1 - గరుడ పురాణము - ఆచార కాండము

Table of Contents

156 - అర్శలు లేదా మొలలు

 మాంసం నుండి కొంచెం సూదిగా మొనలుదేలిన పెరుగుదలలు శరీరం లోపల అన్నిచోట్లా ఏర్పడుతుంటాయి. కాని, వాటిలో మలద్వారంలో పెరిగి మల విసర్జన కంతరాయం కలిగించే వాటిని మొలలు లేదా లేదా అర్శలు అంటారు. (ప్రస్తుత భాషలో పైల్సు) ఇవి సహజ అనంతరోత్థయని రెండు విధాలు.

గుహ్యనాళం అయిదున్నర అంగుళాల పొడవుంటుంది. అందులో పొడిగా రాళ్ళవలె ఉండే మొలలు మూడున్నర అంగుళాల మేరకు పెరుగుతాయి. ఆదారంట వెళ్ళే రక్తనాళాలీ మొలలకు తగిలి పగులుతాయి. తద్ద్వారా రక్తస్రావం జరుగుతుంది. ఇది సాధారణంగా తల్లిదండ్రుల దోషాల కారణంగా పిల్లలకు సంక్రమిస్తాయి. దేవతల శాపాలు కూడా మొలలను పెంచుతాయి.

సహజంగా, అనగా వంశపారంపర్యంగా వచ్చే మొలలు సంపూర్ణంగా నశించడమనేది వుండదు. ఈ రకం మొలలు గరుకుగా, చండాలంగా, లోపలివైపు మొనదేలి, పాలిపోయిన పసుపురంగులో వుంటాయి. వీటివల్ల వచ్చే అనారోగ్య ఫలితాలు పరమభయంకరంగా పుంటాయి.

         ఈ మొలలు ఆరు విధాలుగా విభజింపబడ్డాయి. త్రిదోషాలూ కలిసి కాని రెండేసి కలిసి గాని ఈ రుగ్మతకు కారణమవుతాయి. పొడిమొలలు వాత, కఫదోషాల వల్లా, తడిమొలలు పిత్త దోషం వల్లా ఏర్పడతాయి.

         జఠరరసాలు ఆహారాన్ని దహించే వేళలో శృంగారానుభవాన్ని పొందే వారిలో ఈ దోషాలు మరింత ప్రకోపిస్తాయి. అపానవాయువు ప్రకోపించడానికి తెలివి తప్పేదాకా త్రాగడం, బరువైన - అరగడం కష్టమైన తిండి తినడం, కడుపును మాటిమాటికీ నిమురు కోవడం, కనులను గొంతును అరచేతులతో రుద్దుకోవడం, అతి శీతల ద్రవాన్ని వాడడం, అతిగా స్వారీ చేయడం, సహజమైన కోరికలను అణచుకోవడం, విరేచనాలు, మలబద్దకం - ఇలాటివన్నీ దోహకాలౌతాయి, కారణాలూ అవుతాయి.

 అపానవాయువు కలత చెందినపుడు మలం పైకి పోయే దారిలో ములుకు ల్లాటి మొలలు లేచి దానిని అడ్డేస్తాయి. అప్పుడు ఎముకలు కూడా నొప్పెడతాయి. తల తిరుగు తుంది. కళ్ళు మండుతాయి. వాయువు నాభి క్రింది ప్రాంతాల్లో కదలాడడం వల్ల రోగి శ్వాస తీసుకున్నపుడు ఇబ్బంది కలిగి, మలద్వారం వద్ద రక్తం వస్తుంది. తలనొప్పి, పేగుల నుండి గుడగుడ ధ్వనులు, అతి త్రేన్పులు, అతి మూత్రము, తక్కువ మలం, అన్నద్వేషం, తల, తిరుగుతున్నట్లుండుట, నాలిక చేదెక్కుట, తల ఛాతీ, పక్కల్లో నొప్పులు, భోగేచ్ఛ, ఇంట్లో వాళ్ళపై చిరాకు కలుగుతాయి.

 ఈ రోగలక్షణాలు అతిసార, క్షయ, పచ్చకామెర్లు, క్లోమ వ్యాకోచాదులను పోలివుంటాయి. అయితే మల ద్వారం దగ్గరి బాధ పెరుగుతున్న కొద్దీ లక్షణాల వ్యగ్రతా పెరుగుతుంటుంది. అపానవాయువకి బయటకు పోయే దారి మూసుకుపోతే అది మళ్ళా శరీరంలోకే వెనక్కి మళ్ళి పోయి అన్ని జ్ఞానేంద్రియాలనూ, హృదయాది ప్రధానాంగాలను చికాకు పెడుతుంది. అప్పుడది వాత, పిత్తాలలో పగుళ్ళను కల్పిస్తుంది. ఆ తరువాత మొలలు మరీ ఎక్కువగా విస్తరిస్తాయి.

