భగవంతుడా! నేనడిగిన దెల్ల విష్ణువాధారమై యున్న ముల్లోకములు అందలి భూ సముద్ర నద్యాది సంస్థానము జ్ఞాన ప్రధానమైన పరమార్థ విషయములను జక్కగ నానతిచ్చితివి. భరత భూపతి సాలగ్రామ క్షేత్రమున నివసించి, యా పుణ్యదేశ ప్రభావముచే యోగ యుక్తుడై నిరంతరము వాసుదేవుని యందు మనసు నిలిపి యుండెను గదా! బ్రాహ్మణుడై యాతడేమి చేసెను? ఆయన కేల ముక్తి కలుగ లేదు? తామానతిచ్చిన భరత చక్రవర్తి కథ నంతను వినవలతునను గ్రహింపుడన పరాశరుం డిట్లనియె.
మైత్రేయా! ఆ భరత భూపతి మహానుభావుడు భగవంతునందు మనసు నిల్పి చిరకాలము సాల గ్రామమను క్షేత్రమందు వసించెను. అహింస మొదలయిన సర్వమానవ సామాన్య గుణము లందు బరమావధి స్థితినందుటయే కాక మనో నిగ్రహ మందును బరమోన్నత
స్థాయి నంది కొనెను.
అని యా రాజు కేవలము హరినామోచ్చారణము తప్ప మరియొండు పలుకు గలనైన పలుక డయ్యెను. ఏ విష్ణు నామ పఠనము చేయుచు దీని యర్థముం దప్ప మరియొకం డాలోచింపడయ్యె. దేవతార్చనకై పుష్పసమిత్కుశలం గొని తెచ్చుట తప్ప మరియొక్క పనిని నిస్సంగుడాతడు సేయడయ్యె. ఒకతఱి నాతడు స్నానర్థమై మహానదికేగి స్నానమాచరించి తరువాతి సంధ్యా తర్పణాదులు గావించెను. అప్పుడు దప్పిక గొని యొక లేడి ఈనుటకు సిద్ధముగా నున్న దొంటరిగా నయ్యేటికి నీరు ద్రావ వచ్చి త్రావుట యగు నంతలో సర్వ ప్రాణి భయంకరమైన సింహ గర్జన మొకటి వినిపించెను. దానికి గుండె తటతట గొట్టుకొన నేటి యొడ్డునకు గంతిడినంత దూకుటలో దాని గర్భము జారి నీటం బడెను. కెరటములం దేలి యాడుచున్న యా శిశువుం గని రాజు తటాలున పరువిడి పట్టి ఎత్తికొనెను. గర్భస్రావ దుఃఖము పైని పైకి దుమికిన శ్రమకు లోనై యా యాడులేడి క్రిందపడి మరణించెను. రాజు తపస్వి యా లేడి చనిపోవుట గని, లేడిపిల్ల నెత్తికొని యాశ్రమమున కేతెంచెను. అది మొదలా పిల్ల అనుదినము నీతడు పెంప మొదలిడెను. అదియుం గ్రామముగా పెరిగెను. ఆశ్రమ ప్రాంతముల నడవుల పచ్చిక బయళ్ళ నది సంచరించుచు క్రమముగ దూర దూరముల కేగియు మేసి పులులకు జడిసి తిరిగి వచ్చు చుండెడిది. ఉదయమేగి సుదూరము సాయమందాశ్రమమునకు వచ్చి భరతు నాశ్రమమందు పర్ణశాల నిల్చెడిది. అది దూర మందున్న దగ్గరనున్న నాతని డెంద మా పిల్ల మీదనే కాని మఱి యెందును నిలువదయ్యె.
