ఇట్లా దేవీ దేవతలచే స్తుతింప బడినదై తన గర్భమున సర్వ జగత్త్రాణ కారణమైన పుండరీకాక్షుని ధరించెను. అఖిల భువన పద్మ బోధనము కొఱకు మహాత్ముడు విష్ణుభానువు దేవకీరూప పూర్వాసంధ్య యందావిర్భవించెను. ఆ పుట్టిన రోజు విమలమైన దిశాముఖములు గలదియునై చంద్రుని కౌముది (వెన్నెల) వలె సర్వ లోకమున కత్యంతాహ్లాదకర మైనది జనార్ధను డావిర్భావించిన యెడ సత్పురుషులు మిగుల సంతోషమును ప్రచండ వాయువులు ప్రశమమును, నదులు ప్రసన్నతను బొందినవి. సముద్రములు తమ శబ్ధముచే మనోహర మంగళ వాద్యములను మేళవించెను. గంధర్వ రాజులు గానములు సేసిరి. అప్సరో గణములు నాట్యములు సేసెను. వేల్పు లంతరిక్ష మందుండి పూల వానలం గురిపించిరి. జగన్నాథు డవతరింప అగ్నులు శాంతముగ దక్షిణావర్త జ్వాలలచే దీపించెను. మేఘములు మందీమందముగ నురిమెను. మఱియు నవి పూలవాన గురిసినవి. జనార్దనుం డర్ధరాత్రము నందుదయించెను. వికసించిన నల్లతామర పూవు వంటి నిగనిగలాడు మేని కాంతితో నలుచేతులలో శ్రీవత్స చిహ్నముతో నుదయించిన యామూర్తిం జూచి వసుదేవుడు ప్రసాద గుణభరితము లయిన వచనములచే స్తుతించి కంసుని వలని జడుపుతో నయ్యెడ నిట్లని విన్నవించెను.
ఓ దేవదేవ ప్రభూ! నీవు జన్మించితివి. అనుగ్రహము సేసి యీ నీ దివ్య రూపమును శంఖ చక్ర గదా ధారియైన మూర్తిని ఉపసంహరింపుము. నా నివసమున నీవు అవతరించి నట్లు విని యీ కంసుడీ క్షణము నాకు ఘాతసేయును.
అనంతరూపుడు అఖిల విశ్వ స్వరూపుడునై తనలో సర్వ లోకములం దాల్చునట్టి దేవదేవుడు మాయచే నియ్యేడ బాలక మూర్తియై యున్న స్వామి ప్రసన్నుడవు గాక! ఓ సర్వాత్మక! నాల్గు భుజములతో నున్న యీ రూపమును మఱుగు పఱపుము. దైత్యుడై పుట్టిన యీ కంసుడు నీవు అవతరించినావని యెఱుంగ కుండుగాక!
‘పుత్రుం గోరి మున్ను నీవు నన్ను స్తుతించితివి. అది యిప్పుడు ఫలించినది. నీ కడుపున నేను జన్మించితిని’ అని భగవంతు డూరకున్నంత
వాసుదేవుండా శిశువు నెత్తికొని వెలికిం జనియె. కారాగార రక్షకుల య్యెడ యోగానిద్రచే మొహమున బడిరి. మధురా నగర ద్వారపాలురు గూడ వసుదేవు డేగుచుండ మాయా మోహ వశులైరి. నడిరేయి మేఘములు పెనువాన గురియు చుండ యమునా నది విష్ణువు నెత్తికొని వసుదేవుడు దన్ను దాటుతఱి మోకాలి లోతై తోచెను. ఆ నదీ తటము నందు కంసునికి పన్నులు గట్టనేతెంచి విడిది చేసిన నందాది గోపా వృద్దులను వసుదేవుడు చూచెను. ఆ సమయమందు యశోద యోగానిద్రచే మైమరచి నిద్రపోవ నయ్యింట పరిజనమును నొడలెరుంగకున్న వేళ నా కన్యకం గాంచెను. వసుదేవుడు బాలుడిని యశోద ప్రక్కనుంచి యామె శయ్యపై నుండి యా బాలిక నెత్తుకొని తిఱిగి వేగముగా వచ్చెను. యశోద మేల్కొని తనకు నీలోత్పల దళశ్యాముడు కొడుకు పెట్టెనని యా శిశువుం జూచి మురిసి పోయెను. వసుదేవుడా పిల్లం గొని తన యిరువున కేతెంచి దేవకి ప్రక్కలో
నుంచి ముందటి యట్ల యుండెను.
అవ్వల కారాగార రక్షకులు పిల్ల ఏడుపు విని తొట్రుపడి లేచి దేవకి ప్రసవించినదని కంసునుకి నివేదించిరి. కంసుడు వెంటనే వచ్చి యీ బాలికం బట్టికొని దేవకి విడువు విడువు మని నిరుద్ధ కంఠయై నివారింపగా నతనొక రాతిపై విసరి కొట్టినంత నా శిశువు మీది కెగిరి ఆయుధములతో గూడిన యెనిమిది భుజముల తోడి రూపముంగొనిన బిగ్గరగ నవ్వి కోపోగ్రయై కంసునితో ఓరి! కంసా! నన్ను విసరివైచి నంత నేమయ్యె? నిన్ను వధింప గలవాడు దేవతల సర్వభాగ్యాధి దేవత యతడింత మున్ను పుట్టినాడు. ఈ యంశము బుద్దినిడికొని నీకు హితమట్ల సేయుము అని పలికి దివ్యకుసుమ మాలధారిణి యగు నా దేవి భోజరాజు గనుగొను చుండగనే సిద్దులు స్తుతించు చుండ గగన మార్గమునం జనెను.
Summary of chapter 3 of the Vishnu Mahā Purāṇa is as follows:
Bhagavān is born in four-armed form in Devakī's prison chamber at midnight. Vasudeva, impelled by divine inspiration, carries the infant across the flooded Yamunā under Ādiśeṣa's expanded hoods as a sheltering canopy. He exchanges the infant with the newborn daughter of Yaśodā and Nanda in Gokula. Yogamāyā, placed in Yaśodā's arms, declares to Kaṃsa that his destroyer has already been born elsewhere, then vanishes. Devakī and Vasudeva are freed from their shackles.