ఇంద్రుండరుగ గోపాలురు సర్వప్రాణి సుఖకారియైన కృష్ణుంగని ప్రీతితో నిట్లనిరి. స్వామీ! మహాభాగా! (మహాభాగుడు = కీర్తిమంతుడు, భాగ్యవంతుడు, పవిత్రుడు) గోవర్ధన గిరి నెత్తి మమ్ములను బెద్ద భయము నుండి రక్షించితివి. ఈ బాల క్రీడ అసామాన్యమయినది. నీకీ గోపాలకత్వము జుగుప్సితము, నీ చేష్టితము దివ్యము. ఇదేమో తండ్రీ! మాకు దేల్పుము! మడువునం గాళీయుడు దమితుడయ్యె. ధేనుకుడు గూల్పబడె. గోవర్ధన మెత్తబడె. మా మనసులు శంకాకులము లగుచున్నవి. నీ పాదములు తోడుగనో అపార విక్రమ! నిజము నిజము. శపథము సేయుచున్నాము. నీ ప్రభావము (వీర్యము = తేజస్సు, పరాక్రమము) నున్న దున్నట్టుగని మేము నిన్ను నరునిగా తలంపము. ఆబాల గోపాలము స్త్రీలకు పిల్లలకు నీ యెడల నెక్కడ లేని ప్రీతి. ఎల్ల వేల్పుల కేని నశక్య మీ పని. ఒక వంక నీకు బాల్యము. ఒక యెడ నీ అపూర్వ ప్రభావము. ఒక వంక మాలోనంత శోభనము గాని పుట్టవు. ఆలోచించిన కొలది కృష్ణా! మాకు సందేహము గల్గించు చున్నది. నీవు దేవుడవా? యక్షుడవా? గంధర్వుడవా! మాకెందులకీ విమర్శ! మా బంధువుడవు నీవు. వందనము అనగా విని క్షణమూరకుండి కొంచెము నెయ్యంపుటలుక తెచ్చికొని గోపకుల కిట్లు కృష్ణుడు మారు పలికెను.
నా సంబంధముచే మీకు సిగ్గు గలుగదేని ఓ గోపాలకులారా! నేను మీకు కొనియాడ దగినవాడనా! అట్లైన ఆ విమర్శ వలన మీకేమి లాభము? మీకు నా యెడ ప్రీతి గలదేని మీకు నేను శ్లాఘ్యుడనేని మీ చుట్టముల యెడల నున్న తలంపు నాపై నొనరింపుడు. నేను దేవుడను గాను, గంధర్వుడను గాను, దానవుడ నంతకంటెం గాను. నేను మీకు చుట్టమనై పుట్టినాను. దీనిం గూర్చి యింతకంటే వేరుగ నాలోచింప వలసిన పని లేదు.
అన హరి పలుకు విని వేనము వట్టి గోపాలురతడు పొలయలుకగొన వనమునకుం జనిరి. కృష్ణుడో విమలమైన యాకాశమును శారద చంద్ర చంద్రికను నయ్యెడ విప్పారినవై దిశలెల్ల పరిమళింప జేయుచున్న తెలిగలువ పూదీగను ఝుంకారములు సేయు తుమ్మెదల గుంపులతో మనసుహరించు వనరాజినిం గని గోపికలతో రమింప హరి మనసు గొనెను. బలరామ మూర్తి లేకుండ వనితల కత్యంతప్రియముగ అవ్యక్తమధుర పదలలితముగ తారమంద్ర స్థాయుల జక్కగ శౌరి సంగీతము పాడెను. ఆ రమ్యగీత ధ్వని విని గోపిక లిండ్లు వెడలి యయ్యెడ హరి యున్నయెడ కేతెంచిరి.
