1 - గరుడ పురాణము - ఆచార కాండము
107 - పరాశరమహర్షి చెప్పిన వర్ణాశ్రమధర్మాలు; ప్రాయశ్చిత్తకర్మలు
సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ తన గురువైన వ్యాసమహర్షికి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా ప్రవచింపసాగాడు.
శౌనకాచార్యా! ప్రతి కల్పాంతంలోనూ అన్నీ నశించిపోతాయి. కల్పప్రారంభంలో మన్వాదిఋషులు వేదాలను స్మరించి బ్రాహ్మణాది వర్ణాలు ధర్మాలను మరల విధిస్తుంటారు.
కలియుగంలో దానమే ధర్మము. పాపమూ శాపమూ సర్వాంతర్యాములుగా పరిఢవిల్లే ఈ కలియుగంలో పాపాన్ని అంతంచేయలేము. పాపం చేసిన వారిని మాత్రమే పరిత్యజించవలసి వుంటుంది*.
(*త్యజేద్దేశం కృతయుగే త్రేతాయాంగ్రామ ముత్సృజేత్ ।
ద్వాపరే కులమే కంతు కర్తారంతు కలౌయుగే ॥)
సత్య (కృత) యుగంలో పాపాత్ములుంటే ఆ దేశాన్నే ఋష్యాదులు త్యజించేవారు. అలా త్రేతాయుగంలో గ్రామాన్నీ, ద్వాపరంలో పాపి కుటుంబాన్నీ త్యజించారు. కలియుగంలో పాపం సార్వభౌకికమైపోతుంది కాబట్టి పాపిని మాత్రమే త్యజించగలరు.
మనిషి ఆచారం (సదాచారం, శౌచాచారం) ద్వారానే అన్నీ పొందగలుగుతాడు. సంధ్య, స్నానం, జపం, హోమం, దేవపూజనం, అశిథి సత్కారం అనే ఆరు సత్కర్మలనూ ప్రతి దీనం చేయాలి. ఆచారవంతుడైన బ్రాహ్మణుడు గాని సర్వసంగపరిత్యాగియైన సన్యాసిగాని కలియుగంలో దుర్లభం. బ్రాహ్మణులు తమ వర్ణ ధర్మాలను పాటించాలి. (అధ్యయనా ధ్యాపనాదులను వదులుకోరాదు! క్షత్రియులు దుష్టులైన శత్రువులను గెలిచి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకోవాలి. వైశ్యులు వ్యవసాయ, వ్యాపార, పశుపాలనాదికములను చేయిస్తూ న్యాయసమ్మతంగానే ధనార్జన చేయాలి. శూద్రులు ఈ పై మూడు వర్గాల వారికీ నిష్కపటంగా సహకరిస్తూ దేశసౌభాగ్యానికి ఊతమివ్వాలి..
తినకూడనివి తినడం, దొంగతనం పోకూడని చోటికీ పోవడం మనిషి పతనానికీ కారణాలౌతాయి. వ్యవసాయం చేసేవాడు అలసిపోయిన ఎద్దుని మరల కాడికి కట్టరాదు. దాని చేత బరువులనూ మోయించరాదు. ద్విజులు స్నానం, యోగం, పంచయజ్ఞం - వీటిని మానరాదు. బ్రాహ్మణులకి నిత్యం భోజనాలు పెట్టాలి. క్రూరకర్ముల విషయంలో మొగమాటానికీ స్వార్థానికీ తావివ్వకుండా ప్రవర్తించాలి.
నువ్వులనూ, నేతినీ అమ్ముకోరాదు. పంచసూనాజనిత దోషం పోవడానికి బలి వైశ్వ దేవహోమాన్ని నిత్యం చేయాలి. రైతు తన సంపాదన లేదా పంటలోని ఆరవభాగాన్ని రాజుకీ, ఇరువదవ భాగాన్ని దేవునికీ, ముప్పది మూడవ భాగాన్ని బ్రాహ్మణులకీ ఇవ్వాలి. దీని వల్ల కృషి హింసా పాపం ప్రక్షాళితమవుతంది. ఈ విధంగా ఇవ్వకపోతే (పన్ను ఎగొడితే! పాపం వస్తుంది. అదీ దొంగతనంతో సమానమైన పాపం !
