బాణుడు త్రినేత్రుని ముందు వ్రాలి దేవా! యుద్దము లేక ఈ వేయి బాహువులు నాకెందులకని నిస్పృహుడనయితిని. నాకు నా ఈ బాహువులకు సాఫల్యము గూర్పగల రణ మగునా? ఈ చేతుల పెనుబరువు నాకెందుల కన
నీ నెమలి టెక్కె మెప్పుడు విరుగు నప్పుడు బాణా! మాంసాశనులకు మాహానందము గూర్చు యుద్దము నీకు సంఘతితము కానున్నది.
అన విని వీరుడగు శంభునికి మ్రొక్కి బాణుండింటికి వచ్చి తన మయూర ధ్వజము విరుగుట గని యుప్పొంగు చుండెను. ఇదే సమయమున అప్సరస చిత్రలేఖ యోగ విద్యా శక్తిచే యయ్యనిరుద్దునిం గొని వచ్చెను. అతడంతఃపురము సొచ్చి యుషతో గ్రీడించుట నెరింగి రక్షకులేగి దైత్యపతికి దెల్పిరి. అతడు రాక్షస సైన్యము నాదేశింప నా వచ్చిన సేనను పరిఘాయుధముచే ననిరిద్ధుడు గూల్చెను. తన భటులట్లు వడ బాణుడరద మెక్కి వచ్చి యనిరుద్ధుతో బోరి యోడిపోయెను. అవ్వల మంత్రులు ప్రేరేప మాయాయుద్ద మొనరింప యనిరుద్ధుని నాగాస్త్రమునం బంధించెను. అక్కట ద్వారవతిలో ననిరుద్దుడెటె వోయెనని యనుకొను యాదవులకు నారదుడతడు బాణునిచే బద్ధుడగుటం దెలియ జేసెను. మఱియు నాతడు ఒక యువతిచే శోణ నగరమునకుం గొంపోబడెను గాని దేవతలచే గొంపో బడలేదని దేవముని పలుకు విని యాదవులిది నిక్కమని నమ్మిరి.
ఆపై హరి తలచిన మాత్రమున నెదుట వ్రాలిన గరుడుని ప్రద్యుమ్నునితో నెక్కి బాణపురి కేగెను. ఆ మహాత్మునితో ప్రమథ గణము పురప్రవేశ సమయమం దెదుర్కొనెను. వారి నందరి నోడించి కృష్ణుడు నగరములో కేగెను. అప్పుడు మూడు పాదములు మూడు తలలుం గల శివ జ్వరము వచ్చి బాణుని రక్షింప హరితో బోరు సల్పెను. ఆ జ్వరము యొక్క భస్మపు స్పర్షవలని తాపము కృష్ణ శరీర స్పర్శ మాత్రమున నశించెను. బలరాముడునుం దాన తాపశాంతి వడసి కన్నులు మోడ్చి సుఖానుభవము వెల్లడించెను. ఆ జ్వరమవ్వల హరితో బోరి కృష్ణ శరీర నిర్గతమైన వైష్ణవ జ్వరముచే సమసి పోయెను. నారాయణ బాహు ఘాతముచే గలిగిన యోత్తిడిచే విహ్వాలమైన యా జ్వరమూర్తిం గని బ్రహ్మ వీని క్షమింపు మని హరిని వేడుకొనెను. కృష్ణుడు సైరించితి నని పలికి వైష్ణవ జ్వరమును దన యంమిడించి కొనెను.
అంతట జ్వర దేవత దేవదేవుం గని నీతో నే నొరించిన యీ యుద్దమును తలచుకొన్న వారు విజ్వరుల గుదురని పలికి జ్వరమేగెను. ఆపై భగవంతు డగ్నుల నైదింటిని శమింపజేసి దానవ బలమును లీలగా జూర్ణ మొనరించెను.
అవ్వల బాణాసురు డెల్ల సేనలతో దరలె. బాణుడును శంకరుడును కార్తికేయుడును (దేవసేనాని కుమారస్వామి) శౌరితో పోరిరి. హరిశంకరుల యయ్యుద్ద మతి దారుణమయ్యె. సర్వ లోకములు వారి శస్త్రాస్త్ర కిరణ జాతమున దపించి పోయెను. దేవతలిది చూచి జగత్ప్రలయ మాసన్నమయ్యె ననుకొనిరి. గోవిందుడు జృంభకాస్త్రముచే శంకరుని జృంభింప జేసెను. (బెండు పడవేసెను). దైత్యులును ప్రమథ గణమును హరికి బ్రణమిల్లిరి. జృంభకాస్త్రము దెబ్బతిని హరుడు రథము మొగ జతికిల బడెను. కృష్ణునితో బోరలేడయ్యె. గరుడుని ఱెక్కలం గుఱ్ఱములు కుంటువడి ప్రద్యుమ్నాస్త్ర పీడితుడై కృష్ణుడి హుంకారముచే శక్త్యాయుధము పారదరుమ బడినంతట కుమారస్వామి యుద్దము నుండి దప్పుకొనెను. జృంభకాస్త్రమునకు శంకరుడు వడ దైత్య సేనలును మందల మందలుగ ప్రమథ సైన్యము హరిచే క్షయింప నంది సారథిగా బాణుండు రథమెక్కి కృష్ణ, కృష్ణ కుమారులతో బోరనని కేతెంచెను.
