విష్ణు మహా పురాణము

29 - నరకాసుర వధ

మైత్రేయా! శ్రీకృష్ణుడు ద్వారక యందున్న తఱి త్రిభువనేశ్వారు డింద్రుడు ఐరావత మద గజ మెక్కి వచ్చి ద్వారకం జొచ్చి హరిం గలిసికొని నరకాసురుని ప్రవర్తనము విన్నవించెను. మధుసూదనా! దేవాధినాథుడవు నీవు మనుష్యుడుగా వర్తింపగా గూడ సర్వ దుఃఖము లుపశమింప జేయబడినవి. తపశ్శాలురకు భాధ గూర్ప బూనికొన్ని యరిష్టుడు ధేనుకాసురుడు కేశి మొదలగు నసుర లెల్లరు నీచే నీల్గిరి. కంసుడ కువల యాపీడుడు బాలఘాతిని పూతన మొదలగు జగదుపద్రవము లన్నియు నీచే వినాశ మందినవి. నీదోర్ధండ వైభవమున ముల్లోకము రక్షణ మొంద యజ్వలు పిలిచి యజ్వలు యిచ్చు యజ్ఞ భాగము లందికొని దేవతలు తనియు చున్నారు. జనార్దనా! వారిలో నేనొకడనే నే పని మీద నిపుడిటకు వచ్చితినో యాలించి దాని కనువైన ప్రతిక్రియ గావింప యత్నింపుము. భూమి కొడుకీ నరకుడు ప్రాగ్జ్యోతిష పురాధీశ్వరుడు సర్వ భూతములకు బాధ గూర్చు చున్నాడు. దేవసిద్దుల యొక్కయు ధరణి నాతుల యొక్కయు కన్నియలం గొనిపోయి తన యింటంజెఱ గొన్నాడు.

ప్రచేతుని (వరుణుని) జల స్రావియైన గొడుగును లాగి కొన్నాడు. మందార పర్వత శృంగమగు మణి పర్వతమును హరించినాడు. మా అమ్మ దివ్యమణి కుండలముల నమృతమును గురియు వానిని కృష్ణా! యయ్యుసుర గాజేసినాడు. ఐరావతముం గోరుచున్నాడు. గోవింద వాని దుర్వినీతి యిది నీకు నివేదించితిని దీనికి బ్రతికర్తవ్యమేమో నీవ పరిశీలింప వలయును.

అనన్విని భగవంతు డగు దేవకీ తనయు డల్లన నవ్వి యింద్రుని చేయి పట్టుకొని యాసనము నుండి లేచెను. గరుడుం దలచి వచ్చిన యా పక్షిరాజు నెక్కి సత్యభామను గూడ నెక్కించు కొని ప్రాగ్జ్యోతిషమునకుం దరలెను. ఐరావత మెక్కి యమరపతి స్వర్గమునకుం జనెను. ద్వారకా వాసులు చూచుచుండ నటుపై కృష్ణుడునుం జనియె.

ప్రాగ్జ్యోతిషము నలువైపుల భూమి నూరామడ మురాసురుని చుఱకత్తుల తోడి పాశములం జుట్టు కొనబడి యుండెను. సుదర్శన చక్రమును విసరి హరి వానిని ఛేదించెను. అంతట మురుడెగయ వానిం దునిమి వాని కొడుకుల నేడు వేలమందిని మిడుతలనట్లు చక్రధారాగ్ని దగ్ధులం గావించెను. మురాసురుని హయగ్రీవుని పంచజనునిం గూల్చి ప్రాగ్జ్యోతిష పురమునకు బరువిడెను. అక్కడ నరకుని సేనలతో శ్రీహరికి పెను కలనయ్యె. శస్త్రాస్త్ర వర్షపాతమున ముంచెత్తుతూ యా నరకుని భౌముని (భూమి కుమారుని) దైత్య చక్రంతకుడు చక్రము విసరి రెండొనరించెను. నరకుడు హతుడైనంత అదితి కుండలములం గొని భూమి జగన్నాథు సన్నిధానమునకు వచ్చి యిట్లనియె

నాథా! వరాహమూర్తివై నన్ను నీవుద్దరించి నపుడు నీ స్పర్శముచే నాకు బుట్టిన వాడీ నరకుడు. నీ కొడుకును వీనిని నీవె యిచ్చితివి. నీవె కడతేర్చితివి. ఇవిగో కుండలములు గైకొనుము. వీని సంతతిం బ్రోవుము. నా బరువుం దింప భగవంతుడ వీవు అంశావతార మెత్తితివి. ప్రసాద సుముఖుడవు గమ్ము. జగములకు నీవేకర్తవు. వికర్తవు సంహర్తవును. కారణము లయస్థానము. జగద్రూపు డవు నీవు. నిన్నేమని నుతింతును. వ్యాపించు వాడవు వ్యాపింపబడు విశ్వము క్రియయు కర్తవు కార్యమును నీవు. సర్వభూతాంత రాత్మవాగు నిన్నేమి కొనియాడుదును? పరమాత్మవు భూతాత్మవు ఆత్మవు లయ స్థానము. నిన్నున్న వాని నున్నట్లు స్తుతి సేయనెట్లు వాక్కు ప్రవర్తింప గలదు? సర్వ భూతాత్మా! దయసూపుము. ధర్మ సంస్థాపన కొఱకు నీ కొడుకు నీ చేత చంపబడెం గావున వీని తప్పిదమును క్షమింపుము అని భూదేవి స్తుతించెను.

భూత భావనుడు భగవంతుడు డట్లయని యవనిం బలికి నరకు నింటి నుండి రత్నములం దరలించు కొని కన్యాంతః పురమున గల కన్నియల పదారువేల మందిని గనెను. నాల్గు దంతములు గల శ్రేష్ఠము లయిన గజముల నారువేల కాంభోజ దేశమునకు సంబంధించిన యశ్వ రాజముల నిరువది యొక్క లక్షలను జూచెను. ఆ కన్యల నా నాగములం గురములను గోవిందుడు ద్వారకాపురి కప్పటి కప్పుడు నరక కింకరులచే జేర్పించెను. మఱియు వాని వారుణ చ్చత్రమును మణి పర్వతముం జూచి పతగరాజు గరుడుని మూపు నెక్కించి తానును సత్యభామతో నధిరోహించి అదితికి కుండలము లీయ త్రిదశాలయమగు స్వర్గముం గూర్చి యేగెను.