విష్ణు మహా పురాణము

2 - సావర్ణ్యాది మనూత్పత్తి

మీచే మన్వంతరములు చెప్ప బడినవి. రాబోవు మన్వంతరములను నాకు చెప్పుదురు గాక! 

సూర్యుని భార్య సంజ్ఞా దేవి. ఆమె విశ్వకర్మ యొక్క పుత్రిక. ఆమె సంతతి మనువు, యముడు, యమి. ఆమె భర్త యొక్క తేజస్సును సహించలేక తన వంటి యొక స్త్రీని తన ఛాయను శుశ్రూషార్థమై నియోగించి తపస్సు కొఱకై తానరణ్యమున కేగెను. సూర్యుడామెను సంజ్ఞా దేవిగనే యెంచి, యామె యందు శనైశ్చరుడు, మరియొక మనువు అను పుత్రులను, తపతి యను కన్యను సంతతిగ గాంచెను. తన సంతతి యందు పక్షపాత ముండుటచే కినిసి పాదముతో తన్నబోయిన యమునకు "నీ పాదము పడిబోవు గాక!" అని శాప మిచ్చెను. దాని వలన నీమే సంజ్ఞా దేవి కాదు మరియొక స్త్రీ యను భావము యమునకు తండ్రియగు సూర్యునకు కలిగెను. వెంటనే సూర్యుడు నీవెవరో చెప్పుమని నిర్భంధించగా నేను సంజ్ఞా దేవి యొక్క ఛాయను. సంజ్ఞ ఉత్తర కురు దేశారణ్యమున బడబా రూపమున తపస్సు చేయుచున్నదని తెలిపెను. సూర్యుడు సమాధి దృష్టితో నామెను వాజీ రూపమున తపస్సులో నున్నట్లు గాంచి తాను గూడ వాజీ రూపధరుడై యామె యందు అశ్వినీ కుమారులను రైవంతుని గనెను. సంజ్ఞను స్వస్థానమునకు గొని వచ్చెను.

విశ్వకర్మ సూర్యుని తరణి(సాన) పట్టి యెనిమిదవ భాగమును తగ్గింపగా వైష్ణవాంశమగు నా భాగము ప్రకాశించుచు క్రింద పడెను. ఆ తేజస్సుతో త్వష్ణయే విష్ణు చక్రమును, శివుని త్రిశూలమును, కుభేరుని పుష్పక విమానమును, కుమారస్వామి యొక్క శక్తియను ఆయుధమును, ఇతర దేవతల యాయుధములని రచించెను. ఛాయా సంజ్ఞా పుత్రుడగు ద్వితీయ మనువు లోగడ పుట్టిన మనువునకు సవర్ణుడు కాన సావర్ణియని చెప్ప బడెను. కావున నీ యెనిమిదవ మన్వంతరము సావర్ణిక మన్వంతరమని చెప్ప బడును. భవిష్యత్తు మన్వంతరములను చెప్పెద వినుము. రాబోవు మనువు సావర్ణి. దేవతలు మిక్కిలి తపస్వులు. మహా దీప్తిమంతులు. వారి గణములలో నొక్కొక్క గణమునకు నిరువది మంది గలరు. దీప్తిమంతుడు, గాలవుడు, రాముడు, కృష్ణుడు, ద్రోణి, నా పుత్రుడగు వ్యాసుడు, ఋష్యశృంగుడు సప్తర్షులు. విష్ణు దేవుని అనుగ్రహమున పాతాలాంతర గతుడు విరోచనుని కుమారుడగు బలి ఇంద్రుడు కాగలడు. విరజస్కుడు ఉత్వరీవంతుడు నిర్మోకుడు మున్నగు వారు సావర్ణి పుత్రులు మనుజేశ్వరులు. 

తొమ్మిదవ మన్వంతరమున దక్షసావర్ణి మనువు కాగలడు. పారులు మరీచి గర్భులు సుధర్ములు అను మూడు గణముల వారు దేవతలు. ఒక్కొక్క గణము నందు పన్నిద్దరు గలరు. మహావీరుడగు అద్భుతుడను వాడు వారికి దేవేంద్రుడు. సవనుడు, ద్యుతిమంతుడు, భవ్యుడు, వసువు, మేదాతిథి, జ్యోతిష్మంతుడు, సత్యుడు వీరు సప్తర్షులు. ధృతకేతువు పంచహస్తుడు నిరామయుడు, పృథుశ్రవుడు మున్నగు వారు దక్షసావర్ణి పుత్రులు. పదవ మన్వంతరమున బ్రహ్మసావర్ణి మనువు. సుదాములు, విశుద్ధులు నూరుగురు దేవతలు. శాంతి యనువాడు ఇంద్రుడు కాగలడు. హవిష్మంతుడు, సుకృతుడు, సత్వుడు, తపోమూర్తి, నాభాగుడు, అప్రతిమేజుడు, సత్యకేతువు సప్తర్షులు. సుక్షేత్రుడు, ఉత్తమౌజుడు, భూరిషేణుడు మున్నగు వారు పది మంది బ్రహ్మసావర్ణి పుత్రులు భూమిని రక్షింతురు.

పడునొకండవ మన్వంతరమున ధర్మసావర్ణి మనువు కాగలడు. విహంగములు వామగములు నిర్వాణులు ఋషులు అను గణములు కాబోవు దేవతలలో ముఖ్యులు. ఒక్కొక్క గణములో ముప్పది మంది యుందురు. వృషుడు దేవేంద్రుడు నిశ్చరుడు అగ్ని తేజుడు వపుష్మంతుడు ఘృణి అరుణి హవిష్మంతుడు అనఘుడు అనువారు కాబోవు సప్తర్షులు. ధర్మసావర్ణి మనువు పుత్రులు సర్వత్రగుడు సుధర్ముడు దేవానికాదులు భూపతులు.

