విష్ణు మహా పురాణము

23 - ముచుకుందానుగ్రహము - తత్కృత కృష్ణ స్తుతి

సభలో యాదవు లందరి ముందు గార్గ్యుడను బ్రాహ్మణుని నతని బావమరిది (సంతానము లేకుండటచే) ఇతడు నపుంసకుడని గేలిసేసెను. యాదవులు నవ్విరి. దాన కోపించి యాతడు దక్షిణ పథమునకు వచ్చి యాదవ చక్రమున కెల్ల భయంకరుడగు కొడుకు గావలయునని తపము సేసెను. అందులకత డినుపపొడి దినుచు శంకరునిం గూర్చి చేసిన తపస్సునకు సంతుష్టుడై హరుండు పండ్రెండేండ్ల తపస్సు ఫలముగా వర మోసంగెను. ఆ గార్గ్యుని యవన రాజు సంతానహీనుడై సేవించెను. గార్గ్యుడా యవనుని భార్యతో సంగమించి నంతట తుమ్మెద వంటి శిశువు గల్గెను. వాడే కాలయవనుడు. వజ్రమువలె కఠినమైన రొమ్ము గలవానిని రాజుం గావించి యవన రాజు వనమునకుం బోయెను. ఆ కాలయవనుడు వీర్యమదోన్మత్తుడై ఈనాడు భూమిపై బలవంతులగు రాజు లేవరని యడుగ నారదుడు యాదవులని తెలిపెను. వాడు కోట్లకొలది మ్లేచ్చులం గూడ గట్టుకొని చతురంగ బలముతో దరలి నడుమ నడుమ అలసిన వాహనముల విడుచుచు విడుదులు సేయుచు యాదవుల సంహరింప మథురాపురికి దండయాత్ర వెడలెను. కృష్ణుడును యవనునిచే యాదవ బలము క్షీణించి మాగథునికి లొంగునని యనుకొనెను. మాగధుని బలమల్పము. ఆ కాలయవనుడు ప్రబలుడు. కావున వానితో గలిసి మాగధుడు యుద్దము సేయవలయును. ఆహా! దైవమాయ! యాదవుల కిప్పుడు రెండు విధాల విపత్తు వచ్చి పడినది. అని గోవిందుడెంచి యాదవులకు దుర్గ నిర్మాణార్థమై సముద్రు నడిగి పండ్రెండ్రు యోజనముల చోటిమ్మని యడిగి యట ‘ద్వారక’ అను పురము నిర్మించెను. అట స్త్రీలు కూడా సురక్షితులై యుద్దము చేయ వచ్చును. పురుషుల సంగతి చెప్పనేల? అది మహోద్యానములతో చెరువులతో మేడలతో మిద్దెలతో ప్రాసాదములతో గూడి యింద్ర రాజధానియగు నమరావతిం బోలియుండెను. మథురావాసుల నందులకు రావించి హరి తానందు వసించెను.

కాలయవనుడు సైన్యమును రాజధాని నిలువ జూచి కృష్ణుడు తానొక్కడే నిరాయుధుడై చనినంతట యవనుడు బాహుయుద్ద సమర్థునింగా హరి నెరిగి మహాయోగుల చిత్తములు వెంబడించి యందుకొనలేని యా స్వామిని వెంబడించెను. అట్లు పరువిడి తరుమ కృష్ణుడట నున్న గుహలో ప్రవేశించెను. అందు ముచుకుందుడు పరుండి యుండెను. యవనుడును నందు జొచ్చి యందు శయనించి యున్న ముచుకుందుని జూచి కృష్ణుడనుకొని పాదమునం దన్నెను. అతడు మెలకువగని యవనునిం గనెను.

కనిన యా క్షణమ యవనుడా క్రోధాగ్నిచే మసియయ్యెను. ఆ ముచుకుందుడు దేవాసుర యుద్దమందు రాక్షసులం బలిగొని గాడనిద్ర గొని పెద్దకాలమట నిద్రను దేవతల వరము గోరి నిద్రవోయెను. వారును నిన్నెవ్వడు లేపునో వాడు తన మేనం బొడమిన యగ్నిచే తాన కాలి నుసియగుననిరి.

