మైత్రేయా! నిరంతర ముదార చరితుడగు ప్రహ్లాదుని చరిత్రమును వినుము. పూర్వము దితి యొక్క పుత్రుడు మహా పరాక్రమశాలి యగు హిరణ్యకశిపుడను వాడు బ్రహ్మ వరముచే గర్వించి ఇంద్రుడుగను, సూర్యుడుగను, వాయువుగను, అగ్ని, వరుణుడుగను, సోముడుగను, కుభేరుడుగను, యముడుగను వ్యవహరించుచు యజ్ఞ భాగముల నపహరించు చుండెను. అతని వలన భయపడి దేవతలు భూలోకమున కేగి మనుష్య రూపధారులై తిరుగు చుండిరి. ముల్లోకముల జయించి హిరణ్యకశిపుడు విజయ దర్పముచే గంధర్వులు కొనియాడగా ప్రియ విషయముల ననుభవించు చుండెను. గానాదులచే సిద్ధులు, అప్సరసలు వాని సేవించు చుండిరి. మనోహర ప్రాసాదమున స్పాటిక శిలా స్థలిని అప్సరసలు నాట్య మాడగా మద్యపాన సక్తుడై యుండెను. వాని పుత్రుడు ప్రహ్లాదుడు గురు కులమున బాల పాఠ్యముల నభ్యసించు చుండెను.
ధర్మాత్ముడగు ప్రహ్లాదుడొక దినమున గురువు పురస్సరముగ నేతెంచి పానాసక్తుడగు తండ్రికి పాద వందనము చేయగా లేవనెత్తి హిరణ్యకశిపుడు నీ చదువుల సారము నెరింగింపుమన ప్రహ్లాదుడు చదువుల మర్మమును నా మనోగతమైన దానిని తెల్పెద. సావధానముగ వినుండు.
ఆది, మధ్యాంతములు, వృద్ధి క్షయములు లేనివాడును, నాశన రహితుడును, నాశకరుడును, సర్వ కారణ కారుణుడును నగు విష్ణువును నమస్కరించెద.
అని పలుకగా విని కోపోద్రిక్తుడై గురువుతో నిట్లనియె.
బ్రాహ్మణ బృవుడా! ఏమిది? నన్ను తిరస్కరించి అపారమగు శత్రుపక్ష స్తుతిని వీనికి భోధించితి వేల? అనగా
“దైత్య ప్రభూ! ఆగ్రహింప వలదు, నా బోధన యొక్క సారమును నీ సుతుడు పలుకుట లేదు” అనెను.
“నాయనా! నేవెవ్వరిచే యిట్లు శిక్షింప బడితివి! నీ గురువిట్లు శిక్షింప లేడను చున్నాడు” అని పలికిన తండ్రికి,
“తండ్రీ! విష్ణువు సర్వ జనుల హృదయంతరాళ వర్తియై శాసించు చుండగా అట్టి పరమాత్మ కంటే మరెవ్వరు శాసించ గలరు?” అని పలికిన కుమారునితో
“ఓ దుష్టబుద్ధీ! సర్వ జగత్పతినగు నా యెదుట పదేపదే నీచే పేర్కొనబడు విష్ణువనువా డెవ్వడు?”
“ఎవ్వని స్వరూపము శబ్ద గోచరము కాక యోగి జనధ్యేయము మాత్రమే సమస్త జగత్తు ఎవని వలన నేర్పడు చున్నదో, యెవడు విశ్వ స్వరూపుడో అతడే పరమేశ్వరుడగు విష్ణు దేవుడు”
“తెలివి లేని వాడా! నేనుండగా మరియొకరు పరమేశ్వరు డనువా డెచట నున్నాడు? నీవు చచ్చుటచే క్షణక్షణ మిట్లు పలుకు చున్నావు.”
“నాకు మాత్రమే గాదు, సమస్త ప్రజలకు నీకు నాతడే ధారకుడు సృష్టి కర్త పరమేశ్వరుడునై యున్నాడు. అనుగ్రహింపుము కోపమేల” అనగా తండ్రి ఆవేశముతో
నిట్లు అయోగ్య వచనములు పల్కుటకు దుర్బుద్ధి గల నీతని హృదయమున మహాపాపి యగునెవడో ప్రవేశించెను.