ఒక గోపి యాతని లయానుకూలముగా మెలమెల్లన వంత పాడెను. ఒక సుందరి యా పాట యెడ శ్రద్దకొని యాతనినే మనసార తలంచెను. ఒక ముగ్ద కృష్ణ కృష్ణాయని పలికి సిగ్గు పడెను. ఒకావిడ ప్రేమాంధయై వెంటనే యాతని పజ్జ కరిగెను. ఒక బాల ముంగిలి వాకిటకు వచ్చి వెలుపలనున్న తమ పెద్దను జూచి కనులు మూసి తన్మయత్వముతో గోవిందుని ధ్యానించెను. ఆ కృష్ణుని పైని చిత్తముతో విమలమై పొందిన యానందానుభవముచే దొలి జన్మములందు జేసిన పుణ్యముల ఫలమెల్ల తరుగ నాతని గూడమింగ గలిగిన దుఃఖాను భవముచే తొలుత జేసికొన్న పాపఫలమెల్ల దరిగిపోవ జగత్పతియు కేవల పరబ్రహ్మ స్వరూపుడునగు కృష్ణునే తలంచుచు నుచ్చ్వాసము నిలిచిపోయి ముక్తిం బొందెను. గోపికలు చుట్టునుం గ్రమ్ముకోన శరచ్చంద్ర మనోరమమయిన రాత్రిని గోవిందుడు రాసక్రీడారంభ రాసోల్లాసియై గారవించెను. గోపికలును గుంపులు గుంపులై కృష్ణలీల యందదీనులై కృష్ణు డొండొక ఎడకేగి మరుగువడ నాతనిపై హృదయములు నిల్పి బృందావన మందు నల్గడల వెదకుచుం దిరుగాడ జొచ్చిరి. ఒండొరుల బిలిచికొని యిట్లు పలుకం జొచ్చిరి. ఒక గోపి ఇదిగో నేను కృష్ణుడను. చక్కగా వెళ్ళుచున్నాను. నా జాడగనుగోనుడు అనియె. మరియోకతె నేనే కృష్ణుడను నాపాట వినుండనియె. ఓ దుష్టుడా! కాలియుడా! నిలునిలు. గృష్ణుడనని బాహువులు చరచి చాచి సర్పము నొకతె బట్టెను. ఇంకొకతె ఓ గోపకులారా! నిశ్శంకముగ నుండుడు. వానకు భయపడవల దిదుగో! నేను గోవర్ధన మెత్తితిని. ఇడుగో ధేనుకాసురుడు. వీనిం బట్టి విసరి వైచితిని. స్వేచ్చగా నిక గోవులు సంచరించు గాక! యని కృష్ణ లీలల ననుకరించి పలికెను. ఇట్లు గోపికలు కృష్ణలీలలు నభియనించుచు తిరుగ జొచ్చిరి.
ఒక గోపిక భూమింగని మేనెల్ల పులకరింప సఖీ! చూడుడు! కందొవలు విప్పార ధ్వజము వజ్రము అంకుశము పద్మమునను చిన్నెలు గల కృష్ణుని యడుగులం దిలకింపుడల్లదె కనుగొనుడు. లీలావిలాస గమనమున నేగు కృష్ణుని యడుగు జాడలివె. యని పలికించిరి. ఎవ్వతెయో అదృష్టవంతురాలు మదవతి వానితో గలిసి యేగిన జాడ యిదిగో! దాని గట్టివి చిన్నవియైన యడుగుల గుర్తులివిగో! ఇక్కడ దామోదరుడు పైనిగల పుష్పముల యవచయము సేసి యుండును. నిక్కము. ఆ మహానుభావుని ముందడుగు పై భాగము మాత్రమే చిహ్నితమై గనిపించు చున్నది. ఇక్కడ కూర్చుండి యా భాగ్యవతి ఎవతెయో యాతనిచే పుష్పాలంకార మిక్కడ నలంకరింప బడినది. అది కొండొక జన్మ మందు విష్ణువును నర్చించి యుండే గావలయు. స్వామి పూలుదురిమి యాదరించిన దాన నా యంతది లేదని మిడిసివడె కాబోలు. ఆ మానవతి నిట దిగవిడచి నందగోపుని బిడ్డడీ జాడ నేగినాడు. చూడుడు అట్లేగుచున్న యందగాని వెంటందవిలి పిరుదుల బరువున మంద మందముగ నొక మందగమన యాపరు గందక కాబోలు పరువెత్తినది. దాని పాదాగ్రములియ్యెడ నీనెలవై గట్టిగ నంటినవి. ఆతని కెలుం గోననేల గైకొని నెచ్చెలి! యోకతె ఈ వెంట నడుగులు సరిగ నానింపక యేగెంగావలయు నాయడుగుల జాడ నిట నంటియంటనటు కనబడుచున్నది. చేయి పట్టుకున్నంత మాత్ర నా దూర్తుడీ బాలికను విడలించుకొని పోయి యవమానించి నాడు కాబోలు. నిరాశ చెంది యయ్యిందువదన మంద గమనమున వెనుదిరిగిన యడుగు జాడ లిటగన బడుచున్నవి.
