1 - పూర్వార్ధము - ప్రక్రియా పాదము అనుక్రమణిక

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్

జయతి పరాశరసూనుః సత్యవతీ హృదయనందనో వ్యాసః

యాస్యాస్యకమలగలితం వాజ్మయమమృతం జగత్ పిబతి

  ప్రపద్యే దేవమీశానం శాశ్వతం ధ్రువమవ్యయమ్

 మహాదేవం మహాత్మానం సర్వస్య జగతః పతిమ్

బ్రహ్మాణం లోకకర్తారం సర్వజ్ఞమ పరాజితమ్

 ప్రభుం భూతభవిష్యస్య సాంప్రతస్య సత్పతిమ్

 నారాయణునకు, మానవులలో శ్రేష్టుడగు నరునకు, సరస్వతీ దేవికి, వ్యాసునకు నమస్కరించి, తరువాత జయము (పురాణము)ను చెప్పవలెను. సరస్వతీ దేవి యొక్క హృదయమునకు ఆనందమును కలిగించు నట్టియు, పరాశరమహర్షి యొక్క కుమారుడనగు వ్యాసుడు సర్వోత్కర్షగానున్నాడు. ఆయన యొక్క ముఖపద్మము నుండి జారిన వాజ్మయము. అనే అమృతమును మానవులు పానము చేయుచున్నారు.

శాశ్వతుడు, నిత్యుడు, నాశము లేనివాడు, దేవతలలో కెల్లా గొప్పవాడు, మహాత్ముడు, జగత్తున కంతకు ప్రభువును ఈశ్వరుని శరణు వేడెదను-1. లోకములను సృజించిన బ్రహ్మదేవుని శరణువేడెదను. సర్వజ్ఞుడు, పరాజయము నెరుగనివాడు, భూత భవిష్యద్వర్త మానములకు ప్రభువు, సద్రూపుడునగు విష్ణువును శరణువేడెదను.

జ్ఞానప్రతిమం యస్య వైరాగ్య చ జగత్పతేః

 ఐశ్వర్యం చైవ ధర్మశ్చ సహసిద్ధి చతుష్టయ:

 య ఇమాన్పశ్యతే భావాన్నిత్యం సదసదాత్మకాన్

 ఆవిశంతి పునస్తం వై క్రియాభావార్థ మీశ్వరమ్

 లోకకృల్లోకతత్త్వజ్ఞో యోగమాస్థాయ తత్త్వవిత్

 అసృజత్ సర్వభూతాని స్థావరాణి చరాణి చ

 తమజం విశ్వకర్మాణం చిత్పతిం లోకసాక్షిణమ్

 పురాణాఖ్యాన జిజ్ఞాసుర్ర్వజామి శరణం ప్రభుమ్

జగన్నాథుడగు ఈశ్వరుని యందు సాటిలేని జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, నాల్గు సిద్ధులతో కూడిన ధర్మము గలవు-3. ఈశ్వరుడు క్షర (అసత్), అక్షర (సత్) పదార్థములకు నిత్యసాక్షిగా నున్నాడు. క్రియలకు, పదార్థములకు అధిష్టానమైన ఈశ్వరుని యందే ఈ లోకములన్నియు ప్రళయ కాలము నందు లీనమగును-4. ఈశ్వరుడు జగత్తును సృష్టించెను. ఈ జగత్తు యొక్క స్వరూపము ఆయనకు ఎరుకయే. తత్త్వము నెరిగిన పరమాత్మ ధ్యానయోగము నందున్నవాడై ఈ చరాచర ప్రాణి వర్గము నంతనూ సృజించెను-5. నేను పురాణ గాథలను తెలియగోరి, పుట్టుకలేనివాడు, సర్వకర్మాధ్యక్షుడు, చైతన్యఘనుడు, ముల్లోకములకు సాక్షి, జగన్నాథుడునగు పరమేశ్వరుని శరణువేడెదను.

బ్రహ్మవాయు మహేంద్రేభ్యో నమస్కృత్య సమాహితః

 ఋషీణాం చ వరిష్ఠాయ వసిష్ఠాయ మహాత్మనే

 తన్నప్త్రే చాతియశసే జాతకర్ణాయ చర్షయే

 వసిష్ఠాయ చశుచ యే కృష్ణ ద్వైపాయనాయ చ

  పురాణం సంప్రవక్ష్యామి బ్రహ్మోక్తం వేదసమ్మితమ్

ధర్మార్థ న్యాయసంయుక్తై రాగమైః సువిభూషితమ్    

బ్రహ్మకు, వాయుదేవునకు, మహేంద్రునకు, ఋషులలో శ్రేష్ఠుడు మహాత్ముడునగు వశిష్ఠునికి ఆయన మనమడు అయిన జాతూకర్ణ మహర్షికి, మరియు పరమ పావనుడగు కృష్ణ ద్వైపాయనునకు నమస్కరించి-8, ఏకాగ్రమగు మనస్సు గలవాడనై బ్రహ్మచే చెప్పబడిన పురాణమును చెప్పెదను ఈ పురాణము వేదములకు అనురూపమైనది. ధర్మార్థములతో, యుక్తులతో కూడిన వివిధ శాస్త్రములు దీని యందు అలరారుచున్నవి.

అసీమకృష్ణే విక్రాంతే రాజన్యేఽనుపమత్విషి

 ప్రశాసతీమాం ధర్మేణ భూమిపసత్తమే

ఋషయః సంశితాత్మనః సత్యవ్రత పరాయణాః

 ఋజవో నష్టరజసః శాంతా దాంతా జితేంద్రియాః

 ధర్మక్షేత్రే కురుక్షేత్రే దీర్ఘసత్రం తు ఈజిరే

 నద్యాస్తీరే దృషద్వత్యాః పుణ్యాయాః శుచిరోధసః 

పరాక్రమశాలి, సాటిలేని తేజస్సు గలవాడు, రాజులలో మేటి యగు ఆసీమకృష్ణ మహారాజు ధర్మబద్దముగా ఈ భూమిని పాలించుచుండగా-10, వశీకృతమగు అంతః కరణము గలవారు, సత్యమును పలుకుట అను వ్రతమునకు అంకిత మైనవారు, కపటము నేరుంగని వారు, రజో గుణము లేనివారు, అంతరింద్రీయ బాహ్యేంద్రియ నిగ్రహము గలవారునగు ఋషులు-11, ధర్మభూమి యగు కురుక్షేత్రము నందు, స్వచ్చమగు ప్రవాహము గల దృషద్వతి యనే పుణ్యనదీ తీరము నందు చిరకాలము కొనసాగే సత్ర యాగము ననుష్ఠించిరి.

దీక్షితాస్తే యథాశాస్త్రం నైమిషారణ్య గోచరాః

 ద్రష్టుం తాన్స మహాబుద్ధిః సూతః పౌరాణికోత్తమ:

 లోమాని హర్షయాం చక్రే శ్రోతృణాం యత్ సుభాషితైః

 కర్మణా ప్రథితస్తేన లోకేఽస్మిన్ లోమహర్షణ

 తపః శ్రుతాచార నిధేర్వేద వ్యాసస్య ధీమతః

 శిష్యో బభూవ మేధావీ త్రిషు లోకేషు విశ్రుతః

 పురాణవేదో హ్యఖిలో యస్మిన్ సమ్యక్ ప్రతిష్ఠితః

 సూక్తాః సుపరిభాషాశ్చ భూమావోషధయో యథా   

నైమిషారణ్యము నందు నివసించే ఆ ఋషులు శాస్త్ర ప్రకారముగా యజ్ఞదీక్షను స్వీకరించిరి. వారిని దర్శించుటకు మహాబుద్దీశాలి, పౌరాణిక శ్రేష్టుడునగు సూతుడు విచ్చేసెను-13. సూతుడు తన సుభాషితములచే శ్రోతల రోమములు నిక్కబొడుచు కొనునట్లు చేసెడివాడు. ఇట్టి ప్రవచన ప్రభావము వలన ఆయనకు లోకములో లోమహర్షణుడనే ప్రసిద్ధి కలిగినది-14. ముల్లోకములలో పేరుగాంచిన, బుద్ధిశాలియగు సూతుడు తపస్సునకు, పాండిత్యమునకు, శీలమునకు నిధి, జ్ఞానియగు వేదవ్యాసుని వద్ద శిష్యరికము చేసెను-15. ఆయన యందు పూర్ణమగు పురాణ రూపమైన వేదమే గాక, విశాలమైన మహాభారత రూపములో వర్ధిల్లిన సరస్వతి కూడా స్థిరముగా నుండెను-16. ధర్మార్థ కామమోక్షములను వివరించే గాథలు, సూక్తములు, మరియు సుభాషితములు ఆయన యందు, భూమియందు ఔషధులవలె, విలసిల్లినవి.

సతాన్ న్యాయేన సుధియో న్యాయవిన్ముని పుంగవాన్

 అభిగమ్యోప సంసృత్య నమస్కృత్య కృతాంజలి:

 తోషయామాస మేధావీ ప్రణిపాతేన తానృషీన్

తే చాపి సత్రిణః ప్రీతాః ససదస్యా మహౌజస

 తస్మై సామ చ పూజాం చ యథావత్ ప్రతి పేదిరే

 అథ తేషాం పురాణస్య శుశ్రూషా సమపద్యత

సదాచారము నెరింగిన ఆ సూత మహర్షి ఆ ధీశాలురగు ముని శ్రేష్ఠులను సమీపించి, దోసిలి యొగ్గి నమస్కరించెను -18. ధీమంతుడైన ఆ మహర్షి సాష్టాంగ నమస్కారము చేసి, ఆ ఋషులను సంతోష పెట్టెను. సత్రయాగము నందున్న మహా తేజశ్శాలురగు ఆ ఋషులు సభా సదులతో కూడి సంతోషించిరి-19. వారు ఆ మహర్షిని విధి విధానముగా సత్కరించి, ప్రీతికరమగు మాటలను పలికిరి. అపుడు వారికి పురాణమును వినాలనే కోరిక కలిగెను.

