సృష్టిని గురించి చక్కగా దెలిపితివి. ఈ విషయము నింకను విన గోరెదను. స్వాయంభువ మనువు కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తన పాదుడును. అందు త్తానపాదుని కుమారుడగు ధ్రువుని గూర్చి తెల్పితివి. ప్రియవ్రతుని సంతతిం గూర్చి దయతో తెలుపుడు.
ప్రియవ్రతుడు కర్దమ ప్రజాపతి కూతురును కామ్యను బెండ్లాడెను. వారికి సమ్రాట్టు, కుక్షియను వారు కూతుండ్రు. పదిమంది కుమారులు వారి పేర్లు అగ్నీధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మంతుడు, ద్యుతిమంతుడు, మేధమేధాతిథి, భవ్యుడు, సవనుడు, పుత్రుడు, జ్యోతిష్మంతుడు (జ్యోతిష్మంతుడు యదార్ధ నామధేయుడు), మేధా. అగ్నిభాహువు పుత్రుడునను ప్రియవ్రతుని కొడుకులు ముగ్గురు యోగులు. పూర్వ జన్మ జ్ఞానము గలవారు. రాజ్యముపై వారు మనసు లేని వారు నిర్మములు విరక్తులు నిష్కామ కర్మపరులై యుండిరి. ప్రియవ్రతుడు తక్కిన యేడుగురు మహాత్ములగు కొడుకులకు రాజ్యము విభజించి యిచ్చెను. జంబూ ద్వీపమును ఆగ్నీధ్రునికి ప్లక్ష ద్వీపమును మేధాతిథికి, శాల్మలి ద్వీపమును
వపుష్మమంతునికి, కుశ ద్వీపమును జ్యోతిష్మమంతునికి, క్రౌంచ ద్వీపమును ద్యుతిమంతునికి, శాక ద్వీపమును భవ్యునికి, పుష్కర ద్వీపమును సవనునికి యిచ్చి పట్టాభి షిక్తులం జేసెను. జంబూ ద్వీపాధిపతి యైన యాగ్నీద్రుని కుమారులు ప్రజాపతి సములు తొమ్మండుగురు. వారు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇళావృతుడు, రమ్యుడు, హిరణ్వంతుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అను వారు. కేతుమాలుడు పరమ సాధువు.
వారు జంబూ ద్వీపమును దొమ్మిది భాగము లోనర్చి పంచుకొనిరి. అందు హిమవర్షము నాభికి, దక్షిణ దెసనున్న హేమకూట వర్షమును కింపురుషునికి, మూడవది నైషద వర్షమును హరివర్షునికి, నడుమ మేరువు గల వర్షము నిలావృతునికి, నీలాచల మంటి యున్న వర్షమును రమ్యునికి, దాని కుత్తరముగ నున్న శ్వేత వర్షమును హిరణ్వంతునికి, శృంగవంతమను పర్వతమున కుత్తరపు దెసనున్న వర్షమును కురువునకు, మేరువునకు దూరపు దెసనన్న వర్షమును భద్రాశ్వునకు, గందమాధన వర్షమును కేతుమాలునికి నోసంగెను. ఇట్లారాజు అగ్నీధ్రుడా కుమారులు తొమ్మండ్రను తొమ్మిది వర్షము లందు నభిషేకించి సాల గ్రామమను పుణ్య స్థలమునకు దపస్సునకు నేగెను. కింపురుషాది వర్షము లెనిమి దింట జీవులకు జీవన స్వభావ సిద్దము సుఖప్రాయము (ఆయత్న సిద్దము). అందలి జనులకు విపర్యయము (మార్పు) దుఃఖాదికము ముదిమి మరణము అనువాని భయము లేదు. అందలి జనులందు ధర్మాధర్మములు ఉత్తమాధమ మధ్యమ భేదాములును లేవు. వారిలో యుగ నిమిత్తమైన యవస్థా భేదము ననుసరించి దేహాదులలో హెచ్చు తగ్గులు లేవు. హిమవర్షము మహాత్ముడగు నాభిది. ఆతనికి మేరుదేవి యందు గలిగిన వాడు ఋషభుడు మహాతేజశ్శాలి. ఋషభునికి నూరుగురు పుత్రులు. అందు భరతుడు పెద్దవాడు. ఋషభుడు స్వధర్మముతో రాజ్యము చేసి వీరుడైన తన కుమారుడగు భరతుని అభిషేకించి తపస్సు కొఱకై పులహుని యాశ్రమమగు సాలగ్రామ క్షేత్రమున కేగెను. అచట వానప్రస్థ ధర్మ మవలంభించి తపస్సు చేసెను. యజ్ఞము చేసెను.