“తండ్రీ! నా హృదయమును మాత్రమే గాదు, సమస్త లోకములను ఆక్రమించుకొని యుండి ఆ విష్ణువే నీవు మొదలగు నందరిని సమస్త వ్యాపారము లందు ప్రవర్తింప జేయు చున్నాడు. అతడంతట నిండి యున్నాడు.” అని పలుకగా
“ఈ మహాపాపిని వెళ్ళ గొట్టుడు. గురు గృహంబున శిక్షింప బడుగాక! శత్రుపక్ష స్తుతి యందెవ్వడీ దుర్మతిని ప్రవేశ పెట్టెను.”
అని పలుకగా, గురు గృహంబునకు గొంపోయిరి. గురు శుశ్రూషతో రేయిం బవాళ్ళు విద్యా గ్రహణము చేసెను. చాలా కాలమునకు దైత్యపతి కుమారుని రప్పించి యొక శ్లోకము చదువ మనగా ప్రహ్లాదుడిట్లు చదివెను.
“(ప్రధాన ప్రకృతి) పురుషులకు చరాచర ప్రపంచమునకు సమస్తమునకు కారణభూతుడైన యా విష్ణువు మనల ననుగ్రహించు గాక!”
అనగా రాజు “ఈ దుర్మార్గుడు చంపబడు గాక! వీడు బ్రతికి ప్రయోజనము లేదు. స్వపక్షహానికర్త యగుటచే నీతడు కులదాహకుడు” అని ఆజ్ఞాపింపగా
మహాయుధముల దాల్చి వేల కొలది రాక్షసులు ఆతనిని చంపుటకు సిద్ధ పడిరి.
శాస్త్రము లందు మీ యందు నా యందున ఆ విష్ణువే నిండి యున్నాడు. ఆయాదార్థ్య,ము ననుసరించి యాయుధములు నన్ను స్పృశింపకుండు గాక!
అనేక రాక్షసులచే ఘోర శస్త్రములతో కొత్త బడినను ప్రహ్లాదుడు స్వల్పమగు బాధను కూడా పొంద కుండుటయే గాక తిరిగి నూతతత్వ మందు చుండెను. అది చూచి రాజు,
“ఓరి దుర్బుద్దీ! వైరి పక్షము నుండి మరలుము. నీ కభయ మిచ్చెద. మిక్కిలి మూర్ఖత్వము నొందకుము.” అని పలికెను.
“తండ్రీ! ఎవ్వని స్మరణ మాత్రమున జన్మ భయము జరాభాయము యమ భయము మున్నగు భయములు అన్నియు తొలగిపోవునో అట్టి యనంతుడు మనసులో నుండగా నాకు భయ మెచట నుండును?” అనెను.
“ఓ సర్పములారా! దురాచారుడు, దుర్బుద్ధియునగు నీతనిని విష జ్వాలలచే భయంకరములైన ముఖములచే వెంటనే నశింప జేయుడు” అని పలుకగా
తక్షకాది క్రూర సర్పములు అంటని యవయవము లందు కాట్లు వేసెను. కృష్ణుని యందు లగ్నమైన మనసు గల ప్రహ్లాదుని కేమియు తెలియక పోయెను. సర్పములు దైత్యరాజుతో నిట్టనియే.
మా కోరలు విరుగు చున్నవి. హృదయ మందు కంపము పడగలందు తాపము కలుగు చున్నది. ఓ ప్రభూ! పిల్లవాని చర్మమైన కొంచము భిన్నమగుట లేదు. మరియొక పనిని చెప్పుడు.
“దిగ్గజములారా! శత్రు పక్షముచే భిన్నుడైన ఈ బాలుని మీ చతుర్దంతములతో చంపుడు. అరణి వలన పుట్టిన యగ్ని యా అరణికి నాశనకరమగు గదా!” అని పలుకగా
దిగ్గజములు ప్రహ్లాదుని దంతములతో పొడిచి క్రింద పడ వేసెను. గోవింద స్మరణలో నిమగ్నుడైన యాతనికి బాధ కలుగ లేదు. దిగ్గజముల దంతములు భగ్నము లాయెను.
“తండ్రీ! వజ్రము వలె నిష్టురములైన గజ దంతములను కూడ భగ్నము చేసిన భగవంతుని బలము చూడుడు. భగవదను స్మరణము మహా విపత్తులను గూడ నశింప జేయ గలదు”
“రాక్షసులారా! దిగ్గజముల పారద్రోలుడు. అగ్నుల రగుల్కొల్పుడు. వాయువు అగ్నిని రగుల జేసి యీ పాపాత్ముని దహింప జేయు గాక!”
అని యాజ్ఞాపింపగా నట్లు చేయ మొదలిడిరి.