దృష్ట్యా తమతి విశ్వస్తం విద్వాంసం లోమహర్షణమ్

 తస్మిన్ సత్రే గృహపతిః సర్వశాస్త్ర విశారద

  ఇంగితైర్బావ మాలక్ష్యతేషాం సూతమనోదయత్

 త్వయా సూత మహాబుద్ధిర్బ గవాన్ బ్రహ్మవిత్తమ

  ఇతిహాస పురాణార్థం వ్యాసః సమ్యగుపాసితః

 దుదోహ వై మతిం తస్య త్వం పురాణాశ్రయాం కథామ్

  ఏషాం చ ఋషి ముఖ్యానాం పురాణం ప్రతి ధీమతామ్

 శుశ్రూషాస్తి మహాబుద్దే తచ్చ్రావయితు మర్హసి

సర్వేహమే మహాత్మానో నానాగోత్రాః సమాగతాః

 స్వాన్ స్వాన్ వంశాన్ పురాణైస్తు శృణుయు ర్భ్రహ్మవాదిన:

 సపుత్రాన్ దీర్ఘసత్రేఽస్మిన్ శ్రావయేథా మునీనథ

 దీక్షిష్యమా ణైరస్మాభిస్తేన ప్రాగసి సంస్కృత:

మిక్కిలి శ్రద్ధేయుడు, విద్వాంసుడు నగు ఆ లోమహర్షణుని ఆ స(తయాగము నందలి యజమాని చూచేను. ఆయన కూడా శాస్త్రములన్నిటిలో దిట్ట -21. ఆయన ఋషుల ముఖ కవళికలను బట్టి వారి హృదయములోని భావమును తెలుసుకొని, సూతుని ఈ విధముగా ప్రోత్సహించేను. హే సూతాః నీవు మహా బుద్ధిశాలి, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడునగు వేదవ్యాస భగవానుని-22, ఇతిహాసపురాణములను తెలుసుకొనుట కొరకై చక్కగా సేవించితివి. నీవు ఆయన బుద్ధి (అనే గోవు) నుండి పురాణ గాథలను పితికితివి -23. హే మహాబుద్దే! ధీమంతులగు ఈ ఋషి శ్రేష్ఠులు పురాణమును వినగోరుచున్నారు. కాన, నీవు పురాణమును వినిపింపవలెను-24. వీరందరు మహాత్ములు, బ్రహ్మవేత్తలు, వివిధ గోత్రములవారు ఒకచో సమకూడిరి. వీరు తమ తమ వంశములను గూర్చి పురాణ వచనముల ద్వారా వినేదరు గాక!- దీర్ఘ సత్రయాగములో తమ పుత్రులతో గూడియున్న ఈ మునులకు నీవు వినిపింపుము. మేము యాగమునకు ముందు దీక్షను స్వీకరించబోయే సమయములో నిన్ను స్మరించి యుంటిమీ.

ఇతి సన్నోదీతః సూతస్తైరేవ మునిభిః పురా

పురాణార్థం పురాణజ్ఞైః సత్యవ్రత పరాయణైః॥।

  స్వధర్మ ఏష సూతస్య సద్బిర్దృష్టః పురాతనైః

 దేవతానా మృషీణాం చ రాజ్ఞాం చామిత తేజసామ్

 వంశానాం ధారణం కార్యం శ్రుతానాం చ మహాత్మనామ్

 ఇతిహాస పురాణేఘ దిష్టా యే బ్రహ్మవాది భిః   

పూర్వము సత్యవాక్య పాలనా పరాయణులు, పురాణముల నెరింగిన వారునగు మునులు పురాణము కొరకై సూతుని ఈ విధముగా ప్రోత్సహించిరి-27. ఇది సూతునకు స్వధర్మమని ప్రాచీనులగు ఋషులు భావించిరి. దేవతల యొక్క, ఋషుల యొక్క, మరియు గొప్ప తేజశ్శాలురగు రాజుల యొక్క-28, వంశములను సూతుడు గుర్తుంచుకొనవలెను. మరియు, ఇతిహాస పురాణములలో బ్రహ్మవేత్తలచే నిర్దేశింపబడి ప్రఖ్యాతి గాంచిన మహాత్ములను గురించి సూతుడు తెలుసుకొని యుండవలెను.

న హి వేదేష్వధీకారః కశ్చిత్ సూతస్య దృశ్యతే

వైన్యస్య హి పృథోర్యజ్ఞే వర్తమానే మహాత్మనః

 సుత్యాయా మభవత్ సూతః ప్రథమం వర్ణ వైకృతః

ఐంద్రేణ హవిషా తత్ర హవిః పృక్తం బృహస్పతే:

 జుహావేంద్రాయ దేవాయ తతః సూతో వ్యజాయత

 ప్రమాదాత్తత్ర సంజజ్ఞే ప్రాయశ్చిత్తం చ కర్మసు

 శిష్యహవ్యేన యత్ పృక్తమభిభూతం గురోర్హవిః

 అధరోత్తర చారేణ జజ్ఞే తద్వర్ణ వైకృతః    

వేదముల యందు సూతున కేమియూ అధికారము లేదు. ఏలయన, వేనుని కుమారుడు, మహా పురుషుడునగు పృథువు యజ్ఞమును చేయుచుండగా-30, సుత్య (యజ్ఞమునకు అంగమగు ఒక కర్మ) జరుగుచుండగా, మొదటిసారిగా వర్ణ వికృతి కలిగిన సూతుడు జన్మించెను. ఆ యజ్ఞములో బృహస్పతికి ఉద్దేశించిన హవిస్సు ఇంద్రుని హవిస్సుతో కలిసిపోయేను-31. దానిని దేవేంద్రుని కొరకు హోమము చేసిరి. అపుడు సూతుడు జన్మించెను. ఆ యజ్ఞములో ఇట్టి పొరపాటు వలన యజ్ఞాంగకర్మలలో ప్రాయశ్చిత్తమునకు అవసరమేర్పడెను-32. గురువునకు ఉద్దేశించిన హవిస్సు శిష్యుని హవిస్సుతో కలిసి, తిరస్కారమునకు గురి అయ్యెను. ఇట్లు నికృష్టమును ఉత్కృష్టముతో కలిపి అనుష్ఠించుట వలన వర్ణ వికృతి కలిగిన సూతుడు జన్మించెను.

యచ్చ క్షత్రాత్ సమభవత్ బ్రాహ్మణా వరయోనితః

 తతః పూర్వేణ సాధర్మ్యాత్ తుల్యధర్మా ప్రకీర్తిత

 మధ్యమో హ్యేష సూతస్య ధర్మః క్షత్రోప జీవనమ్

 రథనాగాశ్వ చరితం జఘన్యం చ చికిత్సతమ్

  తత్ స్వధర్మమహం పృష్టో భవద్భి ర్భ్రహ్మవాదిభిః

 కస్మాత్ సమ్యజ్న విబ్రూయాం పురాణమృషి పూజితమ్ 

 బ్రాహ్మణి యందు క్షత్రియుని వలన సూతుడు జన్మించెను. కాని, బ్రాహ్మణత్వ లక్షణ ములుండుటచే, సూతుని ధర్మము బ్రాహ్మణ సదృశమని చెప్పబడెను-34. క్షత్రియుల నాశ్రయించి, రథమును నడుపుట, ఏనుగులను, గుర్రములను సంరక్షించుట సూతునకు మధ్యమ ధర్మము. వైద్య వృత్తి అధమము-35. కావున బ్రహ్మవేత్తలగు మీరు నన్ను స్వధర్మమునకు, చెందిన విషయమును అడిగితిరి. ఋషులచే పూజింపబడే పురాణమును నేను శ్రద్ధగా ప్రవచనమును ఏల చేయను?

పితౄణాం మానసీకన్యా వాసవీ సమపద్యత

 అపధ్యాతా చ పితృభిర్మత్స్యయోనౌ బభూవ సా

 అరణీవ హుతాశస్య నిమిత్తం యస్య జన్మనః

 తస్యాం జాతో మహాయోగీ వ్యాసో వేదవిదాంవరః

 తస్మై భగవతే కృత్వా నమో వ్యాసాయ వేధసే

 పురుషాయ పురాణాయ భృగువాక్య ప్రవర్తినే

 మానుషచ్ఛద్మ రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే

 జాతమాత్రం చ యం వేద ఉపస్థే ససంగ్రహః

 ధర్మమేవ పురస్కృత్య జాతూకర్ణాదవాప తమ్

మతిం మంథాన మావిధ్య యేనాసౌ శ్రుతి సాగరాత్

 ప్రకాశం జనితో లోకే మహాభారత చంద్రమాః

 వేదద్రుమశ్చ యం ప్రాప్య సశాఖ:సమపద్యత

భూమి కాలగుణాన్ ప్రాప్య బహుశాఖోయథా ద్రుమః

తస్మాదహ ముపశ్రుత్య పురాణం బ్రహ్మవాదినః

సర్వజ్ఞాత్సర్వవేదేషు పూజితా ద్దీప్తతేజసః

పురాణం సం(ప్రవక్ష్యామి యదుక్తం మాతరిశ్వనా

పృష్టేన మునిభిః పూర్వం నైమిషీయైర్మహాత్మభిః  

 పితృ దేవతలకు వాసవియను మానస పుత్రిక జన్మించెను. ఆమె పితృ దేవతలచే మానసికముగా శపింపబడి మత్స్య కన్యగా జన్మించెను-37. అరణి నుండి అగ్ని జన్మించి నట్లు, ఆమె యందు గొప్ప యోగి, వేదవేత్తలలో శ్రేష్ఠుడునగు వ్యాసుడు జన్మించెను-38. మహా విద్వాంసుడగు ఆ వ్యాసభగవానునకు నమస్కారము. పురాణ పురుషుడు, జగన్నాథుడునగు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి వాక్యమును సత్యము చేయగోరి-39, వేద వ్యాస రూపముగా మనుష్య దేహమును స్వీకరించెను. పుట్టుటతోడనే సంపూర్ణ వేదము సాంగముగా ఆయనకు సాక్షాత్కరించేను-40. కానీ, ఆయన విద్యాధర్మమును పాలించి, జాతకర్ణుని వద్ద వేదమును ఆధ్యయనము చేసెను. ఆయన వేదములు అను సముద్రమును, బుద్దిని, కవ్వముగా చేసి మథించగా-41, మహాభారతమనే చంద్రుడు ఉదయించి, లోకమును ప్రకాశింపజేసెను. సారవంతమగు నేల యందున్న చెట్టు కొంత కాలములో అనేక శాఖలుగా విస్తరించిన తీరున వేదమనే వృక్షము ఆయన వలన శాఖలు కలది ఆయెను. బ్రహ్మవేత్త యగు ఆయన నుండి నేను పురాణమును వినియుంటిని-42, 43. ఆయన సర్వజ్ఞుడు. సర్వ వేదముల యందు కీర్తింపబడినాడు. మహా తేజశ్శాలి. ఆయన నుండి పొందిన పురాణమును నేను ప్రవచించెదను. ఈ పురాణమును పూర్వము నైమిషారణ్యవాసులు, మహాత్ములునగు మునులు కోరగా, వాయు దేవుడు చెప్పి యుండెను.

