జగద్విధాత దేవదేవుడు చెప్పినట్లు యోగమాయ ఆఱవ గర్భము నందలి (శిశువును) రోహిణీ గర్భమందుంచి యామె గర్భము నందలి శిశువునొక కర్షణమును గావించి ఆ రోహిణీ జఠర మందుంప బడిన యతడే సంకర్షణుడు (బలరాముడు). ఆ యోగనిద్ర యదే రోజున యశోద యొక్క జఠరము నందు విష్ణువెట్లానతిచ్చె నట్లే పుట్టెను, అటుపై దివంబున గ్రహగణము చక్కని స్థానము లందు సంచరింప విష్ణ్వంశ మవని నవతరించెను. ఋతువులు పరమ శోభనము లయి ప్రకాశించెను. అద్భుత తేజమున దీపించు దేవకీ దేవిని యెవ్వరునేని దర్శింప నేరరైరి. ఆమె వంక జూచిన వారి మనస్సు లాందోళన మందినవి. స్త్రీ పురుషు లెవ్వరికిం గనబడకుండ దేవగణములు విష్ణునిం దానయుదర మందు ధరించిన యా దేవకీ దేవిని రేయింబవళ్ళిట్లు స్తుతించిరి.
నీవు సూక్ష్మమయిన పరాప్రకృతి. బ్రహ్మగర్భవు. ఓ కళ్యాణీ యా మీద జగత్తులకు విధాత యగు బ్రహ్మకు వాణివై వేదగర్భ వైతివి. సృజ్యమగు (సృష్టింప బడునది యగు) దృశ్యాత్మక జగత్తునకు రూపగర్భవై సృష్టి రూపిణి వైతివి. సర్వమునకు బీజమయి త్రయీ రూపమగు యజ్ఞ గర్భ వైతివి. యజింప బడుదానవై (ఇజ్యవై) నీవే ఫల గర్భ వైతివి. అరణి రూపమున నీవు వహ్ని గర్భ వైతివి. వెన్నెలవై వాసర గర్భ వైతిని, సన్నతివై (నమస్కార స్వరూపిణివై) జ్ఞాన గర్భ వయితివి. పరమ నీతివీవై నయగర్భ వయితివి. వినయముం బూని లజ్జ గర్భ వైతివి. ఇచ్చవు కామ గర్భవు. తుష్టిగా సంతోష గర్భినివి. మేధగా బోధ గర్భవు, ధృతివై ధైర్య గర్భవు, అఖిల కారణమైన ద్యులోక మంతరిక్షముగా గ్రహ నక్షత్ర తారకా గర్భవు. మరియును వేల కొలదిగా గల విభూతులు అసంఖ్యాకములు నైన జగద్ధాత్రి యిపుడు నీ కడుపులో నున్నది. ఆమెకు సముద్రాద్రి నదీద్వీప పట్టణములు విభూషణములు. గ్రామ ఖర్వట ఖేతాదుల యెల్ల పృథివి అన్ని యగ్నులు నీళ్ళు వాయువులు ఉరగులు యక్షులు రాక్షసులు ప్రేతములు గుహ్యకులు గ్రహర్క్ష తారకా విమాన శతసంకుల మయిన నభము (అంతరిక్షము) అంతటికి అవకాశ మయిన ఆకాశము భూర్భువ స్వర్మ హర్జనస్తపో బ్రహ్మ లోకములు అఖిల బహ్మండము దానిలో నున్న దేవదైత్య గంధర్వచారణ మహోరగ యక్ష రాక్షస ప్రేతగుహ్యకులు మనుష్యులు పశువులు మఱియుం గల జీవులు తనలో నున్న వానిచే ననంతుడగు నీ సర్వాంతర్యామి సర్వభావనుడు యెవ్వని రూపకర్మ స్వరూపులు కొలత కందవో అఖిల మైన కొలత లెవ్వనిలో నిముడునో అట్టి విష్ణువు నీ గర్భ మందున్నాడు, విష్ణు గర్భవు అన్నమాట. నీవు స్వాహదేవీ వి స్వధవు విద్యవు సుధవు నింగిని జ్యోతిస్సువు. నీవు సర్వలోక రక్షార్థ మవని నవతరించిన దానవు దేవీ! ప్రసన్నవు గమ్ము. సర్వ జగమ్మునకు నో కల్యాణీ! శం (= సుఖమును) కురు (= చేయుము). ఎవ్వనిచే నఖిల జగమ్ము ధరింప బడినదో యా యీశానుని బ్రీతితో నీవు ధరింపుము.
Summary of chapter 2 of the Vishnu Mahā Purāṇa is as follows:
Yogamāyā is commanded by Bhagavān to take her position. Balarāma's foetal transfer from Devakī's womb to Rohiṇī's womb is accomplished by Yogamāyā — this pregnancy is declared a miscarriage in Kaṃsa's prison. The devas, knowing the divine birth is imminent, offer a stotra honoring Devakī and the divine presence within her womb.