ఒక తఱి మధువైరి బండి క్రింద పరుండి చిఱుపాదము లెత్తి పాలకై ఏడ్పు పెట్టెను. అతని కాలితాపున నా తలక్రిందులు పడి దరినున్న పాల కడవలు పగిలి యెగిరి పడెను. అంతట గోప గోపీజనము హాహాకార మొనరించుచు వచ్చి వెల్లగిల పరున్న చిన్ని కృష్ణుని జూచిరి. గోపకులారా! ఎవనిచే నీ బండి తలక్రిందు పడినది? అనుచు వారునటనున్న పిల్లలీ పిల్లవాని చేనిది పడగొట్ట బడిన దనిరి. ఏడ్చుచు వీడు కాలాడించి నంతట దిరిగి వడి కూలి పడెనిది యింకొకని చేతగాదనిరి. అంతట గోపు లత్యాశ్చర్య మతులైరి. నందగోపుడును మిక్కిలి యక్కజమున నా చక్కని పాపనెత్తి కొనెను. యశోదయు బండిపై నెక్కించిన కుండ లోటువడి చెదరి పడిన పాలికలను బండిని పెరుగు పూలు అక్షతలు మొదలగు వానిచే బూజసేసిరి.
వసుదేవు పనుపున జ్ఞాననిధి గర్గాచార్యుడు వ్రేపల్లెకు వచ్చి దాబ్రకటించు కొనకయు యా బలరామ కృష్ణులకు నామ కరణాది సంస్కారములను జరిపించెను. పెద్దవానిని రాముడని పిన్నవానిని కృష్ణుడనియుం బేర్కొనెను. అల్పకాలముననే వారిద్దరు నా పల్లెలో మోకాళ్ళు చేతులు నవనిపై దాకించుచుం బాకుచు నొడలికిం గోమయ భస్మముం బూసికోనుచు నిట్టట్టు పరువులు వారుచునుండ యశోద రోహిణియును వారిం బట్టజాలలైరి. ఆవుల దొడ్డిలో నాటలాడుచు నాడుచునే నా దూడల మందకుఱికి వాని తోకలం బట్టికొని దూకుచు వినోదము గొల్పుచుండిరి. ఒక తఱి యన్నా దమ్ములొక్కటై యొక్కచో నాటలాడుచు గంతులు వేయుచుండ వారిని వారింప వశము గాక యశోదయొక తఱి నెట్లో పట్టుబడిన కృష్ణుడి బొజ్జకుం ద్రాడుచుట్టి ఱోటికిం గట్టి వైచెను. కోపముతో నితనిం గూర్చి యిట్లనియె
ఓ అల్లరి పిల్లవాడ! ఏదీ! చేతనైన కదలి వెళ్ళుమని యానవెట్టి బెదరించి తన యింటి పనులం జూచుకోను చుండెను. ఆ తొందరలో నామె యుండుటగని యా పాపడు రెండు మద్దిచెట్ల నడుమ నుండి నా ఱోలీడ్చుకొనుచు బోయి యయ్యిరుకు సందున నడియడ్డము దిఱుగ నా బాలుడు లాగినంత నా మహావృక్షములు విఱిగిపడె. అయ్యెడ నాకటకటా శబ్దమాలించి వ్రేపల్లె జనమేతేంచి యా పెనుమ్రాకులం దిలకించిరి. వచ్చియురాని లేత పలువరుస తెలికాంతుల మిగుల నచ్చమయిన చిఱునవ్వులు గులుక నా తరువులు రెండిటి నడుమ బొజ్జకుం బెనుత్రాటం గట్టబడిన ఱోలితో నున్న బాలకృష్ణునిం గాంచిరి. అమ్మ దామమున త్రాటం గడుపునకు ఱోలు గట్టుట నా పాపడు దామోదరుడను పేర్వడసెను.
నందాది గోప వృద్దులేపల్లియం గలుగు నుత్పాతముల కడలి యిక్కడ మనము నివసింపరాదు. వనమునకుం బోదము. గాలి లేకుండనే యిమ్మహా వృక్షములు గూలినవి. పూతనా వినాశము శకటము తిఱుగుడు వడుట మొదలగు భయంకర సంఘటన లయినవి వెంటనే మనమిట నుండి కదలి బృందావనమునకు బోదము. ఈ భౌమోత్పాత దోషము తొలగు నందాక యట నుందుము. అని నిశ్చయించి వ్రజవాసులెల్లరు లెండులెండు వెనువెంటనే పోవలయునని తమ వారలకు హెచ్చరికలు సేసి యా క్షణమే మందలతో నాలకాపరు లొండొరులం బిలిచికొని యటువోయిరి. క్షణములో బండలపై సామగ్రితో నెక్కి గోధనములతో దరలినంత నా వ్రేపల్లె శూన్యమై కాకులు గ్రద్దలకు నిలయమై శోభ తొరంగెను.
