సగరుని భార్యలిద్దరు. కాశ్యపపుత్రి సుమతి. విదర్భ రాజపుత్రి కేశిని. వారి వలన సంతానము గలుగ మౌర్వుని పరమ సమాధి నా సగరుడారాధింప నతడు వర మిచ్చెను. ఒకతె వంశోద్దారకుని నొక్కనిని ఇంకొక యావిడ అరువది వేలమంది కొడుకులం గనునని యతడ నుగ్రహించెను. ఇందెవతె ఏదికోరునో తెల్పుమనియే. కేశిని యొక్క కొడుకుం గోరెను. సుమతి యరువది వేలమంది గావలె ననెను. ఔర్యుడు సరియనెను. కొలది దినములలో కేశిని యొక్క పుత్రుం గనెను. అత డసమంజసుడను పేరువాడు. వంశకరుడు కాశ్యప తనయ సుమతి కరువది వేలమంది సుత లుదయించిరి. అసమంజసునికి కుంశుమంతుడు పుట్టెను. ఆ అసమంజసుడు బాల్యము నుండి చెడ్డ నడతలో నుండెను. వీడు బాల్యం గడచి బుద్దిమంతుడు గాగలడని తండ్రి యూహించెను. కాని యప్పుడును నసచ్చరిత్రుడయి యుండుట జూచి తండ్రి వానిని త్యజించెను. ఆ యరువది వేలమంది కొడుకులును నసమంజస చరిత్రమునే యనుకరించిరి. అవ్వల గూడ యసమంజసు ననుకరించు సాగరుల చేత యజ్ఞాది సన్మార్గము చేసి దేవతలు సకల విద్యారూపుని అశేష దోష సంస్పర్శ లేని వానిని భగవంతుడు పురుషోత్తముని యంశమైన వానిని కపిలుని నరసి ప్రణమిల్లి యిట్లనిరి. ఈ సగర పుత్రు లసమంజసుని నడవడి ననుగమించు చున్నారు. ఈ దుర్వృత్తుల చేత జగమే మగునో కదా. ఆర్త జగద్రక్షణ కొఱకు గదా భగవంతుడగు నీవు శరీరము గ్రహించితి వన విని యమ్ముని కొలది దినములలో వారు నశింప గలరనియె. ఈలోన సగరు డశ్వమేధ మారంభించెను. అరువది వేలమంది కొడుకులు రక్షకులుగా వెంబడించిన యా గుఱ్ఱము నేవ్వడో హరించి నిలమందు ప్రవేశించెను. అటుపై సగర పుత్రులు గుఱ్ఱము డెక్కల గుర్తులం బట్టిపోయి యోక్కొక్క యోజన మొక్కొక్కడుగ మేదినీతలముం ద్రవ్విరి. పాతాళ మందాహయము తిరుగుచుండ జూచిరి. అతని దూరమందున్న తేజోమూర్తిని మబ్బులు తొలగిన శరత్కాల మందలి సూర్యుడట్లు తన తేజస్సులచే నెడతెగకుండా క్రిందు మీదున నన్ని దెసలను నుద్భాసింప జేయుచున్న కపిల మహర్షిం గనిరి. మఱియు దురాత్ములై యాయుధము లెత్తికొని గుఱ్ఱము దొంగ యిడుగో యీ యజ్ఞ విఘ్నకారి నపకారిని జంపుదామని అతని మీదికి బరువెత్తిరి గూడ. అటుపై నిట్టిట్టు త్రిప్పిన యాతని చూపున బడి వారు తమ శరీరమందు పుట్టిన యగ్నిచే దహింప బడి నశించిరి. సగరుడును గపిల మహర్షి తేజమ్మున నశ్వానుసారియైన పుత్ర బలమెల్ల మసియయ్యెనని దెలిసికొని యాసమంజసుని కొడుకు నమ్శుమంతుని పిలిచి యశ్వాన్వేషణమునకు నియోగించెను. అతడును సాగరులు ద్రవ్విన దారింబట్టి చని కపిలుని దరికి వచ్చి భక్తి నమ్రుడై యప్పర మహర్షిని స్తుతించెను. అంత నమ్ముని యతని కిట్లనియె. ఈ యశ్వమును బితామహునికిం జేర్పుము. వరము గోరుకోనుము. నీ కొడుకు మనుమడు ప్రపౌత్రుడు (ముని మనవడు) స్వర్గము నుండి గంగను బుడమికి గొనిరాగల డనియె. అంత నంశుమంతుడును బ్రహ్మదండ హతులైన మా పితరులకు స్వర్గమున కయోగ్యు లయిన వారికి స్వర్గప్రాప్తి గూర్చు వరమును మాకు కపిల భగవాను డనుగ్రహించు గాకనియె. అది విని కపిల మహర్షి నేనంటిని