రాజ్యము వదలినాడు, బిడ్డలను విడిచినాడు, బందుగు లందరిం బాసినాడు. కాని, లేడిపిల్లపై నాత డెక్కడలేని మమకారముం బెట్టుకొన్నాడు. తోడేళ్ళు మ్రింగినవా? పెద్దపులులు నోట గఱచి కొన్నవా? సింగము వాతబడేనా? అని యా మృగశిశువు రాక తడసిన నతని యెడద తటతట గొట్టుకొనెను. ఇదె ఈ నేల దాని డెక్కల తుది తాకిడికి వింత రంగు లెనసినది. ఈ చిరులేడి నా ప్రీతికై కాబోలు నెటకో దుమికి యున్నది. తన కొమ్ముకొనచే నా బాహువుల గోకు చుండెడిది. అది క్షేమముగా వచ్చి నన్నానంద పరచునా? ఇవిగో దాని లేత పండ్ల గోరికిన లేత చివుళ్ళు దర్భఱెల్లు పఱకలు సామ గానము సేయు లెవడుగు లట్లు ముద్దు గొల్పు చున్నవి. లేత పలు వరుస వెలువడ బ్రహ్మచారులు సామవేదాధ్యయనము సేయు చున్నప్పటి యందము నీ దర్భాంకురములు కుశాంకురములు జ్ఞప్తి సేయుచున్న వన్నమాట. ఇట్లది మిగుల తడసిన కొలది కొందలపడుచు నది పజ్జనున్న తఱి నానంద ప్రసన్న వదనుండు నగుచుండెను. దాన పైన వెఱ్ఱి మొహమున నా ఋతమతికి (సత్య నిష్టునకు) సమాధి భంగ మయ్యెను. రాజ్యము వాసి, భోగముల వీడి సర్వ సంపదలు వదలి, తనవారిం బాసిన మహానుభావునికి గూడ నా లేడిపిల్ల చపలమై దూకిన కొలది మనసు చపల మయ్యే. దూర మేగిన దూరమేగెడిది. ఆ లేడిపిల్ల యందు చిత్తము సుస్థిర మయ్యెను.
అటు కాలము సన నా భూపతి కాలము చేసెను. తన బిడ్డ యట్లె యా లేడిపిల్ల బిక్క మొగము వెట్టి తండ్రి పట్ల తన్ను కంట నీర్వేట్టి చూచు చుండ దానును దాని వంకనే చూచుచు ప్రాణములు వాయుచు మనసు తన్మయమై వేరొకటి తలవ డయ్యెను. తాత్కాల కృత ధృడ భావనం జేసి యాతడు నేరేడు దీవిం దుర్గమారణ్యమున బూర్వ జన్మ స్మ్రుతి గల లేడియై జన్మించెను. జన్మాంతర స్మృతింజేసి సంసారము నెడ (జనన మరణ ప్రవాహ రూపమయిన దాని యెడ) భయాందోళనము లంది తల్లి లేడిని విడిచి తిరిగి సాల గ్రామమునకే ఏతెంచెను.
అక్కడ నెండిన గడ్డి గాదము నాకులుం గొరుకుచు దనకు దాబోషణ మందుచు మృగ జన్మమునకు కారణమైన కర్మమునకు బ్రాయశ్చిత్తము నడసెను. అప్పుడు దేహమువాసి జాతిస్మరుడైన ద్విజుడై సదాచార సంపన్నులయిన యోగుల పవిత్ర విప్ర వంశము నందు జనించెను. సర్వ విజ్ఞానములు సర్వ శాస్త్రములు శాస్త్రార్థముల నిగూడ రహస్యము నెరింగి ప్రకృతి కంటే పైదయిన యాత్మను దర్శించెను. ఆత్మజ్ఞాన మలవడి నందున దేవాది సర్వ భూతములను దనకంటే వేరుగావని గనుగొనెను. ఉపనయనము సేయబడిన నతడు గురువు సెప్పిన శృతి పాఠము సేయడయ్యే. చేయ వలసిన కర్మములను గనడయ్యే. శాస్త్రములం గ్రహింపడయ్యె. పెక్కు రీతుల బలుకరింపబడియు జడునట్లు పలుకు చుండెను. ఆమాటకామాట సంస్కార హీనము గుణహీనమును.
