విష్ణు మహా పురాణము

10 - గోవర్ధనగిరి యజ్ఞము

ఇట్లా వ్రేపల్లె యందు బలరామ కృష్ణులు విహరించు చుండ వర్ష ఋతువు వెళ్లి తామర పూలు వికసింప శరదృతువు వచ్చెను. (ఇవి చక్కని యుపమాలంకారములు) గుంటల లోని నీటనున్న చేపలు పుత్ర క్షేత్రాదు లందలి మమకారముచే (మొహముచే) గృహస్థు వలె మిక్కిలి తాపముం బొందినవి. మదము విడిచి మయూరములు సంసార మసారమని తెలిసిన యోగులట్లు మౌనమూనవి. మేఘములు జలము సర్వస్వము (సర్వము) విడిచి విమలములై అచ్చపు తెలుపు రూపుదాల్చి గృహమును జ్ఞానులట్లు అంబరమును వీడినవి. సర్వధనమును గ్రుహారామక్షేత్ర పుత్రకళత్రాది సర్వమును వీడి విరక్తిచే చిత్తశుద్ధి గడించి అచ్చపు బ్రహ్మ జ్ఞాన కళ దాల్చి జ్ఞానులు దేహాభిమానాదులు వోయి కట్టు వస్త్రముం గూడ విడిచి యవధూతలగుదురను శ్లేషమూలమున మేఘముల కుపమానముగా నిట సమన్వయింప బడినది. ఇది శ్లేషాను ప్రాణి తోపమాలంకారము. శరత్కాల భానుని వేడిమింగ్రాగి సరస్సులు బహువిషయ భోగముల మీది మమకారముచే దేహుల హృదయములట్లు శోషించినవి (ఎండినవి). శరత్కాల మందలి జలములు విచ్చిన తెల్ల గల్వలచే శుద్ధ చిత్తుల యొక్క (బ్రహ్మ జ్ఞానుల యొక్క) మనస్సులవ బోధములచే (ఆత్మ విషయక జ్ఞానములచే) వలె యోగ్యతా లక్షణముం బొందినవి. సరస్సులు యోగ్యములయినవని యర్ధము, జ్ఞానుల మనస్సులు జీవాత్మ పరమాత్మైక్యాను సంధానయోగ సమాధిరూప లక్షణము గలవైనవని యుపమాన పరమైన రెండవ యర్ధము. నక్షత్రములచే విమలమైన యాకాశమున అఖండ మండలము గల శరత్కాల పూర్ణిమ నాటి నిండు చందురుడు శుచులు శ్రీమంతులునగు సాదు కులమున పుట్టిన చరమ దేహాత్ముడగు యోగివలె ప్రకాశించెను. ఆ వంశము తారకా విమలమయిన యాకాశమనుటలో గూడ భ్రూమధ్య స్థానమున గనుపాపల నిలిపి కేవల మాకాశముగా నుపనిషత్తులచే బేర్కొనబడిన నిర్గుణ నిర్వికార పరబ్రహ్మ మందు కేవలమానందము తెలివి మాత్రము స్వరూపముగా గల నిరాకార మందు డెందమును కుంభగతవ్రదీపకలికా రూపమున నిలిపి చిచ్చంద్ర మండల మనబడు సహస్రారమందు స్వరూపోపరతి నందు బ్రహ్మవిద్వరిష్టుల యప్రాకృత సమాధి వైభవమందు ధ్వనింప బడినది. జలాశయములు (నదులు, సరస్సులు మొదలగునవి) అల్లనల్లన దినదినమించించుకగ తీరమును (ఒడ్డులను) జ్ఞానులు క్షేత్ర పుత్రాదులందు మిక్కిలిగా రూడమైన మమకారమునట్లు వడలు చుండెను. ఇది శ్రీమద్రామాయణములో శాంతవాస విషయము. ఆది కవి వాల్మీకి దీనినే శుచి శృంగార రసపరముగా ఉజ్జ్వల రస ప్రధానముగా నిట్లన్నారు.