మహేశ్వరః పరో ఽవ్యక్తశ్చతుర్బాహు శ్చతుర్ముఖః

 అచింత్యశ్చా ప్రమేయశ్చ స్వయంభూర్హే తురీశ్వరః

 అవ్యక్తం కారణం యద్యన్నిత్యం సదసదాత్మకమ్

 మహదాది విశేషాంతం సృజతీతి వినిశ్చయ

 అండం హిరణ్మయం చైవ బభూవాప్రతిమం తతః

 అండస్యావరణం చాద్భిరపామపి చ తేజసా

 వాయునా తస్య నభసా నభోభూతాదినా వృతమ్

 భూతాదిర్మహతా చైవ అవ్యక్తే నావృతో మహాన్     

మహేశ్వరుడు సర్వోత్కృష్టుడు, ఇంద్రియ గోచరుడు కాడు; నాల్గు చేతులు, నాల్గు ముఖములు గలవాడు; మనస్సునకు గోచరము కానివాడు; ప్రత్యక్షాది ప్రమాణములచే పొంద శక్యము కానివాడు; స్వయం సిద్దమగు జగత్కారణుడు; మరియు జగన్నియంత-45. ఆయనయే అవ్యక్త (మూల ప్రకృతి) రూపముగా జగత్కారణమై యున్నాడు. ఈ మూల ప్రకృతి నుండియే మహత్తు మొదలుకొని అణువుల విశేష ధర్మముల వరకు గల జగత్తు పుట్టినది అని శాస్త్ర నిర్ణయము. ఈ జగత్తు అధిష్టాన(ఈశ్వరుడు) రూపముగా సత్; జగద్రూపముగా అసత్ (మిథ్య)-46. మూల ప్రకృతి నుండి సాటిలేని, తేజోమయమగు (హిరణ్య) అండము పుట్టినది. ఈ అండము జలము చేతను, జలము తేజస్సు చేతను ఆవరింపబడి యుండెను-47. తేజస్సు వాయువు చేతను, వాయువు ఆకాశము చేతను ఆవరింపబడి యుండెను. ఆకాశము సమష్టి అహంకారము చేతను, సమష్టి అహంకారము మహత్తు (సమష్టి బుద్ధి) చేతను, మహత్తు మూల ప్రకృతి చేతను ఆవరింపబడి యుండెను.

అతోఽత్ర విశ్వదేవానా మృషీణాం చోపవర్జితమ్

నదీనాం పర్వతానాం చ ప్రాదుర్భావోఽత్ర శస్యతే

 మన్వంతరాణాం సర్వేషాం కల్పానాం చోపవర్ణనమ్

 కీర్తనం బ్రహ్మక్షత్రస్య బ్రహ్మజన్మ చ కీర్త్యతే

  అతో బ్రహ్మణి స్రష్టృత్వం ప్రజా సర్గోపవర్ణనమ్

 అవస్థాశ్చాత్ర కీర్త్యంతే బ్రహ్మణోఽ వ్యక్తజన్మనః

కల్పానాం వత్సరాశ్చైవ జగతః స్థాపనం తథా

 శయనం చ హరేరత్ర పృథివ్యుద్ధరణం తథా      

ఈ పురాణము నందు దేవత లందరియొక్క, ఋషుల యొక్క నదుల యొక్క, మరియు పర్వతముల యొక్క ఉత్పత్తి వర్ణింపబడును-49. అన్ని మన్వంతరములు, కల్పములు కూడా వర్ణింపబడును. బ్రాహ్మణ, క్షత్రియ వంశముల ఉత్పత్తి, బ్రహ్మగారి పుట్టుక కూడ కీర్తింపబడును-50. బ్రహ్మ యందు సృష్టి కర్తృత్వము, ప్రజలయొక్క సృష్టి మరియు మూలప్రకృతినుండి జన్మించిన బ్రహ్మయొక్క అవస్థలుకూడా దీనియందు కీర్తింపబడును-51. కల్పములలోని సంవత్సరములు, జగత్తుయొక్క స్థితి, విష్ణువు శయనించుట, మరియు భూమిని ఉద్ధరించుట దీనియందు వర్ణింపబడును.

సన్నివేశః పురాదీనాం వర్ణాశ్రమవిభాగశః

వృక్షాణాం గృహసంస్థానాం సిద్ధానాం చ వినాశనమ్

 యోజనానాం పథాం చైవ సంచరో బహువిస్తరః

 స్వర్గో స్థానవిభాగశ్చ మర్త్యానాం భువిచారిణమ్

 వృక్షనారకికీటత్వం మర్త్యానాం పరికీర్తితమ్

దేవతానామృషీణాం చ ద్వే సృతీ పరికీర్తితే

 అన్నాదీనాం తనూనాం చ సర్జనం త్యజనం తథా

వర్ణాశ్రమ  విభాగ పూర్వకముగ నగరాదులను తీర్చిదిద్దుట, ఇంటిలో నుండు వృక్షముల అమరిక, సిద్ధ పురుషులు నశించుట-53, బహు దూరము వరకు విస్తరించిన మార్గములు, వాటి నిడివి, వాటి యందలి సంచారము, స్వర్గమునందు స్థానముల విభాగము, భూలోకమునందుండు మానవులస్థానములు వర్ణింపబడును-54. వృక్షములు, ఔషధులు, మరియు లతలు వర్ణింపబడును. మానవులు పాపము వలన పొందే వృక్షకీలాదిజన్మలు కీర్తింపబడును-55. దేవతలకు, ఋషులకు సంబంధించిన రెండు మార్గములు, అన్నము, శరీరములు మొదలగు వాని సృష్టి మరియు శరీర త్యాగము కీర్తింపబడినవి.

ప్రథమం సర్వశాస్త్రాణాం పురాణం బ్రహ్మణా స్మృతమ్

 అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిస్సృతాః

 అంగాని ధర్మశాస్త్రం చ వ్రతాని నియమాస్తథా

పశూనాం పురుషాణాం చ సంభవః పరికీర్తితః

 తథా నిర్వచనం ప్రోక్తం కల్పస్య చ పరిగ్రహః

 నవ సర్గాః పునః ప్రోక్తా బ్రహ్మణో బుద్ధిపూర్వకా:

 త్రయోఽకన్యే బుద్ధి పూర్వాస్తు తతో లోకానకల్పయత్

 బహ్మణోఽవయవేభ్యశ్చ ధర్మాదీనాం సముద్భవ       

బ్రహ్మ శాస్త్రములన్నింటిలో ముందుగా పురాణమును స్మరించెను. తరువాత, ఆయన ముఖముల నుండి వేదములు బయల్వెడలినవి-57. వేదాంగములు, ధర్మశాస్త్రము, వ్రతములు, నియమములు, పశువుల ఉత్పత్తి, మరియు మానవుల ఉత్పత్తి కూడా ఈ పురాణము నందు వర్ణింపబడినవి-58. మరియు కల్పము యొక్క మూలము నిర్వచనము చెప్పబడినవి. బ్రహ్మ చేసిన తొమ్మండుగురు మానస పుత్రుల సృష్టి చెప్పబడినది-59. ఇంతే గాక, బ్రహ్మ ఇంకనూ ముగ్గురు మానస పుత్రులను సృజించి, తరువాత లోకములను సృజించెను. బ్రహ్మ యొక్క అవయవముల నుండి ధర్ముడు మొదలగు వాని పుట్టుక వర్ణింపబడెను.

యే ద్వాదశ ప్రసూయంతే ప్రజాః కల్పే పునః పునః

కల్పయోరంతరం ప్రోక్తం ప్రతిసంధిశ్చ యస్తయోః

 తమో మాత్ర వృతత్వాచ్చ బ్రహ్మణోఽ ధర్మ సంభవః

 తథైవ శతరూపాయాః సంభవశ్చ తతః పరమ్

 ప్రియవ్రతోత్తాన పాదౌ ప్రసూత్యా కూతయశ్చ తాః

 కీర్త్యంతే ధూతపాప్మానో యేషు లోకాః ప్రతిష్ఠితా

 రుచేః ప్రజాపతేశ్చోర్ద్వ మాకూత్యాం మిథునోద్భవః

ప్రసూత్యామపి దక్షస్య కన్యానాం ప్రభవస్తతః

 దాక్షాయణీషు చాప్యూర్ధ్వం శ్రద్ధాద్యాసు మహాత్మనామ్

 ధర్మస్య కీర్త్యతే సర్గః సాత్త్వికస్య సుఖోదయ:  

ప్రతి కల్పము నందు మరల జన్మించే ఈ పన్నెండుగురు పురుషులు, కల్పముల మధ్యన ఉండే కాలము, మరియు వాటి సంధి కాలము వర్ణింపబడినవి-61. తమోగుణముచేత పూర్తిగా ఆవరింపబడిన బ్రహ్మ నుండి అధర్మము పుట్టుట, ఆ తరువాత శతరూప యొక్క జన్మ వర్ణింపబడినవి-62. తరువాత ప్రియవ్రత, ఉత్తానపాదుడు, ప్రసూతి, ఆకూతి కీర్తింపబడుదురు. వీరి యందు క్షాళితము చేయబడిన పాపము గల ప్రజలు ప్రతిష్టితులై యుందురు 63. తరువాత, రుచి ప్రజాపతికి ఆకూతి యందు ఇద్దరు సంతానము కలుగుట, దక్షునకు ప్రసూతి యందు అనేక కన్యలు జన్మించుట-64, ఆ తరువాత ధర్ముడు మహా పతివ్రతలైన శ్రద్ద మొదలగు దక్షుని కుమార్తెల యందు గావించిన సుఖదాయకము, సత్య గుణప్రధానమునగు సృష్టి కీర్తింపబడును.

తథాఽ ధర్మస్య హింసాయాం తామసోఽ శుభలక్షణః

 మహేశ్వరస్య సత్యాం చ ప్రజాసర్గః ప్రకీర్తిత

 నిరామయం చ బ్రహ్మాణం తాదృశం కీర్తితం పునః

 యోగం యోగనిధిః ప్రాహ ద్విజానాం ముక్తికాంక్షిణామ్

 అవతారశ్చ రుద్రస్య మహాభాగ్యం తథైవ చ

 త్త్రైవేదికాం కథాం చాపి సంవాదః పరమో మహాన్

 బ్రహ్మ నారాయణాభ్యాం చ యత్ర స్తోత్రం ప్రకీర్తితమ్

 స్తుతస్తాభ్యాం స దేవేశ స్తుతోష భగవాన్ శివః  

మరియు అధర్మునకు హింసయందు తమోగుణ ప్రధానమైన, అమంగళ లక్షణములతో కూడిన ప్రజా సృష్టి వర్ణింపబడెను. ఇంతే గాక, మహేశ్వరునకు సతి యందు కలిగిన ప్రజా సృష్టి కీర్తింపబడినది-66. దోష రహితుడగు బ్రహ్మ కీర్తింపబడెను. యోగ శాస్త్రము నందు నిధియగు పరమేశ్వరుడు మోక్షమును గోరు ద్విజులకు యోగమును ఉపదేశించెను 67. రుద్రుని అవతారము, మరియు ఎనలేని సంపద, మూడు వేదములకు సంబంధించిన గాధ, బ్రహ్మ నారాయణులతో రుద్రునకు జరిగిన శ్రేష్ఠమగు సంవాదము వర్ణింపబడును-68. వారిద్దరు ఆ దేవదేవుని స్తుతించగా, ఆయన ఎంతయో సంతసించెను. ఈ స్తోత్రము కూడా ఆ పురాణములో వర్ణింపబడినది.