గదా! నీ ముని మనుమడీ భూలోకమునకు స్వర్గము నుండి గనగను గొని రాగలడని ఆ గంగోదకముచే నీ యెముకలు బూడిదయు దడిసినంత మీ తాతలు స్వరము నెక్కగలరని. విష్ణు భగవానుని పాదము బొటన వ్రేలినుండి వెడలిన నీటికీ మహిమ గలదు. కేవలమభి సంధి పూర్వకము (సంకల్పముతో జేయబడినది) గానక్కర లేదు. స్నానాద్యుప భోగములందీ పవిత్ర తీర్థము యథాలాపముగ నేని తాకిన నిది ప్రేత ప్రాణి యోక్క (మరణించిన వాని యొక్క) బూడిద యెముకలు చర్మము ప్రేగులు కేశములు మొదలయిన శరీర భాగమేది యిందు విడువ బడినది యా క్షణము యా శరీరిని (జీవుని) స్వర్గమునకుం గొని పోవునన విని యాత దమ్మునికి బ్రణతుడై సెలవు గొని గుఱ్ఱముం గొనివచ్చి పితామహుని జన్నమున కేతేంచినను సగరుండు నయ్యశ్వముం యజ్ఞముం బూర్తి చేసెను. అతడు పుత్ర ప్రీతితో సాగరమును దన పుత్రుడుగా గల్పించు కొనెను. ఆ యంశుమంతునికి దిలీపుడు అతనికి భగీరాథుడు గల్గిరి. అతడే స్వర్గము నుండి గంగ నిక్కడకు గొనివచ్చి భాగీరథి యను పేరెందిన దానింగా నామేను గావించెను.
భగీరథునికి సహోత్రుడు అతనికి నాభాగుడు అతనికి అంబరీషుడు, సింధుద్వీపుడు, అయుతాయువు, ఋతుపర్ణుడు వరుసగా తండ్రి కొడుకులయిరి. ఋతుపర్ణుడు నలునికి సహాయుడై యుండెను. అతడు ‘అక్షహృదయము’ పాచికలను గూర్చిన విద్య నెఱింగిన వాడై సర్వసకాముడు సుదాసుడు(సౌదాసుడు) మిత్రసహుడుగా వంశ వృక్ష క్రమము సాగెను. మిత్రసహుడు వేటకై యదవిం దిరుగుచు రెండు పెద్ద పులులం జూచెను. ఆ రెండింటి చేత నవ్వనము జంతువన్నది లేకుండా జేయ బడెనని తెలిసి యందొక దాని బాణమునం గొట్టెను. అది చచ్చుచు నతిభీషణాకృతియు వికృత కరాళ వాడను డయిన రాక్షసుండయ్యె. రెండవ పులి నీ ప్రతిక్రియ చేసెద లెమ్మని యంతర్ధాన మొందె, కొంతకాల మరుగ నీ సౌదాముడు యజ్ఞము చేసెను. యజ్ఞము సమాప్తియై వశిష్ఠుండు సన నా రక్షస్సు వశిష్టు రూపుగొని యజ్ఞావసాన మందు నాకు మనుష్య మాంస భోజనము పెట్టుము. దానికి సంస్కారము సేయుమని ఇదిగో క్షములో వత్తునని వెళ్లి పోయెను. మరల వంటవాని వేషముతో రాజునాజ్ఞచే మానుష మాంసమును సంస్కరించి తెచ్చి రాజునకు నివేదించెను. ఈ రాజును బంగారు పాత్రము నందున్న మాంసము గొని వశిష్ఠుని రాక కెదురు చూచు చుండెను. అంతలో వశిష్ఠుడు రాగా నదియాయనకు నివేదించెను.
ఆహా! ఈ రాజు తప్పునడత వింతయైనది. ఈ మాంసము నాకు బెట్టు చున్నాడు. ఈ ద్రవ్య రాశి యేమని ధ్యానపరుండయ్యెను. అందది మనుష్య మాంసమని కనుగొనెను. అందు వలన కోపముచే మనసు కలుషితమై మావంటి తపస్వులకు దినరానిదని తెలిసియు దీనిం బెట్టితివి గావునా నీకే ఈ యపవిత్ర పదార్థముపై నభిలాష కలుగు గాక! యని రాజును శపించెను. అనంతర మారాజు స్వామీ! తాము నన్నిట్లన్నారు శపించి నారేమని తెలుప ఏమేమి! నేనే యిట్లంటినా యని మరల నమ్మహర్షి సమాది యందు నిలిచెను. దాన జరిగిన దవగతమై యా ఱేనియెడ దయగొని ఈ మనుష్య మంసాశన మాత్యంతికము గాదు (నిరంతరము గాదు), పండ్రెండేండ్లు మాత్రమె యిది నీకు భోజన మగునని యనుగ్రహించెను.