(పరాశరుడు ఏ వర్ణానికెన్నాళ్ళు మృత్యు అశౌచముంటుందో యాజ్ఞవల్క్యుని లాగే చెప్పాడు) బంధువులలో ఈ మైల నాలుగో తరం దాకా పది రోజులు, అయిదవ తరంలో ఆరురోజులు, ఆగో తరంలో నాలుగురోజు, ఏడవతరంలో మూడురోజుల వుంటుంది. పరదేశంలో నున్న బాలకుడు పోతే మృత్యు అశౌచం పెద్దగా వుండదు. వార్త వినగానే స్నానం చేస్తే వెంటనే శుద్ధి అయిపోతుంది.
గర్భస్రావ, గర్భపాతాలలో బిడ్డ మరణించినపుడు తల్లి ఎన్నవ నెల గర్భవతి అయి వుండినదో అన్ని రోజులు అశుచి ఆ బిడ్డ బంధుగణానికి వుంటుంది. నాలుగవ నెల వఱకూ జరిగే గర్భనష్టాన్ని గర్భస్రావమని ఆరు మాసాలు నిండేలోగా గర్భనష్టం జరిగితే గర్భపాతమనీ అంటారు.
శిల్పకారుడూ, మేదరవాడు, రాజూ, రాజ గురువూ, శ్రోత్రియ బ్రాహ్మణుడూ, దాసదాసీ జనమూ భృత్యులూ వీరిలో ఎవరు పోయినా (వారి సంతానానికి తప్ప) మైల వుండదు.
పురిటిమైల అనగా పిల్లలు పుట్టినప్పుడు కలిగే అశుచి కన్నతల్లికే పదిరోజుల పాటు వుంటుంది. తండ్రి స్నానం చేయగానే శుచి అవుతాడు. వివాహం లేదా యజ్ఞం తలపెట్టి అన్ని యేర్పాట్లూ చేసుకొన్నాక మృత్యు లేదా పురిటి వార్త తెలిసినా ఆ ఉత్సవం చేయువారికీ, అందులో పాల్గొనువారికీ అశుచి వుండదు. అనాథ శవాన్ని మోసేవారికి ప్రాణాయామ మాత్రమున శుద్ధి కలుగుతుంది. తెలిసీ శూద్రశవాన్ని మోసినవారికి మాత్రం మూడురాత్రుల వలకూ అశుచి.
మంచివాడు, సచ్చరిత్రుడునైన పతిని మదమెక్కి వదిలేసిన స్త్రీ ఏడుజన్మల దాకా ఆడదానిగానే పుడుతుంది. అన్ని జన్మలలోనూ విధవగానేషోతుంది. అన్నపానాదులు విషయంలో భ్రష్టురాలైన స్త్రీ మరుజన్మలో పందిగా పుడుతుంది.
ఔరసుడూ, క్షేత్రజ్ఞుడూ ఒకే తండ్రికి పుడితే ఆ తండ్రి పోయినప్పుడు రెండు రకాల వాళ్ళూ పిండదానం చేయవచ్చును.
పరివేత్త (అన్నకు పెండ్లి కాకుండా తానే ముందు చేసుకున్న తమ్ముడు) పరివీత్తి (తమ్ముడికి వివాహం జరిగిపోయి తాను అది లేకుండా వుండిపోయిన అన్న) - ఈ రెండు రకాల వారికీ కృచ్ఛవ్రతం చేసుకునే దాకా శుద్ది లేదు. తమ్ముని పత్ని కూడా కృచ్ఛవ్రతం చేయాలి. కన్యాదాత అతికృచ్ఛం చేసుకోవాలి. ఇటువంటి వివాహాన్ని చేయించిన పురోహితుడు చాంద్రాయణ వ్రతం చేయాలి. అప్పుడుగాని వీరికి శుద్ధి లేదు.
అన్న గూనివాడో, మరుగుజ్జో, నపుంసకుడో, నత్తివాడో, జన్మాంధుడో, ఇతర అంగ విహీనుడో అయితే మాత్రం తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చును. దోషం లేదు.
