శ్రాద్ధము నందెట్టి గుణములు గల వారిని బ్రాహ్మణులను భుజింప జేయవలెనో చెప్పెద వినుడు. త్రిణాచికేతః = ద్వితీయ కాఠక మందున్న మూడను వాకములగు త్రిణాచికేత మంత్రములను చదివిన వాడు, లేక తదర్థానుష్ఠానము చేయువాడు. త్రిమదుః = 'మధువాతా' అను మూడు ఋక్కుల నధ్యయనము చేసిన వాడు లేక అదివ్రతము గాగలవాడు, లేక చాందోగ్యోక్తమగు మధు విద్యానిష్ఠ గలవాడు. త్రిసుపర్ణః = "బ్రహ్మమేతుమాం" అను అనువాకత్రయము నద్యయనము చేసిన వాడు, లేక తద్ర్వతుడు, లేక "చతుర్వర్గా" అను ఋక్కు నధ్యయనము చేసిన వాడు లేక తద్వ్రతుడు. షడంగవిత్ = శిక్షావ్యాకరణాది షడంగములతో గూడిన వేదము నధ్యయనము చేసిన వాడు, తదర్థ ప్రచారకుడు. యోగీ = బ్రహ్మ ధ్యానము చేయువాడు, జ్యేష్ఠసామగః = 'అజ్యదోహ'మను సంజ్ఞతో చెప్పబడు సామ విశేషమునకు జ్యేష్ఠసామ మని పేరు. దానిని చెప్పువాడు, ఋత్విక్కు, మేనల్లుడు, దౌహిత్రుడు, అల్లుడు, పిల్లనిచ్చిన మామ, మేనమామ, తపోనిష్టుడు, పంచ + అగ్ని + అభిరతః = ఆహవనీయాది త్రేతాగ్నులు సభ్యావసభ్యాగ్నులు రెండు = మొత్తము అయిదు అగ్నుల యందు అభిరతుడు. లేక వేదాంతము లందు చెప్పబడిన ద్యు, పర్జన్య, పృథివీ, పురుష, యోషిత్ రూపపంచాగ్ని విద్యనుపాసించు వాడు. శిష్యులు, వియ్యంకులు, మాతాపితరుల సేవించు వాడు. పైన చెప్పిన గుణములు గల బ్రాహ్మణులను శ్రాద్ధము నందు ప్రథమమున పితృ దేవతల సంతుష్టికై నియోగింప వలెను. వారు దొరకని సమయము నందు అను కల్పము నందు ఆ గుణములు లేని వారిని నియోగించ వలెను. మిత్ర ద్రోహి, పిప్పిగోళ్ళు గలవాడు, నపుంసకుడు, గొగ్గిపళ్ళ వాడు, బ్రాహ్మణుడు కానివాడు, కన్యల దూషించు వాడు, అగ్నిని వేదములను వదలిన వాడు, సోమ విక్రయము చేయువాడు, మహాపాతకో పేతుడు, దొంగ, కొండెములు చెప్పువాడు, గ్రామార్థమై పౌరహిత్యము చేయువాడు, భృతిచే వేదము చెప్పు వాడు, భరణమిచ్చి వేదాధ్యాయము చేసిన వాడు, రెండవ పెళ్లి చేసికొన్న దాని భర్త, తల్లి దండ్రులను విడిచిన వాడు, శూద్రాపత్యమును పోషించు వాడు, శూద్రస్త్రీ పతి, దేవాలయార్చకుడు వీరలు శ్రాద్ధము నందు ఆమంత్రణమునకు పనికి రారు. పండితుడు మొదట శ్రోత్రియులగు యోగ్యులగు యోగ్యులను నిమంత్రించ వలెను. వారికి పితృ దేవతలకై నిమంత్రణమని చెప్ప వలెను. పిమ్మట బ్రాహ్మణులతో కూడ కోపము, మైథునాదికము చేయరాదు. బ్రాహ్మణులును చేయరాదు. అట్లు చేసిన యెడల మహా దోషము, శ్రాద్ధము నందు నియుక్తుడై భుజించినను, నితరుని భుజింప చేసినను మైథునము చేసిన వాడు తన పితరుల రేతోగర్తము (గుంట)లో ముంచిన వాడగును. అందు వలననే ముందుగా శ్రేష్ఠులగు బ్రాహ్మణులను నిమంత్రణము చేయవలయునని చెప్ప బడెను. బ్రాహ్మణులను నియోగింపక తన యింటికి వచ్చిన నియమితేంద్రియులను పాద్యాదులతో భుజింప జేయ వచ్చును. పవిత్రమును ధరించిన వాడై ఆచమనము చేసిన వారిని ఆసనము లందు కూర్చుండ పెట్టవలెను. పితృ దేవతలకై బేసి సంఖ్య వారిని, దేవతల కొఱకై సరి సంఖ్య వారిని లేక ఉభయులకు ఒక్కొక్కరికి నిమంత్రించ వలెను. అట్లే వైశ్వ దేవముతో మాతామహ శ్రాద్దమును చేయ వలెను. భక్తీ సంపన్నుడై పితృమాతామహ శ్రాద్ధములు తంత్రములుగా వైశ్వా దేవముతో (ఒకే విశ్వే దేవస్థానములో) చేయ వలెను. విశ్వే దేవతలను తూర్పు ముఖముగను, పితృ దేవతలను ఉత్తర ముఖముగను లేక విశ్వే దేవతలను ఉభయాత్మకముగ భుజింప జేయవచ్చును.