ఆ రాజు గూడ జలాంజలింగొని మునికి ప్రతిశాప మీయనుద్య మించినంత స్వామీ! ఈయన మన గురువు మన కులదేవత యైన యాచార్యు నీయనను శపింప దగదని మదయంతి (పత్ని) బ్రతిమాల నిటు పంటను నటు మేఘములను రక్షింప దలచి యా శాపోదకములు నేల మీదను ఆకాశము నందును జల్లక దానిచే తన పాదములను దడిపి కొనెను. కోపాగ్ని నంటిన యా నీట వాని పాదములు గాలి మిక్కిలి వన్నె దరిగెను, దాన నతడు కల్మషపాదుడని పేరందెను.
వశిష్ఠ శాపముచే పండ్రెండేండ్ల కాలము నందు రాక్షస స్వభావము గొని యడవి యందరుగుచు ననేక మనుష్యులను దినివేసెను. ఒకప్పుడొక మునిని భార్యా సంగతుడై యుండ జూచెను. వాని భీషణ రాక్షస ఆకారము చూసి హడలి యా దంపతులు పారిపోవు చుండ వాడు బ్రాహ్మణుం బట్టెను. అంత ఆ బ్రాహ్మణి పెక్కు తెరగుల భర్త నిమ్మని యాచించెను. దయ సూపుము. నీ విక్ష్వాకుకుల తిలకుడవు. మహారాజువు మిత్ర సహుడవు నా యెడ గృతార్థుడు గాని యీ నా భర్తను జంప దగదని అనేక ప్రాకారముల నామె ఏడ్చుచుండ నా పులి జంతువుం దినట్లు యా విప్రుని దిని వేసెను. అందుచే నతి కోపమును గని యా బ్రాహ్మణి యా రాజును శపించెను. నేనీ విప్రుని తోడి సుఖమున నసంతృప్తురాలనై యుండ నా భర్తం దింటివి కావున నీవు కామోపభోగ ప్రవృత్తుడవై యున్న తరిం జావొందెదవు గాక యని శపించెను. ఇటు శపించి యామె యగ్ని ప్రవేశము చేసెను. అటుపై పండ్రెండేళ్ళు స్త్రీ విషయాభిలాషియై యున్న గడువ శాపముక్తి నంది స్త్రీవిష యాభిలాషియై యున్న యాతనికి మదయంతి జ్ఞాపకము చేసెను. ఆ మీదట నతడు స్త్రీ భోగము ద్యజించెను. అపుత్రకుండై యారాజు పుత్రార్థమై యాచింప వశిష్ఠుండు మదయంతికి గర్భా దానమును జేసెను. ఏడెనిమిదేండ్లకు కూడ శిశువు జనింప కున్నంత నా దేవి (ఆశ్మతో) రాతితో గర్భముం గొట్టికొనెను. అంత పుత్రుండు బుట్టెను. వానికి అశ్మకుడనియే పేరయ్యెను. అశ్మకునికి మూలకుడు కొడుకయ్యెను.
పరశురాముడు క్ష్మాతలము నిః క్షత్రియ మొనరింప స్త్రీలు వివస్త్రలై చుట్టు వారుకొని ఈతనిని రక్షించిరి. అందువలన నతనిని నారీకవచుడని పిలుతురు. మూలికుని వలన దశరథుడు వాని వలన ఇలిబిలుడు వానికి విశ్వసహుడు వానికి ఖట్వాంగుడు గల్గిరి. ఖట్వాంగుడు దేవాసుర సంగ్రామమందు దేవత లర్థింప నసురులం గూల్చెను. స్వర్గమందు గూడ తమకు బ్రియము సేసినాదని వారము గోర ప్రేరేపితుడై వరము గ్రహింపక తప్పదందు రేని నా యాయుర్థాయమెంతో చెప్పుదని వేల్పులం గోరెను. ఆ పైని వారు ఒక ముహూర్త మాత్రమనిరి. అంతట నస్ఖలితయైన లఘువైన (మిక్కిలి తేలిక యైన) విమానమున మర్త్య లోకమునకు వచ్చి యిట్లనియె. బ్రాహ్మణుల కంటె నాకు ఆత్మగూడ ప్రియతరము గానట్లు, ఎన్నడేని స్వధర్మమును నేను ల్లంఘింపని యట్లు, సకల దేవ మానుష పశు పక్షి వృక్షాదులందచ్యుతుని కంటె వేరైనా దృష్టి కలుగ కుండునట్లు, ఆ దేవుని ముని జనాను స్మృతుని భగవంతునే యస్ఖలిత గతినై పొంద గల్గునట్లు, కోరి దేవగురువు అనిర్దేశ్య రూపుడు సత్తామాత్రుడు నైన వాసుదేవు డనబడు ఆత్మయందు ఆత్మను సంయోజించి యందె లయ మొందెను. సాయుజ్య ముక్తి వడసె నన్నమాట. యీతని విషయమున మున్ను సప్తర్షులు గానము సేసిన (గీతము) శ్లోక రూపమిది వినబడును. దాని భావమిది. ఏ మహానుభావుడు స్వర్గము నుండి యిటకు వచ్చి ముహూర్త మాత్రాయుర్దాయమును బొంది జ్ఞానముచే సత్యముచే ముల్లోకాల ననుసంధించెనో అట్టి ఖట్వాంగూని సమానమైన వాడవని పైనింకొకడు లేడు, ఉండబోడు. ఖట్వాంగునికి దీర్ఘబాహువు వానికి రఘువు వానికి అజుడు, అజునికి దశరథుడును పుత్రులైరి.
