విష్ణు మహా పురాణము

2 - సృష్టి పూర్వ స్థితి

అవికారుడు = షడ్భావ వికారములు 1. ఉనికి, 2. పుట్టుట, 3. పెరుగుట, 4. తఱగుట, 5. పరినమించుట (మార్పు చెందుట), 6. నశించుట అను నాఱు వికృతులు లేనివాడు. శుద్దుడు (ఎట్టి గుణ సంగము లేనివాడు) నిత్యుడు నిత్యసత్తా స్వరూపుడు విష్ణువు (సర్వ వ్యాపకుడు) సర్వము జయించువాడు హిరణ్య గర్భుడు, సృష్టికర్త హరి శంకరుడు వాసుదేవుడు సర్వ దేవతలకు (జ్యోతి స్వరూపులకు) నివాసమైన వాడు తరింప జేయువాడు సృష్టి స్థితి లయములను జేయువాడు ఏకరూపము నానారూపము తానేయైన వాడు స్థూలము = సాకార సగుణ రూపము. సూక్ష్మము = అంతర్యామి జ్ఞాన రూపము నైనవాడు. ఆ విధముగ వ్యక్తము అవ్యక్తము నైనవాడు, ముక్తికి కారణమైనవాడు, జగన్నిర్మాణ పాలన లయములు చేయువాడు, అజరుడు (ముదిమి లేనివాడు), అమరుడు (మరణము లేనివాడు), సర్వమూలము (బీజము) నైనవాడు నైనయా పరమాత్మకు నమస్కారము, నమస్కరించుట యనగా ప్రహ్వీభావము విధేయుడననట అభేదాను సంధానము కూడ. ప్రపంచమున కాధారమైన వాడు అణువు కంటే వణువైన వాడు సర్వ భూతము లందుండు వాడు అచ్యుతుడు, జ్ఞానమూర్తి మిక్కిలి స్వచ్చ మైనవాడు పరమార్ధముగ నిర్మలుడు (గుణ సంగము లేనివాడు) భ్రాంతి దృష్టికి జగముగా (బీజము) నైనవాడు నైన సర్వ వ్యాపకుడు సర్వము కబళించు వాడు సృష్టి స్తితుల జేయు స్వతంత్రుడు సర్వజ్ఞుడు జగదీశ్వరుడు పుట్టుట హానివృద్దులు లేనివాడు బ్రహ్మ తెల్పిన పురాణ కథ నేను జెప్పుచున్నాను. దక్షాదులు పురుకుత్సుడను రాజునకు నర్మదా తీరమున నిది. తెల్పిరి. ఆ రాజు సారస్వతునికి నతడు నాకు నిద్దాని నెఱింగించెను.

పరమాత్మయను వస్తువొకటి యున్నది. అది సర్వజీవు లందు నాత్మ రూపమై యున్నది. అది నామరూప వర్గాది నిర్దేశము లేనిది. జన్మాది వికారము లేవియు లేనిది. అయినను నదియొకటి యున్నదని చెప్పుటకు శక్యమయినది. అంతట నంతయునై యున్నది. కావున విద్వాంసులు దానిని వాసుదేవుడని పేర్కొందురు. హేయోపాదేయాది విలక్షణమై నిత్యయై యున్న యా పరబ్రహ్మయే వ్యక్తరూపము నవ్యక్త రూపమునై పురుషుడు మొదలగు రూపముల వ్యవహరింప బడుచున్నను నదియాయా పురుషాదులకు సృష్టి స్థితి కాలము లందభి వ్యక్తమయి యున్నట్లుండును. వ్యక్తము నవ్యక్తము మొదలయిన యాయా పదార్ధములతో, నాగు నా వ్యవహారము పరబ్రహ్మకొక బాలక్రీడ, అవ్యక్తము కారణము, ప్రదానమునను బేరులం బ్రకృతి చెప్పబడును. అది సూక్ష్మము. సదా సదాత్మకము. ఉన్నదియు లేనిదియు నదే. అక్షరము మఱియొక యాధారము లేనిది యమేయము నజరము ధ్రువము శబ్ద స్పర్శములు లేనిది. రూపాదులతో గూడనిది. త్రిగుణాత్మకము జగత్కారణము అనాది సృష్టి మూలము అవ్యయమునైన యాయోక్క పదార్ధము చేతనే ప్రళయ కాలము నుండి యీ విశ్వము వ్యాప్తమయి యున్నది. వేదవాదులు, వేదవేత్తలు బ్రహ్మ నిష్టులు, నీ ప్రధాన ప్రతిపాదక మయిన విషయమునే వేదమని యధ్యయనము సేయు చుందురు.