తపస్సుచే గృశించి శల్యమాత్రా వశిష్టుడై నగ్నుడై (దిగంబరియై) మౌనానశన వ్రతస్థులు ధరించు నట్టి బంతివంటి రాతిని నోటపెట్టుకొని వీరమార్గ (మహాప్రస్థాన) మేగెను. (మహాప్రస్థానము చేయునపుడు ధర్మరాజు ఆశ్మఫలమును నోట నుంచుకొని వెళ్ళినాడని, శ్రీ భాగవతము). భరతుడు పాలించుట వలన వనమున కేగు తండ్రిచే ఈయబడిన యీభూమి భారత వర్షమని లోకఖ్యాతి నందినది. భరతుని పుత్రుడు సుమతి పరమ ధార్మికుడు. యజ్ఞనిష్టుడగు తండ్రి (భరతుడు) తన రాజ్యమును చక్కబరచి యాతని కిచ్చెను. సామ్రాజ్య లక్ష్మిని భరతుడు కొడుకున కప్పగించి సాలగ్రామ క్షేత్రమందు యోగాభ్యాస మొనరించి ప్రాణములను విడిచెను. ఇతడవ్వల విప్రుడై యోగి వీరుల కులమందు జనించెను. మైత్రేయా! అతని కథను నీకు ముందు తెలిపెదను. సుమతి యొక్క తేజస్సు (వీర్యము) వలన నింద్రద్యుమ్నుడు, వానికి పరమేష్టి, వానికి ప్రతిహారుడు, నతనికి ప్రతిహర్తయను ప్రసిద్దుడు, వానికి భవుడు, వానికి గీతి, వానికి ప్రస్తావుడు, వానికి పృథువు, వానికి నక్తుడు, వానికి గయుడు, వానికి నరుడు, వానికి విరోహణుడు, వానికి బుద్ధిశాలి యగు మహావీర్యుడు, వానికి భావనుడు. వానికి త్వష్ట, వానికి విరజుడు, వానికి రజుడు, వానికి శతజిత్తు, వానికి విశ్వగ్జోతి మొదలగు నూర్గురు కుమారులును కల్గిరి. వారు ప్రజలను పెంపొందించిరి. వారిచే నవ విభాగ మందిన భారత వర్ష మలంకరింప బడినది. వారి వంశీయులచే నీ భారత భూమి భుక్త మయినది. కృత త్రేతాది విభాగముగా డెబ్బది యొక్క మహా యుగములు వారీ భూమిని ముందుగ భుక్తము సేసికొనిరి. వరాహ కల్పమందు ప్రథమ మన్వంతరాధిపుడు స్వాయంభువ మనువుండగా నీ ప్రియవ్రతాది సృష్టి జరిగినది. ఈ సృష్టిచే జగత్తంతయు నిండినది.
Summary of chapter 1 of the Vishnu Mahā Purāṇa is as follows:
Parāśara narrates the lineage of the seven dvīpas beginning from Priyavrata, son of Manu Svāyambhuva. Priyavrata's seven sons divide the earth among themselves, each ruling one dvīpa: Āgnīdhra (Jambūdvīpa), Medhātithi (Plakṣa-dvīpa), Vapuṣmān (Śālmali-dvīpa), Jyotiṣmān (Kuśa-dvīpa), Dyutimān (Krauñca-dvīpa), Bhavya (Śāka-dvīpa), and Savala (Puṣkara-dvīpa). Āgnīdhra had nine sons who ruled the nine varṣas of Jambūdvīpa, among them Nābhi (Bhārata-varṣa). Nābhi begat Ṛṣabha, and Ṛṣabha begat Bharata — from whom Bhārata-varṣa takes its name. The chapter traces Bharata's lineage through many generations.