అర్వాక్స్రోతస్సు మానుష సృష్టి యంటిరి. అది బ్రహ్మ యెట్లు సేసెనో సవిస్తారముగ దెల్పుము. వర్ణములు గుణములు వాని కర్మ విశేషములు గూడ నానతిమ్మన.
జగత్తు సృజింప నెంచి సత్యవస్తు ధ్యానము సేయ బ్రహ్మ యొక్క ముఖము నుండి సత్త్వ సంపన్నులగు ప్రజలు పుట్టిరి. ఱొమ్ము నుండి రజో గుణోద్రికులు, తొడల నుండి రజస్తమో గుణోద్రికులు, పాదముల నుండి మరి వేరు ప్రజలు నుద్భవించిరి. వారందరు తమః ప్రధాన జీవులు. యజ్ఞ నిర్వహణ మునకై బ్రహ్మ యిదెల్ల గావించెను. చాతుర్వర్ణ్య ముత్తమయిన యజ్ఞ సాధనము. యజ్ఞములచే నాప్యాయితులైన దేవతలు వర్షము గురియించి ప్రజల నాప్యాయన పరతురు. కావున యజ్ఞములు నిర్వహింప బడును. మనుష్య జన్మముచే మోక్షము స్వర్గము నందుందురు. ఇష్టమయిన యే స్థానమునకైన దాన నేగ గలరు. చాతుర్వర్ణ్య వ్యవస్థ గలవారు, శ్రద్ధాచార సంపన్నులు శుద్దాంతఃకరణులు శుద్ధులు సర్వా నుష్ఠానము సేసి పాపము తొలగిన వారు సర్వ బాధా వర్జితులు యదేచ్చా లోక సంచారులు నగుదురు.
వారికి చిత్తము శుద్ధమై యందు హరి వసింప వారు విశుద్ధ జ్ఞాన రూపమయిన విష్ణువను పరమ పదముం దర్శింతురు. అంతట హరి యొక్క యంశమైన కాలాధిష్ఠాన దేవత అల్పము వారి ఘోరము నయిన పాపము నంతను ద్రుంచును. ఆ పాపము అధర్మ భీజము. తమో లాభాది గుణ సంభవము. అది ప్రజల యందు రాగ ద్వేషాది రూపమున నుండి యసాధక మగును. ముక్తి సాధకము గాకుండును. అందువలన ప్రజలకు సహజ సిద్ధి (సాయుజ్య ముక్తి రూపమైనది) గలుగదు. రసోల్లాసము మొదలైన యష్ట సిద్ధులు మాత్రమే గలుగును. ఇట్లా యా సిద్ధులు క్షీణించి నంతట పాతకము మరల పెంపొంద ద్వంద్వములకు రాగ ద్వేషములు, సుఖ దుఃఖములు మొదలయిన జంటలకు లొంగి ప్రజలు మున్ను దుఃఖ వశులైరి. ఆ దుఃఖ సహనమునకై వారు ధాన్వము (ఎడారి) మరు పార్వతము, ఔదకము, పురఖర్వటము (400 గ్రామాల పరగణాలకు ముఖ్య గ్రామము) గ్రామాదికమునగు కృత్రిమ దుర్గములను గల్పించు కొనిరి. శీతవాతాతపాది సహనమునకై ఇండ్లు వాకిండ్లు నిర్మించుకొన మొదలిడిరి. ఆ మీద బ్రతుకు తెరువునకు వార్తోపాయమును కృష్యాది జీవన వ్యాపారమును గల్పించు కొనిరి. కర్మ సిద్ధమగు శిల్పాది హస్త సిద్ధిని సాధించు కొనిరి.
ఆమీద యవగోధుమాదిగ పదునేడు రకముల పంటలను పండించ నేర్చు కొనిరి. (17 రకముల పంటలు వ్రీహలు, యవలు, గోధుమలు, ప్రియంగువులు = కొఱ్ఱలు, ఉదారములు = ధరలను వడ్లు, కోర దూషములు, సతీనకములు = అంకాలు అనెడి పప్పు ధాన్యము. మాషములు = మినుములు, ముద్గములు = పెసలు, మసూరములు = చిరు సెనగలు, నిష్పావములు = అనుములు, కులుత్థములు = ఉలవలు, ఆఢక్యములు = కందులు, చణకములు = సెనగలు, శణములు = జనుములు ఇవి గ్రామౌషది జాతులు. యజ్ఞికములు(యజ్ఞోపయోగాములైన ఔషధులు గ్రామ్యములు అరణ్యములు పదునాల్గు రకములు అవి. వ్రీహులు = ఎఱ్ఱవడ్లు యవలు, మాషములు, గోధుమలు, అనువులు, తిలలు, ప్రియంగువులు, కులుత్థములు = ఉలవలు, శ్యామాకములు = చామలు, నీవాకములు = నెవరి ధాన్యము, జర్తిలములు = అడవి నువ్వులు, గవేధుకలు = అడవి గోధుమలు, వేణుయవలు = వెదురు బియ్యము. మర్కటములు = ధాన్య విశేషములు అను నవి పదునాల్గు రకములు. ఇవి కూడ గ్రామ్యములు అరణ్యము లను భేదము లందినవి. ప్రజాకారణము లుగా నివి యజ్ఞములతో బాటు సృష్టింప బడినవి.
