బుద్దిమంతుడగు ముచుకుందునిచే నిట్లు స్తుతింప బడి యనాదినిధనుడు సర్వ భూతేశుడు నగు హరి నిట్లనియె
ఓయీ! రాజా! నీవభీష్ట దివ్యభోగము లనుభవించి అవ్యాహతైశ్వరుడవై నా యనుగ్రహ సంపూర్ణ బలమున నుత్తమ లోకముల కేగుము. అట దివ్యభోగము లనుభవించి మహాకాల మందు బుట్టి జన్మాంతర వృత్తాంతా మెరిగి నా ప్రసాదముచే మోక్షమొందెదవు.
అనిన నాతడు ప్రణతుడై గుహ నుండి వెడలి యల్పాకారుల నరులంగని కలి యుగమని యెరింగి తపము సేయ నర నారాయణ స్థాతానమగు గన్ధమాదన గిరికి బదరీ క్షేత్రమునకు జనెను.
కృష్ణుడును నుపాయముచే పగతుని వాని బలముం గూల్చి మథురకు వచ్చి గజతురగ పదాది సంకులమగు వాని సైన్యము స్వాధీనము చేసికొని దానిని ద్వారక యందుగ్రసేనునికి నివేదించెను. అంతట యాదవ కులము పరాభిభవశంక యే మాత్రమేని లేక హాయిగా నుండెను. మైత్రేయా! బలదేవుడు తగవులన్నియు శాంతివడ జ్ఞాతుల దర్శింప వేడ్కగొని నన్దగోకుల మేగెను. గోపీగోపాలురను మున్నట్లు బహుమాన పూర్వకముగ బలుకరించెను. ప్రేమతో కొందఱు కౌగిలించు కొనిరి. కొందరి నీతడు కౌగిలించెను. పరియాచకము లాడి కొందరితో బ్రియమ్ములాడ వారును హరింగని పెక్కు ముచ్చటలు జరిపిరి.
గోపికలు మాత్రము ప్రణయ కుపితలై కొందరు ఈర్ష్యగొని నాగరీజన వల్లభుడు ఇచ్చకాలమారి యాకృష్ణుడు సేమమున నున్నాడు గద! పల్లె పడుచులగు మా చేష్టలు సరిపడక పురాంగనల నెరజాణ లందవిలి సౌభాగ్య గర్వమాధికముగ బెంచికొన లేదు గద!
కణమాత్రపు మెరమెచ్చు గాడతడు. వేణు గీతమున దన్ను వెంటాడిన మమ్ము స్మరించునా? మంముంజూడనైన ఒకసారి యీతడిట కరుదెంచునా? అదిగాక ఆ మాట ఎందులకు? ఒండు ముచ్చటల జెప్పుకొందము. అతడు లేక మనకు మనము లేక యతనికిం, జరుగదు కనుకనా! తండ్రి తల్లి అన్న తమ్ముడు భర్త బంధువు ననున దెల్ల వానికై వడలు కొంటిమిగద! అతడు కృతఘ్నులకెల్ల యోకపతాక. అయినను నిచటికి తిరిగి రాకను గూర్చిన మాట నీతో నోక్కమాటైన నన్నాడా! రామా! అబద్ద మాడకము. ఈ దామోదరుడు గోవిందుడు నాగరిక విలాసినులం దవిలెను. మా యెడల ప్రీతివోయినది. ఇంక దర్శనము దుర్లభమే. ఇక మాకు కనబడడని తోచును. కృష్ణా! దామోదరా! అని పిలిచి పిలిచి హరి మనసులం దొంగిల గోపికలు నవ్విరి. సామ మధురములు ప్రేమ గర్భములు గర్వ రహితములు నైన కృష్ణస్వామి సందేశములను బలరాముడు వారికి వినిపించి వారల నోదార్చెను. మునుపటివలె తోడి గోపాలురతో పరిహాస మనోహరము లగు కథలు సెప్పుచు నా వ్రజ భూములందు వారితో బలరామ మూర్తి విహరించెను.
Summary of chapter 24 of the Vishnu Mahā Purāṇa is as follows:
Mucukunda departs for Gandhamādana and then Badarikāśrama to spend his remaining time in tapas. Kṛṣṇa takes Kālayavana's army and great wealth to Dvārakā and presents it all to Ugrasena as treasury. Balarāma makes a sentimental visit to Nandagokula to see the people he grew up with.