విష్ణు మహా పురాణము

4 - ప్రళయ స్వరూపము - నైమిత్తిక ప్రళయము

ఓ మహామునీ! సప్తర్షి మండలము నాక్రమించి జలమున్నతరి నీ ముల్లోకము నొకే సముద్రమగును. అంతట విష్ణుముఖ నిశ్శ్వాసము నుండి పుట్టిన వాయువు ఆ మేఘములను జెల్లా చెదరు సేయుచు నూరు సంవత్సరములు ఒకే రీతి వీచును. సర్వభూత మయుడు ఊహ కందని వాడు విశ్వమున కాదియు నాదిలేని వాడునగు భగవంతుడు వాయువది యెల్ల ద్రావి బ్రహ్మరూప ధారుడై శేష తల్పమందు నిదురించును. అప్పుడు జనలోకము నందు బ్రహ్మలోకము నందుండు సనకాది సిద్ధులా దేవుని ధ్యానించుచు ముక్తికోరుచు స్తుతించు చుందురు. తన దివ్య మాయా స్వరూపిణి యగు యోగ నిద్ర యందుండి యమ్మధుసూదనుడు వాసుదేవాఖ్య పరబ్రహ్మమగు తన్నుదాను ధ్యానించు చుండును. ఇది నైమిత్తిక మనెడి ప్రళయము. బ్రహ్మ స్వరూపుడగు హరి యయ్యెడ నిదురించుటయే నిమిత్తము. కారణము, కావున దీనికీ పేరు వచ్చినది. ఆ సర్వాత్మకుడు మేలుకొన్నపుడు జగత్తు చేష్టించును. క్రియా సమర్థమగును. అచ్యుతుడు మాయాశయ్య నున్నపుడీ నిఖిల జగత్తు కనుమూయును. వేయి చతుర్యుగములు పద్మ గర్బునకోక పగలు. లోకమేకార్ణవ మయినపుడదే పరిమాణమున బ్రహ్మకు రాత్రియగును. ఆ రాత్రి తుదనాతడు మేల్కొని సృష్టి నారంభించును. అప్పుడు విష్ణువే బ్రహ్మ స్వరూపుడగును. లోగడ నీకిట్లు తెల్పియున్నాను. ఇదే కల్ప సంహారము, అవాంతర ప్రళయము, నైమిత్తిక ప్రళయము అనంబడును. ఇక ప్రాకృత ప్రళయ మేమో వినుండు.

అనావృష్టి మొదలయిన హేతువులచే సర్వ లోకము లందు బాతాళము లందుక్షాళనము సేయబడగా మహాదాది వికారము నుండి విశేషము వరకు గల సర్వ వికృతి క్షయింపగా కృష్ణుని యిచ్చవలన జేయబడు ప్రతి సంచరము నందు తొలుత ఉదకములు భూమి యొక్క గంధ గుణమును గ్రసించును. అంతట భూమి ప్రళయము నందు అనువగును. గంధ గుణము పోగా అది కేవలము జలమయ మగును. అప్పుడు జలములు తెగ పెరిగి పెద్ద వేగము పెద్ద ధ్వనియుం గలవై ఈ విశ్వమంతను నిండును. అవి యోక్కొక్క తరి నిలుపొందును. ఒకతరి చలించును. కెరటములు వేయు సలిలముచే లోకాంతము దాక నెల్లెడ వ్యాప్తమగును. తేజస్తన్మాత్ర యా జలముల యొక్క గుణమును రసమును ద్రాగి వైచును. రసము క్షయించి నంతట నయ్యుదకములు క్షయించును. రస గుణము పోయిన నీరు తేజో రూపము నందును. నీరగ్ని భూతావస్థ యందుండగా సర్వము తేజస్సుచే నావరింప బడగా నా యగ్ని యంతట వ్యాపించి యా నీటిని స్వీకరించును. అప్పుడీ జగమెల్ల అగ్ని జ్వాలలచే నింప బడును. ఇట్లది క్రిందను మీదను నడ్డముగను జ్వాలలచే నిండి నంతట జ్యోతిస్సు యొక్క పరమ రూపమయిన ప్రభాకరుని వాయువు మ్రింగును. సర్వాత్మక మయిన యా వాయు మహాభూతము గూడ రూపతన్మాత్ర యందు విలీనమయినంత అగ్ని భూతము ప్రణష్ట మగును. జ్యోతిస్సట్లు ప్రశమింప మహావాయువు తెగ విసరినంతట తేజోభూతము కేవల వాయు భూతావస్థ యందున్న తరి లోక మంధకార బంధుర మగును.