ఆహోరాత్రాదులు పంచభూతములు ఇంద్రియముల కందవు. ప్రధాన వస్తువు అది యొక్కటియే. బ్రహ్మ మనబడున దొక్కటే ప్రపంచ మంతయు. జరిగి పోయిన ప్రళయ కాలమున ప్రకృతి యందు లీనమై యుండును. అదే ప్రాకృత సంచరమను పేరందును. కాలము భగవంతుడు. దానికి మొదలు తుదియును లేవు. అందుచేత నీ సృష్టి స్థితి లయముల కట్టుబాటు నరికట్టుటకు వశము గాదు. సత్వాది గుణముల యొక్క యా సామాన్యావస్థ యందు బురుషుడు వేఱే విడిపడి యున్న తఱి విష్ణువు యొక్క కాలస్వరూపము పరివర్తనము చెందుచునే యుండును. జరుగుచునే యుండును. కాని సర్వాంతర మైన పరామాత్మ వస్తువు హరి తన యిచ్ఛనుసారము వ్యయస్వభావమైన ప్రధాన మందు నవ్యయమైన పురుష తత్త్వము లందు గూడ సృష్టి కాలములో ప్రవేశించును. ఆ వస్తువు యొక్క సన్నిధాన మాత్రమున నా ప్రధాన పురుషాత్మక తత్త్వమందు క్షోభ జనించును. అయ్యెడ మనస్సు నిరుపకార మయినందున (స్తబ్ధమై యున్నందున) ఆ పురుషోత్తము డైన పరమాత్మయే క్షోభింప జేయువాడు. క్షోభింప బడునదియు దానేయై యుండును. ఒకపరి వెలికి, నొకపరి లోనికి (తాబేలు వలె) ముణుచు కొనుచు తానే మిగిలి యుండును. కావుననే ఈ స్థితిలో నాయున్న పదార్ధము ప్రధానమన బడినది. సర్వేశ్వరుడు విష్ణు విట్లు వికాస రూపుడు, అణు రూపమునై బ్రహ్మాది త్రిమూర్తులై వ్యక్త స్థితినందును.

క్షేత్రజ్ఞునిచే నదిష్టితమైన యా గుణ సామ్యావస్థ నుండి సృష్టి సమయమందు గుణముల యభివ్యక్తి యావిర్భావ మగును. తొలుత భేదమున యా ప్రధాన తత్వము మహాతత్త్వము నావరించెను. ఆ మహాత్తత్త్వము బుద్ది. అది సాత్విక రాజస తామస భేదమున మూడు రకములగును. అది త్రిగుణాతమకము గావున భూతములకు నింద్రియములకు నదికారణ మగును. ఇట్లు ప్రదానముచే మహత్తు, మహాత్తుచే ప్రదానమును బరస్పర మావృతములయి నంతట భూతాదియైన యహంకార తత్త్వము తలుత శబ్దతన్మాత్రను వ్యాకరించెను. దాని నుండి శబ్ద తన్మాత్రమైన యాకాశామును సృజించెను. దానిని భూతాది యావరించెను. ఆకాశం వ్యాక్రుతమై స్పర్శను సృజించెను. అవ్వాల వాయు రూప తన్మాత్రను సృజించెను. వాయువు నుండి యగ్ని పుట్టినది దానికి రూపము గుణము. స్పర్శ తన్మాత్రమైన వాయువు నావరించినది. తేజస్సు వ్యాకరించుచు రస తన్మాత్రను సృజించెను.

దాని నుండి రసమునకు (రుచికి) నాధారము లయిన జలములు పుట్టినవి. అవి రూప తన్మాత్ర నావరించెను. రస తన్మాత్రము లయిన నీళ్ళు రూప తన్మాత్ర నావరించెను. నీళ్ళు వ్యాకృతి పొందినవై గంధ తన్మాత్రను సృష్టించెను. ఆ గంధ తన్మాత్ర వలన నొక సంఘాతము (ముద్ద) పుట్టినది. కావున దాని గుణము గంధమని చెప్ప బడినది. ఆకాశాదు లందు శబ్దాది గుణములు సూక్ష్మ రూపమున నున్నందున దానికి తన్మాత్ర యను పేరు వచ్చినది. త్న్మాత్రాల విశేష రూపములు గావుననవి శాంతములు, ఘోరములు, మూఢములును గావు. అవిశేషములు, భూత తన్మాత్రాల సృష్టి తమ సాహంకారము నుండి యైనది. తైజసాహంకార జన్యము లింద్రియములు వైకారికములు ననుపేర పది, పదకొండవది మనస్సు. త్వక్కు(చర్మము) చక్షుస్సు(కన్ను) శ్రోతము(చెవి) జిహ్వ(నాలుక) ఘ్రాణము(ముక్కు) ఇవి జ్ఞానేంద్రియములు. ఇవి శబ్దాది విషయ గ్రహణము కొఱకు బుద్దితో జత పడి యుండును. వాక్కు(నోరు) పాయువు(గుదము) ఉపస్థ(జననేంద్రియము) కరములు పాదములు కర్ణేంద్రియములు విసర్గ, శిల్ప, గతి, ఉక్తి యను పనులు చేయును. ఆకాశము, వాయువు తేజస్సు నీరు భూమియు శబ్దాది గుణములతో నొక దాని తరువాత నొకటి అధిక గుణములతో గూడియున్నవి. అందుచేనవి శంతములు, ఘోరములు, మూఢములనని విశేషములుగా చెప్ప బడినవి.