ఇట్లా పాపిని యవనుని దహించి యా ముచుకుందుడు ముకుందుంగని నీవెవ్వడవన నేను చంద్రవంశమున యాదవుల వంశమున పుట్టిన వసుదేవుని తనయుడనన ముచుకుందుడు వృద్ధగార్గ్యుడన్న మాట జ్ఞప్తికి దెచ్చికొనెను. వెనువెంటనే ప్రణమిల్లి సర్వేశ్వరుని సర్వరూపుహరిం గూర్చి యిట్లనియె.

నీవు సాక్షాద్విష్ణుడవని ఎరింగితిని. ఇరువది ఎనిమిదవ యుగములో నవతారమగునని గార్గ్యుడు మున్ను తెలిపెను. ఆ హరివే నీవిట సాక్షాత్కరమైతివి. సందేహము లేదు. మనుష్యుల కుపకారము చేయు నీ మహత్తర తేజ మేను సైప జాలను. సజల జలదనాద గంభీరమయిన నీ పలుకు నీ పాద స్పర్శ మాత్రమున నవని క్రుంగుటయుం గంటిని. దేవాసుర మహాసమరమున దైత్య సైన్య మహాభటులు నా తేజము సైపలేరైరి. అట్టి నేనే నీ మహాతేజ మోర్వలేకున్నాను. సంసారమునం బడిన జంతువునకు నీ వొక్కడవ దిక్కు. ప్రపంనార్తిహరా! ప్రభో ప్రసన్నుడవగుము. నా అశుభము హరింపుము! సముద్ర శైల సరిద్వనాదులు భూమ్యాది పంచభూతములు మనస్సు బుద్ధి అవ్యాకృత ప్రాణములు ప్రాణేశ్వరుడవు నీవ. పురుషోత్తముడవు. పురుషతత్త్వమున కంటెను బైది జన్మాది వికార రహితము సర్వవ్యాపి శబ్దాది రహితము అజరము అమేయము అక్షయము వృద్ధి నాశములు లేనిదియు ఆద్యన్తహితమునైన బ్రహ్మము నీవ. నీ నుండియ దేవ పితృ యక్ష గంధర్వాదులు ఆ పిపీలిక బ్రహ్మము చరాచరము భూత భవిష్యము నుదయించినది. మూర్తము అమూర్తము స్థూలము సూక్ష్మమునైన సర్వవిశ్వము నీవు. నిను మించియే కొంచెమును లేదు.

ఈ సంసార చక్రమున నేననేక భ్రమణములు సేసి తాపత్రయము వలన గుమిలితిని. ఎండమావులం జూచి జలాశచే జలాశయములని పర్వెత్తినట్లు దుఃఖములనే సుఖములని యెంచి పర్వులిడితిని. అవి నాకు తాపమునకే అయినవి. రాజ్యము, నేల, బలము, కోశము, మిత్రపక్షము, కొడుకులు, భార్య, సేవకులు, శబ్దాది విషయములు, సుఖములను బుద్ధిం దగిలితి నిది యెల్ల పరిణామ దశయందు నాకు తాపాత్మకమైనది. దేవా! దేవగతి కేగితిని. అక్కడ దేవగణము గూడ నా వలన సాహాయ్య మర్థించినది. స్వామీ! శాశ్వత నిర్వృతి యెక్కడ? సర్వ జగత్కారణమగు నిన్ను గొలువక శాశ్వతానంద మెట్లు లభ్యము? నీ మాయచే మూడులై జన్మ మృత్యుజరాదుల వశులై తాపములువడి ప్రేతరాజును దర్శింతురు.

ఆవలదా మొనరించిన పనులం బొడమిన యతిదారుణ నరకముల దుఃఖములను నీకల రూపెరుంగని నరులు గుడుతురు. నేనత్యంతము విషయ లోలుడనై నీ మాయచే మోహితుడనై మమత్వాహంకారము లనెడి గుంటలో నిట్టట్టు లెట్టి పర్వులిడితిని. పరమేశ్వరా! అట్టి నేను అప్రమేయము పరమ పదమునైన నిన్ను శరణందు చున్నాను. ఇంతకు పైనేమియు లేదు. సంసార భ్రమణ పరితప్తచేతస్కుడ నిప్పుడు నిర్వాణమందు కేవల తేజస్సు నందలి లాషగా గన్నాను. ప్రభూ! శరణు శరణు.