మహావీరుడు బలరాముడు బాణములచే బాణు సైన్యముం బారగొట్టెను. మఱియు నాగటి కొనచే రోకలిచే వీర సైన్యముం జిందఱ వందఱ సేయు హరిహరుల వోడిపోయిన తన సేనంగని బాణుడు తనంత నెదిరించి నయ్యుద్దమతి దారుణమయ్యె. తీవ్ర శరీరములం గృష్ణ సైనికుల కవచములం భేదించు బాణుని బాణములను హరి ఖండించెను. అవ్వల నొండొరులం గొట్టుకొనిరి. తుట్టతుదకు శ్రీహరి బాణుం గూల్చి తీర వలెనను నిశ్చయము కొని నూరుగురు సూర్యుల తేజస్సున వెలుగు సుదర్శన చక్రముం బట్టెను. బాణుడు నశింప వలెనని దానిని విడువ నున్నంత రాక్షస విద్య కోటరీయను నొకానొక శక్తి నగ్నయై (దిగంబరయై) హరి యెదుట నిలువ బడెను. దానిం గని హరి కన్నులు మూసికొని సుదర్శ నాయుధమును బాణుని గురిసేసి వాని బాహు సహస్రముం దెగి పోవలెనని వదలెను. అది యసురు లొకవంక విసరు శస్త్రాస్త్రము లన్నిటిని నరకుచు బాణాసురుని చేతుల నెల్ల ఖండించెను. వాని బాహు వనమెల్ల తెగినది. తిరిగి కృష్ణుని చేతిలో నిలిచెను. బాణుని గూల్ప దానిని వదల వలెనను కొనుచున్నంతలో బాహువు లన్నియుం దెగి రక్తధారలం గురియు బాణునిం గని త్రిపురారియు ఉమారమణుడు రమారమణు తులంపెఱిగి యెదుటి కేతెంచి సామ పూర్వకముగ గోవిందుని కిట్లనియె
కృష్ణా! కృష్ణ! జగన్నాథ! నిన్నేను పురుషోత్తముడు పరేశుడు పరమాత్మ అనాధి నిధనుడు అగు హరివని యెఱుంగుదును. సర్వముం దానయ్యు దేవ పశుపక్షి మనుష్యులందు లీలా విలాసముగా రూపొంది యవతరించుట యిది నీకుపలక్షణము. అందుచే ప్రసన్నుడవు గమ్ము. ఈ బాణునికే నభయమిచ్చి యున్నాను. ఆ నా మాట నీవబద్దము సేయదగదు. నాయండగొని వీడు పొగ రెక్కినాడు. అపరాధము సేయకుండ వలసినది సేసినాడు. నాచే వరమొందినాడు కావున వీని నేను క్షమించు చున్నాను.
అన విని గోవిందుడు ప్రసన్న ముఖుడైన బాణుని యెడ కోపముమాని శూలపాణి కుమాపతి కిట్లనియె
వీడు నీచే వరము వడసిన వాడు గావున బ్రతుకుం గాక! నీ మాటయెడ గౌరవమున నీ చక్రము నుపసంహరించెద. నీవు వరమిచ్చుట యన్న నేనిచ్చుటయే. నన్ను నీ కంటె నన్యునిగా గనవలదు. సదేవాసుర మానుషమైన యీ జగము నాకంటె వేఱుగాదు. నీవు నట్ల తెలియుము. అవిద్యా మోహితులైన వారు భిన్న దృష్టులై మన యిద్దఱును భేదముం జేసి పలుకుదురు. మనకు భేదముం గాంతురు. ఏనిది ప్రసన్నుడనైతి నేగుచున్నాను. నీవునుం జనుము.
అని పలికి కృష్ణుడు ప్రద్యుమ్న కుమారుడున్న తావున కేగెను. ఆతని న్బంధించిన పాములు గరుత్మంతు గాలి తగిలిన మాత్ర విరిసి చచ్చు పడిపోయినవి. అవ్వల బలరామ కృష్ణ ప్రద్యుమ్ను లనిరుద్దుని సపత్నీకముగ రథ మెక్కించుకొని ద్వారకా నగరమున కేతెంచి వివాహ వైభవము కావించెను. అక్కడ జనార్దనుండు కొడుకులతో మనుమలతో గూడి రుక్మిణి సత్యభామ మొదలగు గల దేవీ సముదాయముతో భూభారము నవతరింప జేయు తలంపున నా ద్వారక యందు సుఖ ముండెను.
Summary of chapter 33 of the Vishnu Mahā Purāṇa is as follows:
Bāṇa discovers Aniruddha with Uṣā and imprisons him with the nāgāstra (serpent-weapon). When the Yādavas learn of this, Kṛṣṇa, Balarāma, and Pradyumna march their forces to Śoṇitapura. Śiva fights on Bāṇa's behalf; Kṛṣṇa deploys the Jṛmbhakāstra to render Śiva temporarily drowsy and incapacitated. Skanda (Kārttikeya) is defeated by Pradyumna. Bāṇa's thousand arms are severed by Kṛṣṇa's Sudarśana cakra, leaving only four arms — Śiva intercedes and Bāṇa is spared his life. The supreme non-difference of Viṣṇu and Śiva is formally proclaimed by Kṛṣṇa in this episode. Uṣā and Aniruddha are married and return to Dvārakā.