 రోగి బక్కచిక్కిపోతాడు, మరీ పుల్లల్లా కాలుసేతులైపోతాయి, విరక్తుడై పోతాడు. ముఖం పాలిపోతుంది. చెదచే పూర్తిగా మింగబడిన చెట్టు లాగైపోతాడు. మనిషిలో నవకం పోతుంది.

 యక్ష్మవిషయంలో ఇదివఱకు చెప్పబడిన బాధలన్నీఈ రోగిని తాకుతాయి. సంధులన్నిటీ లో నొప్పులు వస్తుంటాయి. దగ్గు, అతిదాహం, నోరు తడారిపోవుట, శ్వాసకృచ్చ్రము, పడిశం, తుమ్ములు, కడుపులో తిప్పు, ఒళ్ళునొప్పులు, వినికిడి తగ్గుట, జ్వరం, అతి నీరసం, ఒళ్ళు కొయ్యబారిపోవుట, జల్లిరోగము కనిపిస్తాయి. మలద్వారం నుండి మాంసం కడిగిన నీటిని పోలిన ద్రవం కారుతుంటుంది.

 తడిమొలలు పిత్త దోషం వల్ల వస్తాయి. ఇవి చింతపండు రంగులో వుండి వాచుట, పగులుట చేస్తాయి. వాత మొలలు పొడిగా గరుగ్గా వుంటాయి.ఎఱ్ఱగా గాని జేగురు రంగులో గాని వుంటాయి. ఇవి ఏ ఆకారంలోనైనా వుండవచ్చు. పగుళ్ళు వేసినట్లు కనిపిస్తాయి. ఖర్జూర, కర్కందు, కర్పాస పిక్కల రంగులో కూడా ఉంటాయి. కదంబ పుష్ప వర్ణంలోనూ తెల్ల ఆవాల రంగులోనూ కూడా వుండవచ్చు.

 ఈ రోగం పెరుగుతున్నకొద్దీ శరీరం, గోళ్ళు, మలం, మూత్రం, కనులు, ముఖము నల్లబడుతూ వుంటాయి. వాపు, గుండ్రంగా వుండి, జారి పడుతున్నట్లున్న పెద్ద పొక్కులు, మల విసర్జనలో విపరీతమైన శ్రమ, బాధ వస్తాయి. (ఈ పొక్కులను అస్థీలలంటారు)

 పిత్త దోషం వల్ల వచ్చే మొలలు మొదట్లో నీలం రంగులో వుంటాయి. పోను పోను ఎఱ్ఱగా, నలుపు ఎరుపు కలిసిన రంగులోకి వస్తాయి. వాటినుండి అరుణవర్ణంలో పలచగా వున్న ద్రవం కారుతుంటుంది. పచ్చిమాంసపు వాసనను వెలువరుస్తుంటాయి. మెత్తగా తగులుతాయి. వాటిలో కొన్ని చిలుక నాలుకలాగా, జలగ నోటిలాగా వుంటాయి. విరేచనం అజీర్ణంగా, పలచగా, ద్రవరూపంలో, ఎరుపు పసుపు నలుపు కలిపిన రంగులో అవుతుంది. ఈ మొలలు బార్లీ గింజల్లా మధ్యలో దళసరిగా వుంటాయి. చర్మం, గోళ్ళు అకుపచ్చ లేదా పసుపు రంగుల్లోకి వస్తాయి.

కఫం దోషం కారణంగా వచ్చే మొలలు బాగా లోపలికి వేళ్ళూనుకొని వుంటాయి. దళసరిగా వుంటాయి. నొప్పి మిగతా రకాల కన్న తక్కువ పెడతాయి. తెల్లగా వుండి, కుళ్ళినట్లు కనిపిస్తూ, గుండ్రంగా, నున్నగా, నిటారుగా వుంటాయి. అవుపొదుగులా, వెదురు కొమ్మలా, జీడిపిక్కలా ఉంటాయి. దురద పుట్టిస్తాయి. గోక్కుంటే గొప్ప హాయిగా వుంటుంది. తొడల సందుల్లో నొప్పి, గుదంలో, మూత్ర కోశంలో, బొడ్డులో కూడా నొప్పి మొదలవు తుంది. శ్వాసలో ఇబ్బంది, పడిశం, దగ్గు, గుండెలో అశాంతి, చొంగకారడం, అన్నం సహించకపోవడం మున్నగు లక్షణాలు క్రమేపీ బయటపడతాయి.

