ఇట్లు జగద్రక్షణ కొఱకు శ్రీకృష్ణుడు బలదేవుని తోడ్పాటుగొని దుష్ట రాజుల యొక్కయు దైత్యుల యొక్కయు సంహారమును గావించెను. ఫల్గునునితో సర్వాక్షౌహిణీ సేనా నాశము చేసి భూభారముం గూడ దించెను. ఇట్లు కావించి విప్రశాపము మిషమున యాదవ కులముం గూడ నుప సంహరింప జేసెను. ద్వారకను వదలి మానుష రూపముం బాసి విష్ణునంశమైన కృష్ణుడు తన విష్ణు పదముం బ్రవేశించెను.
అనవిని కృష్ణ పరమాత్మ అయ్యాదవ వంశ సంహారాదు లెట్లు సేసె దెలుపుమని మైత్రుయుం డడుగ పరాశరుం డిట్లు పలుక దొడంగెను.
విశ్వామిత్ర కణ్వ నారదులు మహామునులు పిండారక తీర్థమందు యదు కుమారులకు గనబడిరి. అయ్యాదవులు యౌవనమున మత్తెక్కి కాగల కార్యవిధి ప్రేరణను జాంబవతీ కుమారుని సాంబుని ఆడుదానిగా నలంకరించి వినతులై యమ్మునులకు బ్రణమిల్లి ఈ యింతి కొడుకుంగన గోరిక గలదై యున్నది. కొడుకు పుట్టునా? చెప్పుడనిరి. అమ్మునులు దివ్య జ్ఞాన సంపన్నులు యదు కుమారులచే మోసగింపబడి కోపము గొని ఈమె ముసలముం గనును. అది యతిలోక ప్రభావము. సర్వ యాదవుల సంహార కారణము. దాన సర్వ యాదవుల కుల నాశము గాగలదనిరి. ఆ బాలురది యెల్ల నుగ్రసేన మహారాజున కెరిగించిరి. సాంబుని కడుపున ముసలము పుట్టనే పుట్టి ఉగ్రసేనుడా ముసలమును పొడి గొట్టించెను. అది ఏరకా చూర్ణమయ్యెను. దానిని యాదవులు సముద్రమందు బడవేసిరి. ముసలాయుధము చూర్ణముకాగా మిగిలిన ఖండము తోమరము రూపమున నున్న దానిని గూడ సముద్రమునం బారవేసెను. దాని నొక్క చేప దినెను. ఆ చేప జాలరుల వలలో బడ దానిం జంపి యొక లుబ్దుడుగై కొనెను. భగవంతుడు మధువైరి పరమార్థమిదియెల్ల నెరింగియు విదివిహితమై నందున దాని నన్యథాకరించుట దలంపడయ్యె. అదే సమయమున దేవతల పనుపున వాయుదేవుం డేతెంచి హరికిం బ్రణమిల్లి ఏకాంతమున నేనమరులు పంపవచ్చిన దూతను వసురుద్రాదిత్యాశ్వి సాధ్యాదు లందరతో గూడి ఇంద్రుడు తమకిట్లు విన్నపము సేయుచున్నా డాలింపుము. భూభారావతరణమునకై వంద యేండ్లకు పైగా నిమ్మేదిని నీవు దేవ ప్రేరణముచే నవతరించితివి. దుష్టులు దైత్యులు సంహరింప బడిరి. దేవతలు స్వర్గమున నీచే సనాథులగుదురు గాక! నూరేండ్లు జరిగినవిక దమకిష్టమేని తాము స్వర్గమునకు దయసేయ వలయును. తమకిటనే యుండ నభిలాషయేని అనుచరులతో నిక్కడనే యుండవలెను. అనవిని భగవంతు డిట్లనియె.
ఓ దేవదూత! నీవన్నదెల్ల నేనెరుంగుదును. యాదవ వంశ నాశము నేనే యారంభించితిని. తెగ పెరిగిన యాదవులచే నిపుడు గూడ బరువెక్కిన ఈ భూమి భారము దింపి యేడు రాత్రులలో సముద్రము నుండి ద్వారకను గొనివచ్చి యాదవుల కిచ్చి సంకర్షుణునితో ఈ మానుష్య శరీరముప సంహరించి దేవ సదనమున కేతెంతును. దేవేంద్రుడు దేవతలును నేనక్కడకు వచ్చినాడననియే తలంప వలయును. జరాసంధాదు లెందరో నిహతులైరి. కాని యాదవుల వలన గూడ బరువెక్కి యీ భూభారమింత మాత్రాన తగ్గలేదు. ఈ పెనుబరువుం గూడ నేను దింపి యమ పరలోక పాలనకే నేతెంతును. ఈ మాట వారికి జెప్పుము. వాసుదేవుం డిట్లు పలుక దేవదూత వాయు భగవానుడు భగవంతునికి బ్రణతుడై దివ్యగతి నింద్రుని దరికేతెంచెను.