వీనికి యజ్ఞముత్త కారణము. యజ్ఞా నుష్టానము పాపశాంతి గూర్చుటకై ప్రతిదిన మనుష్టింప బడి ప్రజల కుపకారక మగును. ఎవరి మనస్సు లందు కాలముచే సృజింప బడిన పాపబిందు విరపు కొన్నదో క్రమాభివృద్దినందునో అట్టివారు వేదములను వేదముల వలన దెలియనగు విషయములను దేవతలను యజ్ఞాది కర్మముల నెల్ల నిందించు వారు యజ్ఞములకు భంగము సేయువారు ప్రవృత్తి మార్గమునకు (కర్మ మార్గమునకు) విచ్చిత్తి కల్గించు వారు వేద నిందలకు దురాత్ములు దురచారులు కుటిలులునై బయలు దేరినారు. వార్త సిద్ద మైనంతట (జీవన విధానము ఏర్పడిన మీదట) ప్రజాపతి ప్రజలను సృష్టించి ఆయా స్థానము గుణమును బట్టి యొక మర్యాద (కట్టడ) ఏర్పరచెను. వర్ణముల ఆశ్రమముల యొక్కయు ధర్మములను స్వధర్మ పరిపాలనము సేయు నాయా వర్ణము లన్నిటికి గలుగు పుణ్య లోకములను బరమేష్వరుడు సృజించెను. కర్మ పరులయిన బ్రాహ్మణులకు ప్రాజాపత్యము అను స్థానమును, యుద్దము లందు వెనుజూపని క్షత్రియులకు ఇంద్ర స్థానమును, స్వధర్మ నిరతులైన (పశుగోరక్ష వాణిజ్యాది నిరతులైన) వైశ్యులకు వాయు దేవతా స్థానమును, పరిచర్య చేసి ధన్యులగు శూద్రులకు గంధర్వ స్థానమును నేర్పరచెను. ఊర్ధ్వరేతస్కు లయిన యతులకు ఎనుబది ఎనిమిది వేల స్థానములు. అవియే గురుకుల వాసులగు నైష్ఠిక బ్రహ్మచారులకు నేర్పఱచెను. వానప్రస్థులకు సప్తర్షుల కేస్థానమో యదే నిర్దేశించెను. గృహస్థులకు ప్రాజా పాత్యస్థానము (బ్రహ్మలోకము) న్యాసులకు (సన్యాసులకు పరివ్రాజులకు) బ్రహ్మస్థానము బ్రహ్మైక్య రూపము ఆత్మ సంతుష్టులగు యోగులకు అమృత స్థానము నేర్పరచెను. ఏకాంత నిష్ఠులు బ్రహ్మ ధ్యాన నిష్ఠులు, యోగులు నైనవారి స్థానము పరమోన్నత స్థానము. శూరులు బ్రహ్మ విద్వరిష్ఠులు దానినే సదా దర్శింతురు.
చంద్ర సూర్యాది గ్రహాలూ ఆయా గ్రహాదికార స్థానము నందున్న జీవులు వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వచ్చుచునే యుందురు. కాని ద్వాదశాక్షర మహామంత్ర ధ్యాన నిష్ఠుల య్యుత్తమోత్తమ స్థానమున కేగిన వారేగిరే కాని యిప్పటికిని వారు తిరిగి రారు. తామిస్రము అంధ తామిస్రము రౌరవము మహారౌరావము అసిపత్ర వనము ఘోరము కాలసూత్రము అవీచికము నను ఘోర నరకములు వేద నిందకులకు యజ్ఞ ద్వంసకులకు స్వధర్మ త్యాగులకు జెప్ప బడిన స్థానములు.
Summary of chapter 6 of the Vishnu Mahā Purāṇa is as follows:
Brahmā creates the four varṇas from his own body (brāhmaṇas from mouth, kṣatriyas from chest/arms, vaiśyas from thighs, śūdras from feet) and establishes the four āśramas (brahmacarya, gṛhastha, vānaprastha, saṃnyāsa). The cosmic purpose of varṇāśrama-dharma is expounded. Brahmā then creates Manu Svāyambhuva and his consort Śatarūpā, from whom the human lineage descends.