విష్ణు మహా పురాణము

34 - పౌండ్రక వాసుదేవ వధ

శౌరి మానుష మూర్తియై యద్భుత మయిన మహాకార్యము లెన్నో కావించెను. లీలా మాత్రముగ నింద్రుని పరమేశ్వరుం దేవతలను మఱియేమియు వమ్మొనరించె నాయా లీలల నింకను విన ముచ్చట యగుచున్నది. కావున నో మహానుభావా! వానినాన తిమ్మన.

కృష్ణుడు నరావతారమెత్తి కాశీనగరముం గాల్చెను. ఆ కథ తెల్పెద వినుము అజ్ఞాన మోహితులగు జనులు నీవు వాసుదేవుడవే భువినవతరించి నావన పౌండ్రకుడు (పుండ్రదేశ ప్రభువు) వాసుదేవుడనే యిలపై నవతరించితినని జన్మాంతర స్మృతికోలుపోయిన యా పౌండ్రకుడు విష్ణు చిహ్నము లన్నియుం జేయించుకొని కృష్ణునికి ప్రతిగా వానిం ధరించెను.

అంతియ కాక మహాత్ముడగు కృష్ణుని దగ్గరకు ఓ మూఢా! నీవు బ్రతుకదలతు వేని విష్ణుని గుర్తులు చక్రాది చిహ్నములు విడిచి వాసుదేవుడను నా పేరును వదలి నా కడకు వచ్చి వ్రాలుమని యోక దూతను బంపెను. ఇది విని హరి దూతం గని యల్లన నవ్వి నీ చిహ్నమును నీపై విసర బోవుచున్నానని పౌండ్రకునకు జెప్పుము. నీ మాట లోని భావము తెలిసినది, ఏది సేయనగు నది సేయుము. ఆయా చిహ్నములు వేషము వేసికొనియే నీ పురమున కేతెంతును. నిజ చిహ్నము చక్రమును వదలెదను. సంశయము లేదు. రమ్మని నన్నాజ్ఞా పూర్వముగా నున్న నీ మాటను రేపే నీ కప్పగించెదను. నిముశ మాగను. ఓ రాజా నీ వలన భయమే మాత్రము లేకుండు గాక! ఇదే వచ్చి నిన్ను శరణు జొచ్చెదనని తెలుపమని దూతం బంపి హరి తలంచి నంతన నరుదెంచిన గరుత్మంతునిపై నెక్కి పౌండ్రక నగరమునకుం జనియె.

కాశీపతి హరియుద్దోద్యోగ వార్త విని సర్వ సైన్యముతో స్వామి పైకి ద్రొక్కికొని వచ్చెను. వానితో గూడి పౌండ్రకుడు వాసుదేవుని కెదురు నడచెను. చక్కని యాదరము ననున్న వానిని దూరము నుండియ చూచెను. చేతం జక్రము గద శార్ఙ్గము పద్మముం బూని వనమాల ధరించి కిరీట కుండలములు దాల్చి గరుడ చిహ్నితమైన జెండా తోడి వక్షః స్థలము నందు శ్రీవత్స చిహ్నమును రచించు కొనిన వానిని నానారత్నా లంకృతుండై పీతాంబర దారియగు వాని జూచి భావ గంభీరముగ నవ్వెను. నానావిధాయుధ శాలియైన వానితో తీవ్ర యుద్దమునుం గావించెను. శార్ఙ్గధనుర్వియుక్త శరజాలముల గదా చక్ర నిపాతనములను క్షణములో వాని సేనలం గూల్చెను. కాశీరాజు సైన్యమునుం గూల్చి జనార్ధనుడు తన చిహ్నములం జేయించి పెట్టుకొని మూర్ఖుని పౌండ్రకునిం గని యిట్లనియె

పౌండ్రకా! దూత ముఖమున నన్ను గూర్చి నీ శార్ఙ్గచక్ర గదాది చిహ్నముల వదలు మన్న నీ మాట అక్షరాల పాటించెదను. ఇదిగో చక్రమును వదలితిని. ఇది గద వీడితిని. ఇడుగో గరుత్మంతునిం గూడ వడలు చున్నాను. నీ ధ్వజముపై నెక్కు గాక!

