అయ్యాదవుడు, అక్రూరుడు, యమునావారి విష్ణుని వినుతిసేసి ధ్యానావాహన దూపదీప నైవేద్యాదులను షోడశోపచారములచే మానసిక పూజ గావించెను. ఇతర విషయముల నుండి మరలించి శ్రీకృష్ణ పరబ్రహ్మ మందు మనసు చిరకాలము నిలిపి క్రమముగా సమాధి నుండి వ్యుత్థాన మందెను. ఆ బుద్ధిశాలి తాను ధన్యుడయ్యెనని భావించి యమునా జలంబుల నుండి వెడలి తిరిగి రథము దఱికి వచ్చెను. ముందటి యట్లు రథము లండున్న బలరామ కృష్ణులం దర్శించి విస్మితనయను డయ్యెను.
“యక్రూర! యమునా తీర్థ మందేదో వింత కనినట్లున్నావు. ఇది నిజము. నీతనువాశ్చర్యముచే వికాస మొంది కనిపించు చున్నది.”
స్వామి! అచట నన్నీటిలో నేమి వింత నేను చూచితినో అది రూపుగట్టి యిచ్చట కనపడుచున్నది. కృష్ణా! ఈ విశ్వమే మహాత్ముని స్వరూపమో యట్టి పరబ్రహ్మమగు నిన్ను నేనిపుడు గలిసికొన్నాను. ఆ సంగతి కేమిగాని మనము సత్వరము మథురకు జనవలెను. నేనా కంసునికి భయపడు చున్నాను. పరపిండోప జీవుల బ్రదుకు పరమ తుచ్చము. అని వాయు వేగములైన రథాశ్వములను తొలి ప్రోద్దుగుంకు సరికాతడు మథురం జేరెను. బలరామ కృష్ణులం గని “మీరు పాదచారులై రండు. నేనొంటరిగ ఈ రథమున నగరమున ప్రవేశింతును. వసుదేవు గృహమునకు పోవలదు. కంసుడు మీ నిమిత్తముగా నా వృద్దుని గెంటివేయ గలదు” అని పలికి యతడు మథురం బ్రవేశించెను.
బలరామ కృష్ణులు రాజ వీథి కేతెంచిరి. స్త్రీ పురుషు లానందమున కనులార వారిం గాంచిరి. మదపుటేనుగు గున్నలట్లు ఒయ్యారముగ నడచుచు నట్టటు పరిభ్రమించుచు రంగాలంకరణము సేయు నొక్క చాకలిం గని వారు వాని చేనున్న చక్కని రాజోచిత వస్త్రములను మాకిమ్మని యడిగిరి. కంసరాజు దివాణపు చాకలి యగుట గర్వపడిన వాడై వారి నాక్షేపించుచు నేకసక్కము లాడుచు బిగ్గరగా నరచెను. కృష్ణుడు రోషము గొని యరచేతను గొట్టి వాని తల నేలం బడవేసెను. అవ్వల నీలపీతాంబర ధారులా యన్నదమ్ము లిద్దరూ నమ్మడుగులం దాల్చి మరియును నా రాచబాట మాలాకారు నింటికిం జనిరి. అతడా ముద్దు కుమారులం గాంచి కనుంగవ విప్పార చూచి మిక్కిలి వింతపడి మైత్రేయా! వీరేవ్వరి వారిటకు వచ్చిరని యాలోచించెను.
ఆ నలుపు తెలుపు వలువలుం దాల్చి ముచ్చట గొల్పు నా సుకుమార కుమారులంగని యవనికి దిగి వచ్చిన దేవతలేమో యని వాడు తలచెను. వారును మోము దామరలు వికసింప ఈ పువ్వులు తమకిమ్మని యడిగిరి. అతడు వారిదరి వ్రాలి పుడమిం జేతుల నానించి శిరస్సు ధరణిందాక పరమ ప్రసన్న మూర్తులు నాపాలి ప్రభువులు నా యింటికి దయ సేసినారు. ధన్యుడను. ఇదే యర్చించెదను అని హృష్ట ముఖుడై ఇంతకంటె నివి మంచివి! ఇవి గైకొనుండని వారిని మురిపించి ఊరించుచు వారు మనసు వడిన చక్కని పూవులం గాన్క పెట్టెను. మఱిమరల నయ్యిద్దరకుం బ్రణమిల్లి యా మాలాకారుడు ఆ పురుషోత్తములకు సువాసనలు మించు మంచి పూలెంచి యిచ్చె. అంతట హరి వాని యెడ ప్రసన్నుడై ఎప్పుడు నాతోనుండు మహాలక్ష్మీ నిన్నెపుడును బాయకుండు గాక! మంచివాడవు. బలహాని ధనహాని నీకు కలుగదు. నీ సంతతి వారు పూర్నాయుష్మంతు లగుదురు. ఇహమున మహాభోగము లనుభవించి నా యనుగ్రహమున నా యనుస్మరణము నొంది దివ్య లోకమును బొందుదువు. ఓ భద్రుడా! నీ మనసేవేళ ధర్మము నందు నిలుచును. నీ సంతతి కలకాలము సుఖముండును. సూర్యుడున్నంత కాలము నీ సంతానము కెట్టి యుపద్రవములుం గలుగవు.
అని యా మాలాకారునిం గరుణించి బలదేవునితో వాని పూజ లందుకొని వాని ఇల్లు వెడలెను.
Summary of chapter 19 of the Vishnu Mahā Purāṇa is as follows:
Akrūra performs an elaborate mānasa pūjā (mental worship) of Bhagavān before entering the city. The party enters Mathurā to the wonder of the citizens. Kṛṣṇa encounters an arrogant washerman who refuses to give fine royal garments and strikes him dead. He then meets Sudarśana the Mālākāra (garland-maker), whose simple and wholehearted welcome is rewarded with generous boons.