మైత్రేయ! నన్నీవడిగితివి గాన తెల్పెద వినుము. మరీచి వలన లక్ష్మీ చారిత్రము నిట్లు విని యుంటిని. దుర్వాసుడు శంకరుని యంశము. ఆయన యీ భూలోకము సంచరించుచు నొక దివ్య పుష్పమాలను జూచెను. దాని పరిమళముచే నా వనమంతయు ఘుమఘుమ లాడి వనవాసు లందఱకు సంసేవ్య మయ్యెను. అమ్మహర్షి పిచ్చివాని యట్లు తిరుగుచు (ఉన్మత్త వ్రతముదాల్చి) ఆ సుశోభన కల్పవృక్ష కుసుమ మాలికం గని యా సుందరి నది తనకిమ్మని యడిగెను. ఆ విశాల నయన యాతనికి మ్రొక్కి యది యమ్మునికి సమర్పించెను. అది చేకొని పిచ్చి గంతులు వేయుచు నమ్ముని యీ భూమి నలుదెసల పరిభ్రమించుచు నైరావత మెక్కి యెదురుగా వచ్చు త్రిభువనాధి పతిని శచీపతిని గనెను. తత్సుగంధమునకు తుమ్మెదలు దిమ్ముగొని (వెర్రెత్తి) తుమ్మెదలు మూగు నా మాలను తన తలకు విసిరి వైచెను. కైలాస శిఖర మందు గంగా నదివలె రాణించెను. మదముచే గన్నులు గానని యా గంధగజము మదము స్రవించు తొండముచే నాఘ్రాణించి దానిని నేలకు విసరెను. దాన దుర్వాసుడు కోపించి దేవరాజున కిట్లనియె.
వాసవ! ఐశ్వర్య మదముచే మత్తేక్కితివి. మొద్దు బారితివి. లక్ష్మీ స్థానమైన దానిని నేనిచ్చిన యీ కల్ప సుమ మాలను అభినందింప వైతివి. మహా ప్రసాదమని ప్రణతుడవై సంతోషాతిశయముచే చెక్కిళ్ళు విప్పార (మోము విప్పార) దీనిందల దాల్చ వైతివి. అందులో గూడ నేనిచ్చినదని యైన గమనింపక గౌరవింప వైతివి. ఇందుచే నో మూడ! నీ త్రోలోక సామ్రాజ్య లక్ష్మి తరిగి పోగలదు. ఇతర బ్రాహ్మణులనట్లు నన్ను లెక్కించి లెక్క చేయనైతివి. దురభిమానివీ వందుచే మమ్మవమానించితివి. నేను కోపించి కనుబొమలు ముడిచితివా యీ చరాచర ప్రపంచము గడగడ లాడునే! అట్టి నన్ను పొగరెక్కి ఓ దేవరాజా! అవమానించితివి.
నావిని మహేంద్రుడు గజేంద్ర స్కంధము నుండి దిగ్గున దిగి పుణ్యమూర్తి యగు దుర్వాసుని బ్రతిమాలెను. అతడంతట నల్లన నవ్వి ప్రణతుడై యింద్రుని కిట్లు బదులు పల్కెను.
నేను దయా హృదయుడను గాను, నన్నోరిమి పొందదు. ఆ మునులు వేరని యెరుంగుము, ఆ గౌతమాది మునులితరులు వృధాగా నిన్ను పొగరెక్కించినారు. ఇంద్రా! అశాంతికి (ఓరిమి లేమికి) పరమసారము (నిగ్గు) అయిన దుర్వాసునిగ నన్నెరుంగుము.
దయాసారులైన వశిష్ఠాది ఋషులు తెగ బొగడ నీవు మదమెక్కితివి. అందుచేతనే నన్నిట్లవమానించితివి. జ్వలించు జటా మండలముతో కినుకచే కనుబొమ్మలు ముడిపడి వికటమైన నా మొగముం జూచి భువన త్రయమం దెవ్వడు హడలిపోడు? పెక్కు మాటలెందుకు? నిన్ను నేను క్షమింపను. బ్రతిమాలుట యను నీ నాటక మింకను నాడుచున్నావు అని యవ్విప్రుడు వెళ్ళిపోయెను. దేవరాజును నైరావత మెక్కి యమరావతికి జనెను.