అని పలికి వదలిన చక్రాయుధముచే వాడు చీల్చబడెను. గదచే దెబ్బకు కూల్చ బడెను. గరుడునిచే ధ్వజము విరిగి పడెను. ఆవల లోకము హాహాకార మొనరింప కార మొనరింప కాశీరాజు మిత్రునిపై మక్కువతో వాసుదేవునితో బోరెను. శార్ఙ్గధనుర్విముక్త బాణములచే గొట్టి లోకము వెఱగువడ వానిం గాశీపురం బడునట్లు విసరి వైచెను. శౌరి పౌండ్రకుని కాశిఱేనిని సపరివారముగ జంపి తిరిగి ద్వారవతిం జేరి స్వర్గధామ మందట్లు దాను గ్రీడించెను.

ఆ పడిన కాశీరాజు తలంగని ఏమిది? ఎవ్వడిది నరకెనని వింతపడి వాసుదేవునిచే వాడీల్గుట విని వాని కొడుకు పురోహితునితో గూడ శంకరుం బూజించి సంతుష్టు నొనరించెను. అవిముక్తమను నమ్మహాక్షేత్రమున వానిచే సంతుష్టి నొందిన శంకరుడు వరము గోరుకొమ్మనియె. అతడు నా తండ్రిం జంపిన వాని జంపుటకు నీ అనుగ్రహముచే కృత్యయను శక్తి విజృంభించుగాతమనియె.

అట్లయగు లెమ్మని శూలియనిన క్షణమున దక్షిణాగ్ని నుండి మహాకృత్య యను శక్తి వాని నాశమునకే జ్వాలాకారాళమైన ముఖముతో నగ్ని శిఖలట్లున్న జుట్టుతో పుర్రెల మాలతో కృష్ణ! కృష్ణ! అనుచు కోపముతో ద్వారవతికిం జనెను.

ఆమెంగని ద్వారకా జనము భయపడి కన్నులు గిఱ్ఱునం దిఱుగ సర్వ జగచ్చరణ్యుడగు మధు సూదనుని శరణొందెను.

కాశీరాజు కొడుకు వృషభ వాహనునిం గొల్చి యీ శక్తినుత్పాదింప జేసినాడని గమనించి పాచిక లాటలో నున్న హరి ఈ ఉగ్రశక్తిం గృత్యను వహ్నిజ్వాలా జటిలమైన యాకారము గలదానిం గూల్పుమని లీలా మాత్రముగ సుదర్శనమును వదలనది అగ్ని మాలా జటిలముగ జ్వాలలం గ్రక్కుచున్న మహాభీషణ మైన కృత్యను వెన్ధరిమెను. చక్ర ప్రతాపమున ప్రతిహత ప్రభావయై యా మహేశ్వరీ శక్తి బెండువడి పరుగిడి వారాణసీ పురమునే ప్రవేశించెను. చక్రాయుధము దానిని వెంబడించి తఱిమెను. అంతట కాశీసైన్యము ప్రమథ గణ సేనలు సమస్త శస్త్రాస్త్ర సంయుతముగ చక్రమున కెదురు నడిచెను. సుదర్శనము విజృంభించి కొండలతో గుట్టలతో గజములతో గుఱ్ఱములతో భటులతోడి దానిని అశేష గోష్ఠికోశాగారాదులతో దేవతలకేసి దేరిపార చూడరాని యా కాశీపురిని అశేష గృహ ప్రాకార చాత్వరములను జ్వాలలతో నలుదెసలం గ్రమ్మి పురమెల్ల దహించి వైచెను. అంతకునుం జల్లారని యాగ్రహముతో నత్యుగ్రమైన హరి చక్రాయుధము ఇంకను సాధింప వలసిన పని సాధనము లేమని యను కొనుచునే యత్యద్భుత దీప్తితో విష్ణువు కరమున కేతెంచెను.