పాటకపు జనము మాటలం బోలేను. మాసిన యొడలు మాసిన వలువలు పాచి బట్టిన పలువరుసతో నాగరికు లేవగింప దిరుగాడు చుండెను. యోగ సంపాదకు సమ్మానము (గౌరవము) హానిం గల్గించునది గావున నయ్యోగి జనముచే నవమానితుడై యోగ సిద్ధి నందగలడు. కావున యోగి సత్పురుషుల ధర్మమున నే మాత్రము దూషింపక తాను మాత్రము తనను జనుల అవమానించునట్లు తనతో పొత్తు కూడకుండునట్లును జరింప వలయునన్న బ్రహ్మ వచనమును దలంచి యమ్మహా జ్ఞాని తనను లోకమునకు జడునట్లు ఉన్మత్తునట్లు దెయ్యము బట్టిన వాడట్లు గానబరచు కొనెను. ఒక తల కుల్మాషములను (గుగ్గిళ్ళను) ఒకప్పుడు వాట్య (పులగము) ఒక యెడ నడచి కూరాకుల పండ్లు నూకలు (కణములు) ఏది దొరికిన నది యా కాలాన కనువుగ దినును. తండ్రి వోయిన మీదట అన్నదమ్ములు వారి పుత్రులు బంధువులచే పొలము పనులందు గూర్పబడి కదన్నము (గంజి వగైరాలు, ఎంగిలి మెతుకులు) దిని సంతోషించు. తిన్నని కండ్లు బలిసిన యోడలుం గల్గి పనిలో మాత్రము మందగించుచు జీతము నాతము లేని వట్టి కూడు మాత్రము జీతముగా నింటనె కాదూరికెల్ల పనిముట్టె వాడుకోనబడు చుండెను. అట్టి యసంస్కార విచేష్టితుని ఆకారమాత్ర విప్రుని సౌవీరరాజ సారథి (క్షత్తా) కాలికి బశువుగా బలి ఈయ నియోగించెను. వైశసవిధి ననుసరించి (బలియిచ్చు విధానమును బట్టి) రాత్రి వాని నలంకరించి బలి నిచ్చు బండ్లపై నిలువబెట్టి నంత వానింగని కాలి యోగీశ్వరుండని తెలిసి బలియిచ్చు వాని కత్తిని లాగికొని యారేయి ణా క్రూరకర్ముని యా దాసీ పుత్రుని కంఠము మొదలికి నరకెను.
తన పరివారముతో నా దేవి వాని మేడం బొంగిపొరలు రక్తముం ద్రావెను. ఆపై సౌవీరరాజు మహాత్ముడు చనినంతట వాని వెట్టివాడు వీడు వెట్టిపని కనువైన వాడని యట్టి మహానుభావుని నివురు గప్పిన నిప్పట్లున్న వానిని పెట్టి పనిలో బెట్టెను. అరేడొక నాడు శిబిర (లాలకి) నెక్కి కపిల మహర్షి యాశ్రమమున కేగ సంకల్పించెను. ఈ సంసారము దుఃఖ ప్రాయము. ఇందు శ్రేయస్కరమేమి? అని మోక్ష ధర్మముం గూర్చి కపిల మహాముని నడుగ నెంచెను. రాజభటు నానచే నా భరతుడు వేట్టివాండ్ర నడుమ తానును పల్లకి మోతకు బూను కొనెను. సర్వజ్ఞాన నిదానమై జాతి స్మరుడైన ఈతడు పాపక్షయ మీ విధముగా గావలెనని కోరి యాలాలకి మోసెను. జ్ఞానుల కెల్ల నుత్తముడాయన లాలకి దండి మాత్రము చూచు కొనుచు (భుజము మీద నుండి యది జారిపడకుండు నంత వరకు గమనించుచు) మంద మందముగా నడుచు చుండెను. అది చూచి రాజు లాలకి యెడుదుడుకువడుట గని యిది ఏమి? సమముగ నడుపమని బోయీలని గద్ధించెను. అప్పటికినది యెడుదుడుకువడుట సూచీ రాజు ఏమిది? యిట్లేల నడతురని పలుమారు లాడినంత వాహకులు వీడు త్వరగా నడచుట లేదనిరి.