తొందరగ బోవలయు. తిరిగి నీదరికి వత్తునని కృష్ణుడొకతెం దాటి యేగె గాబోలు నీ యడుగు జాదజూడ నా తొందర గనిపించు చున్నది. కృష్ణుడీ గహన మందు బ్రవేశించి నాడు. ఇదిగో యడుగు జాడ కనబడ లేదు. మనమిక మరలి పోవలయును. జాబిల్లి వెన్నెల వెలుగిందు గనబడదు. అని యా గోపికలు కృష్ణ దర్శన నిరాశలై యమునా తీరమునకుం జేరి యాయన చరిత్రమును గానము సేయ జొచ్చిరి. అంతట ముఖారవింద మల్లన వికసింప నెదురుగ వచ్చుచున్న త్రైలోక్య రక్షకుని సర్వ జీవసుఖ విలాసుని గాంచిరి.
ఒక గోపి యెదురుగ వచ్చుచున్న గోవిందునిం గని కృష్ణా! కృష్ణా! అని ముమ్మారు పిలిచే నంతేకాని మారుమాట పలుకదయ్యే. ఒక సుందరి కనుబొమలు ముడివడ లలాటమున హరింగని కన్నులు తుమ్మేదలుగా హరి ముఖ పద్మముం ద్రావెను. ఇంకొక గోపి గోవిందుం గని మైమరచి కనులల్లన మూసి యాతని రూపమునే ధ్యానించుచు యోగారూడ యట్లు భాసించెను. అవ్వల మాధవుండొక మానవతిని మధుర భాషణములతోను నొక గొల్లభామను భ్రూభంగ వీక్షణముల చేతను మరొక తరుణిని కెంగేలం దాకియు మాధవుడు కలక దీర్చి యూరార్చి లాలించెను. ఉదార చరితుండగు హరి యా సుందరుల డెందములు ప్రసన్నములయినంత వారితో రాస క్రీడలచే గ్రీడించెను. కృష్ణుని యందొక్క లక్ష్యమందే స్థిరమయిన మనసు గలదియై కృష్ణుని పార్శ్వమును వీడని గోపికా జనము చేత రాసా మండల బంధము (కుండలాకారముగ చేరుట) ఏర్పడక పోయెను. కృష్ణుడు గుండ్రముగ నేర్పడిన రాస మండలమందు ప్రక్కనున్న యోక్కొక్క గోపిక చేయి పట్టుకొని తన కరస్పర్శ మాత్రమున గల్గిన యానందముచే మైమరచి కన్నులు మూసి కొనుట ద్వారమున శృంగారానుభావము నభివ్యక్త మొనర్చు దాని గావించెను. అట్లే మరియొక దానిని. అట్లందరను మైమరపించెను. చలించుచున్న కంకణ ధ్వనులు గలదియు, అనుస్యూత మయిన శరదృతు ప్రబంధ గానము గలదియునై క్రమముగా రాసక్రీడ యారంభ మయ్యెను. కృష్ణుడు శరచ్చంద్రుని చంద్రికను కలువ పూలకొలని శోభలం గూర్చిన యాయా కవులు మున్ను గూర్చిన గేయములను ఆలపించెను. గోపికలు మాత్రమొక్క కృష్ణ నామమునే మరిమరి పాడ జొచ్చిరి. ఒక గోపిక పరివృత్తి (తిరిగుట) వలన గలిగిన యాలసటచే ముంచేతం జలించు కంకణముల సడి రూపమున తన శ్రమను కృష్ణునితో ముచ్చటించు చున్నదో యన్నట్లున్న తన బాహులత నా లతాంగి మధువైరి భుజముపై నుంచెను. (ఇక్కడ పరివృత్తి యను పదమునకు పరివర్తనము, ఆట యందట్టిట్లు తిరుగుట అనునది విశేషార్థము. పాదము లందు మోకాళ్ళ యందు నడుము నందు గలుగు పరివర్తనమది నృత్య విషయము). ఒక నెరజాణ గోపీ గీతమును స్తుతించు నెపమున రమణీయ బాహువు గల కృష్ణుని గౌగిలించు కొనెను. గోపికల