ఉపనయనము జరుప బడిన బాలుడు వేదములను సంపాదించుట యందు శ్రద్ధ కలవాడగుచు శ్రద్దావంతు డగు బ్రహ్మచారిగా గురు గృహమున నుండ వలయును. అచ్చట నతడు శౌచమును సదాచారమును కలిగి గురునకు శుశ్రూష చేయ వలయును. బ్రహ్మ చర్యమునకు తగిన వ్రతములను ఆచరించుచు శ్రద్దబుద్దితో వేదము గ్రహించ వలయును. ఓ రాజా! ప్రాతః సాయంసంధ్యల యందును శ్రద్దా పూర్వకముగా అగ్నిని ఉపాసించుట సూర్యోపస్థానము ఆచరించ వలెను. గురునకు అభివాదమును చేయ వలెను. గురువు నిలువ బడినచో తాను నిలువ బడుచు, నడచు చున్నచో తానును నడచుచు. కూర్చున్నచో తాను క్రిందుగా కూర్చుండ వలయును. శిష్యుడు గురునకు ప్రతికూల మగునది ఏదియు నాచరింప రాదు. గురుడు చెప్పినపుడు అతని ముందు ఉండి అన్యమనస్కత లేక వేదమును పఠింప వలెను. ఆచార్యుడు స్నానము చేసిన తరువాతనే శిష్యుడు స్నానము చేయ వలెను. ప్రతి ప్రాతః కాలమునను గురునకు సమిధలు, జలము మొదలగునవి తెచ్చి యిచ్చుచుండ వలయును. ఇది బ్రహ్మచర్య ధర్మము.
తాను గ్రహింప వలసిన వేదములను గ్రహించిన తరువాత గురుని వలన తాను గ్రహించిన వేదాది విద్యలకు తగిన ప్రతి ఫలము నిచ్చి గురు ఋణమును తీర్చి అతని అనుమతి పొందివచ్చి ప్రాజ్ఞుడై గృహస్థాశ్రమమును ప్రవేశింప వలయును. ఓ రాజా! శాస్త్రోక్త విధానమున భార్యను పెండ్లాడి తాను ఆచరించిన కర్మలను ధనము ఆర్జించి తనశక్తి ననుసరించి గృహస్తుడుగా ఆచరింప దగిన కార్యముల నాచరింప వలెను. తర్పణము చేసి పితృ దేవతలను, యజ్ఞములచే దేవతలను, ఆహారముచే అతిథులను, స్వాధ్యాయముచే మునులను, సంతానము అనుతచే ప్రజాపతిని, బలి వేయుటచే భూతము (ప్రాణు)లను వాత్సల్యము, దయచేత సమస్త లోకమును ఆరాధించు చున్నచో పురుషుడు తానాచరించి ఆయా కర్మములకు తగిన ఉత్తమ లోకములను పొందును. భిక్షాటనము చేసి ఆహారము భుజించు యతుల బ్రహ్మచారులు గృహస్థుని మూలముననే జీవింతురు. కనుకనే గార్హస్థ్యము గొప్ప ఆశ్రమము. ఓ రాజా! విప్రులు విద్యల సంపాదించుటకును తీర్థముల యందు స్నానమాచరింప గోరియు పృథివీ విశేషములను చూడగోరియు భూమిపై సంచారము చేయుచుందురు. కొందఱు నియతమగు నివాస స్థానము ఆహారము లేక తాము సంచరించుటలో ఎక్కడ ఉండగా సాయంకాల మయినచో ఆ ప్రదేశమునే గృహముగా గ్రహించి ఆ రాత్రి గడిపుపోవు మహనీయు లుందురు. అట్టివారికి అందరకును గృహస్తులే ఆశ్రయము జీవనమునకు కారణమును. ఓ రాజా! గృహస్థులు అట్టివారికి మధురముగా స్వాగతము పలికి ఇంటికి వచ్చిన వారికి ఆసనము, భోజనము, శయనము సమకూర్ప వలెను. ఎవరి ఇంటి నుండి అతిథి తన కోరికలు తీరక మరలో పోవునో అతడు తన పాపమును గృహస్థునకు సంక్రమింప జేసి ఆతని పుణ్యమును తీసికొని పోవును. ఇతరులను అవమానించుట అహంకారము కపటము పరితాపము నొందించుట ఇతరులకు ఇబ్బంది కలిగించుట పరుషత్వము (మాటల లోకాని చేతలలో కాని) గృహస్థుని యందు ఉండరాదు. శ్రేష్టమగు తన ఈ కర్మనుష్టానమును చక్కగా అనుష్టించు గృహస్థుడు సర్వ బంధముల నుండి విడుదల పొంది ఉత్తమములగు లోకములను పొందును. ఇది గృహస్థాశ్రమ ధర్మము.