అలసితివా? నీవు నాలుగడుగులేని నా శిబికను మోయలేదు? ఆయాసమెక్కువైనదా? సహించలేవా? ఔను పాపము బక్క చిక్కినట్లు గనపడు చున్నావు అనెను.
నేను బలసిన వాడ గాను. నేను మోతగాడను కాను, అలయను లేదు, ఆయాసము లేదు, సహించుటయు లేదు.
ఎదురుగా బలిసి కనబడు చున్నావు. నీ మీద శిబిక యున్నది, బరువు మోతలో శ్రమయు దేహుల కుండును కదా!
రాజా నీవు ప్రత్యక్షముగా నేది చూచితివో అది నాకు చెప్పుము. బలశాలి దుర్బలుడన్న మాటలు తరువాత? నీవీ లాలవి మోయు చున్నావు. ఇది యిప్పుడును నీమీద నున్నది అన్న నీ మాట అబద్దము నా పలుకాలింపుము. భూమి మీద పాదములు రెండున్నవి, పిక్కలు వాని మీదున్నవి, తొడలా పిక్కల మీదున్నవి, ఆ తొడలపై కడుపున్నది, దాని మీద రొమ్ములు, బాహువులు, భుజము లున్నవి. ఆ భుజముల మీద నీ శిబిక యున్నది. ఇదంతయు నా బరువందువు ఏమి? శిబిక యున్న ఈ శరీరము నీచే నుపవిక్షిత మైనది. అక్కడ నీవు నేను నన్న వస్తువన్యథా చెప్పబడు చున్నది. నీవు నేను మరి యితరులు భూతములచే భయపడు చున్నాము. భూత వర్గము, గుణ ప్రవాహమున బడి యిట్లు కొట్టుకొని పోవు చున్నది. గుణములు కర్మకు లొంగిన అవి సత్వము రజస్సు తమస్సు కర్మ అవిద్యా సంచితము అజ్ఞానముచే ప్రోగు పడినది. అది జంతువుల నన్నిట నున్నది.
ఆత్మయనునది శుద్ధము అక్షరము శాంతము. అది గుణముల కంటె ప్రకృతి కంటె వేరైనది. అఖిల జంతువులం దొకానొకటి యైయున్న దీనికి వృద్ధి క్షయమును లేవు. పెరుగుదల యెట్లు లేదో, తరుగుదలయు దీనికి లేదు. అట్టి యెడ నీవు బలిసి యున్నావనియే యుక్తిం బట్టి నీవన్నావు? భూమి పాదములు మోకాళ్ళు నడుము తొడలు కడుపు మొదలయిన వానిపై మెడపైన శిబిక యెట్లున్నదో సరిగా నీచే నీ శరీరము నట్లున్నది. జంతువులన్నిటి విషయమంతే. శిబికను మోయువాడే కాదు. కొండలు, చెట్లు, ఇండ్లు మొదలయిన వాని వలన నలుగు భూభారమంతయు నీమీద నున్నది. ప్రాకృత కారణముల వలన నీ బరువంతయు పురుష వాచ్యమగు వస్తువు కంటే నిదెల్ల ‘వేరు’ అను భావమున్నంత దాక ఆయాసము గూడ సహింప వలసి యుండును. కాని నేనెందుకది సహింతును (నాకా ప్రుథగ్భావము లేదు గనుక నాకా భారమును లేదన్న మాట). ఈ శిబికయే ద్రవ్యముచే జేయబడినదో ఈ యూత సమూహమునదే ద్రవ్యము. నీకును, నాకును, నంతకును మమకారముచే నిది యెల్ల పెంచుకొన బడినది.