ప్రాదుర్భావోఽథ రుద్రస్య బ్రహ్మణోంఽగే మహాత్మనః

 కీర్త్యతే నామ హేతుశ్చ యథాఽకరోదీన్మహామ నాః

 రుద్రాదీని యథాహ్యష్టౌ నామాన్యాప్నోత్ స్వయంభువః

యథా చ తైర్వ్యాప్తమిదం త్రైలోక్యం సచరాచరమ్

 భృగ్వాదీనామృషీణాం చ ప్రజాసర్గోప వర్ణనమ్

వసిష్ఠస్య చ బ్రహ్మర్షేర్యత్ర గోత్రానుకీర్తనమ్

 అగ్నే: ప్రజాయాః సంభూతిః స్వాహాయాం యత్ర కీర్తితా

 పితృణాం ద్వీప్రకారాణాం స్వధాయాస్తద నంతరమ్   

తరువాత బ్రహ్మ యొక్క అంగము నందు పరమాత్మయగు రుద్రుని ఆవిర్భావము, ఆయన నామములోని వైశిష్ట్యము, మరియు గొప్ప మనస్సు గల రుద్రుడు రోదించుటకు గల కారణము కీర్తింపబడును-70. స్వయంభువుడు (అనగా సర్వ కారణ కారణుడు, అజుడు, స్వయముగా ప్రకాశించు జగత్పిత) అగు శివుడు 'రుద్ర' మొదలగు ఎనిమిది నామములను పొందిన తీరు, మరియు స్థావర జంగమాత్మకమగు ఈ ముల్లోకములు శివుని ఆ ఎనిమిది రూపములచే వ్యాప్తమై యున్న విధము వర్ణింపబడును-71. భృగు మొదలగు ఋషుల ప్రజా సృష్టి, మరియు బ్రహ్మర్షి యగు వశిష్టుని గోత్రము ఈ పురాణములో కీర్తింపబడును-72. అగ్నికి స్వాహా దేవి యందు కలిగిన సంతానము వర్ణింపబడును. తరువాత, రెండు రకముల పితృ దేవతలకు స్వధా దేవి యందు కలిగిన సంతానము కీర్తింపబడును.

పితృవంశ ప్రసంగేన కీర్త్యతే చ మహేశ్వరాత్

 దక్షస్య శాపః సత్యర్థే భృగ్వాదీనాం చ ధీమతామ్

 ప్రతి శాపశ్చ రుద్రస్య దక్షాదద్భుత కర్మణః

 ప్రతిషేధశ్చ వైరస్య కీర్త్యతే యత్ర విస్తరాత్

తేషాం నియోగో ద్వీపేషు దేశేషు చ పృథక్ పృథక్

 స్వాయంభువస్య సర్గస్య తతశ్చాప్యను కీర్తనమ్

ఉక్తో నాభేర్నిసర్గశ్చ రజసశ్చ మహాత్మనః

 ద్వీపానాం ససముంద్రాణాం పర్వతానాం చ కీర్తనమ్

ఈ పితృ వంశ ప్రసంగము తరువాత, మహేశ్వరుడు సతీదేవి విషయములో దక్షునకు, భృగుడు మొదలగు ధీమంతులగు ఋషులకు శాపము నిచ్చిన ఘట్టము వర్ణింపబడును-74. విస్మయమును కలిగించే కర్మల నాచరించు దక్షుడు రుద్రునకు తిరిగి శాపమునిచ్చుట, ఆ తరువాత వైరము తొలగుట అను వృత్తాంతము ఈ పురాణములో వివరముగా వర్ణింపబడినది-75. పై విధముగా సృష్టింపబడిన వారు వేర్వేరు ద్వీపములలో వేర్వేరు దేశములలో నియోగింపబడిరి. తరువాత స్వాయంభువమనువు యొక్క సృష్టి కీర్తింపబడును. మరియు, నాభి యొక్క సృష్టి కీర్తింపబడును-76. మరియు నాభి యొక్క సృష్టి మహాత్ముడగు రజసుని సృష్టి వర్ణింపబడును. ఇంతేగాక, ద్వీపములు సముద్రములు, పర్వతములు వర్ణింపబడును.

వర్షాణాం చ నదీనాం చ తద్భేదానాం చ సర్వశః

 ద్వీపభేద సహస్రాణా మంతర్భేదశ్చ సప్తసు

 విస్తరాన్ మండలాచ్చైవ జంబూద్వీప సముద్రయోః

 ప్రమాణం యోజనాగ్రేణ కీర్త్యతే పర్వతైః సహ

 హిమవాన్ హేమకూటస్తు నిషేధో మేరురేవ చ

 నీల: శ్వేతః శృంగవాంశ్చ కీర్త్యంతే వర్షపర్వతాః

 తేషామంతర విష్కంభా ఉచ్చ్రాయాయా మవిస్తరాః

 కీర్త్యతే యోజనాగ్రేణ యే చ తత్ర నివాసినః    

కురు, ఇలావతాది దేశములు, నదులు, వాటి ఉప నదులు, సప్త ద్వీపములు, వాటిలోని వేలాది అవాంతర భేదములు -78, జంబూద్వీప, సముద్రముల మండల విస్తారము, యోజనములలో వాటి నిడివి, మరియు వాటి యందలి పర్వతములు -79, హిమవంతుడు, హేమకూటము, నిషధము మేరువు, నీలము, శ్వేతము, శృంగవాన్, అనే వర్ష (దేశ) పర్వతములు కీర్తింపబడును-80. ఆ పర్వతముల చుట్టు కొలత, ఎత్తు, వైశాల్యము, విస్తారములు యోజన ప్రమాణములో ఈయబడును. మరియు ఆ పర్వతములలో నివసించు జనులనీ పురాణము వర్ణించును.

భారతాదీని వర్షాణి నదీభిః పర్వతైస్తథా

భూతైశ్చోప నివిష్టాని గతిమద్భిర్ధ్రువైస్తథా

 జంబూద్వీపాదయో ద్వీపా: సముద్రైః సప్తభిర్వృతాః

తతశ్చాప్యమ్మయీ భూమిర్లోకాలోకశ్చ కీర్త్యతే

 అండస్యాంతస్త్విమేలోకాః సప్తద్వీపా చ మేదినీ

 భూరాదయశ్చ కీర్త్యంతే వరణైః ప్రాకృతైః సహ

 సర్వం చ తత్ ప్రధానస్య పరిమాణైక దేశికమ్

 సవ్యాసపరిమాణం చ సంక్షేపేణైవ కీర్త్యతే      

భారత మొదలగు దేశములు, వాటిలోని నదులు, పర్వతములు, చలనము గల ప్రాణులు, చనలము లేని ప్రాణులు 82, ఏడు సముద్రములచే చుట్టు వారబడియున్న జంబూ ద్వీపము మొదలగు ద్వీపములు, ఆ తరువాత జలమయమగు భూమి, లోకాలోక పర్వతము వర్ణింపబడును-83. ఈ లోకములు, మరియు ఏడు ద్వీపములతో కూడిన భూమి, ఆ హిరణ్యాండములోపల నున్నవి. భూరాదిలోకములు, వాటిని చుట్టు వారియున్న పదార్థములు కూడా వర్ణింపబడును-84. ఇది అంతా ప్రధానము (మూల ప్రకృతి) యొక్క పరిమాణములో ఒక అంశము మాత్రమే. లోకముల పరిమాణము వ్యాసముతో సహా సంక్షేపముగా వివరింపబడును.

సూర్యాచంద్ర మసోశ్చైవ పృథివ్యాశ్చాప్య శేషతః

 ప్రమాణం యోజనాగ్రేణ సాంప్రతైరభిమానిభి

 మహేంద్రాద్యాః సభాః పుణ్యా మానసోత్తరమూర్ధని

అత ఊర్ధ్వం గతిశ్చోక్తా స్వర్గస్యాలాత చక్రవత్

నాగ వీథ్య జవీథ్యోశ్చ లక్షణం పరికీర్యతే

 కాష్ఠయోర్లేఖయోశ్చైవ మండలానాం చ యోజనైః

 లోకాలోకస్య సంధ్యాయా అహ్నో విషువతస్తథా

 లోకపాలాః స్థితాశ్చోర్థ్వం కీర్త్యంతే యే చతుర్దశమ్  

సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి ప్రమాణము యోజనములలో అశేషముగా వర్ణింపబడును. వీటి అభిమాని దేవతలు కూడ కీర్తింపబడుదురు-86. మానస సరోవరము యొక్క ఊర్ధ్వ భాగము నందు మహేంద్రుని పవిత్ర సభ మొదలగునవి, ఆపైన అలాత (అగ్ని) చక్రము స్వర్గమును పొందు మార్గము చెప్పబడినవి-87. నాగవీథి, అజవీథుల స్వరూపము చెప్పబడినది. ధ్రువములు, అభిమాని దేవతలు వర్ణింపబడిరి-88. లోకాలోకము (సూర్యకాంతి ప్రసరించని అంతిమ భాగమునందుండు పర్వతము) యొక్క పరిమాణము యోజనములలో నీయబడినది. ఈ భాగమునకు, జగత్తునకు మధ్య గల సంధి వర్ణింపబడినది. మరియు భూమధ్య రేఖ వద్ద పగలు వర్ణింపబడును. నాల్గు దిక్కులలో ఊర్ధ్వ భాగమునందుండే లోకపాలురు కీర్తింపబడుదురు.