ఓ రాజా! గృహస్థుడుగా నిట్లు జీవించి కృతకృత్యుడై వయస్సు పండిన తరువాత భార్యను తన కుమారుల యొద్ద ఉంచికాని తన వెంట తీసికొని కాని అరణ్యమునకు పోవలెను. ఆకులు, దుంపలు, వేళ్ళు, పండ్లు ఆహారముగా తీసికొనుచు జుట్టు గడ్డములు మీసములు పెరగ నిచ్చుచు జడలు ధరించి నేలపైనే శయనించుచు ఏ ప్రయోజనము లందును కోరికలు లేక జీవించ వలయును. చర్మముతో, ఱెల్లుతో, దర్భలతో చేసిన ధోవతిని ఉత్తరీయమును ధరించు వలయును. ప్రాతర్ మధ్యాహ్న సాయం కాలముల యందు స్నానము చేయుట మంచిది. ఓ రాజా! ఇతనికి దేవతలను అర్చించుట, హోమము, అభ్యాగతులను అందరను పూజించట, భిక్షాప్రదానము, భూతములకు బలి యిచ్చుట చాల శ్రేష్టమయినది. అడవిలో లభించు నూనెలతో తలంటు పోసికోనుట చలిని ఉష్ణమును ఓర్చుచు తపస్సాచరించుచు మౌనముతో మునిగా నుండుట వానప్రస్థునకు విహితములు. ఈ కర్మములను ఇట్లు అనుష్టించు వానప్రస్థుడు అగ్నివలె దోషములను దహించును. శాశ్వతము లగు లోకములను జయించును. ఇవి వానప్రస్థాశ్రమ ధర్మములు.
ఓ రాజా! విద్వాంసులు భిక్షువు యొక్క ఆశ్రమము సన్యాసాశ్రమము అని వ్యవహరించు నాలుగవ ఆశ్రమము యొక్క స్వరూపమును చెప్పెదను. వినుము, పుత్రుల యందు, భార్య యందు, ద్రవ్యము నందు, స్నేహమును మత్సరమును విడిచి సన్యాసాశ్రమమున ప్రవేశించ వలయును. ధర్మార్థకామ ప్రయోజనములకు సంబంధించిన కార్యాచారణము లను పూర్తిగా విడువ వలయును. శత్రు మిత్రుల యందు సముడై సమస్త ప్రాణుల యందు దయ కలిగి ఉండ వలయును. జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భిజములు అగు ప్రాణులతో వెతికిని వాక్కుచే కాని, మనస్సుచే కాని, కర్మచే కాని ద్రోహమును ఆచరింప రాదు. అన్ని విధములగు సంబంధములను విడువ వలెను. గ్రామము నందు ఒక రాత్రి మాత్రము, పురము లందు పంచ రాత్రములు మాత్రము ఇట్లక్కడ నుండు నెవరి యందును ప్రీతిగాని, ద్వేషముకాని కలుగుటకు అవకాశము లేకుండు నట్లు కొలది కాలము మాత్రము నిలవ వలయును. వంటలు ముగిసి నిప్పులు చల్లార్చి జనులు భోజనము చేసిన తరువాత శ్రేష్ట వర్ణముల వారి యిండ్లకు తన శరీర యాత్రామాత్రమునకై ఆహారమునకై బిక్షార్థము తిరుగ వలయును. కామము, క్రోధము, దర్పము, లోభము, మోహము మొదలగు దోషములను విడిచి సన్యాసి మనస్సులో మమకారము ఏమియు లేకుండ వలయును. సమస్తములగు భూతములకు అభయము నిచ్చుచు నిట్లుండు మునికి ఎక్కడను నే ప్రాణుల వలనను భయము ఉండదు. అగ్ని హోత్రమును వేదికయందు కాక తన శరీరము నందు నిలుపుకొని భిక్షాటనముచే లభించిన ఆహారముల చేత నోటి ద్వారా అట్టి శరీరాగ్ని యందు హోమము జరుపు మహానీయుడు (సన్యాసి) అన్ని యజ్ఞముల తోడను చితాగ్నులు అగ్ని చయనము చేసిన వారు పొందు లోకములను పొందును. చక్కని సంకల్పములతో సంకరింప బడిన బుద్ది గలిగి ఈ చెప్ప బడిన విధమున మోక్ష సన్యాసాశ్రమ ధర్మమును ఆచరించుచు ద్విజుడు (బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని ) కట్టెలను ఆశ్రయించిన జ్యోతిస్సు వలె జీవించి ప్రశాంతమగు బ్రహ్మ లోకము బొంద గలుగును.
వివరణము:
ప్రాణులు నాలుగు విధములు. 1. జరాయుజములు: తల్లి కడుపులో పిండము అన్ని అవయవములతో వృద్దిపొంది మావితో కూడ జన్మించు మనుష్యులు, పశువులు, మృగములు మొదలగునవి. 2. అండజములు: తల్లి కడుపు నుండి వెలుపడిన గ్రుడ్డు నుండి పుట్టినవి. పక్షులు మొదలగు నవి. ౩. స్వేదజములు: చెమట నుండి పుట్టు తేలు, నల్లి, పేను మొదలగు ప్రాణులు. 4. ఉద్భిజములు: నేలను చీల్చుకొని పుట్టేది చెట్లు మొదలగునవి.
Summary of chapter 9 of the Vishnu Mahā Purāṇa is as follows:
Detailed duties of the four āśramas are expounded: Brahmacarya (upanayana, guru-service, Vedādhyayana, begging from seven houses), Gṛhastha (pañca-mahāyajñas, hospitality, procreation), Vānaprastha (forest retirement, pañcāgni-tapas), and Sannyāsa (tridaṇḍa, complete renunciation). The chapter emphasizes that there are only four āśramas — not five — and that abandoning gṛhastha dharma without proper transition is not valid renunciation.