ముని శ్రేష్ఠులారా! భూమి యొక్క వైశాల్యము డెబ్బది వేల యోజనములు, దాని యెత్తు నంతే. ఒక్కొక్క పాతాళము వైశాల్యము పదివేల యోజనములు. అతలము, వితలము, నితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము యనునవి సప్త పాతాళములు. అచట కృష్ణా, శుక్లా, అరుణా, పీతా, శర్కరా, శైలకాంచనీ అను భూములు ఉత్తమ సౌధములతో నొప్పు చుండును. ఆ ప్రదేశము లందు దైత్య దానవ జాతులు వందల కొలది గలరు. బ్రాహ్మణోత్తములారా! అచట పెద్ద సర్ప జాతులు కూడా గలవు.
స్వర్గము కంటెను పాతాళములు రమ్యములని పాతాళము నుండి స్వర్గమున కేగి సభా మధ్యమున నారద మహర్షి చెప్పిరి. వీనియందాహ్లాద జనకము లైన పరిశుభ్ర కాంతి భరితములైన రత్నము లున్నవి. నాగాభరణ భూషణములు పెక్కు లున్నవి. ఇట్టి పాతాళము దేనితో సాటియగును. దైత్యదానవ కన్యారత్నము లిందందందు క్రీడింతురు. ఇట్టి పాతాళము ముక్తుడైన వానికి గూడ ప్రీతిజనకమై యుండును. పగటి సూర్యు కిరణము లిచ్చట కాంతి నొసంగును గాని ఎండ వేడిమిని కలిగింపవు. రాత్రి చంద్ర కాంతులును చలిని గాక చక్కని వెలుగును మాత్రమే యిచ్చును. భక్ష్య భోజ్యలేహ్య పానీయా రూపమైన యాహారము లచే మదించిన భోగులగు దానవాదులు కాలగమనము నిచట గమనింపనే గమనింపరు. వనములు నదులు సరోవారములు పుంస్కోకిలల కళకళ రావములతో మనోహరములై యుండును. ఇచటి ప్రజలు ధరించు భూషణములు మిగుల రమ్యములు. అంగరాగములు గందాదులు పరిమళ భరితములు. నిరంతరము వీణావేణు మృదంగ నాదము శ్రవణ మనోహరముగ వినిపించును. ఇచటి భాగ్య భోగ్యములు పరమ మనోహరములు. పాతాళ వాసులగు దానవులు దైత్యులు నాగులును ఆ భోగము లనుభవించు చుందురు.
పాతాళమున కడుగున విష్ణువు యొక్క తమోమయ శరీరము శేషుడను పేర అనంత కళ్యాణ గుణ నిలయమై తేజరిల్లు చుండును. దేవ, దేవర్షి, సిద్దులచే నత డనంతుడని కీర్తింప బడును. స్వస్తిక ముద్రాంకితము లైన వేయి శిరస్సులచే సహస్ర ఫణామణి కాంతి పుంజములచే దెసలను రంజింప జేయు చుండును. లోకహితమునకై ఆయన యచటి యసురులను తన దేజముచే నిర్వీర్యము నొనరించు చుండును. ఎల్లప్పుడు నొకే కుండలము నాభరణముగ ధరించి, కిరీట ధారియై, పుష్ప మాలాంకృతుడై మద ఘార్ణిత నేత్రుడై అగ్ని సహిత శ్వేతాచల మాట్లు ప్రకాశించు చుండును. నీల వసనుడు మదోత్సికుడు శ్వేతహోరోప శోభితుడు ఆకాశగంగా ప్రపాత సంయుత కైలాస పర్వత మున్నట్లు ఈ శేషుడు ఒక చేత నాగలియు మరొక చేత రోకలియు ధరించి వారుణియను నాగాంగనతో గూడి యుపాసింప బడును.
కల్పాంత మందు సహస్ర ముఖముల నుండి విషానల జ్వాలలు గ్రమ్ముకొన సంకర్షణ స్వరూపుడైన రుద్రుడు జగ త్రయమును మ్రింగి వేయును. గిరి మండలమట్లు అశేషక్షితి మండలమును ఫణాగ్రమున ధరించి అశేషు డశేష సురార్చితుడై పాతాలమూల మందధిష్టించి యున్నాడు. దేవతలు కూడ యతని వీర్య ప్రభావ రూప వైభవము వర్ణింప జాలరు. తెలిసికొన జాలరు. ఆయన ఫణామణి శిఖలచే అరుణమయి కుసుమ మాలికవలె నిలాతల మఖిలము నిలిచి యున్నది. అట్టి మహానుభావుని శక్తి నెవ్వడు వర్ణింప గలదు.
మదముచే తిరుగడువడు కన్నులతో నయ్య నంతుడెప్పుడు విజృంభించునో అపుడు భూమండలము ఆ పర్వత సముద్రముగా కంపించును. గంధర్వాప్సర సిద్ద కిన్నరోరగా వారణులు కూడా ఆశేషాహి గుణముల యంతు తెలియలేరు. కావుననే యాయన అనంతుడను పేరొందెను. నాగకన్యా తిలకములు తమ మృదుల కరకమలములచే నతనికి పూయు హరి చందనము శ్వాసా నిలములచే విసరబడి దెసలకు సువాసన భరిత పటవాసమై (పరిమళ చూర్ణమై) వాసించుచు. ఆ ఫణిరాజు నారాధించి పురాణ మహర్షి గర్గాచార్యుడు జ్యోతిశ్చక్రము యొక్క రహస్యముల నెరింగెను. సకల శకున ఫలితములను దెలుప గల్గెను. ఆ నాగేంద్రునిచే శిరసా వహింప బడిన యీ వసుంధర దేవాసుర మానుష విశేష సహితము లయిన సర్వ లోకములను ధరింప గల్గు చున్నది.
Summary of chapter 5 of the Vishnu Mahā Purāṇa is as follows:
The seven subterranean worlds are described from uppermost to deepest, each distinguished by its soil color: Atala (white), Vitala (black), Nitala (purple), Sutala (yellow), Talātala (sandy), Rasātala (stone), and Pātāla (golden). Daityas and Dānavas inhabit these realms in magnificent underground palaces lit by their own jewels. At the base of the deepest pātāla rests Śeṣa (Ananta) — the thousand-hooded serpent who bears the entire globe upon a single hood. His venom blazes as kālāgni at the cosmic dissolution. The great astrologer Gargācārya obtained his jyotiṣa-vidyā by going to the pātāla and learning directly from Śeṣa.