ద్వాదశ మనువు రుద్ర పుత్రుడగు సావర్ణి. ఋతుధాముడు దేవేంద్రుడు. హరితులు రోహితులు సుమనసులు సుకర్ములు సురాపులు అను అయిదు గణములు. ఒక్కొక్క గణమున పది మంది చొప్పున దేవతలు, తపస్వి సుతపుడు తపోమూర్తి తపోరతి తపోధృతి ద్యుతి తపోధనుడు అను సప్తర్షులు. దేవవంతుడు ఉపదేవుడు దేవాశ్రేష్ఠుడు మున్నగు మహావీర్యులగు మహారాజులు ఆ మనువు పుత్రులు.

పదమూడవ మనువు రుచి యనువాడు కాగలడు. సుత్రాములు, సుకర్ములు, సుధర్ములు అను ముప్పది మూడు బేదములు గల గణములు దేవతలు. మహావీర్యవంతుడగు దివస్పతి వారల కింద్రుడు. చిత్రసేనుడు, విచిత్రుడు మున్నగు భూపతులు వారి పుత్రులు. పదునాల్గవ మనువు భౌముడు. ఇంద్రుడు శుచి యనువాడు. దేవతలు అయిదు గణములు. చాక్షుషులు, పవిత్రులు, కనిష్ఠులు, భ్రాజములు, వాచావృద్ధులు, అనుగణములు. సప్తర్షులు అగ్నిబాహువు, శుచి, శుక్రుడు, మగధుడు, అగ్నీధ్రుడు, యుక్తుడు, జితుడు అనువారు. ఊరువు గంభీర బుద్ధి మున్నగు మనుపుత్రులైన రాజులు భూమిని పాలింతురు. 

నాల్గవ యుగాంతము నందు వేదములు అధ్యయనా భావముచే విప్లవము (నాశనము) కలుగును. కృతయుగాది యందు దివము నుండి సప్తర్షు లేతెంచి యుత్సన్న ప్రాయములైన వేదములను అధ్యాపనాదులచే ప్రవర్తింప జేయుదురు. ప్రతికృత యుగారంభము నందు మనువు స్మ్రుతి ప్రణేత యగును. ఆ మన్వంతర దేవతలు మన్వంతర సమాప్తి వరకు యజ్ఞ భోక్తలుగ నుందురు. ఆ మను పుత్రులు భూపాలకులుగా నుందురు. ఇట్లు మనువు సప్తర్షులు దేవతలు భూపాలకులగు మను పుత్రులు నింద్రుడు నను వీరాధికారిక పురుషులుగా నా మన్వంతరమున నేర్పబడుదురు.

పదునాల్గు మన్వంతరములు గతింపగా సహస్రయుగ పరిమితమగు కల్పము పూర్తి యగును. అటుపిమ్మట అంత పరిమాణము గల రాత్రి యేర్పడును. సర్వేశ్వరుడు బ్రహ్మ రూపధరుడై జలప్రళయము నందు నారాయణ రూపమున శేషతల్పము నందు శయనించును. ముల్లోకముల నెల్ల తన తర్భము నందిముడ్చుకొని సర్వభూత రూపుడైన జనార్ధనుడు స్వీయమాయ (యోగ నిద్ర) యందుండును. అవ్యయాత్మయగు భగవంతుడు కల్పకల్పము నందు తిరిగి మేల్కాంచిన వాడై రజోగుణ ప్రధానుడై యథా పూర్వముగా సృష్టిని చేయుచుండును. మనువులు రాజులు ఇంద్రుడు దేవతలు సప్తర్షులు వీరందరు జగత్తు యొక్క స్థితి (ఉనికి)కి కారణమగు భగవంతుని సాత్త్వికాంశములు సాత్త్విక తనువు నాలుగు యుగము లందును విష్ణు దేవుడు లోక స్థితిలో నిమగ్నుడై యుగ వ్యవస్థను చేయు చుండును. ఎట్లనగా 

కృత యుగము నందు సర్వ భూతరూపుడగు నారాయణుడు సర్వభూత హతార్థియై కపిలమున్యాది రూపముల ధరించి తత్త్వజ్ఞాన మనుగ్రహించును. ఆ ప్రభువే త్రేతా యుగము నందును చక్రవర్తి స్వరూపమున దుష్టనిగ్రహము చేయుచు జగత్త్రయముల పరిపాలించును. వేద వ్యాస రూపమును ధరించి యా ప్రభువే యొక వేదమును యుగ భేదముచే నాలుగు భేదములలో నొప్పు దానిని శాఖా శతములచే విస్తరింప జేయును. ద్వాపార యుగమున వేద విధాగమును ఆ వ్యాసుడే చేయును. కలి యుగాంతమున నా శ్రీహరియే కల్కి రూపధారియై దుష్టులను సన్మార్గమున పెట్టును. ఈ విధముగ నెల్లప్పుడు సమస్త ప్రపంచమును సృజించును. హరించును. అంతకాలమున ననంతుడుగా నా శ్రీహరి యుండును. కావున గతించినది గాని వర్తమానమున నున్నది గాని రాబోవునది గాని యీ సమస్తమును సర్వ భూతమయుడగు నా పరమాత్మ కంటే భిన్నము కాదు. మైత్రేయా! నీకు ఆ పరమాత్మ యొక్క సద్భావమే ఈ ప్రకరణమున గాని మరియొక ప్రకరణమున గాని నాచే చెప్ప బడినది. మన్వంతరములు తదధిపతులు కూడ నాచే సమగ్రముగ నీకు చెప్పబడిరి. ఇంకేమి చెప్పుమందువు?