“తండ్రీ! గాలిచే రగులజేయ బడిన యీ అగ్ని నన్ను దగ్ధము చేయ జాలదు. దిక్ముఖములెల్ల పద్మములచే పరువ బడినట్లు చల్లగా నున్నవి.”
“ప్రభూ! బాలుడైన నీ తనయునిపై కోప ముపసంహరింపుడు. మీ కోపము దేవతల యెడ సఫల మగును. ఈ బాలుని మేము విపక్ష నాశ దక్షుడగునట్లు శిక్షింప గలము.
దైత్యరాజా! బాల భావము సర్వ దోషములకు నిలయము గదా! ఈ యర్భాకుని యెడ తీవ్ర కోపము వలదు. మా శిక్షణ వలన హరి పక్షమును వీడడేని క్రుత్యయను అభిచారికా భూత విశేషమును నీ బాలుని వదార్తమై ప్రయోగింతుము. దానికి తిరుగుండదు.
“దైతేయ బాలకులారా! పరమ పురుషార్థమును వినుడు. అన్యథా భావింపకుడు. అనగా మిత్యగా తలంపకుడు. గురూపదేశము నందు వలె నా బోధ యందు లోభాదులు కారణము గావు. జన్మాది పంచకము (జన్మ, బాల్యము, యౌవనము, జరా మృత్యువులు) ప్రతి జంతువునకు ప్రత్యక్షముగ గోచరించు చున్నవి గదా! మృతునకు పునర్జన్మ కలుగు ననునదియు అసత్యము గాదు, కారణము లేకుండ పుట్టుక లేదని కూడా నాగమము చెప్పు చున్నది. ఆకలి, చలి మున్నగు వాని ఉపశాంతి హేతువగు అన్నము అగ్ని మొదలగునవి దుఃఖ కారణమే యైనను అజ్ఞతచే సుఖ హేతువనుకొను చున్నారు.
మిక్కిలి నిశ్చలమైన యవయవములు గలవారునూ ఆయాసముతో సుఖమును పొందగోరు వారునూ భ్రాంతిచే గ్రమ్మ బడిన నేత్రములు గల వారికిని దుఃఖమే సుఖముగ నుండును. శ్లేష్మాది సమస్త కల్మషముల సముదాయ రూపమగు శరీర మెక్కడ? సౌందర్య శోభాది గుణములెక్కడ? మాంస విణ్మూత్రాది సంఘాత రూపమగు దేహము నందు ప్రీతిగల మూడునకు నరకము నందు కూడ ప్రీతి కలుగు గాక! అగ్నికి చల్లదనము చేత నీటికి దప్పిక చేత అన్నమునకు ఆకలి చేత సుఖ కర్తృత్వము సెప్పబడు చున్నది. శీతాద్యభావములచే అగ్న్యాదులకు దుఃఖ కర్తృత్వము సెప్పబడు చున్నది. ఓ దానవ బాలకులారా! ధనాదులెంతెంతసంగ్రహింతురో వారికవి అంతంతగ దుఃఖ హేతువులగును. కళత్రాదిక మెంతగ ప్రేమింతురో అంతగనవి శోకశంకువువై హృదయమున స్థిరముగ నిలిచి పోవును. ఇంటి యందున్న వస్తువులన్నియు దూరమున నున్న వానికి నాశాద్యా శంకచే నవియెల్ల మనస్సు నందేయుండ గలవు. జనన మందు మరణము నందు యమ యాతనల యందు గర్భమున సంక్రమించుట యందు గర్భము నందును సుఖ లేశము గూడ నూహింప శక్యము గాదు. ఈ విధముగ నతిదుఃఖముల కునికిపట్టగు సంసార సముద్రము నందు విష్ణువొకడే సుఖమైన శరణ్యము.