వాల్మీకీ వ్యాసులు శుచి శృంగార శాంతరసముల నద్వైతానుభవ నిర్విశేషముగా దామనుభవించి నిజానుభవము నాత్మ సారస్వతో పాసకులకు విందు సేసినారు. అట్టి రసవత్తర ఘట్టములలో నిదియొకటి. హంస లింతమున్ను (వర్ష ఋతువు) మానస సరోవరమునకు వెళ్లి విడిచిన యుదకములతో అనేక యోగ విఘ్నములచే దెబ్బతిన్న యోగులట్లు పునర్యోగమును (కలయికను) పొందినది. ఇట హంస శబ్దమునకు హంసలు పరమ హంసలు నను నీ యతి విశేషులను దెల్పును. సముద్రుడు తరంగముల యలజడి తగ్గగా స్థిమితమై జలములతో క్రమముగా యోగసిద్ధి గడించి కదలని మతివలె మిక్కిలి నిండుదన మొంది విలసిల్లెను. అన్ని యెడల నుదకములు వండ్రు తిని విరిగి సర్వాత్మకుడైన విష్ణువు తెలియ బడగానే యుత్తమ మేధావుల మనస్సులట్లు మిక్కిలి ప్రసన్నము లయ్యెను. శరత్తులచే మబ్బులు వీడ గగనము యోగాగ్నిచే సకల క్లేశములు దగ్దములై దీపించు యోగుల మానసమట్లు దీపించెను. సూర్య కిరణములచే జనించిన తాపమును తారాపతి (చంద్రుడు) అహం మమాభిమానముచే (నేను నాదియను నహంకారముచే) బుట్టిన దుఃఖమును గొప్ప వివేకమట్లు శమింప జేసెను. నింగి నుండి మబ్బులను భూమి నుండి పంకమును (బురదను) ఉదకముల నుండి కాలుశ్యమును శరత్తు, ఇంద్రియార్థముల నుండి (శబ్దాది విషయముల నుండి) యింద్రియములను శ్రవణాదులను ప్రత్యాహారము వలె హరించెను. ప్రత్యాహారమనునది యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధ్యానధారణ సమాధులనెడి యోగము యొక్క నష్టాంగములలో నొకటి. విషయము లంటిన యింద్రియములను వాని నుండి ప్రత్యాహరించుట యనగా వెనుకకు తరలించుటకు ప్రత్యాహారమని సంకేతము. సరస్సు లందలి యుదకములు తొలుత పూరకముల చేత తరువాత కుంభకముల చేత అవ్వల రేచకముల చేతను దినదినము ప్రాణాయామ సాధన చేయుచున్న వాయన్నట్లుండెను. అనగా వర్షర్తువులో నీటిని బూరించుకొని (నింపుకొని) దానిని కుంచించుకొని (ఇమిడించుకొని) శరదృతువు నందు రేచించు చున్నవి (వడలు చున్నవి) తగ్గుదల నొందించు కొన్నవన్న మాట.

ఆకాశము చుక్కలును విమలములైన కాలమగు శరదృతువు రాగానే వ్రేపల్లె యందు ఇంద్రుని నారాధించు నుత్సవ ప్రయత్నము నందు వ్రజవాసులుత్సుకు లౌటగని పెద్దలం జూచి బుద్ధిశాలి కృష్ణుడు మనకింత హర్ష మొదవించు నీ యింద్రోత్సవమన నేమన నందగోపుడు సాదరముగ నతని కిట్లనియె.

శతక్రతువగు ఇంద్రుడు మేఘములకు నుదకములకు ప్రభువు. అతని ప్రేరణచే మేఘములు జలమయమైన రసమును వర్షించును. ఆ వర్షము వలన జనించిన పంటను మనము మఱియుం గల దేహులు నుపయోగించు కొనుచు బ్రతుకుదుము. దేవతలను దృప్తి పరతుము. ఆ పంట చేతనే ఈ గోవులు పాలుగలవై దూడలు గలవై సంతృప్తి నందును. ఇంద్రుడిచ్చిన వర్షముచే వర్ధిల్లు పంటలచే తుష్టములు పుష్టములు నగును గదా! పంట తృణము లేని భూమి గాని, ఆకలికి గుములు జనము గాని వృష్టినిచ్చు మేఘములు కనిపించు చోట కనిపింపవు. సూర్య కిరణములచే నీ భూమిపై గల నీరు పిదుక బడును. పర్జన్యుడు (ఇంద్రుడు) దానిని సర్వ లోకోత్పత్తికి మేఘముల ద్వారా భూమిపై వర్షించును. అందువలన వర్ష ఋతువు నందు రాజులెల్లరు, మనము మఱియుం గల మానవులు సమ్మోదముతో యజ్ఞములచే సురేశ్వరుడైన శక్రుని నర్చించును.

ఇంద్ర పూజ యెడల నిట్లా నందగోపుని పలుకులు విని దేవేంద్రునికి రోషము దెప్పింప దామోదరుం డిట్లనియె.