అని పలికి యాలాలకి నట్లే మోయుచు మరుమాటాడ కూరకుండెను. ఆ రాజును సత్వరమాలాలకి దిగి పుడమిపై వ్రాలి యాయన పాదములం బట్టుకొనెను. మఱియు నిట్లనియె.
ఓ విప్రోత్తమా! శిబిక వదలి, స్వామీ! నా యెడ ననుగ్రహము చూపుము. అల్పుని రూపమున నున్న తామెవరో యానతిండు. ఎందులకు ఏమి పని మీద యిట్లు వచ్చితివో ఓ బ్రాహ్మణ మూర్తి ! యదెల్ల శుశ్రూషువునగు నాకానతిమ్ము.
దేశ కాలాదుల ననుసరించి సుఖ దుఃఖానుభవము జరుగును. అవి రెండును ధర్మాధర్మముల వలన నేర్పడునవి. దానిం బట్టి జంతువు దేహాదులం బడయును. ఎల్లెడల నెల్ల జీవులకు నెల్ల యనుభవములకు గారణము ధర్మాధర్మములే, కావున నీవు కారణమడుగుటేల?
సర్వకార్యము లందు ధర్మాధర్మములు కారణములు సందేహము లేదు. ఒకదాని వెంటనొక శరీరము గల్గుట ఫలానుభవము కొఱకు సరికాని నీవన్నావే ఆ వస్తువు నేను అని ఆత్మను గూర్చి యన్న మాట అనుటకు వినుటకు గూడ శక్యము గాకున్నది. అందు నాకభిరుచి కల్గు చున్నది. సోఽహమనుణ దాన నేది గలదది పలుకుట కేల శక్యము గాదు, ‘అహమ్’ (నేను) అను పదము ఆత్మా యందు అన్వయించుట తప్పుగానప్పుడది యెట్లు పలుకుటకేమి యిబ్బంది?
‘అహమ్’ నేను అన్న పదము ఆత్మా యందు వర్తించుట తప్పని గాదు, అది యంతియే, కాని ఆ ఆత్మ తానూ గాని, వాని ఆ విజ్ఞానము గాని, శబ్దము గాని భ్రాంతి లక్షనమైనది. అట్టి భ్రాంతి మూలకమయిన వాగాడంబరమన్నమాట. నాలుక నేననును దంతములు పెదవులు తాలువులును, కావున ‘అహం’ నేను అను నీ మాటలు కేవలము వాజ్మాత్రోచ్చారణ కారణములు ఈ వాక్కు ‘నేను’ అను వస్తువును ఏ కారణముచే చెప్పును. ఇందువలన నీవు బలిసి యున్నావనుటయు నది చెప్పుటకు వలను బడదు. పురుషుని కంటె పిండము (దేహము) వేరు ఈ పిండము తల చేతులు మొదలయిన చిహ్నములు గలది. ఈ వివిధ వస్తు సంఘాత మందు ‘అహం’ నేను అను వ్యవహారము (సంజ్ఞ) దేని యందు జేయ మందువు నాకంటే మరియోకడి తరుడుండెనేని వీడు నేను వాడు మరియోకడని చెప్పుటకేని వీలగును. అన్ని దేహము లందు పురుషుడొక్కడై యున్నపుడు నీవేవాడవు అతడు నేను ఇత్యాదిగ మాటలాడుట వ్యర్థము. నీవు రాజువు, ఇది శిబిక మేము బోయీలము, ఈ రాజ్యము నీది ఇత్యాదిక మిదంతయును ‘అసత్తు’ లేనిది ముందు చెట్టు. దాని నుండి దారువు, దాని నుండి ఈ నీ యెక్కిన లాలకి దీనికి వృక్షము, దారువు నను నీ సంజ్ఞలు (పేర్లు) ఇపుడేమై పోయినవి నీ పరిజనము నిన్ను వృక్షారూడుడవని (చెట్టెక్కిన వాడవు అని) అనుట లేదే లేదా దారువు మీద నెక్కినావని ననుట లేదు. శిబికా రూడుడవను చున్నది. శిబిక, దారువు, వృక్షము నను నదొక్క వస్తువే రచనాభేదము