భరతుడు గంధర్వ రాజ్య సాధనకై యేగి మూడుకోట్ల గంధర్వులం గూల్చెను. శత్రుఘ్నుడు అతి బలపరాక్రము మధుపుత్రుని లవణునిం జంపెను. మధురా నగరమును నిర్మించెను. ఈ విధముగా నతిబల పరాక్రమ విక్రంబుల నతిదుష్టనిబర్హణము చేసి యశేష జగత్తునకు స్థితిని (ఉనికి) నిర్వహించి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మరలి దివమ్ము నధిష్టించిరి. ఆ భగవ వదవతార మూర్తులందెవ్వ రనుక్తులై రాకోసల రాజ్య ప్రజల జానపదులును తన్మనస్కులై తత్సాలోక్య మందిరి. సుష్ట సంహారి రాముని కుమారుల కుశలవు లిద్దరు, లక్ష్మణుని కొడుకులుం గదచంద్రకేతువులు, భరత పుత్రులు తక్షక పుష్కలులు, శత్రుఘ్నుని తనయులు సుబాహు శూరసేనులు. కుశుడు, అతిథి నిషధుడు అనలుడు నభుడు పుండరీకుడు క్షేమధన్వుడు దేవానీకుడు హీనగుడు గురుడు పారియాత్రుడు బలుడు ఛలుడు ఉత్కుడు వజ్రనాభుడు శంఖణుడు వ్యుషితాశ్వుడు విశ్వసహుడు హిరణ్యనాభుడు నను తండ్రి కొడుకుల వరుసలో కుశ వంశ వృక్షము వర్ణితము. హిరణ్యనాభుడు మహా యోగీశ్వరుడైన జైమినికి శిష్యుడై యాజ్ఞ్యవల్క్యుని వలన యోగముం బడసెను. హిరణ్యనాభుని కొడుకు పుష్యుడు వానికి ద్రువసంధి వాని వలన సుదర్శనుడు వాని వలన అగ్నివర్ణుడు వానికి శీఘ్రగుడు ఆతనికి మరువుం గల్గిరి. ఈ మరువు యోగా నుసంధానము సేసి యిప్పుడును కలాపగ్రామ మందున్నాడు. రాబోవు యుగమందు సూర్యవంశ ప్రవర్తకుడీతడు గాగలడు. అతని కొడుకు ప్రశుక్రుడు, వానికి సుసంధి వానికి అమర్షుడు అతనికి సహస్వంతుడు అతనికి భవుడు, భవునికి బృహద్బలుడు గల్గిరి. ఈ బృహద్బలుడు భారత యుద్దము నందు అభిమన్యుని చేతిలో నీల్గెను. ఇక్ష్వాకు వంశ రాజులను బ్రదానముగా నేను దెల్పితిని. వీరి చరిత్ర విని నతడు పాప ముక్తుడగును. శ్రద్ధతో నిది చదివిన సర్వాభీష్టములు బొంది స్వర్గమందు బూజింప బడును.
Summary of chapter 4 of the Vishnu Mahā Purāṇa is as follows:
Sagara performs the Aśvamedha yajña; the horse is stolen and hidden in the pātāla. Sagara's 60,000 sons dig down to the pātāla to retrieve it and are burned to ashes by the gaze of the sage Kapila Maharṣi. Aṃśumān undertakes a mission to retrieve the horse and receive Kapila's instruction on how the Gaṅgā must be brought down to liberate his ancestors. Dilīpa and then Bhagīratha continue this quest; Bhagīratha ultimately brings the Gaṅgā to earth. Also narrated are: Triśaṅku's story, Kalmāṣapāda/Mitra-saha who is possessed by a rākṣasa, Khaṭvāṅga who attains mokṣa in a single muhūrta by surrendering completely to Viṣṇu, and the lineage continuing through Daśaratha to Rāma, Bharata, Lakṣmaṇa, and Śatrughna.