పితృ మాతామహ వర్గముల వారికి వేఱుగా శ్రాద్ధము చేయవలయునని కొందరందురు. ఇతర మహర్షులు ఒక చోటనే యొకే పాకముతో చేయ వలయు నందురు. ఆసనార్థమై కుశలనిచ్చి అర్ఘ్యాది విధానముతో పూజించి ప్రాజ్ఞుడు దేవతలయా వాహనమును దేవాత్మ బ్రాహ్మణానుజ్ఞతో చేయ నగును. యవల జలముతో దేవతలకు అర్ఘ్యమును విధాన మెరింగిన వాడై ఈయ వలయును. పూల దండ, గంధము, ధూప దీపములను యథావిధిగా సమర్పించి, పితృ దేవతలకు నపసవ్యముగ సమస్తమును కల్పించి, యనుజ్ఞ పొంది దర్భలను రెండు విధములుగ భాగించి మంత్ర పూర్వకముగ పితృ దేవతల యావాహనము చేయ వలయును. తిలోదకముతో నపసవ్యముగ నర్ఘ్యాదికము సమర్పింప వలయును. ఆ సమయమున నన్నకాముడై ఏతెంచిన బాటసారియగు నతిథిని, బ్రాహ్మణుల యభ్యనుజ్ఞ నొంది, వానిని కూడ భుజింప జేయవలెను. యోగీశ్వరులు, నరులకు నుపకారము చేయువారై వివిధ రూపములతో నవిజ్ఞాత రూపమున భూమి నంతను తిరుగు చుందురు. కావున శ్రాద్ధ కాలమున నేతెంచిన యతిథిని పండితుడైన వాడు అర్చించ వలెను. ఓ రాజా! పూజింపబడిన యతిథి, శ్రాద్ధ మాచరించుటచే కలుగు ఫలమును నాశము చేయును. ఓ పురుషోత్తమా! పిమ్మట ఆ బ్రాహ్మణానుజ్ఞ నొంది, వ్యంజనములు (శాకాదికములు) లవణాదికము లేని యన్నమును మూడు పర్యాయములు హోమము చేయ వలయును.
మొదట "అగ్నయే కవ్యవాహనాయ స్వధానమః" అనునాహుతి, పిదప "సోమాయ పితృమతేస్వాహా" అను నాహుతి. మూడవ ఆహుతి "వైవస్వతాయ యమాయాంగిరస్వతే" అని హోమము చేయగా మిగిలిన యన్నము నల్పమైన దానిని బ్రాహ్మణుల విస్తళ్ళలో నుంచ వలెను. పిమ్మట మృష్టాన్నమును చక్కగా తయారు చేసిన దానిని వడ్డించి మీ యభీష్టము ననుసరించి భుజింతురు గాక! అని మృదువుగా చెప్పా వలెను. బ్రాహ్మణులు తదేక చిత్తులై మౌనముతో సుముఖతతో సుఖముగ భుజింప వలెను. కోపము, వేగము లేకుండ యజమాని భక్తీ పూర్వకముగ వడ్డించ వలెను. రక్షోఘ్న మంత్రముల చదువ వలెను. తిలలతో భూమి యందాస్తారణమును కల్పించి, యా బ్రాహ్మణులను తమ పితృ దేవతలుగ ద్యానింప వలెను. నా యొక్క పితృపితామహ ప్రపితామహులు ఇపుడీ బ్రాహ్మణుల దేహ మందున్న తృప్తిని పొందుదురు గాక! హోమముచే సంతుష్టి చెందుదురు గాక! అట్లే భూమి యందు నాచే నొసంగ బడిన పిండముచే తృప్తినందుదురు గాక! నా యొక్క భక్తిచే వారు తృప్తి నందుదురు గాక!
