ణించడం, శరీరమంతా శుభ్రంగా వుంచుకోవడం, అల్పంగానే తినడం, నగ్నతలేకుండా శయనించడం - ఈ పనులన్నీ చేయువాని వద్దకు లక్ష్మి వచ్చి చేరుతుంది,

బాలసూర్యుని తేజం, రగులుతున్న చితి యొక్క పొగ, వృద్ధ (తనకంటే పెద్ద) స్త్రీ సాంగత్యం, చీపురు నుండి వచ్చే దుమ్ము - ఇవన్నీ ఆయుక్షీణాలు.

ఏనుగు, గుఱ్ఱం, రథం, గోవు, ధాన్యంల నుండి రేగే ధూళి శుభకరమే కాని గాడిద, ఒంటె, గొఱ్ఱె, మేక నడిచినపుడు రేగే ధూళి అశుభకరం. ముఖ్యంగా ఆవు, ధాన్యము, పుత్రుని అంగముల నుండి వచ్చు ధూళి కల్యాణకారి, మహాపాతక వినాశిని.

దేన్నయినా చేటతో విసురుతున్నపుడు వచ్చే గాలి, గోటి నీరు, స్నానం చేశాక గుద్ద దులిపినపుడు చిలికే జలం, తల వెంట్రుకల నుండి జారే నీరు, చీపురు ధూళి బహు చెడ్డవి. ఇవి అర్జిత పుణ్యాన్నంతటినీ నశింపజేయగలవు. బ్రాహ్మణునికీ, అగ్నికీ, గుఱ్ఱానికీ ఎద్దుకీ, ఇద్దరు బ్రాహ్మణులకీ, ఆలుమగలకీ, యజమాని దంపతులకీ మధ్య నుండి వెళ్ళరాదు.

విశ్వసించకూడనివారిని అసలు విశ్వసించనేకూడదు. నమ్మదగినవారిని కూడడా అతిగా పూర్తిగా నమ్మకూడదు. దీనివల్ల అంటే నమ్మడం వల్ల ఒక విలక్షణమైన భయం పుట్టుకొస్తుంది. అది మన సుఖాలన్నింటినీ నాశనం చేస్తుంది. శత్రువుతో సంధి చేసుకోవచ్చు గానీ వానిపై విశ్వాసముంచుట చిటారుకొమ్మ మీద నిద్రపోవడం వంటిదే.

నవిశ్వసే దవిశ్వస్తం విశ్వస్తం నాతి విశ్వసేత్ ।

విశ్వాసాద్భయముత్పన్నం మూలాదపి నికృంతతి ॥

వైరిణా సహసంధాయ విశ్వస్తో యది తిష్ఠతి ।

సవృక్షాగ్రే ప్రసుప్తోహి పతితః ప్రతిబుద్ధ్యతే ॥ (ఆచార... 114/47,48)

పడిపోయాకే తెలుస్తుంది పడిపోయానని.

అత్యంత కాఠిన్యమూ, అలవి మీరిన మెత్తదనమూ రెండూ తప్పే. బలహీన కాండములు గల మొక్కలను శ్రమలేకుండా నరకవచ్చు. మహావృక్షాలు ఒకపట్టాన లొంగవు.

మనం ఆహ్వానించకపోయినా దుఃఖాలు వస్తాయి; వాటంతట అవే పోతాయి కూడ. సుఖాలు కూడా అంతే. సాధారణంగా సజ్జన పురుషులు సుఖపడతారు. దుష్టులకు దుఃఖాలు తప్పవు. కాబట్టి సజ్జనులుగానే జీవించాలి.

రహస్యం నాలుగు చెవుల మధ్యనే వుండాలి. ఆరో చెవి దాకా వెళితే అది రహస్యం కాబోదు. భవిష్యద్ వ్యూహాలూ రెండు చెవుల మధ్యనే అనగా ఒక మనిషి బుఱ్ఱలోనే వున్నంతకాలం అవి బ్రహ్మకు కూడా తెలియవు.

షట్కర్ణో భిద్యతే మంత్రశ్చతుః కర్ణశ్చ ధార్యతే ।

ద్వికర్ణ స్యతు మంత్రస్య బ్రహ్మాప్యంతం నబుధ్యతే ॥ (ఆచార... 114/54)

పాలీయని, చూలు కట్టని ఆవు, విద్వాంసుడు, ధార్మికుడు కాని కొడుకు ఉండి మాత్రం లాభమేమి? చంద్రుడొక్కడే అయినా ఆకాశమంతా వెలుగొందునట్లు మహా పురుషుడైన కొడుకు వల్ల వంశమంతా వన్నెకెక్కుతుంది. తారలెన్ని వున్నా చంద్రుడే శోభస్కరుడు కుపుత్రులు వందమంది కంటె గుణవంతుడైన ఒక్క కొడుకే మేలు, చాలు.

ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన ధీమతా ।

కులం పురుష సింహేన చంద్రేణ గగనం యథా ॥

ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధితా ।

వనంసువాసితం సర్వం సుపుత్రేణ కులం యథా ॥

ఏకోహి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కిం ।

చంద్రోహంతి తమాం స్యే కో నచ జ్యోతిః సహస్రకం ॥ (ఆచార...114/59)

పిల్లలను అయిదేళ్ళ వయసొచ్చేదాకా ప్రేమ కురిపిస్తూ పెంచాలి. అక్కడి నుండి పదేళ్ళు వచ్చేదాకా అవసరమైతే దండించియైనా క్రమశిక్షణ నేర్పాలి. పదారేళ్ళదాకా విద్యాబుద్ధులు నేర్పి ఆ తరువాత వారిని మిత్రుల వలె సంభావించాలి.

కొందరి ముఖాలు పులిముఖాల వలెనున్నా వారు సాత్త్వికులు కావచ్చు. కొందరి ముఖాలు లేడి ముఖాల వలె అమాయకంగా వున్నా వారు క్రూరులూ కావచ్చు. అందుచేత పైపై చూపులతో ఎవరినీ విశ్వసించరాదు.

క్షమించే లక్షణం వున్నవారిలో అది దోషం కూడా కావచ్చు. ఎందుకంటే జనులు వారు అసమర్థులనుకుంటారు.

ఏకః క్షమావతాం దోషో ద్వితీయో నోప పద్యతే ।

యదేనం క్షమయా యుక్తమశక్తం మన్యతే జనః ॥

ఈ ప్రపంచంలోని భోగాలన్నీ క్షణభంగురాలేనని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. కాబట్టి అనుభవించవచ్చు గాని ఆరాటపడరాదు. విద్వాంసుడెపుడూ ఆకర్షణకు లోను కాడు.

అన్న పితృసమానుడే. నాన్న చనిపోతే ఆ కుటుంబానికి అన్నే దిక్కవుతాడు. తమ్ముళ్ళందరినీ పైకి తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళునిలబడేలా చేసే అన్న నాన్నే కాదు దేవుడితోసమానుడవుతాడు. కాబట్టి అన్నను దేవునివలె చూసుకొనేవాడే నిజమైన మనిషి.

తక్కువ బలం కలవారిని తక్కువగా చూడకూడదు. వారు ఒక బృందంగా ఏర్పడితే ఏమైనా చేయగలరు. గడ్డి పరకలతో నేసిన తాడు ఏనుగునే బంధించగలుగుతున్నది కదా!

 ఒకరిని దోచి ఇంకొకరికి దానం చేయువానికి ఆ దానం సద్గతి నివ్వదు. దోపిడీలు చేసిన పాపానికి వాడు నిస్సందేహంగా నరకానికే పోతాడు. దేవతలు, బ్రాహ్మణుల ధనాన్ని అపహరించినా, వారిని తిరస్కారంగా చూసినా వంశం వృద్ధికాదు. బ్రహ్మహత్య, మద్యపానం వంటి మహాపాతకాలకు కూడా ప్రాయశ్చిత్తముంది కాని సజ్జనుల వద్ద ఉపకారాన్ని పొంది వారికే కీడు చేసే కృతఘ్నులకు నిష్కృతి లేదు.

పొరపాటున కూడా దుష్టునీ, శత్రవునీ ఉపేక్షించకూడదు. వాళ్ళు అల్పులే, పరవాలేదు అనుకోకూడదు. చిన్న నిప్పురవ్వే బ్రహ్మాండమును భస్మము చేయగలదని మరువరాదు.

యౌవనంలో కూడా శాంతంగా వుండగలవాడే నిజమైన శాంత స్వభావి. అన్నీ అయిపోయినవాడూ, శక్తులన్నీ ఉడిగిపోయినవాడూ శాంతుడు కాక చేసేదేముంటుంది?

నవే వయసి యఃశాంతః సశాంత ఇతి మేమతిః ।

ధాతుషుక్షీయమాణేషు శమః కస్య న జాయతే ॥ (ఆచార...114/73)

సంపదలన్నీ భగవంతుడివీ, ఆయన ప్రసాదించిన ప్రకృతివీనీ.

‘ఈ సంపదంతా నాది’ అని ఏ మనిషీ భ్రమపడరాదు.