పితృణాం దేవతానాం చ పంథానౌ దక్షిణోత్తరౌ

 గృహిణాం న్యాసినాం చోక్తా రజస్సత్త్వ సమాశ్రయాత్

 కీర్త్యతే చ పదం విష్ణోర్ధర్మాద్యా యత్ర ధిష్ఠితాః

 సూర్యాచంద్ర మసోశ్చార: గ్రహాణాం జ్యోతిషాం తథా

  కీర్త్యతే ధ్రువసామర్థ్యాత్ ప్రజానాం చ శుభాశుభమ్

 బ్రహ్మణా నిర్మితః సౌరః స్యందనోఽర్థవశాత్ స్వయమ్

 కీర్త్యతే భగవాన్ యేన ప్రసర్పతి దివి స్వయమ్

 సరథో ఽధిష్ఠితో దేవైరాదిత్యెః ఋషిభిస్తథా

 గంధర్యై రప్సరోభిశ్చ గ్రామణీ సర్పరాక్షసైః

 అపాం సారమయ స్యేందో: కీర్త్యత్యై చ రథస్తథా

వృద్దిక్షయౌ చ సోమస్య కీర్త్యేతే సూర్యకౌరితౌ

 సూర్యాదీనాం స్యందనానాం ధ్రువాదేవ ప్రకీర్తనమ్

 కీర్త్యతే శిశుమారశ్చ యస్య పుచ్ఛే ధ్రువః స్థితః

 తారారూపాణి సర్వాణి నక్షత్రాణి గ్రహైస్సహ

 నివాసా యత్ర కీర్త్యంతే దేవానాం పుణ్యకారిణామ్

 సూర్యరశ్మి సహస్రే చ వర్ష శీతోష్ణనిః స్రవ:

ప్రవిభాగశ్చ రశ్మీనాం నామతః కర్మతోఽర్థతః

 పరిమాణగతీ చోక్తే గ్రహాణాం సూర్య సంశ్రయాత్   

రజోగుణ ప్రధానులగు గృహస్థులు పొందే దక్షిణ (పిత్స మార్గము, సత్య గుణ ప్రధానులగు సన్యాసులు పొందే ఉత్తర (దేవ) మార్గము-90, ధర్మాదులు నిత్యనివాసము చేసే శ్రీ మహావిష్ణువు యొక్క ధామము వర్ణింపబడును. సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రముల గతి-91, ధ్రువుని వలన ప్రజలకు కలుగు శుభాశుభములు కీర్తింపబడును. బ్రహ్మ ఒక విశిష్ట ప్రయోజనము కొరకై స్వయముగా సూర్యరథమును నిర్మించెను-92. భగవానుడు సూర్యరూపుడై స్వయముగా ద్యులోకము నందు సంచరించును. ఆ రథమును దేవతలు, ఆదిత్యులు, ఋషులు-93, మరియు గంధర్వులు, అప్సరసలు. సర్పములు, మరియు రాక్షసులు అధిష్ఠించిరి. ఇంతేగాక, జలముల సారభూతుడైన చంద్రుని రథము కూడా వర్ణింపబడును-94. సూర్యుని వలన కలిగే చంద్రుని పెరుగుదల, తరుగుదలలు కీర్తింపబడును. సూర్యాదుల రథములు ధ్రువుని నుండియే వచ్చునని చెప్పబడెను-95. శిశుమారుడు (సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుడు) దీని యందు వర్ణింపబడును, శిశుమారుని పుచ్చములో ధ్రువుడు ఉండును. నక్షత్రముల స్వరూపము, గ్రహముల స్వరూపము వర్ణింపబడును-96. ఈ పురాణములో దేవతల నివాసములు, పుణ్యాత్ములు నివసించు లోక ములు వర్ణించబడును. వర్షమునకు, చలికి,వేడికి ఆధారమగు అనంత సూర్యరశ్మి వర్ణింపబడును-97. పేరు, కర్మ, స్వరూపము ఆధారముగా సూర్యరశ్ముల విభాగము వర్ణింపబడును. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహముల పరిమాణములు, గతులు చెప్పబడును.

యథాచాశు విషాత్ ప్రాప్తా శంభోః కంఠస్య నీలతా

 బ్రహ్మ ప్రసాదితస్యాశు విషాదః శూల పాణినః

  స్తూయమానః సురైర్విష్ణుః స్తౌతి దేవం మహేశ్వరమ్

 లింగోద్భవ కథా పుణ్యా సర్వపాప ప్రణాశినీ

విశ్వరూపాత్ ప్రధానస్య పరిణామోఽయమద్బుతః

 పురూరవస ఐలస్య మహాత్మ్యాను ప్రకీర్తనమ్

పితౄణాం ద్వీప్రకారాణాం తర్పణం చామృతస్య వై  

తతః పర్వాణి కీర్త్యంతే పర్వణాం చైవ సంధయః

బ్రహ్మచే ప్రార్థింపబడిన శివుడు విషమును భక్షించగా, కంఠము నీల వర్ణమును పొందుట, శివుడు విషాదమును పొందుట వర్ణింపబడును-99. దేవతలు విష్ణువును ప్రార్థించుట, విష్ణువు మహేశ్వరుని స్తుతించుట, పాపములనన్నిటినీ పోగొట్టే, పవిత్రమైన లింగోద్భవ కథ వర్ణింపబడును-100. రూపములన్నీ ఈశ్వరుని రూపములే. ప్రధానము (మూల ప్రకృతి) యొక్క ఈ లింగాకార పరిణామము గొప్ప అద్భుతము. తరువాత, ఇలుని కుమారుడగు పురూరవసుని మహిమ వర్ణింపబడును-101. రెండు రకముల పితృ దేవతలకు అమృతరూపమగు తర్పణము వివరింపబడును. తరువాత, పర్వదినములు (చంద్రుని వృద్ధి క్షయములు), వాటి సంధులు వర్ణింపబడును.

స్వర్గలోక గతానాం చ ప్రాప్తానాం చాప్యధోగతిమ్

 పితౄణాం ద్వీ ప్రకారాణాం శ్రాద్దేనానుగ్రహో మహాన్

 యుగసంఖ్యా ప్రమాణం చ కీర్త్యతే చ కృతయుగే

 త్రేతాయుగే చాపకర్షా ద్వార్తాయాః సంప్రవర్తనమ్

 వర్ణానా మాశ్రమాణాం చ సంఖ్యానం చ ప్రవర్తనమ్

వర్ణానా మాశ్రమాణాంచ సంస్థితిర్థర్మతస్తథా

 యజ్ఞ ప్రవర్తనం చైవ సంవాదో యత్ర కీర్త్యతే

 ఋషీణాం వసునా సార్ధం వసోశ్చాధః పునర్గతిః 

స్వర్గ లోకమును పొందినవారు, అధోగతిని పొందినవారు అను రెండు రకముల పితరులకు శ్రాద్దముచే కలిగే గొప్ప అనుగ్రహము-103, యుగముల సంఖ్య, వాటి పరిమాణము, కృతయుగ, త్రేతాయుగములలో క్రమముగా ధర్మనిష్ఠ మహిమ తగ్గి ప్రవర్తిల్లుట అను విషయములు కీర్తింపబడును-104. వర్ణాశ్రమముల గణనము, వాటిని ధర్మబద్దముగా పరిరక్షించుట -105, యజ్ఞమును చేయుట, దానిలో ఋషులకు, వసువునకు మధ్య సంవాదము, వసువు మరల అధోగతిని పొందుట మొదలగు విషయములు కీర్తింపబడును.

ప్రశ్నానాం దుర్వచత్వం చ స్వాయంభువమృతే మనుమ్

 ప్రశంసా తపసశ్చోక్తా యుగావస్థాశ్చ కృత్స్నశః

  ద్వాపరస్య కవేశ్చాత్ర సంక్షేపేణ ప్రకీర్తనమ్

 దేవతిర్యజ్ మనుష్యాణాం ప్రమాణాని యుగే యుగే

 కీర్త్యంతే యుగసామర్థ్యాత్ పరిణాహోచ్చ్రయాయుషః

శిష్టాదీనాం చ నిర్దేశః ప్రాదుర్భావశ్చ కీర్త్యతే

 వేదస్య తద్విజాతానాం మంత్రాణాం చ ప్రకీర్తనమ్

 శాఖానాం పరిమాణం చ వేదవ్యాసాది శబ్దనమ్   

స్వాయంభువ మనువు తప్ప ఇతరులు ప్రశ్నలకు సమాధానమును చెప్పలేకపోవుట, తపస్సు యొక్క మహిమ, మరియు యుగములలోని స్థితి గతులు సవిస్తరముగా చెప్పబడినవి-107. ఈ పురాణములో ద్వాపర, కలియుగములు సంక్షేపముగా వర్ణించబడినవి. ప్రతియుగము నందు దేవతలు, పశుపక్ష్యాదులు, మరియు మానవుల ప్రమాణము (ఒడ్డు, పొడవు) లు-108, యుగ ప్రభావముచే ప్రాణులు విశాల దేహములను కలిగి, గొప్ప ఆయుర్దాయమును కలిగియుండుట, మహాత్ముల ప్రాదుర్భావము మొదలగు విషయములు కీర్తింపబడును-109. వేదములు, వాటిలోని మంత్రములు, వేదశాఖలు, వాటి పరిమాణము, వేద వ్యాస శబ్దము యొక్క సార్థకత ఇత్యాదులు వర్ణింపబడును.

మన్వంతరాణాం సంహారః సంహారాంతే చ సంభవః

దేవతానామృషీణాం చ మనోః పితృగణస్య చ

  న శక్యం విస్తరాద్వక్తు మిత్యుక్తం చ సమాసతః

 మన్వంతరస్య సంఖ్యా చ మానుషేణ, ప్రకీర్తితా

 మన్వంతరాణాం సర్వేషా మేతదేవ చ లక్షణమ్

 అతీతానోగతానాం చ వర్తమానేన కీర్త్యతే

 తథా మన్వంతరాణాం చ ప్రతి సంధాన లక్షణమ్

 అతీతానాగతానాం చ ప్రోక్తం స్వాయంభువేఽoతరే

ప్రళయములో మన్వంతరముల ఉపసంహారము, ప్రళయాంతము నందు దేవతలు, ఋషులు, మనువు, పితృ దేవతలు తిరిగి జన్మించుట-111. మొదలగు సృష్టిని విస్తరముగా చెప్పుట అసంభవము గాన, సంక్షేపముగా చెప్పబడును. మనుష్య మానములో మన్వంతర కాల గణనము ఈయబడును-112. గడుచుచున్న మన్వంతరమునకు చెప్పబడిన ఈ గణనము గడచిన, రాబోవు మన్వంతరములకు కూడా వర్తించును-113. మరియు స్వాయంభువ మన్వంతరమునకు గడచిన, రాబోవు మన్వంతరములతో గల ప్రతి సంధానము (మధ్యలో నుండు కాలము) కూడా చెప్పబడినది.

మన్వంతరత్రయం చైవ కాలజ్ఞానం చ కీర్త్యతే

 మన్వంతరేషు దేవానాం ప్రజేశానాం చ కీర్తనమ్

 దక్షస్య చాపి దౌహిత్రాః ప్రియాయా దుహితుః సుతాః

బ్రహ్మాదిభిస్తే జనితా దక్షేణైవ చ ధీమతా

 సావర్ణాద్యాశ్చ కీర్త్యంతే మనవో మేరు మాశ్రితాః

 ధ్రువస్యోత్తాన పాదస్య ప్రజాసర్గో పవర్ణనమ్

 పృథునాపి చ వైన్యేన భూమేర్దోహ ప్రవర్తనమ్

 పాత్రాణాం పయసాం చైవ వంశానాం చ విశేషణమ్    

మూడు మన్వంతరములు, కాలజ్ఞానము, మన్వంతరములలోని దేవతలు, మహారాజులు వర్ణింపబడిరి-115. దక్షుని ప్రియ కుమార్తెకు జన్మించిన కుమారుల వర్ణన గలదు. వారీ విధముగా బ్రహ్మ, దక్షుడు అను పరంపరకు చెందినవారైరి -116. మేరు పర్వతము నందుండు సావర్ణుడు మొదలగు మనువులు; ధ్రువుడు, ఉత్తానపాదుడు చేసిన ప్రజాసృష్టి వర్ణింపబడినవి-117. వేనుని కుమారుడగు పృథువు భూమిని గోవుగా చేసి పాలను పితుకుట, ఉపయోగించిన పాత్రలు, పితికిన పాలు వర్ణింపబడుటయే గాక, రాజవంశముల వర్ణన కూడా గలదు.