నానావిధ శక్తులు గల్గి నానా రకములునైన యా గుణములు సంహతి లేకుండ (ఒక దానితో నొకటి యొత్తిడి నొందకుండ) ప్రజాసృష్టి చేయుట కసమర్థము లయ్యెను. అందువలన నవి పూర్తిగా గలిసికొని యొక దానికొకటి యాశ్రమమై యొకే సంఘాత మందు లక్ష్యము గొని యేకమయి పురుషాదిష్టితము లగుట వలన నవ్యక్తము యొక్క (అనుగ్రహము) అనుబంధము చేతను మహత్తు మొదలుగ వేశేషాంతము తుదదాక గూడి యొక యండమును జనింప జేయును. అది క్రమముగా భూతముల నుండి నీటి బుడగ వలె సమముగా మీదికి లేచినది. ఉదక మందంతట నావరించినది. అది బ్రహ్మ రూపుడగు విష్ణువు యొక్క ప్రాకృతమై యుత్తమ స్థానము. అవ్యక్త రూపుడుగా విష్ణువిందు వ్యక్తమయినాడు. అట్లండ రూపుడయిన ఈ హరికి మేరువు ఉల్బము (గర్భ వేష్టన మాంసము) పర్వతములు, జరాయువు (ఉల్పవేష్టనము) గర్భమందున్న యుదకము సముద్రాలు. ఆ యండమందు పర్వతములు ద్వీపములు జ్యోతిర్లోక సముదాయము దేవాసుర మనుషులతో గూడ నుండెను.

పదిరెట్లు జలాగ్ని వాయ్యాకాశ భూతముల చేతను అవ్వల భూతాదియైన యహంకార తత్వము చేతను అందమావృతమయి యున్నది. భూతాది మహత్తు చేతను మహత్తు అవ్యక్తము చేతను నావరింప బడి యున్నవి. ఈ యేడావరణములును ప్రాకృతములు ప్రకృతి మూలములు. దీనితో నండము కొబ్బరి కాయలోని బీజము వెలుపలి దిప్పచేత వలె నీ యేడావరణముల చేతను ఆవరింప బడియున్నది. విశ్వేశ్వరుడయిన విష్ణువు హరి రజో గుణమును బొంది బ్రహ్మయై యీజగము సృష్టించుటయందు బ్రవృత్తుడగును. సృజించిన దీనిని యుగానుసారముగా కల్ప వికల్పన యున్నంతవరకు సత్త్వగుణముంబూని విష్ణు వమేయ పరాక్రముడై రక్షించును. కల్పాంతము నందు తమో గుణోద్రేకము నంది జనార్ధనుడు రుద్ర రూపియై అతి భయంకరుడై యేళ్ళ భూతములం భాక్షిమ్చును. అన్ని భూతములం దిని జగత్తేక సముద్రమైనంత శేషశయనమందీ పరమేశ్వరుడు పరుండును. ఆపై మేల్కొని బ్రహ్మ రూపియై మరల సృష్టి చేయును. ఒక్కడే భగవంతుడు శ్రీహరి. సృష్టి, స్థితి, లయకారిణి బ్రహ్మ విష్ణు శివాత్మిక యునుగా శక్తియను పేరందును. స్రష్టయై తనను దా సృజించును. విష్ణువై పాలింప వలసిన దానిని పాలించును. స్వయంప్రభువై చివర సంహర్తయై దీని నుపసంహరించును. పృథివ్యాప స్తేజో వాయురాకాశములు జ్ఞాన కర్మేంద్రియములు. అంతఃకరణ పురుషుడనబడు తత్త్వము జగత్తును ఆ విష్ణువే. సర్వభూతాత్మా విశ్వరూపుడు నయినా యవ్యయుడాయనయే. భూతము లందలి సృష్ట్యాది కార్యమెల్ల యా యనకుపకారకమే. ఆ హరియే సృజింప బడిన వస్తువు. సృజించు వాడు వరేణ్యుడు బ్రహ్మాది వివిదావస్థలచే సర్వమూర్తి వరదుడు వరేణ్యుడు వరిష్ణుడునగు నాహరియే సృజ్యుడు సృజింపబడు సర్వము. ఆయనయే సర్గాకర్త. ఆయనయే పాలించును. భక్షించును. పాలింప బడును.