మేరగు జెక్కిళుల సంస్పర్శ మంది హరి భుజములు చెమర్చి కపోలగత పులకలను సస్యముల పెంపొందించుటకై స్వేద వారిని వర్షించు వారిదము లయ్యేను. (అన్యోన్యాను రాగము) కృష్ణుడు తారాస్థాయితో రాస గేయము నాలపింప నా గోపికలు దానికి రెట్టింపుగ కృష్ణ కృష్ణ సాదు అని యాలపించిరి. (తారాస్థాయి = శృతి స్థానములు 22. అవి హృదయ పద్మము నుండి కపాల రంధ్రము లోపలి దాక నడ్డముగా నున్న నరములు 22. వాటి మీద నిచ్చెన మెట్ల మీద వలె నాదము మీది మీదికి పోవుచునంత నంతకు హెచ్చై మొదలి మెట్టు వదలిన తరువాత నుండి ఉచ్చము ఉచ్చతరము ఉచ్చతమమను నీ విధమగు పేరులం బొందును. వానిలో హృదయ మందుండెడు మొదటి యేడు శ్రుతుల గుంపు మంద్ర స్థాయి యనియు, కంఠము నందలి రెండవ శృతి సప్తకము మధ్యమ స్థాయి యనియు, మూడవ శృతి సప్తకము తారాస్థాయి యనియుం బేర్కొనబడినది. ప్రతి శృతి సప్తకము నందును గల స్థానములు తప్పకుండ బలుకబడెడు నా శ్రుతులకు వరుసగా షడ్జము (స) ఋషభము (రి) గాంధారము (గ) మధ్యమము (మ) పంచమము (ప) దైవతము (ద) నిషాదము (ని) అను పేరుల సప్త స్వరములు పేర్కొన బదినవి).
వెళ్ళుటలో ననుగమించుట తిరుగుటలో సమ్ముఖముగ తిరుగుట ప్రతి లోమానులోమములలో తిరుగుట ఈ విధముగ గోపికలు హరిని సేవించిరి. ఆ విధముగ గోపికలతో నచ్యుతుడు కేళి సలుప నతడెడ మయిన క్షణము వారికి కోటి సంవత్సరములటు తోచెను. ఆ మగువలు మగలచే తండ్రులచే సోదరులచే నివారింప బడియును రతిప్రియలా స్వామిని రేరేలను రమింప జేయు చుండిరి. శత్రుంజయుడగు అతడు కైశోరక వయో లక్షణమును ఆదరించు (పండ్లు వచ్చినది మొదలు మూడేండ్ల కైశోర వయస్సు) వారితో రాత్రులందు క్రీడించెను. వారి భర్తలందు వారియందు నెల్ల భూతము లందును ఆత్మ స్వరూపుడై సర్వ వ్యాప్తియై వాయువు వలె నీ పరమేశ్వరుడుండేను. సర్వ భూతము లందు ఆకాశము అగ్ని భూమి నీరు వాయువు ఆత్మయు ఎలా వ్యాపించి యున్నవో యట్లె యతడు సర్వమున వ్యాపించి యున్నాడు.
Summary of chapter 13 of the Vishnu Mahā Purāṇa is as follows:
The gopikās experience intense viraha (longing) for Kṛṣṇa. Kṛṣṇa plays the venu (flute) on a moonlit night — the music drawing the gopikās irresistibly from their homes. An account of the saptasvaras (seven musical notes) and their cosmic significance is given. The gopikās leave their households — some still in the middle of cooking, some half-dressed — and follow the sound through the forest, tracking Kṛṣṇa's footprints in the moonlit grass.