విష్ణు మహా పురాణము

15 - కృష్ణావతార ప్రసంగము

హిరణ్యకశిపుడుగా రావణుడుగాపుట్టి విష్ణువు చేత గూలి దేవతలు గూడ పొందనలవి గాని భోగములను బడెసెను. కాని భగవంతునిలో లయము నందలేదు. ఆ హరి చేతనే యతడు శిశుపాలుడుగా హతుడై శాశ్వతుడైన హరితో సాయుజ్యము నెట్లు గాంచెను. ఈ వివరము విన నాకు గుతూహలమగు చున్నది.

దైత్యేశ్వరుడగు హిరణ్యకశిపుని జంపుట కొఱకు మున్ను భగవంతునిచే నృసింహావతారము ప్రకటింప బడినది. అత్తరి హిరణ్యకశిపుని మనసులో నీతడు విష్ణువన తలంపు గలుగ లేదు. నిరతిశయ పుణ్యముచే నావిర్భావించిన జంతువిదియను నూహ కలుగ తన యుద్రేకముచే బ్రేరేపింప బడిన ఏకాగ్రమైన మతికలవాడై యా విధమైన భావన చేసి (ఆ భావనా రూప యోగముచే) నా నర మృగాకారముచే నైన మరణముచే నిరతి శయమైన సకల త్రైలోక్యమును మించిన యాదిక్యమును గూర్చు భోగ సంపదను రావణుడుగా బుట్టి యనుభవించెను. అంతియ కాని అనాది నిధనము కేవలము పరబ్రహ్మము నిరాలంబమునైన భగవత్తత్వ మిదియని భావన సేసి యందు మనస్సు యొక్క లయమును బొందలేదు. రావణుడయి పుట్టినపుడు గూడ యిట్లే కామవశుడగుటచే జానకి యందంటిన మనస్సుచే దశరథ కుమార రూపము ధరించిన రామచంద్ర పరమాత్మ రూప భగవంతునిచే హతుడైన తఱి వానికి రాముడే కనిపించెను గాని యితడచ్యుతుడను భావన కలుగ లేదు. చనిపోవునెడ వాని యంతః కరణ మందు రాముడు కేవలము మనుష్యుడను భావనయే కలిగెను. అవ్వలనో అచ్యుతుని చేతిలో నీల్గుట మాత్రమె ఫలముగా గలది చేదిరాజకుల మందు శిశుపాలుడై యఖిల భూవలయుము మెచ్చున వ్యాహతైశ్వర్యమైన జన్మ మందెను.

ఆ పుట్టువు నందు ఆతడు సర్వ భగవన్నమములను త్వంకరించుటకు కారణమయ్యెను. (త్వంకరించుటయనగా నీవు నీవని తృణీకరించుట యన్నమాట) అందుచే తత్కాలముగా నొనరించిన యా పేర్లన్నిటి యందు నిరంతరము పెక్కు జన్మము లందు పెంచుకొనిన విద్వేషముతో నుడివడిన చిత్తము గలవాడై నిదించుట బెదరించుట మొదలగు వానియందా భగవన్నా మోచ్చరణము సేసెను. మఱియు విప్పారిన తామర పూరేకుల వంటి కన్నులు మెరుగారు పీతాంబరము దాల్చినది అమల కీరిట కేయూర హార కటకాది శోభితము ఉదార చతుర్భాహు శంఖ చక్ర గదాదారమునైన యా పరమ సుందర రూపము ప్రగాడ వైరాను భావముచే నట్టిటు తిరుగాడు నపుడు స్నాన భోజనాసనశయనాది సర్వావస్థల యందును వీని చిత్తమింకొక తెరుపునకు బోదయ్యే. అందుచే ఆక్రోశము (ఆక్షేప వచనము) లందు ఆ విష్ణు నామములనే ఉచ్చరించుచు నాతనిని హృదయ మందవధరించుచు తన చావునకు భగవంతుని హస్తమందలి చక్రాయుధము యొక్క కిరణ మాలికలచే నుజ్జ్వలమైన అక్షయ తేజస్స్వరూపము గల ద్వేషాది దోష దూరమునైన యా కేవల పరబ్రహ్మ రూపమును దర్శించు చున్నంతట నా భగవంతుని చక్రముచే హతుండయ్యె. తదను స్మరణమున నఘసంచయమెల్ల దగ్ధమై భగవంతునిచే నంతమొందింపబడ యా తత్త్వమందే లయ మందెను. ఇది యెల్ల నీ కేను దెల్పితిని.