అంతట నావాయువు తన నడక తుములమై క్రిందను మీదను నడ్డముగను బదిదెసల విపరీతముగ వీచును. అంతట వాయు భూతము యొక్క స్పర్శ గుణమును ఆకాశము గ్రసించును. అపుడు వాయువు శమించును. ఆకాశ మహాభూతము నిరావరణమై యుండును. రూప రస స్పర్శ గంధ గుణ రహితమయి రూపము కూడ లేక యా ఆకాశ మహాభూతము మిక్కిలి పెద్దదై యుండును. పరిమండలము రంద్ర మాత్రమునైన యాకాశము కేవలము శబ్దమే గుణము గాగలదై యుండును. అట్టి ఆకాశ మయ్యెడ సర్వము నావరించి యుండును. ఆకాశము యొక్క ఆ శబ్ద గుణమును భూతాది అహంకారతత్త్వము మ్రింగును. అంతః కరణము భూతములు ఇంద్రియములు నొక్కసారి భూతాది యందున్న తరి నీ భూతాది అహం మమాభిమానాత్మకమయి తామసమని చెప్పబడును. తమో గుణ ప్రాయమయిన యహంకారమిది ఆ భూతాదిని బుద్ధియను పేర జెప్పబడు మహత్తు గ్రసించును. ఈ మహత్తు అను భూమి జగత్తునకు లోపల వెలుపల దగ్గర దాపునను గూడ నుండును. ఈ మీద జెప్పిన క్రమముగ బుద్ధి యొక్క సప్తమూల తత్త్వములు ప్రకృతులని చెప్ప బడినవి. సృష్టి వికారనమునకివి మూల పదార్థములు. సృష్టి యొక్క ప్రవృత్తి యందివి విడివిడిగ నివృత్తి యందొక దాని యందొకటి ప్రవేశించును. ప్రవృత్తి యనగా ప్రయాణము. నివృత్తి యనగా ప్రతి ప్రయాణము నని ఆగమికుల రహస్య సంకేతము. అనులోమము విలోమమునను మాటలచే గూడ ఈ సృష్టి ప్రతిసృష్టులు వ్యవహరింప బడును.

ఏ యుదకములచే నీ అండ ఆకారమైన జగత్తు ఆవరింపబడి యున్నదో సప్తద్వీప, సప్త సముద్ర సప్త లోకాత్మకమయిన యిదెల్ల నుదకము లందు లీనమగును. ఆ ఉదకమును తేజస్సు ద్రావును. ఆ తేజస్సు వాయువు నందు పాయ మొందును. వాయువాకాశము నందు లయించును. ఆకాశమును భూతాది మ్రింగును. దానిని మహత్తు. ఈ చెప్పిన వానితో గూడియున్న యా మహత్తును బ్రకృతియుం గ్రసించును. సత్త్వ రాజస్తమో గుణ సామావ్యస్థ పెరుగక తరుగక యుండునది హేతువు ప్రధాన కారణము నైనదిది ప్రకృతి యనబడును. ఇది యెల్ల వ్యక్తావ్యక్త స్వరూపిణి. వ్యక్త స్వరూపము అవ్యక్త మందు లీనమగును. ఆ అవ్యక్త శబ్దమున జెప్పబడు వాడు ఏకైక మూర్తి, శుద్దుడు, అక్షరుడు, నిత్యుడు, సర్వవ్యాపి. పురుషుడునని పిలువ బడును. ఆయన కూడ సర్వమయియున్న పరమాత్మకు అంశము సర్వేశ్వర మయిన వస్తువు నందు సత్తామాత్ర స్వరూపము జ్ఞేయము (ఎరుక బడునది), జ్ఞానము (ఎరుకయు) నైన ఏపర వస్తువు నందు నామరూప జాత్యాది కల్పన లేదో యది బ్రహ్మము పరమధామము పరమాత్మ ఈశ్వరుడు విష్ణువే ఈ సర్వము. అందుండి యతి ఆ వృత్తి నందడు. వ్యక్తావ్యక్త స్వరూపిణియని నేను చెప్పిన ప్రకృతియు పురుషుడును నను నీ యిద్దరును బరమాత్మ యందు లయమందుదురు. పరమాత్మ సర్వులకు నాధారుడు. పరమేశ్వరుడు విష్ణువను పేర వేదము లందు వేదాంతము లందును గీర్తింప బడును.

వేదము సెప్పిన కర్మ ప్రవృత్తము నివృత్తమునని రెండు విధములు. ఆ రెండింటి చేతను నా సర్వ మూర్తిని పురుషు లారాధింతురు. ఋగ్యజుస్సామ మార్గములు ప్రవృత్తములు. వీనిచే యజ్ఞేశ్వరుడు యజ్ఞ పురుషుడు పురుషోత్తముడు యజింపబడును. జ్ఞాన స్వరూపుడు జ్ఞానమే తానైన వాడునగు విష్ణువును యోగులు జ్ఞాన యోగముచే నివృత్త కర్మ మార్గమున సేవింతురు. ఆ విష్ణువు ముక్తిఫల ప్రదాత.

హ్రస్వ దీర్ఘ ప్లుతములను స్వరములచే నే కొంచెము వస్తువు వచింప బడునో యే వస్తువు వాక్కులకు (వేదములకు) గోచరము గాదో యదంతయు నవ్యయుడైన విష్ణువు వ్యక్తుడాతడే. అవ్యక్తమును అతడే. అతడే పురుషోత్తముడు. పరమాత్మ విశ్వాత్మ విశ్వరూపధారి హరియే. వ్యక్తావ్యక్త స్వరూపిణియగు ప్రకృతి పురుషుడు నా విష్ణువు నందు లీనమగును. సర్వవ్యాప్తి అవ్యాహతమునైన యాత్మయందు ద్విపరార్ధమయిన నీకు నేజేప్పిన కాలము అవిష్ణువునకు పగలు. ఈ వ్యక్తము (దృశ్య ప్రపంచము) ప్రకృతి యందు పురుషు నందు లీనమయినపుడు ఆ ద్విపరార్ధ దివాకాల ప్రమాణములు రాత్రి యగును. ఆ విష్ణువునకు బవలురేయి యనునవి లేవు. ఆ పరమాత్మ యందీ కాల పరిగణము కేవల మౌపచారికము. ఇట్లీ ప్రాకృతలయ వృత్తాంతము మైత్రేయా! నీకు దెలుప బడినది. అత్యంతిక ప్రతిసంచరముం గూర్చి యిక తెలిసికొనుము.