ఇది నిజము. మేము పిల్లలమని తలంచ వలదు. దేహము లందుండు దేహి శాశ్వతుడు. జన్మ యౌవనము, జర మొదలగు ధర్మములు దేహమునకు గాని ఆత్మకు లేవు. “నేను బాలుడను. నా శ్రేయస్సు కొఱకై యౌవనమున యత్నింతును. నేనిపుడు యువకుడను. వార్ధక్యము వచ్చిన పిదప యత్నింతును. నేనిపుడు వృద్దుడను. నాకిపుడే పనులు గోచరించుట లేదు. ఏమి చేయుదును? సమర్థతతో నుండగా నేమియు సేయ నైతిని.” అని దురాశ పూరితుడై నరుడు శ్రేయో మార్గమున ప్రవర్తింపడు. బాల్యమున నాటలతోను యౌవనమున విషయాసక్తితోను వార్దమున అశక్తతతోను మూడులు కాలము గడుపుదురు. కావున వివేకయుక్తుడు బాల్యాది దేహ భావములతో సంబంధము లేకుండ శ్రేయస్సు (మోక్షము) కొఱకు నెల్లపుడు బాల్యము నందే ప్రయత్నింప వలయును. నేను మీకు చెప్పిన ఈ విషయములను అసత్యము గాదని గుర్తించిన మీ ప్రీతి కొఱకై భుక్తి ముక్తుల నొసంగు శ్రీమహా విష్ణువు స్మరింపుడు ఇట్లు స్మరించుట కేమి శ్రమ గలదు? స్మరణ మాత్రముననే హరి మంచిని కలుగ జేయును. రేయిం బవళ్ళు ఆ విష్ణు దేవుని స్మరించు వారలకు పాప నాశనము కూడా కలుగును. సర్వ భూతముల యందు నిండి యున్న విష్ణువు నందు రేయిం బవళ్ళు మీకు బుద్ధి యుండుగాక! సర్వ భూతముల యందు మైత్రి కలుగు గాక! ఇట్లగునేని సర్వ సంసార క్లేశములు తొలగును. సమస్త ప్రపంచము తాపత్రయ దూషితము. అట్టి యెడ శోచనీయమైన ప్రాణుల యెడ ప్రాజ్ఞుడైన వాడు కరుణ చూపును గాని ద్వేషమూనడు.
సమస్త భూతములు అధిక పుణ్యవంతములు. నేను హీన శక్తుడను భావమున్నచో దాని యందు మోదమును చూప వలెను. కాని యసూయ పడరాదు. ద్వేషము వలన తన పుణ్యం నాశనమగును గదా! వ్యర్థముగ బద్ధ వైరులై పరులందు ద్వేషము చూపువారి యెడ విద్వాంసుడు వీరు అధిక మొహముచే వ్యాప్తులై యున్నారు. కావున వీరు శోచనీయులు గాని ద్వేషింప దాగిన వారు గాదని ఉపేక్ష వహింప వలెను. ఈ వికల్పము లన్నియు భేద దృష్టి గల మధ్యమాదికారుల ద్వేషోప శమన ప్రాకారములు. అభేద దృష్టి గల ఉత్తమాదికారుల మతమును సంక్షేపముగ చెప్పేద వినుడు. ఈ సర్వ జగత్తు సర్వ భూత స్వరూపుడగు విష్ణు దేవుని విస్తృతియే. కావున నేర్పరులైన వారు సర్వ భూతములను ఆత్మాభిన్నములుగ చూడ వలెను. అసుర భావమును (దేహము నందు ఆత్మాభిమానమును) వదలి మీరు మేము కూడా మోక్షము పొందునట్లు ప్రయత్నించ వలెను. ఆ నిర్వృతి (మోక్షము) అగ్ని సూర్య చంద్ర వాయు వరుణ సిద్ధ సాధ్య కిన్నరాద్యాధీ దైవికోప ఘాతములచే గాని, మనుష్య పశ్వాద్యాధీ భౌతికోప ఘాతములచే గాని, శారీరమాన సాద్యాధ్యాత్మికోప ఘాతములచే గాని, నాశనము చెందడు. అట్టి మోక్షమును మానవుడు అమలుడైన కేశవుని యందు హృదయము నుంచి కేశవా స్మ్రుతిచే నంద గలడు. అపారములగు సంసార వివర్తములగు దేవ మనుష్య తిర్యక్ పశ్వాది జన్మ లందు సంతోషము నంద వలదు. సర్వ భూతముల సమ దర్శితను పొందుడు. అదియే యచ్యుతారాధనము. ఆ కేశవుడు ప్రసన్నుడు కాగా అలభ్య మనునది లేదు. ధర్మార్థ కామములు అత్యంతాల్పములు. నిత్య సన్నిహితమైన బ్రహ్మ కల్పతరువు నాశ్రయించిన వారికి మహాఫలమగు మోక్షము తప్పదు.
Summary of chapter 17 of the Vishnu Mahā Purāṇa is as follows:
Dakṣa's daughters are enumerated. Aditi's sons are the twelve Ādityas. Ditī's sons include Hiraṇyakaśipu and Hiraṇyākṣa — the two great daitya lords. The lineage of Hiraṇyakaśipu is established, setting the stage for Prahlāda's story.