బ్రహ్మాదిభి: పూర్వమేవ దుగ్ధా చేయం వసుంధరా

 దశభ్యస్తు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతేః

  దక్షస్య కీర్త్యతే జన్మ సోమస్యాంశేన ధీమతః

 భూతభవ్య భవేశత్వం మహేంద్రాణాం చ కీర్త్యతే

  మన్వాదికా భవిష్యంతి ఆఖ్యానైర్బహుభిర్వృతాః

 వైవస్వతస్య చ మనోః కీర్త్యతే సర్గవిస్తర

 దేవస్య మహతో యజ్ఞే వారుణీం బిభ్రతస్తనుమ్

 బ్రహ్మశుక్రాత్ సముత్పత్తిర్భృగ్వాదీనాం చ కీర్త్యతే    

ఈ భూమిని బ్రహ్మాదులు పూర్వమే పితికియున్నారు. పదిమంది ప్రచేతసుల వలన మారిష యందు-119, సోముని అంశముతో ధీమంతుడగు దక్షప్రజాపతి జన్మించుట, భూర్భువస్సువర్లోకములపై మహేంద్రుల ఆధిపత్యము వర్ణింపబడును-120. మన్వాదులకు చెందిన అనేక గాథలు వర్ణింపబడును. మరియు, వైవస్వత మనువుయొక్క ప్రజాసృష్టి వివరింపబడును-121. మహాదేవుని యజ్ఞములో వారుణ దేహమును ధరించిన బ్రహ్మ యొక్క శుక్రము నుండి భృగువు మొదలగు వారి ఉత్పత్తి వర్ణింపబడును.

వినివృత్తే ప్రజాసర్గే చాక్షుషస్య మనోః శుభే

 దక్షస్య కీర్త్యతే సర్గో ధ్యానాద్యైవస్వతేఽన్తరే

నారదః ప్రియసంవాదీ దక్షపుత్రాన్ మహాబలాన్

నాశయామాస శాపాయ ఆత్మనో బ్రహ్మణస్సుతః

 తతో దక్షోఽసృజత్ కన్యా వీరిణ్యామేవ విశ్రుతాః

 కీర్త్యతే ధర్మసర్గశ్చ కాశ్యపస్య చ ధీమతః

 అత ఊర్థ్వం బ్రహ్మణశ్చ విష్ణోశ్చైవ భవస్య చ

 ఏకత్వం చ పృథక్త్వం చ విశేషత్వం చ కీర్త్యతే       

చాక్షుష మనువు యొక్క శుభకరమగు ప్రజాసృష్టి, తరువాత వైవస్వత మన్వంత రములో ధ్యానము నుండి దక్షుడు చేసిన సృష్టి వర్ణింపబడును-123. బ్రహ్మ పుత్రుడు, ప్రియముగా మాటలాడు వాడునగు నారదుడు తన శాపము కొరకై మహా బలశాలురగు దక్షుని కుమారులను నశింప జేసెను-124. అపుడు దక్షుడు వీరిణి యందు కీర్తిగాంచిన కన్యలను సృజించెను. తరువాత, ధర్ముని సృష్టి ధీమంతుడగు కాశ్యపుని సృష్టి వర్ణింపబడును-125. ఆ తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య గల ఐక్యము, భిన్నత్వము, మరియు వారిలోని విశేషములు కీర్తింపబడును.

ఈశత్వాచ్చ యథాశప్తా జాతాదేవాః స్వయంభువా

 మరుత్ప్రసాదో మరుతాం దిత్యాదేవాంశ సంభవాః

  కీర్త్యంతే మరుతాం చాథ గణాస్తే సప్తసప్తకాః

 దేవత్వం పితృవాక్యేన వాయుస్కంధేన చాశ్రయః

దైత్యానాం దానవానాం చ గంధర్వోరగ రక్షసామ్

సర్వభూత పిశాచానాం పశూనాం పక్షివీరుధామ్

  ఉత్పత్తయశ్చాప్సరసాం కీర్త్యంతే బహువిస్తరాత్

 సముద్ర సంయోగకృతం జన్మైరావత హస్తినః

  వైనతేయ సముత్పత్తి స్తథాచాస్యాభి షేచనమ్

 భృగూణాం విస్తరశ్చోక్త స్తథా చాంగిరసామపి        

 దేవతలకు అధిపతి యగు బ్రహ్మ దేవతలను శపించుట, దితి యొక్క అనుగ్రహముచే దేవాంశతో కూడి మరుత్తులు జన్మించుట, ఏడురు చొప్పున మరుత్తుల గణములు ఏడు తండ్రి మాటచే వారికి దేవత్వము, వాయువు యొక్క ఆవహ, ప్రవహ మొదలగు స్కంధములలో ఆశ్రయము లభించుట. దైత్యులు, దానవులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, సర్వభూతములు, పిశాచములు, పశువులు, పక్షులు, లతలు, అప్సరసలు అను వాటి ఉత్పత్తి విస్తరముగా వర్ణింపబడును. సముద్రము నుండి ఐరావత గజము పుట్టుట గరుత్మంతుని పుట్టుక, అభిషేకము, భృగువుల, అంగిరసుల వివరములు చెప్పబడినవి.

కశ్యపస్య పులస్త్యస్య తథైవాత్రేర్మహాత్మనః

పరాశరస్య చ మునేః ప్రజానాం యత్ర విస్తరః

 దేవతానా మృషీణాం చ ప్రజోత్పత్తిస్తతః పరమ్

 తిస్రః కన్యాః ప్రకీర్త్యంతే యాసు లోకాః ప్రతిష్ఠితాః

 పితృదౌహిత్రనిర్దేశో దేవానాం జన్మచోచ్యతే

 విస్తరస్తే భగవతః పంచానాం సుమహాత్మనామ్

 ఇలాయా విస్తరశ్చోక్త ఆదిత్యస్య తతః పరమ్

 వికుక్షి చరితం చోక్తం ధుంధోశ్చైవ నిబర్హణమ్         

మహాత్ములగు కశ్యప, పులస్త్య, అత్రి, పరాశర మహర్షుల సంతానము ఈ పురాణములో వివరింపబడును. దేవతలకు, ఋషులకు కలిగిన సంతానము గురించి చెప్పబడును. లోకములకు ఆధారమైన ముగ్గురు కన్యల కీర్తి గానము చేయబడును. ఓ పూజ్యా! దేవతల తండ్రులు, మనుమలు, వారి జన్మ గురించి వివరింపబడును. ఐదుగురు మహాత్ముల చరిత్ర వర్ణింపబడును. భూమి విస్తారము, ఆదిత్యుని విస్తారము, తరువాత కుక్షి చరిత్ర, మరియు ధుంధువధ వర్ణింపబడును.

బృహద్బలాంత సంక్షేపాదిక్ష్వాక్వాద్యాః ప్రకీర్తితాః

 నిమ్యాదీనాం క్షితీశానాం యావజ్జహ్ను గణాదితి

 కీర్త్యతే విస్తరో యశ్చ యయాతేరపి భూపతేః

 యదువంశ సముద్దేశో హైహయస్య చ విస్తర:

 క్రోష్టోరనంతరం చోక్త స్తథా వంశస్య విస్తరః

జ్యామఘస్య చ మాహాత్మ్యం ప్రజాసర్గశ్చ కీర్త్యతే 

దేవావృధస్య త్వర్కస్య వృష్టేశ్చైవ మహాత్మనః

 అత్రిమిత్రాన్వయశ్చైవ విష్ణోర్దివ్యాభి శంసనమ్

 వివస్వతోఽథ సంప్రాప్తిర్మణిరత్నస్య ధీమతః

యుధాజితః ప్రజాసర్గః కీర్త్యతే చ మహాత్మనః         

ఇక్ష్వాకువు నుండి బృహద్బలుని వరకు, నిమి మొదలు కొని జహ్ను గణము వరకు గల చక్రవర్తులు కీర్తింపబడిరి. యయాతి మహారాజు చరితము, యదువంశ చరిత్ర, హైహయుని చరిత్ర కీర్తింపబడును తరువాత, క్రోష్ణువు యొక్క వంశము, జ్యామఘుని మాహాత్మ్యము, ప్రజాసృష్టి కీర్తింపబడును. దేవావృధుడు, అర్కుడు, మహాత్ముడగు వృష్టి అను మహారాజుల చరిత్ర, అత్రిమిత్ర వంశము, మరియు విష్ణువు యొక్క మహిమ వర్ణింపబడును. తరువాత, సూర్యుడు శ్రేష్ఠమగు మణిని పొందుట, ధీమంతుడగు యుధాజితుని ప్రజాసృష్టి కీర్తింపబడును.

కీర్త్యతే చాన్వయః శ్రీమాన్ రాజర్షేర్దేవ మీఢుషః

 పునశ్చ జన్మ చాప్యుక్తం చరితం చ మహాత్మనః

 కంసస్య చాపి దౌరాత్మ్య మేకాంతేన సముద్భవః

 వాసుదేవస్య దేవక్యాం విష్ణోర్జన్మ ప్రజాపతేః

విష్ణోరనంతరం చాపి ప్రజాసర్గో పవర్ణనమ్

 దైవాసురే సముత్పన్నే విష్ణునా స్త్రీవధే కృతే

 సంరక్షతా శక్రవధం శాపః ప్రాప్తః పురా భృగోః

భృగుశ్చోత్థాపయామాస దివ్యాం శుక్రస్య మాతరమ్         

 దేవమీఢుడనే రాజర్షి యొక్క శోభాయుతమగు వంశము, ఆ మహాత్ముని చరిత్ర, పునర్జన్మ వర్ణింపబడినవి. కంసుని దుష్టబుద్ధి, దేవకీవసుదేవులకు జగన్నాథుడగు విష్ణువు రహస్యముగా జన్మించుట. తరువాత ప్రజాసృష్టి వర్ణింపబడెను. దేవాసురయుద్ధములో విష్ణువు ఇంద్రుని ప్రాణములను రక్షించుట కొరకై స్త్రీని వధించగా, భృగువు విష్ణువును శపించెను. భృగుమహర్షి శుక్రుని మాతృదేవిని తిరిగి బ్రతికించెను.