ఇంద్రరాజ్య భ్రంశము తరువాత అది మొదలు మూడు భువనములు జగత్స్వరూపము సొంపు దరిగి పోయినవి. ధ్వంసమైనది. ఓషదులు పంటలు క్షీణించి పోయినవి. యజ్ఞములు జరుగుట లేదు. తాపసులు తపస్సు సేయరు. దానాది ధర్మములందు జనము మనస్సును బెట్టరు. లోభాదుల కింద్రియములు వశమై అల్పాల్ప వస్తువున కుబలాట పడిరి. ఎందు సత్వమో (సత్వ గుణమో) అందు లక్ష్మి యుండును. ఎందు లక్ష్మియో యట సత్వ గుణముండును. సిరి గోల్పోయిన వారికి సత్వమెక్కడ? అది లేనిచో బలము శౌర్యము మొదలగునవి శూన్యము నగును. అవిలేని వాడందరికి లొంగి పోవును. లొంగి పోయిన మానవుడు మతిభ్రష్టుడగును. ఇట్లత్యంతము సిరి తగ్గి త్రిభువనములు సత్త్వ శూన్యము లయినంత దైత్య దానవులు దేవతల మీదికి దండెత్త నుద్యమించిరి. లోభ వశురైయైశ్వర్య హీనులైన దైత్యాలు సత్వము పోయి సిరి తరిగి నిస్సత్వులైన దేవతలతో యుద్దము చేసిరి.
ఇంద్రాదు లోడిపోయి యగ్ని మున్నుగా నందరు బ్రహ్మను శరణందిరి. వారి ఘోష నాలించి బ్రహ్మ అసురమర్దను జనార్దను శరణు పొందు డనియె. అని వారితో దానును పాల్కడలి యుత్తర తీరమున కేగి పరాశర ప్రభుడగు హరిని తదిష్టములైన వాక్కులచే (వేదము చేత) స్తుతించెను.
సర్వులకు సర్వేశ్వరుడు, అనంతడు, అజుడు, అవ్యయుడు, కారణమునకు కారణము, దాని కారణమునకు కారణము, దానికి కారణము లయిన వానికి కారణమునైన సురేశ్వరునికి బ్రణతు లయ్యెదము. భోక్త భోజ్యము, స్రష్ట సృజ్యము. కార్యము, కర్తయు నైన పరమ పదమునకు వినతులయ్యెదము. విశుద్ధ జ్ఞాన సంపన్నము అజము, అవ్యక్తము, అవికారము నైన విష్ణువు పరమ పదము స్థూలము గాదు, సూక్ష్మము గాదు. విశేష గుణములకు గోచరము గాని యవిష్ణుని పరమ పదమునకు మ్రొక్కెదము. ఏ పరబ్రహ్మ యొక్క పదివేల యంశమునకు బదివేలవ యంశమై ఈ విశ్వ శక్తి యున్నదో ఆ యవ్యయమును మ్రొక్కెదము. యోగులు నిత్యమును ఉద్యమించి (నిరంతరాను సంధానము సేసి) పుణ్య పాపములు క్షయింప నీ యక్షయము అచింత్యము నైన దానిం దర్శింతురో ఆ విష్ణువు పరమ పదము దేవతలు, మునులు, నేనును, శంకరుడునుం గూడ నెరుంగరో అవ్విష్ణు పరమ పదమును, అచ్యుత పూర్వుడయిన (పుట్టుక లేని) శక్తులు బ్రహ్మయు, విష్ణువు, శివుడను పేర నున్నవో అట్టి ఓ సర్వేశ, సర్వ భూతాత్మా! సర్వ! సర్వాశ్రయ! అచ్యుత! ఓ సర్వగతా! అని బ్రహ్మ దేవతలు పలికిన తరువాత నిట్లు బృహస్పతి, దేవర్షులును స్తుతించిరి.
ఆద్యుడవు యజ్ఞ మూర్తివి, పూర్వుల కెల్ల పూర్వుడవు. సృష్టికర్తను సృష్టించిన వాడవు. అవిశేషణుడవు. (విశేషణ మనగా భేదకము. ఉన్నదొక్కటే వస్తువైనప్పుడు అది నిర్గుణము. నిర్వికార మైనప్పుడు భేదక సామాగ్రి మరి యుండనే యుండదని తాత్పర్యము) అట్టి నీకు వినతులయ్యెదము. లోగడ పుట్టిన యికమీద పుట్టనున్న వానికీవీశ్వరుడవు. యజ్ఞమూర్తిధరుడవు (లోగడనే యజ్ఞమూర్తివని పిలిచినారు. మరల యజ్ఞమూర్తి వనుట పునరుక్తి కాదా? అన్న స్తుతే “బూమితానాస్తి” స్తుతులందు బునరుక్తి దోషము లేదను న్యాయానుసారము చెప్పినవే మరల చెప్పుట స్తుతి లక్షణము. అట్టి వానికి బునరుక్తికా భావము వ్రాయబడదు. చదువరులు గమనింతురు గాక!) మాయెడ బ్రసన్నుడ వగుము. దర్శన మిమ్ము. ఇదిగో బ్రహ్మాది దేవతలు వారి ముఖమైన యగ్నితో కూడ నీకు బ్రణతులైనారు. శరణొందినారు.