మనము మడిదున్ను వారము, కర్షకులము గాము. వాణిజ్య జీవులమునుం గాము. మనకు దైవము గోవులు. తండ్రీ! మనము వనములం దిఱుగు వారము. అన్వీక్షకి (తర్కము) త్రయి వార్త దండనీతి (అర్థశాస్త్రము) యనునవి నాల్గు విద్యలు. అందు వార్తను మాత్రమునే దెల్పునది వినుము. వ్యవసాయము వర్తకము మూడవది పశుపాలనమను నీమూడు వృత్తులకు సంబంధించినది వార్తయను నొక్కటే విద్య. భూమిదున్ను వ్యవసాయికుల వృత్తి కృషి, క్రయవిక్రయ వ్యాపార జీవుల వృత్తి పణ్యము. మనకు గోవే పరమవృత్తి. ఇట్లీ మూడు వృత్తులు వార్తయను దాని భేదములే. ఎవడే విద్యతో గూడి యుండునో వానికదే మహాదైవము. అదే పూజింప దగినదియు అర్చింప నైనదియు. అదే వాని కుపకారికయు. ఎవడు దేని ఫలమునుభావించుచు వేరొండు దానిం బూజించు నానరుడిహ మందు బరమందునునా శోభనమును బొందడు. కృష్యము (క్షేత్రము) నకు పరమావధి పొలిమేర. దాని కవధి వనము. వనమున కవధి గిరులు ఆ గిరులన్నియు మనకు పరమగతి. ద్వార బంధములు నా వరణములునున్న వారు గృహము పొలము గలవారు సుఖులు గారు ఎల్ల లోకమున సుఖించు వారు చక్రచారులు. అనగా బండ్లమీద తిరుగువారు. ఈ వనమున గిరులు కామ రూపములని విందుము. అవి యాయా రూపముగొని తమతమ చరియలం గ్రీడించును. వానియెడ నపరాధము సేయు వారిని ఆ పర్వతము లందలి యడవు లందుండు వారిని సింహాది రూపములతో నా పర్వతములు కడముట్టించును. అందువలన నీ గిరి యజ్ఞము గో అగ్నము మనము సేయదగినది. ఇంద్రునితో మనకేమి పని? గోవులు కొండలు మనకు దేవతలు. మంత్ర ప్రకాశిత దేవతా యజ్ఞమున దీక్షితులు విప్రులు. నాగలితో దున్నుటయను యజ్ఞము చేయు కర్షకులు కొండలందు వనము లందుండు మనము. గిరిగో యజ్ఞ ఫలులము. అందువలన గోవర్ధన శైలము వివిధ పూజా సామాగ్రులచే నర్చింప నగును. శాస్త్రవిధి ననుసరించి పవిత్రములగు పశువుల బలి యిచ్చి పూజింప నగును. శాస్త్రవిధి ననుసరించి పవిత్రములగు పశువుల బలి యిచ్చి పూజింప నగును. వ్రేపల్లెలోని ఎల్ల వస్తు సామగ్రిని గైకొనుడు. ఆలోచింప పనిలేదు. దాన విప్ర సంతర్పణము అతిథి సంతర్పణము కావింపుడు. అందు అర్చనము హోమము సేసి ద్విజులకు భోజనము పెట్టిన పిదప శరత్కాల కుసుమ మాలలను శిరస్సున దాల్చిన గోగణము ప్రదక్షిణము సేయు గాక! ఇది నా కభిమతము. దీనిని మీరు ప్రీతితో నాచరింతురేని దాన గోవులకు కొండకు నాకును ప్రీతి కలుగును.

అన నా కృష్ణుని పలుకు విని నందాది వ్రజవాసులు ప్రీతిచే మోములు విప్పార బాగు బాగనిరి. వత్సా! నీ మతము పరమ శోభనము. అది ఎల్ల సేసెదము. గిరి యజ్ఞము సాగింతుము. అనియట్లు గిరి యజ్ఞము గావించి పెరుగు పాయసము మాంసాదులతో గోవర్ధన శైలమునకు (బలి) నివేదన సేసిరి. వందలు వేలు ద్విజులకు సంతర్పనములు సేసిరి. అర్చితములైన గోవులు వృషభములు ఱంకెలు వేయుచు నీటితోడి మేఘము వలె గోవర్ధన గిరికి బ్రదక్షిణములు సేసినవి. ఆ కొండ నెత్తమున కృష్ణుడును రూపుగొన్న గోవర్ధన గిరిని నేనేయని గోపశ్రేష్ఠులు కొనివచ్చి నివేదించిన సర్వము నిండుగ నారగించెను. కృష్ణుడు నిజ రూపముననే యా గిరి మీదికి గోపకులతో నెక్కి తన రెండవ మూర్తి యగు గోవర్ధన శైలముం దాన యర్చించెను. ఆతడంత్ధాన మైనంతట గోపకులు వరములం బడసి గిరియజ్ఞ మిటుల నిర్వహించి తమ గోనిలయమునకు తిరిగి వచ్చిరి.