కృష్ణ భగవానుడు దివ్య భౌమాంతరిక్షము లయిన యుత్పాతములను రేయిం బవళ్ళు ద్వారక యందు జూచెను. చూచి యాదవులతో నిదిగో చూడుడని వాని యుపశమనంబునకు వెంటనే ప్రభాస తీర్థమున కరుగుదుమనెను. అది విని యాదవ ప్రవరుడు మహాభాగవతుడు ఉద్దవస్వామి హరింగని, 'స్వామీ! నేనిపుడేమి సేయవలయు నానతిమ్ము. ఈ యాదవ కులమంతను నీ వుపసంహరింతువని తలంచెద. ఈ వినాశమునకు శకునములం గూడ నేను జూచు చున్నాను. అన విని కృష్ణ భగవానుడిట్లనియె.
నీవు నా యనుగ్రహముచే లభించిన దివ్యగతిని గంధమాదన పుణ్య బదర్యాశ్రమమున కరుగుము. పవిత్ర నర నారాయణ స్థానమందు గలదు. నాపై మనసు నిల్పి యక్కడ నా యనుగ్రహమున సిద్ధినందెదవు. నేనీ కులము ఉపసంహరించి స్వర్గమునకు వత్తును. నే విడిచిన ద్వారకను సముద్రుడు ముంచి వేయును. నా నివాస సౌధమొక్కటి మాత్రము నా వలని భయమున ముంచడు. భక్త హితము గోరి నేనక్కడ సన్నిహితుడ నయ్యెదను.
అన విని యుద్ధవుడు కేశవాను మోదితుడై సత్వరము నర నారాయణ స్థానమైన బదరీ తపోవనమునకుం జనెను. అవ్వల యాదవులెల్లరు శీఘ్రగములైన రథముల నెక్కి బలరామ కృష్ణులతో ప్రభాస తీర్థమునకుం జనిరి. కుకురాంధక వృష్టి వంశముల వారు యందరు వాసుదేవ ప్రచోదనచే తెగ త్రావిరి. అట్లు త్రావి యొండొరుల సంఘర్షణ నొడివిన ప్రేలుడను కట్టెలం గనగన మండు కలహాగ్ని సర్వ నాశకము పుట్టెను.
అనవిని వారివారి వంతు వారువారు అనుభవించు చుండ వారికే నిమిత్తమున కలహము పుట్టెను. సంఘర్ష మెందుల కయ్యెనది నాకు దెలుపుమన పరాశరుండిట్లనియె.
నా అన్నము రుచిగా నున్నది నీవు తిను నన్నము రుచిపచి లేనిదని యాదవులలో నొండోరులకు మృష్టామృష్ట నిమిత్తమైన కథ సాగెను. దాన వారికి సంఘర్షణ కయ్యము నారంభమైనది. అంతట కోపముచే గ్రుడ్లు ఎర్రవడ ఒండొరులం దారసిల్లి యాయుధములచే బాదుకొన జొచ్చిరి. వారి ఆ కలహమునకు దైవమే బలాత్కరించినది. ఆయుధము లన్నియు నైన తరువాత దాపున నున్న తుంగను బట్టికొనిరి. అది చేపట్టగానే అది వజ్రాయుధమయినట్లు కాన వచ్చెను. దానిచే దారుణమయిన యా పోరు ప్రద్యుమ్న, సాంబ ప్రముఖులు, కృతవర్మ, సాత్యకి, అనిరుద్దాదులు, పృథువు, విపృథువు, చారువర్మ, చారుకుడు, అక్రూరాదులు నొకరి నొకరు తుంగ గడ్డి రూపము లయిన వజ్రములం గొట్టుకొనిరి. హరి వారి నాపెం గాని వారాతనిని శత్రువులకు సహాయుడని భావించి పరస్పర మింకను బాదుకొనిరి. అదిగని కృష్ణుడుం గుపితుడై తుంగను గుప్పిటం బట్టినంత నదియు లోహమయమైన ముసల మయ్యెను. ఆతతాయు లయిన యయ్యాదవుల నాతడు దానిచే బాదేను. తక్కినవారు వారును బాదుకోనిరి. అవ్వల చక్రాయుధుని యరదము దారుకుడు చూచు చుండగానే గుఱ్ఱములతో సాగరమున బడెను. చక్రము గద శార్ఘ్యము అమ్ములపొది శంఖము ఖడ్గమును హరికి బ్రదక్షినము సేసి ఆదిత్య మండల మార్గమున నేగినవి. ఒక్క క్షణములో యాదవులలో కృష్ణుడు దారుకుడుం దప్ప కొట్టబడని వాడొక్కడు లేడయ్యే. ఆ యిద్దరు నడుగులు వేసికోనుచుం జని వృక్షము మొదలనున్న బలరాముం జూచిరి. ఆయన ముఖము నుండి యొక్క మహా సర్పము వెలువడుచున్నట్లును గాంచిరి. పెద్ద పడగ గల యా పామట్లాతని మోము వెడలి సిద్ధులు నాగులు పూజింప సముద్రముం జొచ్చెను. అవ్వల సముద్రు డర్ఘ్యముం గొని బలరాముని కెదురుగా నేగెను. అవ్వల నాగులచే నర్చింప బడుచు హలి నీటిలోని కరిగెను. బలరామ నిర్యాణముం గాంచి హరి దారుకునితో నీవీ వార్త ఎల్ల వాసుదేవునికి నుగ్రసేనునికిం జెప్పుము. బలభద్రుని నిర్యాణమును యాదవకుల క్షయమును నెరింగింపుము. నేనును యోగ సమాధి నిలిచి కళేబరము