దేవానామసురాణాం చ సంగ్రామా ద్వాదశాయుతాః

 నారసింహ ప్రభృతయః కీర్త్యంతే ప్రాణనాశనాః

 శుక్రేణారాధనం స్థాణోర్ధీరేణ తపసా కృతమ్

వరదాన ప్రలుబ్ధేన యత్ర శర్వస్తవః కృతః

  అనంతరం వినిర్దిష్టం దేవాసుర విచేష్టితమ్

జయంత్యా సహ సక్తే తు యత్ర శుక్రే మహాత్మని

 అసురాన్మోహయామాస శుక్రరూపేణ బుద్ధిమాన్

 బృహస్పతిస్తు తాన్ శుక్ర: శశాప సుమహాద్యుతి:         

ధీరుడగు శుక్రుడు వరదానమును గోరి, శివుని ఆరాధిస్తూ తపస్సు చేయుట, శివస్తుతి ఆ తరువాత దేవాసురుల వృత్తాంతము వర్ణింపబడినవి. మహాత్ముడగు శుక్రుడు జయంతితో కూడి యుండగా, బుద్దీశాలియగు బృహస్పతి శుక్రరూపముతో రాక్షసులను మోహ పెట్టెను. అపుడు గొప్ప తేజశ్శాలియగు శుక్రుడు వారిని శపించెను.

ఉక్తం చ విష్ణుమాహాత్మ్యం విష్ణోర్జన్మాది శబ్దనమ్

 తుర్వసుః శుక్ర దౌహిత్రో దేవయాన్యాం యదోరభూత్

 అనుర్ధ్రుహ్యస్తథా పూరుర్యయాతి తనయా నృపాః

 అత్ర వంశ్యా మహాత్మానస్తేషాం పార్థివసత్తమాః

కీర్త్యంతే దీర్ఘయశసో భూరిద్ర విణతేజసః

 కుశికస్య చ విప్రర్షేః సమ్యగ్యో ధర్మసంశయః          

విష్ణు మాహాత్మ్యము, మరియు విష్ణువు జన్మించుట వర్ణింపబడును. యయాతికి శుక్రాచార్యుని కుమార్తెయగు దేవయాని యందు తుర్వసుడు, అనువు, ద్రుహ్యుడు, పూరువు అను కుమారులు కలిగిరి. ఈ పురాణములో వారి వంశములో జన్మించిన మహాత్ములగు చక్రవర్తులు కీర్తింపబడిరి. మరియు, ఆ చక్రవర్తుల దీర్ఘ కాలకీర్తివారి సంపద, తేజస్సు కీర్తింపబడినవి. విప్రర్షియగు కుశికుని ధర్మనిష్ఠ వర్ణింపబడినది.

బార్హస్పత్యం తు సురభిర్యత్ర శాపమిహానుదత్

 కీర్తనం జహ్నువంశస్య శంతనోర్వీర్య శబ్దనమ్

 భవిష్యతాం తథా రాజ్ఞాముప సంహారశబ్దనమ్

అనాగతానాం సప్తానాం మనూనాం చోపవర్ణనమ్

 భౌమస్యాంతే కలియుగే క్షీణే సంహారవర్ణనమ్

పరార్ధ పరయోశ్చైవ లక్షణం పరికీర్త్యతే

బ్రహ్మణో యోజనాగ్రేణ పరిమాణ వినిర్ణయః

నైమిత్తిక: ప్రాకృతిక స్తథావాత్యంతికః స్మత:

 త్రివిధః సర్వభూతానాం కీర్త్యతే ప్రతి సంచరః

 అనావృష్టిర్భాస్కరాచ్చ ఘోరః సంవర్తకోఽనలః             

సురభి బృహస్పతి శాపమును తొలగించుట, జహ్ను వంశము, శంతనుని పరాక్రమము వర్ణింపబడును. భవిష్యత్తులో రాబోవు రాజుల వర్ణనము, రాబోవు ఏడురు మనువుల వర్ణనము ఈ పురాణము నందు గలవు. కలియుగాంతము నందు ప్రాణి సంహారము, పరార్ధ లక్షణము, పరలక్షణములు కీర్తించబడును. యోజనములలో బ్రహ్మ యొక్క పరిమాణము, నైమిత్తిక, ప్రాకృతిక, ఆత్యంతికములనే, సర్వప్రాణుల యొక్క మూడు రకముల ప్రళయము, అనావృష్టి సూర్యుని నుండి భయంకరమగు ప్రళయకాలాగ్ని పుట్టుట వర్ణింపబడును.

మేఘో హ్యేకార్ణవం వాయు స్తథా రాత్రిర్మహాత్మనః

సంఖ్యాలక్షణముద్దిష్టం తతో బ్రహ్మం విశేషతః

 భూరాదీనాం చ లోకానాం సప్తానాముప వర్ణనమ్

 కీర్త్యంతే చాత్ర నిరయాః పాపానాం రౌరవాదయః

బ్రహ్మలోకో పరిష్టాత్తు శివస్య స్థానముత్తమమ్

 యత్ర సంహారమాయాంతి సర్వభూతాని సంక్షయే

సర్వేషాం చైవ సత్త్వానాం పరిణామ వినిర్ణయః

 బ్రహ్మణః ప్రతిసంసర్గే సర్వసంహార వర్ణనమ్                

ప్రళయ కాలమేఘము వర్షించగా సర్వము జలమయమగుట అప్పటి వాయువు వర్ణింపబడును. మరియు, అపుడు మహాత్ముడగు బ్రహ్మకు రాత్రియగుట, ఆ రాత్రి యొక్క కాలమానము నిర్దేశింపబడును. భూరాది ఏడు లోకములు, పాపులు పొందే రౌరవాది నరకములు వర్ణింపబడును. బ్రహ్మ లోకమునకు పైన పవిత్రమగు శివ లోకము గలదు. సర్వప్రాణులు ప్రళయములో అచటనే లీనమగుదురు. సర్వప్రాణుల ఉత్తరగతులు అచటనే నిర్ణీతమగును. ప్రళయము నందు సర్వప్రాణులసంహారం వర్ణింపబడును.

అష్టరూప్యమతః ప్రోక్తం ప్రాణస్యాష్టకమేవ చ

గతిశ్చోర్ధ్వమధశ్చోక్తా ధర్మాధర్మ సమాశ్రయాత్

 కల్పే కల్పే చ భూతానాం మహతామపి సంక్షయః

 ప్రసంఖ్యాయ చ దుఃఖాని బ్రహ్మణశ్చాప్య నిత్యతా

దౌరాత్మ్యం చైవ భోగానాం పరిణామ వినిర్ణయః

 దుర్లభత్వం చ మోక్షస్య వైరాగ్యా ద్ధోషదర్శనమ్

వ్యక్తావ్యక్తం పరిత్యజ్య సత్త్వం బ్రహ్మణి సంస్థితమ్

 నానాత్వ దర్శనాచ్ఛుద్ధం తతస్తదభి వర్ధతే                

ధర్మా చరణము వలన ఊర్థ్వగతి, అధర్మా చరణము వలన అధోగతి, ప్రతి కల్పము నందు మహాభూతములు కూడా వినాశము చెందుట, దుఃఖగణనము, సృష్టికర్త కూడా అనిత్యుడేనని నిరూపించుట. భోగములు పరిణామములో హానిని కలిగించునని నిర్ణయించుట, మోక్షము దుర్లభమని ప్రతిపాదించుట, వైరాగ్యముచే భోగములయందు దోషమును దర్శించుట ఈ పురాణములో వర్ణింపబడినవి. వ్యక్తము (పృథివి, అగ్ని, జలము), అవ్యక్తము (వాయువు, ఆకాశము) అగు జగత్తు నుండి మనస్సును మరలించి, బ్రహ్మము నందు స్థిరముగా నుంచుట వలన అది శుద్ధమై ద్వైత దర్శనమును అతిక్రమించగలును.

తతస్తాపత్రయాతీతో నీరూపాఖ్యో నిరంజనః

ఆనందో బ్రహ్మణః ప్రోక్తో న బిభేతి కుతశ్చన

 కీర్త్యతే చ పునః సర్గో బ్రహ్మణోఽ న్యస్య పూర్వవత్

 కీర్త్యతే ఋషివంశశ్చ సర్వపాప ప్రణాశనః

ఇతి కృత్య సముద్దేశః పురాణస్యోప వర్ణితః

 కీర్త్యంతే జగతో హ్యత్ర సర్వప్రలయ విక్రియాః

 ప్రవృత్తయశ్చ భూతానాం నివృత్తీనాం ఫలాని చ

 ప్రాదుర్భావో వసిష్ఠస్య శక్తేర్జన్మ తథైవ చ                 

తరువాత త్రివిధ తాపములకు అతీతము, రూపము లేనిది, పుణ్యపాప సంగము లేనిది, ఆనందఘనము, అభయస్థానమునగు పరబ్రహ్మ వర్ణింపబడును. బ్రహ్మ పూర్వ సృష్టిని బోలిన మరియొక సృష్టిని చేయుట, పాపముల నన్నిటినీ పోగొట్టే ఋషి వంశ వర్ణన, మొదలగునవి ఈ పురాణమునకు విషయ వస్తువులు. దీని యందు జగత్తు యొక్క సర్వ వికారములు, ప్రలయము కీర్తింపబడును. ప్రాణుల ఉత్పత్తి వినాశములు, కర్మఫలములు కూడా వర్ణింపబడును. వశిష్ఠుని ఉత్పత్తి, మరియు శక్తి యొక్క జన్మ వర్ణింపబడును.