  మూత్ర విసర్జన కష్టతరమౌతుంది. ఆలోచించడానికి కూడా బద్దకమేర్పడి తలదిమ్మెక్కి పోతుంది. చలి, శరీరంలో కుదుపు కలుగుతాయి. అన్ని రకాల సామర్థ్యమూ కొరవడు తుంది. ఏంతిన్నా ఒకంతట అరగదు. వాంతులు మున్నగు అజీర్ణ సంబంధ రోగాలన్నీ వచ్చి పడతాయి. విరేచనం మసిరంగులోకి వచ్చేస్తుంది. చీము పడుతుంది. మొలలు పగలవు, రక్తం కూడా కారదు. కాని చికాకుపెడతాయి. చర్మం బూడిద రంగును పులుముకున్నట్లయిపోతుంది. మరీ నున్నగా కూడా అయిపోతుంది.

 మూడుదోషాలూ కలిసిన మొలల లక్షణాలు ఇలా వుంటాయి, రక్తంలో మాలిన్యాలున్న వారిలో పిత్త దోష లక్షణాలన్నీ కనిపిస్తాయి. మొలలు మఱ్ఱి లేదా గంజాయి చిగురుల్లా వుంటాయి. మలం గట్టిగా వేడిగా రోగగ్రస్తమై వుంటుంది. రక్తహీనత వల్ల వచ్చే రోగలక్షణాలన్నీ ఈ మొలల రోగిలో కూడా కనిపిస్తాయి. విరేచనాలు ఎక్కువై ఒక్కొక్కసారి ధారాపాతంగా రక్తం పోతుంది. శరీరం కప్పతోలు రంగులోకి వస్తుంది.

 రోగి శరీర వర్ణాన్నీ, బలాన్నీ, బుద్ది నిలకడనీ కోల్పోతాడు. శరీరంలోని ముఖ్య చర్యలు పాడవుతాయి. జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయవు. గట్టి అనగా అరుగుట కష్టమైన ఆహారాన్ని ఆరగించడం వలన వాయువు ఎక్కువగా గుహ్య ప్రాంతంలో రేగిపోయి క్రిందికి వస్తున్న నాళాలను అడ్డుకుంటుంది. మొత్తం వ్యర్థ పదార్థాలన్నిటినీ పొడిగా, గట్టిగా మార్చేస్తుంది. మలమూత్రాలలోని తేమను హరించి వేసి రోగిని పరమ ప్రమాదకర స్థితిలోకి నెట్టివేస్తుంది. దానివల్ల నడుము, వీపు, ఛాతీప్రాంతాల్లో భరింపరాని నొప్పికి వ్యక్తి గురౌతాడు. మహోదరం, మలం ఒకే చోట ఉండిపోవడం, శూలనొప్పి, మూత్రాశయంలో బాధ, బుగ్గలు లోపలికి నొక్కుకు పోవడం జరుగుతాయి.

 వాతదోషంలో వాయువు పైకి అంటే క్రింది భాగాలలో నుండవలసిన వాయువు శరీరంపై భాగాలలోకి పయనించడం వల్ల వాంతులు, అన్నంపై విరక్తి జ్వరం, గుండె భాగంలో దడ, నీళ్ళ విరేచనాలు, నులుగడుపు, మూత్రం అణచబడుట సంభవిస్తాయి. దాహం, తలనొప్పి, పడిశం, ప్లీహవ్యాకోచం కలుగుతాయి. చెవులు పనిచేయడం తగ్గుతుంది. ఈ వాతదోషాల వల్ల మరణం సంభవించవచ్చు. వాతమొలలు అతి ప్రమాదకరం. వీటిని తగ్గించడం జరుగుతుందే కాని నిర్మూలన సాధ్యం కాదు.

రెండు ప్రకోపాల వచ్చే మొలలను వెంటనే పోల్చి మందు వేస్తే ప్రయోజనముంటుంది గాని ఒకయేడాది దాటితే మాత్రం నయం చేయడం అసాధ్యం. బాహ్య గుహ్యకాలయిన మొలలు ఏదో ఒక దోషం వల్ల యేర్పడితే, వెంటనే అయితే, సులభంగానే వాటిని నిర్మూలించవచ్చు. జననేంద్రీయం పైగానీ, బొడ్డులోగాని పుట్టే మొలలు కూడా వుంటాయి. అలాగే వ్యానమను పేరు గల వాయువులో తేడాలో చర్మంపై కూడా పుట్టుకొస్తాయి.ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించేవారికి ఇవి తగ్గిపోయే అవకాశం ఎక్కువ. వైద్యునికి రోగి పూర్తిగా సహకరించాలి.

మొలలలో గరుకుదనం, పొడిచినట్లు పొటమరించడం వాతదోషం, మొనల్లో నలుపు పిత్త ప్రకోపం, రంగులు,నున్నన, మెత్తన కఫరోగం లక్షణాలు.