విడిచెదను. ద్వారకా వాసులకును నాహుకునికిని ‘ఈ నగరము నెల్ల సముద్రుడు ముంచి వేయును. కావున మీరందఱు నర్జునుని రాక కెదురు చూడుడు. అతడిచటకు వచ్చి నిష్క్రమించిన తరువాత మీరు ద్వారకా నగర మధ్య మందుండరాదు. అతనితో నతడెటకేగు నచ్చటికి మీరు నేగుడు’ అని చెప్పుము. నీవేగి మా మాటగా నర్జునకిట్లు ఈ నా భార్యా వర్గమును యథా శక్తి కాపాడ వలయునని చెప్పుము. నీవును నర్జునునితో ద్వారవతి యందలి జనముం గొని సనుము. వజ్రుడును రాజు గాగలడు. ఇది విని దారుకుడు మరి మరి కృష్ణునికి మ్రొక్కి పలుమారులు ప్రదక్షిణము సేసి యా చెప్పినట్లు ద్వారక కేగి యర్జునుని కా మాటలు విన్నవించెను. వజ్రుని గొని వచ్చి రాజుం గావించెను. భగవంతుడు గోవిందుడు వాసుదేవాత్మక మయిన పరబ్రహ్మమును దనయం దారోపించికొని సర్వభూతము లందును ధారణ సేసెను. నిష్ప్రపంచమగు నాత్మయందాత్మను సంయోజించి తుర్యావస్థాత్మకుడై యా పురుషోత్తముడు శయనించెను. దుర్వాసో మహర్షి మున్నేమి పలికె నా మాటను గౌరవించుచు తన పాదమును మోకాలిపై నుంచి యోగ సమాధి స్తిథుడయ్యేను. జరసుడను బోయ ముసలము యొక్క యవశేషమైన రోహ బాణమును తోమరముం జతసేసి ఏతెంచెను. వాడు హరి పాదమును మృగ పాదమట్లున్న దాని నల్లంత దూరము నుండి చూచి యా తోమరముతో ఆ పాద తాళమును గురిచేసి కొట్టెను. అటుపై నక్కడ వాడు చతుర్భాహుదారియైన విష్ణుని దర్శించెను. ఈయనకు మఱియుం బ్రణతి చేసి దయ చూడుమని మరిమరి పలికెను. ఇది యొక లేడి యనుకొని తెలియక కొట్టితిని. నా పాపముచే దగ్దుడనగుచున్న నన్ను క్షమింప వలయు రక్షింప వలయునని వాడు వేడుకొనెను. అంతట భగవంతుడు “నీకు అణు మాత్రమేని భయము వలదు లుబ్డక! నా యనుగ్రహముచే నీవు దేవతావాసమగు స్వర్గమునకుం జను” మనెను. ఆ మాట పలికినదే తడవుగ నరుదెంచిన విమాన మెక్కి యా హరి ప్రసాదమున నా బోయ స్వర్గమునకుం జనెను. వాడటు వోయినంత కృష్ణ భగవానుడు దన్ను బ్రహ్మ భూతమును అవ్యయమును అచింత్యమును అమలమును వాసుదేవ మయమును అజమును అమరమును అప్రమేయమును అఖిలాత్మకమునైన తన విష్ణుతత్త్వము నందు ఆత్మను సంయోజించి దశాత్రయమును దాటి మానుష దేహముం ద్వజించెను.
Summary of chapter 37 of the Vishnu Mahā Purāṇa is as follows:
The ṛṣis Viśvāmitra, Kaṇva, and Nārada test the Yādavas: they dress Sāmba as a pregnant woman and ask the assembled Yādavas to identify the expected child. The Yādavas, arrogant and disrespectful, give a mocking answer — and the ṛṣis curse them that an iron musala will be born and destroy the Yādava race. Ugrasena grinds the musala to powder and casts it in the sea, but an iron fragment remains. The Yādavas gather at Prabhāsa for a festival, drink wine, quarrel, and fight each other with eraka-grass that transforms into iron weapons — the entire race destroys itself. Kṛṣṇa, after the fratricidal destruction, gives his final instructions to Dāruka. Balarāma's mahānirvaṇa occurs: a great white serpent (Ādiśeṣa) emerges from Balarāma's mouth and departs for the ocean. The hunter Jarā's arrow strikes the sole of Kṛṣṇa's foot — Kṛṣṇa pardons him and Jarā attains a divine state. Kṛṣṇa then merges into his own Viṣṇu-tattva, and the devas in Svarga celebrate Bhagavān's return to his supreme abode.