మాతామహాదులు, విశ్వే దేవతలు పరమ తృప్తి నొందుదురు గాక! రాక్షసులు నశింతురు గాక! హవ్యకవ్యములను (దేవతలకు పితరులకు నొసంగు నన్నములు) భుజించు వాడును, యజ్ఞేశ్వరుడును, అవ్యయుడునగు, శ్రీహరి యిచ్చట నుండుట వలన సమస్త రాక్షసులు, అసురులు వెంటనే తొలగి పోవుదురు గాక! ఆ బ్రాహ్మణులు తృప్తి నందిన వెనుక భూతలము నందు నన్నమును చిమ్మ వలెను. పిదప వారికి నుత్తరాపోషణ మీయ వలెను. తృప్తులైన బ్రాహ్మణుల యనుజ్ఞ నొంది, సావధాన చిత్తుడై అన్నము తోను, నీటితోను భూతలము నందు పిండ ప్రదానము చేయవలెను. పితృ తీర్థము (తర్జనీ మూలము) తో జలమును, తిలోదకమును పిండములను నివ్వ వలెను. మాతామహాదులకు కూడా నట్లే. దక్షిణాగ్రములగు దర్భల మీద పుష్పాదులచే పూజింప బడిన పిండములను ఉచ్చిష్ట సన్నిధానమున పితృ పితామహాదులకు నొసంగి యా దర్భల మూలము నందు లేపభుక్కులగు చతుర్దాది పితరులను లేప ఘర్షణముతో సంతోష పెట్ట వలయును. మాతామహాదులను కూడనట్లే పూజించి యథా శక్తి దక్షిణల నొసంగ వలెను. వారి యాశీస్సులను కోరి, ముందు పితృ దేవతలను పిమ్మట విశ్వే దేవతలను విసర్జింప వలెను. (విశ్వే దేవతంత్ర పక్షమున - ముందు విశ్వే దేవతలకు, తరువాత పితరులకు చేయ వలెను) మాతా మహాదులకు కూడా నిట్లే. ప్రీతి వాక్కుల నడిగి, ద్వార పర్యంతము అనుగమించి మరల వలెను. పిమ్మట వైశ్శ్వ దేవమను నిత్య కృత్యమును చేసి యిష్టుల, శిష్టుల భృత్యులతో భుజింప వలెను.
ఈ విధముగా పండితుడు పితృ శ్రాద్ధమును మాతామహ శ్రాద్ధమును చేయవలెను. శ్రాద్ధములచే తృప్తి నందిన పితామహులు సర్వ వాంచలను ననుగ్రహింతురు. దౌహిత్రుడు (సుతా పుత్రుడు) కుతప కాలము అనగా 8/15 దిన భాగము, తిలలు ఈ మూడు శ్రాద్ధము నందు పవిత్రములు. అట్లే వెండి వృత్తాంతము, వెండి దానము, తత్సంకీర్తనము మొదలగునవి పవిత్రములు. శ్రాద్ధము చేయు నతడు భోక్తము కోపమును మార్గ గమనమును వేగమును విడువ వలెను. శ్రాద్ధ మాచరించు వాని కులము పితరులు మాతామహులు విశ్వేదేవులు తృప్తిని చెందుదురు. పితృ గణము సోముని (చంద్రుని) పై ఆధారపడి యున్నది. ఆ సోముడు యోగాముపై ఆధారపడి యున్నాడు. కావున ఓ రాజా! శ్రాద్ధము నందు యోగిని నిమంత్రించుట ప్రశస్తము. వెయ్యి మంది బ్రాహ్మణులకు ముందున్న యోగి భోక్తలను, యజమానుని తృప్తి నొందించును.
Summary of chapter 15 of the Vishnu Mahā Purāṇa is as follows:
The qualified categories of brāhmaṇas to be invited to śrāddha are enumerated: triṇāciketaḥ, trimadhu, trisuparna, ṣaḍaṅgavid, yogī, jyeṣṭhasāmagaḥ, ṛtvij, dāyādaḥ, tapasvin, and pañcāgni. The disqualified categories are also listed — including mitra-drohī, napuṃsaka, false brahman, soma-seller, mahāpātaki, thief, grāma-purohita, salaried Veda teacher, śūdrā-pati, and devalaka. The full śrāddha procedure is described in detail: invitation, pādya-arghya pūjā, ācamana, seating directions, silence and meditation, Agni-homa, piṇḍa-dāna, conclusion, and atithi-sevā. Foods giving pitṛ-tṛpti for specified durations, and prohibited items, are also listed.