ననుసరించి (రూప భేదమును బట్టి) నామ భేదమందినది. ఆ భేదమందలి ఈ శిబిక మొదలేమో వెదకి కొనుము. ఇట్లే ఛత్రము (గొడుగు), శలాక (గొడుగు కామ) మొదలయిన వాని వేరిమి యందలి బండారము వెదకి కొమ్ము నీ గొడుగెటు పోయినది అన్న ప్రశ్నము నీయందెంత న్యాయమో నాయందు నంతే కర్మ హేతువులయిన (కర్మ కారణముగా నేర్పడు) పురుషుడు స్త్రీ, గోవు, మేక, గుఱ్ఱము, ఏనుగు, పక్షి, చెట్టు అనునది దేహము లందు ఒక గుర్తు (సంజ్ఞ) నామము మాత్రము ఆ పురుషుడు (ఆత్మ) దేవుడు గాదు, నరుడు గాదు, పశువు గాదు, పాదపము గాదు. శరీరాకృతి భేదులు (ఉపాధినానాత్వ) కర్మ నిమిత్తములు కర్మము వలన నీ భేదము లేర్పడిన వన్నమాట. రాజు, రాజ భటాదికము మఱియు గల వస్తువెల్ల సత్పదార్థము గాదు (ఉన్నది కాదు). ఇది కేవలము కల్పనామయము. కాలాన్తరముననేని యేది ద్రూపమొంది పరిణామాదుల వలన నేర్పడు నామాంతరములను వేరు వేరు పేరులను బొండని దేదో యది వస్తువు ఆత్మా వస్తువు? అదేమి యుండును? అది దృశ్య వస్తువులం దేదియును గాదు. నీవు సర్వ లోక ప్రభుడవు. తండ్రికి కొడుకువు. శత్రువునకు శత్రువువు, భార్యకు మగడవు, కొడుకునకు తండ్రివి. రాజా నేను నిన్నేమని పిలుతును? ఈ తల నీవా? మెడ నీవా? కడుపు నీవా? పాదాదికము నీవా? ఇది నీదా అన్ని యవయవములకు నీవు వేఱుగా నున్నావు. ఇక్కడ నీవు నేనెవ్వడనని నేర్పరిపై యాలోచిమపుంము. తత్త్వమిట్లుండ పృథగ్భావముతో నేర్పడ దగిన ‘అహం’ నేను అని ఎటు పలుక శక్య మగును?
Summary of chapter 13 of the Vishnu Mahā Purāṇa is as follows:
The Jaḍabharata narrative begins: Bharata, eldest son of Ṛṣabhadeva, performed deep tapas on the Śālagrāma mountain. He developed attachment to a rescued deer fawn, died with his mind on the deer, and was reborn as a deer with jāti-smṛti (memory of past lives). After living out that deer birth in repentance, he was reborn as a brāhmaṇa with full jñāna from birth. He feigned stupidity (jaḍatā) to protect himself from renewed worldly entanglement. While being forced to carry a palanquin for the king of Sauvirā, Rahūgaṇa, he walked unevenly to avoid harming insects. The king mocked him. Jaḍabharata replied with a profound teaching: the ātman carries no burden; the body is composed of earth, and earth bears earth; the very notion of "I" cannot be applied to any limb, organ, or body part.