అన ననుగ్రహమూని విష్ణువు వారికి బ్రత్యక్ష మయ్యెను. శంఖ చక్ర గదాధరియై అపూర్వరూప సంపత్తి కలిగి తెజోరాసియై దర్శన మిచ్చిన యా పుండరీకాక్షుని బ్రహ్మాది దేవతలు స్తుతించిరి.
తెలియువాడు తెలియదగినది తెలివియు నీవే. నీ తేజస్సుచే (ప్రతాపముచే) మమ్ములను శత్రువశుల గాచి యాప్యాయన పరుపుము. నీ దర్శన మగునంత వరకే బాధ కోరిక మోహము దుఃఖమును, నీవు నీ శక్తితో మమ్మానంద పరుపుము. అని స్తుతింప ప్రసన్న కటాక్షముల వారినాదరించి యిట్లనియె.
ఓ వేల్పులారా! మీ తేజస్సుల మరల వూరించేదను. నేను దెల్పినట్లు సేయుడు. మందరమును గవ్వముగను వాసుకిని దరిత్రాడుగను జేసి నేను దోడైయుండ పాల్కడిలిం ద్రచ్చుడు. అయ్యెడ మంచి మాటల నా రాక్షసుల నందరికిని సంబంధించిన పని యిది, ఫలము నందరకును సమానమే. ఇందులకు మీరాహుతులు గండు. సముద్ర మథన మయినంతట నమృతము పుట్టును. అది త్రావి మీరు బలవంతులు అమరులు (మరణము లేనివారు) గండు. ఈయన (తానన్న మాట) దేవద్వేషు లమృతము నందకుండ కేవలము సముద్ర మథన క్లేశము మాత్రము కుడుచునట్లు సేయగలరు. అనవిని సురలసురులతో సంధి చేసికొని యమృత సంపాదనమునకు ప్రయత్నా మారంభించిరి. ఓషధులన్ని దెచ్చి పాల సంద్రమున వైచిరి. శరత్కాలాకాశ మట్లచ్చమైన కాంతి గల యా పయోధి యందు మథన మారంభించిరి. మొట్ట మొదట పాము తలకడ బట్టిన దేవతలు దోక బట్టుటకు, తోక బట్టిన దైత్యులు తల బట్టునట్లు హరి తంత్రము గావించెను. మీరు మహా బలశాలురు ధీరులు మీరేమి తుచ్చమైన తోక పట్టుటేమి? ఈ అల్పబలుల ధీరులు దేవతలు శరీరమున కెల్ల ప్రధానమైన ముఖము పట్టుటేమి? సిగ్గు సిగ్గు అని పొఱపులు వెట్టి వాండ్రచే నౌనౌను పొరబడితిమి మేము తల బట్టు కొందుము. మీరు తోకకు రండని వారల చేతనే యనిపించి బేలు చేసి యిద్దరకుం దల తోక మార్చెను. మొదటి కంటే పోయిన కొలది ద్రచ్చు తరితరిగొండ దిరిగిన కొలది వాసుకి ముఖ నిశ్వాస వేగా మెక్కువై కాలకూట విష జ్వాల లువ్వెత్తున లేచి మొగము వైపున నున్న రాక్షసులం దహించెను. దాన్నే వారిలో ముప్పాతిక మంది నశించిరి. మిగిలిన రక్కసులు తోజోహీనులైరి. తోకనున్న వేల్పులను హరి మేఘముల వర్షింప జేసి యాప్యాయనము గావించెను. అంతలో మందరము మత్తు (కవ్వము) బరువున ణా సంద్రమున దిగబడి పోయినంత తాను దాబేలయి ఎత్తుటయే గాక మేరు రూపున రాక్షసులలోని కీడ్చివైచెను. మరియు నా కొండ శిఖరమున బెద్ద రూపమున నిలచెను. సురాసురు లెన్నడు నా రూపము సూచీ యెరుంగరు. ఆ మీద తన తేజముచే నాగరాజును గూడ శ్రమ నదలించి అప్యాయితుం గావించెను. మరియొక రూపమున దేవతలకు బుష్టి చేకూర్చెను.
అట్లు తరచు చుండ నా పాల్కడలి యందు దేవహవిర్దానము సురభి (హవిర్ధానము = హవిర్భాగమైనపాలకు నివాసము, కామధేనువు) పుట్టెను. వేల్పులెల్లరు నవ్వేల్పుటావును బూజించు చుందురు. దేవదానవు లానంద భరితులైరి. అంతమున్ను జెదరిన చిత్తముల వారు వారు స్తిమిత దృష్టి నందిరి. అంతలో నిదియేమని సిద్ధులను కొనుచుండ వారుణీదేవి మత్తుచే కనుగ్రుడ్లు తిరుగాడ పాల్కడలిలో సుడి సేసుకొని యెగసి వచ్చెను. సువాసనలచే జగమెల్ల బరిమళింప జేయుచు పారిజాత ముదయించెను. రూపౌదార్యాది గుణ సంపదతో నద్భూతావహముగా సప్సరో గణము బుట్టెను. అవ్వాల శీతాంశువు (చంద్రుడు) బుట్టెను. అతనిని మహేశ్వరుడు గైకొనెను. అందు బుట్టిన విషమును నాగులు గైకొనిరి. అచ్చము పట్టు పుట్టములం దాల్చి అమృత పూర్ణ కమండలువుం బట్టుకొని ధన్వంతరి తానుగా నందుండి మీదికి వచ్చెను. అంత దైతేయులు దానవులు మునులతో స్వస్థ చిత్తులైరి, ముదితులైరి.