నిశ్చితార్థంలో ఎవరికో వాగ్దత్తయైన కన్య ఆ వరుడు పరదేశమేగిపోయి (ఇక రాడని తెలిసినా, మృతి చెందినా, సన్యాసం పుచ్చుకున్నా, నపుంసకుడని తెలిసినా, పతితుడై పోయినా (ఆమె) వేరొకరిని వరించి వివాహం చేసుకొనవచ్చును. పతితోబాటు, సతీధర్మముననుసరించి, అగ్ని ప్రవేశం చేయు స్త్రీ తన శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్నేళ్లపాటు స్వర్గంలో నివాసముండగలదు*.
(*సతీసహగమనాన్ని ప్రస్తుత రాజ్యాంగం నిషేధించిందీ - అను)
కుక్కకాటుకి గురైనవాడు ఔషధసేవనం గావించి గాయత్రి మంత్రాన్ని జపిస్తే అశాచం పోతుంది. స్వయంగా దాన్ని జపించే అర్హత లేనివారు బ్రాహ్మణునెవరినైనా ఆశ్రయించి ఆయన చేత ఈ జపాన్ని చేయించాలి. చండాలాదుల ద్వారా చంపబడిన బ్రాహ్మణుడు స్వయంగా అగ్నిహోత్రి అయితే ఆయనను లౌకికాగ్నితో దహనం చేయవచ్చును. ఆయన అస్థికలను సేకరించి మగల మంత్రపూర్వకంగా ఆయన యొక్క అగ్నిహోత్రశాల నుండి అగ్నిని తెచ్చి, అంతకు ముందే పాలతో శుద్ధి చేసిన అయన అస్థికలను అందులో దహనం చేయాలి. వ్యక్తి పరదేశంలో మరణిస్తే ఇక్కడి పరిజనులు తమ గృహాలలోనే కుశలతో ఆ వ్యక్తి శరీరాన్ని తయారుచేసి అగ్నికి ఆహుతిచేయాలి. ఆపరదేశ మృతుడు అగ్నిహోత్రియైతే మృగచర్మంపై ఆగువందల పలాశ ఆకులను అతని ఆకారంలో పలచి శిశ్నభాగంలో శమీ, వృషర్రుభాగంలో అరడీ పెట్టి కుడిచేతి జాగాలో అన్నం కుండనీ ఎడమచేతి జాగాలో యజ్ఞయపాత్రనీ వుంచాలి. వక్షోభాగంలో సోమరసం తయారీలో వాడే రాతినుంచాలి. ముఖభాగంలో నేతిలో ముంచిన శిలలనూ, తండులాలనూ నేత్రాల వద్ద నేతికుండన ఉంచాలి. కనులు, చెవులు, ముక్కు నోరు ప్రాంతాలలో చిన్న చిన్న బంగారు ముక్కలనుంచే పద్దతి కూడా వుంది. ఇలా అగ్నిహోత్రం యొక్క సమస్త ఉపకరణాలనూ వుంచి ఆ అగ్నిహోత్రి ఊహాకల్పిత కళేబరాన్ని ‘అసౌస్వర్గాయ లోకాయ స్వాహా" అనే మంత్రాన్ని చదువుతూ చేతిని ఒక ఆహుతి నిచ్చి... అగ్నికి ఆహుతి చేస్తే ఆయనకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
హంస, చిలుక, క్రౌంచం, చక్రవాకం, కోడి, నెమలిలలో దేనిని వధించినా ఒక పగలూ ఒక రాత్రీ ఉపవాసం చేస్తే పాపం పోతుంది. నాలుగు కాళ్ళ పశువును (గోవును కాదు) దేనిని వధించినా ఒక రోజంతా నిలబడి, ఉపవసించి, గాయత్రిని జపిస్తే పాపశాంతి కలుగుతుంది.
శూద్రుని వధిస్తే కృచ్ఛవ్రతం చేయాలి. వైశ్యుని హత్య చేస్తే అతికృచ్ఛవ్రతము చేయాలి. క్షత్రియుని చంపితే ఇరవై రెండూ, బ్రాహ్మణుని మృతి నొందిస్తే ముప్పదీ చాంద్రాయణ వ్రతాలు చేయాలి”.