ఈ భగవంతుడు పగనైన కీర్తింపబడి స్మరింపబడి యఖిల సురాసురాది దుర్లభమైన ఫలము నిచ్చును. మంచి భక్తి సంపన్నుల మాట వేరే చెప్పవలెనా? వసుదేవునికి (ఆనక దుందుభికి) పౌరవి రోహిణి మదిర భద్ర దేవకీ మొదలయిన పెక్కుమంది భార్యలుండిరి. అతడు భద్రశఠసారణ దుర్మదాదులం దనయులను రోహిణి యందు గనెను. బలరాముడు రేవతి యందు విశఠుడు ఉల్ముకుడు ననునిద్దరు కుమారులం గనియె. సాష్టీ మాష్టి శిశు సత్యధృతి ప్రముఖులు సారణుని కొడుకులు. భద్రాశ్వ భద్రబాహు దుర్దమభూతాదులు రోహిణీ కులజులు నంద ఉపనంద కృతకాదులు మదిర యొక్క తనయులు. ఉపనిది గదాదులు భద్రా సంతానము. వైశాలి యందు కౌశికు నొక్కనినే కనెను. ఆనకదుందుభికి దేవకీ యందు కూడా కీర్తింమంతుడు సుషేణుడు ఉదాయువు భద్రసేనుడు ఋజుదాస భద్రదేవుడు నను నార్వురు పుత్రులు గల్గిరి. వారి నందరను కంసుడు సంహరించెను.

అటుపై సప్తమ గర్భమున అర్థరాత్రి భగవంతుడంప యోగనిద్ర రోహిణి యుదర మాకర్షించి గొంపోయెను. కర్షణ మొనరించుట వలన నీ శిశువు సంకర్షణుడను పేరొందెను. అవ్వల సకల జగన్మహా తరువునకు మొదలు, భూత భవిష్యదాది సకల సురాసురమునిజన మానసముల కేని యగోచరుడు బ్రహ్మాదులగు నగ్నిముఖులచే (దేవతలచే) ప్రణమిల్లి యవని భారము దింప ప్రసన్నత నొందింప బడిన భగవాను డనాదిమధ్య నిధనుడు హరి వాసుదేవుడు దేవకీ గర్భము నవతరించెను. ఆ దేవు ననుగ్రహముచే దినదినాభివర్ధమాన మహిమ గల యోగ నిద్ర నన్దగోపుని పత్నియగు యశోద గర్భము నందునికి సేసెను.

ఆ పుండరీకాక్షుడు అవతరించు చుండగా సూర్య చంద్రాది గ్రహములు సుప్రసన్నము లాయెను. వ్యాళాది భయరహితమై మనసు స్వస్థమై యెల్లజగ మధర్మ దూరమై యుండెను. పుట్టిన క్షణమయాప్రభు వీయెల్ల విశ్వమును సన్మార్గవర్తిగ నొనరించెను. ఈ మానవ లోకమందవతరించిన భగవంతున కిక్కడ పదునాఱు వేల నూరోక్క మంది భార్యలుండిరి. వారిలో రుక్మిణీ, సత్యభామ, జాంబవతి, చారుహాసిని మొదలగు వారెనమండుగురు ప్రధాన భార్యలు. అఖిల మూర్తి యానాదియునగు నా దేవుడు వారియందు ఒక లక్ష ఎనబది వేల మంది పుత్రులం గనియె. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబాది కుమారులు పదుమువ్వురు ముఖ్యులు. ప్రద్యుమ్నుడు రుక్మి కుమార్తెను రుక్మవతిం బెండ్లాడెను. ఆమెయం దనిరుద్దు డుదయించెను. అనిరుద్ధుడు రుక్మి పౌత్రిని సుభద్రను పెండ్లాడెను. ఆమె యందతనికి వజ్రుడు దయించెను. వజ్రునికి ప్రతిబాహువు అతనికి సుచారువుం కల్గిరి. ఇట్లనేక శతసహస్ర పురుష సంఖ్యాక మీ యదుకుల హరివంశ విస్తరము నూరేండ్లకైన వర్ణింప నలవి గాదు. ఈ క్రింది శ్లోకములీ విషయములో జరితార్థములు వీని భావము. హరి కుమారులకు ధనుర్విద్యను శిక్షించుటకు నియుక్తులైన చాపాచార్యులు మూడుకోట్ల యెనుబదియెనిమిది వేల మంది గలరు. మహాత్ములగు యాదవుల నెవరు లెక్కింప గలరు? అనేక లక్షల కొలది గలరు. ఆహుకుడను వాడెల్లపుడు యదురాజు. దేవాసుర యుద్దమందు చనిపోయిన మహాబలవంతులగు దైత్యులు మనుష్యులందు జనోపద్రవకారులై పుట్టురి. వారిని తుదముట్టించుటకీ భూలోకమున దేవతలు యదుకులమున జన్మించిరి. ఆ వంశములు నూటొక్కటి (నూరుకు మించి) యున్నవి. వాని కార్య నిర్ణయము నందు ప్రభుత్వ మందు (రక్షణ మందు) పూనిక గొని విష్ణువు నిల్చినాడు. ఆయన యాజ్ఞయందుండి యాదవులందరు వృద్ధి పొందిరి. వృష్ణుల ఈ సంతతి నెవ్వడు విను నాతడు సర్వ పాప విముక్తుడై విష్ణులోకమందును.