అంతట నలుదెసల వెలుగులు గ్రమ్మ వికసించిన పద్మమందు గూర్చిండి చేతం బద్మము బట్టుకొని శ్రీదేవి యావిర్భవించెను.
అట్లుదయించిన యా దేవిని మహర్షు లానంద మంది స్తుతించిరి. విశ్వావసు ప్రముఖ గంధర్వు లామె ముందు గానములు సేసిరి ఘృతాచీ ప్రముఖ లప్సరసలు నర్తించిరి. గంగాది నదులు పవిత్ర జలముం గొనివచ్చిరి.మఱియు దిగ్గజ కుంభస్థల మందు సువర్ణ కుంభము లందున్న యా పవిత్ర తీర్ధములచే నమ్మంగళ దేవతను సర్వలోకేశ్వరిని స్నానమాడించిరి. ఆవిడకు క్షీర సముద్రుడు వాడులేని తామర పూలమాల నిచ్చెను. దివ్య మాల్యాంబరములుం దాల్చి దివ్య స్వర్ణ మణి భూషములు గైసేసి యా సుందరి ఇందిరా యల్లన జని సురలెల్లరు గనుచుండ హరి వక్షస్థల మలంకరించెను. అవ్వల హరి వక్షస్థల మందున్న యా లక్ష్మి క్రేగంటం గనుగొనబడి (లక్ష్మి కటాక్ష పాత్రులాయి) యెన్నడులేని సుఖమును సంతోషమును బొందిరి. విష్ణు విముఖులు (విష్ణునికి బెడ మొగమైన వారు) లక్ష్మిచే బరిత్యక్తులై విప్రచిత్తి మొదలగు వాండ్రేగి ధన్వంతరి చేతనున్న యమృత కమండలువు లాగికొనిరి. విష్ణువు మాయచే స్త్రీ రూపము దాల్చి వారిని లోభపెట్టి దానిని దేవతల చేతికిచ్చెను. అంతట నింద్రాదులా అమృతమును ద్రావిరి. రాక్షసులాయుధముల నెత్తి వారి పైకెత్తిరి. అమృతము ద్రావి బలమొందిన దేవతల చేత దైత్యసేన హతము గావింప బడుచు పాతాళామును ప్రవేశించె. అపుడు దేవతలు నమ్మోదమంది శంఖ చక్ర గదాధరుని దామోదరుం మ్రొక్కి ముందతయట్లు స్వర్గముం బాలించిరి. అవ్వల సూర్యుడు కావిరివాసి ప్రసన్నప్రభతో దానదారిందాను సంచరించెను. ఎల్లవెలుగులు (జ్యోతిర్మండలము) తనదారిం బ్రవర్తించె. అగ్ని భట్టారకుడు చక్కని దీప్తితో మిక్కిలిగ బ్రజ్వలించెను. భూతములకు ధర్మమందు బుద్దిగలిగె. ముల్లోకము లక్ష్మీకళ నిండెను. శక్రుడెప్పయట్టి శ్రీమంతు డయ్యెను. మఱల స్వర్గ సామ్రాజ్య మంది సింహాసన మదిష్టించి పద్మహస్త యగు శ్రీదేవిని దేవరాజు స్తుతించెను.
Summary of chapter 9 of the Vishnu Mahā Purāṇa is as follows:
The great churning of the cosmic ocean (samudra mathana) is narrated. The devas, weakened by Durvāsa's curse, seek Viṣṇu's help. Viṣṇu advises them to form an alliance with the asuras and churn the ocean using Mount Mandara and the serpent Vāsuki. Viṣṇu tricks the asuras into holding the head-end of Vāsuki (from which the poison breath flows), while the devas hold the tail. The treasures that emerge include Dhanvantari with the kumbha of amṛta, Lakṣmī (Śrī), the Kauśtubha jewel, Uccaiḥśravas, Airāvata, and other ratnas. Viṣṇu-Mohini takes the amṛta and distributes it to the devas. Lakṣmī's cosmic vibhūtis — the correspondences by which she manifests in all the good, beautiful, and prosperous aspects of creation — are extensively listed.