విష్ణు మహా పురాణము

14 - వృషభాసుర వధ

సంధ్యా కాలానంతరము కృష్ణుడు రాసక్రీడా కుతూహలియైన తఱి నరిష్టుడు పొగఱుకొని బెదరించుచు గోష్ఠమునకు వచ్చెను. సజల మేఘము లట్టి నల్లని మేనితో పెద్ద కొమ్ములతో సూర్యునట్లున్న కన్నులతో డెక్కలచే నేలను జీల్చుచు నాలుక సాచి పెదవులను గట్టిగ నాకుచు తోక పైకెత్తి కఠినమయిన మెడతో మిక్కిలి యెత్తయిన మూపురముతో అంతులేని యోడ్డునుం బోడవుతో మూత్ర పురీషముల పూతగొన్న వృష్ఠముతో గోవులకు దుడుకు గూర్చుచు మెడవ్రేల పెద్ద ముట్టెతో చెట్ల రాపిడిం బుండ్లు వడిన మొగముతో గోవుల గర్భ నిర్భేదనము సేయుచు వృషభ రూపుడై యా రాక్షసుడు తపస్వులం జంపుచు వనము లందే వేళ తిరుగు చుండును.

ఆ ఘోర రాక్షసునిం జూచి గోపీ గోపాలకులు జడిసిపోయి కృష్ణ కృష్ణాయని యాక్రందించిరి. అంతట కేశవుడు సింహ గర్జనము చేసి యరచేతులు సరచి చప్పుడు చేసెను. ఆ సడివిని వీడు హరి పైకి వచ్చెను. ఆ దానవుడు కృష్ణుని కుక్షిం గురిసేసి కొమ్ముల కొనల ముందునకు సాచి స్వామి మీదకు బరువిడెను. అట్లుపై బడునా మ్రుక్కుడి రక్కసుని గనియు హరి యున్నతావు నుండి కదలక నీలెక్కేమి పోరా యన్నట్లు నటించి దరిసిన వానిం బట్టుకొని కదలకుండ రెండు కొమ్ములుం బట్టి వ్రాల్చి మొకాళ్ళం గడుపునం బోడిచెను. వాని దర్ప బలమణచి తడిబట్ట పట్టి పిడిచి నట్లు వాని మెడబట్టి పిడుప వెట్టెను. ఒక కొమ్మూడ బెరికి దాననే వానిం గొట్టెను. ఆ రాక్షసుడు నోట నెత్తురు గ్రక్కికొని చచ్చెను. ఆ క్రూర దానవుడు హతుడై నంత గోపకులు జంభాసురుడు చావగా దేవగణము లింద్రునిం బలె కృష్ణునిం గొనియాడిరి.