సౌదాసాన్ని గ్రహస్తస్య విశ్వామిత్ర కృతేన చ

 పరాశరస్య చోత్పత్తి రదృశ్యత్వం యథావిభోః

జజ్ఞే పితౄణాం కన్యాయాం వ్యాసశ్చాపి యథామునిః

శుకస్య చ తథా జన్మ సహపుత్రస్య ధీమతః

పరాశరస్య ప్రద్వేషో విశ్వామిత్ర కృతో యథా

 వసిష్ఠ సంభృత శ్ఛాగ్ని ర్విశ్వామిత్ర జిఘాంసయా

సంతాన హేతోర్విభునా చీర్ణః స్కందేన ధీమతా

 దైవేన విధినా విప్ర విశ్వామిత్ర హితైషిణా

..............భావం

ఏకం వేదం చతుష్పాదం చతుర్ధా పునరీశ్వరః

యథా బిభేద భగవాన్ వ్యాసః సర్వాన్ స్వబుద్ధితః

తస్య శిష్యైః ప్రశిష్యైశ్చ శాఖాభేదాః పునః కృతాః

 ప్రయోగైః షడ్గుణీయైశ్చ యథా పృష్టః స్వయంభువా

 పృష్టేన చానుపృష్టాస్తే మునయో ధర్మకాంక్షిణః

 దేశం పుణ్యరూపాఖ్యం సత్యాంగం శుభ విక్రమమ్

అనౌపమ్య మిదం చక్రం వర్తమాన మతంద్రితాః

పృష్ఠతో యాత నియతాస్తతః ప్రాప్స్యథ యద్ధితమ్

 గచ్ఛతో ధర్మచక్రస్య యత్ర నేమిర్విశీర్యతే

  పుణ్యస్సదేశో మంతవ్య ఇత్యువాచ తదా ప్రభుః

 ఉక్త్వా చైవమృషీన్ బ్రహ్మ హ్యదృశ్యత్వ మగాత్పునః                  

వ్యాస భగవానుడు నాల్గు పాదములతో కూడియున్న ఒకే ఒక వేదమును తన బుద్దితో నాలు భాగములుగా విభాగము చేసిన విధానము, ఆయన శిష్యులు, శిష్యుల శిష్యులు మరల వాటిని శాఖలుగా విభాగము చేయుట వర్ణింపబడినవి. దీని వెనుక విడువకుండా జాగరూకులై వెళ్లుడు. మీకు హితమును కలిగించు దేశమును పొందగలరు. పరుగిడే ఈ ధర్మ చక్రము యొక్క అంచు ఎక్కడ శిథిలమగునో, ఆ ప్రదేశము పవిత్రమైనదని తెలుసు కొనుడని బ్రహ్మదేవుడు చెప్పెను. బ్రహ్మ ఋషుల నుద్దేశించి, ఇట్లు పలికి, మరల అంతర్ధానమయ్యెను.

గంగాగర్భ సమాహారం నైమిషీయత్వమేవ చ

 ఈజిరే చైవ సత్రేణ మునయో నైమిషే తదా

మృతే శరద్వతి తథా తస్య చోత్థాపనం కృతమ్

 ఋషయో నైమి షేయాస్తు శ్రద్ధయా పరయా పునః

 నిస్సీమాం గామిమాం కృత్స్నాం కృత్వా రాజాన మాహరన్

 యథావిధి యథాశాస్త్రం తమాతిథ్యై రపూజయన్

ప్రీతం తథా కృతాతిథ్యం రాజానం విధివత్తదా

 అంతర్ధాన గతః క్రూర స్వర్భానురసురోఽ హరత్                    

గంగాదేవి యొక్క గర్భము నుండి జనించిన బంగారమును తీసుకువచ్చుట, ఆ ఋషులకు నైమిషీయులు అను సార్థక నామ ధేయము వర్ణింపబడినవి. అపుడు ఋషులు నైమిషమునందు సత్రయాగముననుష్ఠించిరి. శరద్వంతుడు మరణించగా, ఆతడు పునరుజ్జీవితుడు చేయబడెను. నైమిషము నందలి ఋషులు అతిశయించిన శ్రద్దతో-180, ఈ సమస్త భూమిని సరిహద్దులు లేకుండగా చేసి, రాజును తీసుకువచ్చిరి. ఆతనిని శాస్తోక్త విధానముగా అతిథి మర్యాదలతో ఆదరించిరి. ఆ విధముగా యథావిధిగా చేయబడిన ఆతిథ్యముచే సంతసిల్లిన రాజును క్రూరుడు, కనబడకుండ సంచరించువాడునగు స్వర్భానుడనే రాక్షసుడు అపహరించేను.

అనుసస్రు ర్హృతం చాపి నృపమైడం యథా పురా

గంధర్వసహితం దృష్ట్యా కలాప గ్రామవాసినమ్

  సన్నిపాతః పునస్తస్యయథా యజ్ఞే మహర్షిభిః

 దృష్ట్యా హిరణ్మయం సర్వం యజ్ఞే వస్తు మహాత్మనామ్

 తదా వై నైమి షేయాణాం సత్రే ద్వాదశవార్షికే

యథా వివదమానస్తు ఐడ: సంస్థాపితస్తు తై:

 జనయిత్వా త్వరణ్యాంతే ఐడపుత్రం యథాయుషమ్

సమాపయిత్వా తత్సత్ర మాయుషం పర్యుపాసతే

 ఏతత్సర్వం యథావృత్తం వ్యాఖ్యాతం ద్విజసత్తమాః

 ఋషీణాం పరమం చాత్ర లోకతంత్ర మనుత్తమమ్                       

ఆ మహారాజు యజ్ఞములో మహరులను కలుసుకొనుట, ఆ మహాత్ముల యజ్ఞములోని సామగ్రి అంతా బంగరుదై ఉండుటను గాంచుట. నైమి షేయులగు మహర్పులు చేయు పన్నెండు సంవత్సరముల యాగములో ఆ రాజునకు మహర్షులతో వివాదము, ఆతడు, వారిచే సంహరింపబడుట. ఆతని కుమారుడగు ఆయుషుని నైమిషారణ్యములో చక్రవర్తిని చేయుట, తరువాత యాగమును పూర్తి చేసిన ఆ మహారాజును సేవించుట వర్ణించబడినవి. ఓ ద్విజశ్రేష్ఠులారా! ఋషుల యొక్క మహిమాన్వితమగు చరితము జరిగినది జరిగినట్లుగా ఈ పురాణము నందు వ్యాఖ్యానింపబడినది.

బ్రహ్మణా యత్పురా ప్రోక్తం పురాణం జ్ఞానముత్తమమ్

 అవతారశ్చ రుద్రస్య ద్విజానుగ్రహ కారణాత్

 తథా పాశుపతాయోగాః స్థానానాం చైవ కీర్తనమ్

 లింగోద్భవస్య దేవస్య నీలకంఠత్వమేవ చ

 కథ్యతే యత్ర విప్రాణాం వాయునా బ్రహ్మవాదినా

ధన్యం యశస్య మాయుష్యం పుణ్యం పాపప్రణాశనమ్

 కీర్తనం శ్రవణం చాస్య ధారణం చ విశేషతః

అనేన హి క్రమేణేదం పురాణం సంప్రచక్ష్యతే                           

ఉత్తమ జ్ఞానరాశియగు ఈ పురాణమును పూర్వము బ్రహ్మ చెప్పియుండెను. రుద్రుడు ద్విజులననుగ్రహించుట కొరకై అవతరించు. పాశుపత యోగములు, స్థానములు, లింగోద్భవము, శివుడు నీలకంఠుడగుట అను విషయములు కూడా దీని యందు కీర్తింపబడును. ధన్యము, కీర్తినిచ్చునది, ఆయుర్దాయమునిచ్చునది యగు ఈ పురాణమును బ్రహ్మవాదియగు వాయుదేవుడు విప్రులకు చెప్పియుండెను. దీనిని ప్రవచించుట, వినుట, విశేషించి కంఠస్థము చేయుట వలన పాపములు తొలగి, పుణ్యము లభించును. ఈ పురాణము ఇదే క్రమములో చెప్పబడగలదు

సుఖమర్థః సమాసేన మహానప్యు పలభ్యతే

తస్మాత్ కించిత్ సముద్దిశ్య పశ్చాద్వక్ష్యామి విస్తరమ్

 పాదమాద్యమిదం సమ్యక్ యోఽధీయీత జితేంద్రియః

 తేనాధీతం పురాణం తత్సర్వం నాస్త్యత్ర సంశయః

యో విద్యాచ్చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజః

న చేత్పురాణం సంవిద్యాన్నైవ స స్యాద్విచక్షణ

 ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్

బిభేత్యల్ప శ్రుతాద్వేదో మామయం ప్రతరిష్యతి

  అభ్యసన్ని మమధ్యాయం సాక్ష్యాత్ ప్రోక్తం స్వయంభువా

 ఆపదం ప్రాప్య ముచ్యేత యథేష్టాం ప్రాప్నుయాద్గతిమ్                            

 విశాలమగు విషయమునైననూ తేలికగా, సంగ్రహముగా చెప్పుటకు వీలుపడును. అందువలన, ముందుగా సంగ్రహముగా చెప్పి, తరువాత విస్తరముగా వివరించెదను. ఎవరైతే ఇంద్రియములను జయించి ఈ పురాణములోని మొదటి పాదమును శ్రద్దగా అధ్యయనము చేసెదరో, వారు పురాణమునంతనూ అధ్యయనము చేసిన ఫలమును పొందెదరనుటలో సందియము లేదు. నాలు వేదములను వేదాంగములతో, ఉపనిషత్తులతో సహా అధ్యయనము చేసిన ద్విజుడైననూ, పురాణమును ఎరుంగని వాడైనచో, అట్టివాడు పండితుడు కాజాలడు. ఇతిహాస, పురాణముల జ్ఞానముతో వేదమును విస్తరముగా వ్యాఖ్యానించవలేను. వేదము అల్పజ్ఞుడగు వ్యక్తి వలన ఈతడు నన్ను తప్పుగా వ్యాఖ్యానించునేమో యని భయపడుచుండును. బ్రహ్మ స్వయముగా చెప్పిన ఈ అధ్యాయమును పునః పునః పఠించే వ్యక్తి ఆపదల నుండి విముక్తుడై, అభీష్టమగు పుణ్యగతిని పొందును.

యస్మాత్ పురాహ్యని తీదం పురాణం తేన తత్ స్మృతమ్

 నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే

నారాయణః సర్వమిదం విశ్వం వ్యాప్య ప్రవర్తతే

తస్యాపి జగతః స్రష్టు: స్రష్టా దేవో మహేశ్వరః

 అతశ్చ సంక్షేపమిమం శృణుధ్వం మహేశ్వరస్సర్వమిదం పురాణమ్

 స సర్గకాలే చ కరోతి సర్గాన్ సంహారకాలే పునరాదదీత

ఇతి శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే అనుక్రమణికా నామ ప్రథమోఽధ్యాయః                             

పురా అనితీతి పురాణమ్. పూర్వము (సృష్ట్యాదిలో) ప్రవర్తిల్లినది గనుక పురాణము అనబడును. ఈ నిర్వచనము నెరింగిన వ్యక్తి పాపములన్నిటి నుండి విముక్తుడగును. నారాయణుడు ఈ జగత్తునంతనూ వ్యాపించియున్నాడు. జగత్తును సృష్టించిన బ్రహ్మను కూడా సృష్టించిన వాడు మహేశ్వరుడు. మీరీ పురాణ సంగ్రహమును వినుడు. ఈ పురాణము అంతా మహేశ్వరుని స్వరూపము. ఆయన సృష్టి కాలములో ప్రాణులను సృష్టించి, ప్రలయకాలములో తనలో లీనము చేసుకొనును.

శ్రీ వాయుప్రోక్తే మహాపురాణములో అనుక్రమణిక (విషయ సూచిక) అను ప్రథమాధ్యాయము సమాప్తము.