శ్రీకృష్ణ భగవానుడు గోవుల పెంపుగోరు శుభ సంకల్పముతో బృందావనముం దలంచు కొనెను. అందుచే నా ప్రాంతమంతయు మిక్కిలి తీవ్రమైన గ్రీష్మకాల మందును వర్షర్తువు నందువలె పచ్చని లే పచ్చిక మొలచెను. సర్వగోకుల రూపయి నా దొడ్డిలో బండ్లను విప్పి అర్ధచంద్రాకారముగ నేర్పఱచు కొన్న హద్దునందు విడిది సేసిరి. అయ్యెడ బలరామ కృష్ణులాల కాపరులైరి. ఇద్దరుం గూడి యయ్యావుల మందలో బాలలీలల న్విహరింప జొచ్చిరి. నెమలి పించెములం శిరములం జెరవికొని వన్యము లగు పువ్వులను జుట్టులం దురుముకొని తోడి గోపాలురు లేగలంగాయుటకు జేకొన్న వేణు ఖండమ్ములచే తను బత్రవాద్యముల చేతను (కొబ్బరియాకులు మొదలయిన వాని చేనయిన బూరాల చేతను) తాళ లయానుగుణ మేళనంబు గావింప కాకపక్షధరులై (తల నిరువైపుల వ్రేలాడు జునపాలతో ముచ్చట గొలుపుచు) అగ్నికుదయించిన కుమారులట్లు అగ్నియందు నిక్షిప్తమైన శివ వీర్యమున నుదయించిన స్కందస్వామి యంశావతార మూర్తులయిన శాఖ విశాఖలను కుమారులట్ల బలరామ కృష్ణులా బృందావన మందల్లన నవ్వుచుం గేరింతలు కొట్టుచు నవ్వన మందాటలు మఱిగి తిరుగాడం జొచ్చిరి. ఏడేండ్ల యీడువారై యమ్మహా వ్రజమందా సర్వజగత్పరి పాలకులు గోవత్స పరిపాలకులైరి.
ఆకసమలముకొన్న మబ్బులతో మిన్ను మన్నేకము గావించు వర్షధారలతో వర్షర్తువు వచ్చెను. పచ్చని లేబచ్చికలతో నింద్ర గోపములతో (ఆర్ద్ర పురుగులతో) వసుమతి నడునడుమ పద్మరాగ మణులు దాపిన మరకత మాణిక్య మయమై (పచ్చలతో నిండినదై) నటుల ముచ్చట గొల్పు చుండెను. నదులు వఱదలంగొని కట్టలు తెంచుకొని పరవళ్ళు ద్రొక్కుచు నడిమంత్రపు సిరుల మిడిసిపడు సవినయ శీలుర మనస్సులట్లు దుందుడుకుం గొని పారం జొచ్చెను. అచ్చ తెల్లని చందమామ నల్లని మబ్బుల చాటునం బడి మూర్ఖుల ప్రగల్భోక్తుల చేత సద్వాదుల వాడమట్లు వెలవెలబోయెను. వివేకము లేని రాజు చేతిలోని విల్లటుల గుణ హీనమై పనికి మాలినదై (శ్లేష) (గుణము = నారి ఎక్కిడినది గాని) ఇంద్రధనస్సు నింగినిందిర వొందెను. నల్లని మబ్బుల వెనుక తెల్లని బెగ్గురు పక్షుల వరుస కులభ్రష్టుని యెడ శిష్టాచార వంశుడు చేసిన శోభనచర్య యలా (ప్రాయశ్చిత్త క్రియవలె) విరాజిల్లెను. మెఱపు మిక్కిలి చపలమై యుత్తమ పురుషుని యెడ నపాత్రుడు చూపిన మైత్రివలె నాకసమందు నిలుకడ గోన జాలడయ్యె. గడ్డి గాదముల గ్రమ్ముకొని బాటలు పెడయర్ధముల నిచ్చు మూర్ఖుల మాటలట్లు తెలియ రావయ్యెను. నెమళ్ళు సారంగములు (బెగ్గురు పక్షులు) మిక్కిలి మదమును ముదముంగొను నా వానకారున నా బృందావనమున బలరామకృష్ణు లానందభరితులై గోపాలురతో సంచరించిరి. ఒక్కతఱి కడిమి పూలమాలల వింతగులుకుచు నొకప్పుడు నెమలి పించముల సొంపుగొని మఱియొక వేళ గైరికాది ధాతువుల నంగరాగములుగ బూసికొనియు నాకులసెజ్జ లందొక వేళ నిద్రవోవుచు నొక్కయెడ మేఘములు బిట్టురుమగ హాహాకారము లోనరించుచు నట్టిట్లు పరువు లిడుచు తోడి గోపకులు పాటలు పాడుచుండ బాగుబాగని యభినందనములు సేయుచు నెమళ్ళుల కేకారవముల ననుసరించుచు పిల్లన గ్రోవులూదుచు నిటుల పలుపోకలు బాలచేష్టల నానంద వివశులై మనసు లెంతేని తుష్టి నంద నా సుందర బృందావనము నందా గోప సుందరుల లన్నాదమ్ములింపు గుల్కుచుం గ్రీడించిరి. ఇట్లు విహరించి సంజెవేళ గోవులతో గోపా బృందముల్తో మహాబలులు రామకృష్ణులు పల్లియకుం జనుదెంచి యీడు జోడైన గోపకులతో నాటలాడుచు దేవకుమారు లద్భుతప్రభ నా వ్రజవాటము నందు వసించిరి.
Summary of chapter 6 of the Vishnu Mahā Purāṇa is as follows:
Śakaṭāsura (the cart-demon) is overturned by the infant Kṛṣṇa kicking with his feet. Garga Muni secretly visits Gokula at Vasudeva's request and names the two boys Rāma and Kṛṣṇa. The Dāmodara episode occurs: Yaśodā ties Kṛṣṇa to the mortar as punishment for breaking a pot of curd; Kṛṣṇa drags the mortar between two arjuna trees, uprooting them and releasing the two sons of Kubera who were cursed to be trees. The community moves to Bṛndāvana. Lyrical seasonal descriptions with philosophical commentary are given. By seven years of age, Kṛṣṇa and Balarāma graduate from calf-herding to gopāla (cattle-herder) duties.