విష్ణు మహా పురాణము

Table of Contents

38 - కృష్ణావతారగమనానంతరము - పరీక్షిత్పట్టాభిషేకము

 

 

అర్జునుడు బలరామకృష్ణ శరీరములను గాంచి సంస్కారము గావించెను. మఱియుం గల యందరకును క్రమముగా నది యోనరించెను. రుక్మిణి మొదలుగా గల అష్టమహిషులు కృష్ణ శరీరముం గౌగిలించికొని యగ్ని ప్రవేశము సేసిరి. రేవతి బలరామ దేహమును గౌగిలించి ప్రజ్వలదగ్నిం జొచ్చెను. ఆమె తాకినంత నగ్ని యానంద భరితుడై చల్లనయ్యెను. అది విని ఉగ్రసేనుడు వసుదేవుడు దేవకి రోహిణియు నగ్నిం జొచ్చిరి.

 

 

అర్జునుడు ప్రేత కృత్య మెల్లరకు యథావిధిం గావించి తక్కిన జనముం గొని వజ్రుని వెంటనిడికొని బయలు దేరారు. ద్వారావతి నుండి వెడలిన వేల కొలదిగ గల కృష్ణ భార్యలను వజ్రుని పురజనుముం గాపాడుచు నల్లన నేగెను. కృష్ణుడు మర్త్యలోకముం బాయగనే సుధర్మయను నింద్రసభయ పారిజాతమును స్వర్గమున కేగెను. ఏ దినమున హరి దివమ్మున కరిగె నానాడె నల్లనిమేని వాడు బలీయుడు నైన కలి యవనికిం దిగెను. మహోదధి శూన్యమైపోయిన యీ ద్వారకా నగరమును ముంచివేసెను. వాసుదేవ మందిరము నొక్కదానిని మాత్రము ముంచడయ్యెను. ఓ బ్రహ్మణ్యుడ! విను మిప్పటికిని సముద్రుడా నగర మాక్రమింప లేకున్నాడు. అక్కడ నవ్యయుండగు కృష్ణ భగవానుడు నిత్య సన్నిహితుడై యున్నాడు. ఆ స్థానము సర్వపాథక నాశనము మహాపుణ్యము. విష్ణు శ్రీసంపన్నము. దర్శనము సేసినంత బాపము పోవును. ద్వారకావాసుల కందరకు నర్జునుడు బహుధాన్య ధన సమృద్దమైన పంచనదమను దేశ మందునికి యేర్పరచెను.

 

 

అటుమీద విల్లుపూని యొక్కడ పార్థుడు విధవలైన స్త్రీలను గొనిపోవుట చూచి దొంగలకు ఆశ పొడమెను. ఆ పాపకర్ము లొండొరుల గదిసి మిగుల పొగరెక్కిన వాండ్రై ఇడుగో ఒక్కడర్జునుడు విగత భర్తృక మయిన స్త్రీజనమును గొని మనల నతిక్రమించి కొని పోవుచున్నాడు. ఛీ ఛీ! మీ బలమేపాటిది? భీష్మద్రోణ జయద్రథులను కర్ణుని జంపి పొగరెక్కి పల్లెటూరి వాండ్రమగు మన బల మెఱుంగ కున్నాడు. కర్రచే కొనిన మనలం గని దుర్మతి వీడు తాను ధనుష్పాణియై నేను మేటి విల్కాడనని మనలనందర నవమానించు చున్నాడు. ఎందులకు మనకీ పొడవు చేతులు? అని యా దొంగలు కర్రలు గొని మంటి యిటుకలు గొని వేలకొలది మంది యా విధవా జనముపై పరువెత్తిరి. అది చూచి యర్జునుడయ్యా భీరులం జూచి నవ్వుచునే ధర్మజ్ఞాన హీనులు మీరు బ్రతుక దలతురేని మరలి పొండనెను. అతని మాట నీసడించి వాండ్రు ధనమును, కృష్ణుని భార్యలయిన స్త్రీ ధనమును గాజేసిరి. అంత నర్జునుడు యుద్దమున వమ్ముగాని గాండీవము జేకొని యెక్కిడ బూనెను. కాని యదిసేయ లేకపోయె. అతికష్టము మీద నెక్కిడెను గాని యది యప్పుడే శిథిలమై పోయెను. అటుపై నెంతయాలోచించినను అస్త్రములు జ్ఞాపకము రావయ్యెను. ఈసుగొని వీండ్రపై బాణములను విసరెను. అవి వారి చర్మముం జించిన వంతియ. అగ్నిదేవుడిచ్చిన అక్షయ బాణము లవికూడ కృష్ణుడు లేనందున అయ్యల కాపరులతో బోరునెడ క్షయము నందెను అప్పుడు కౌంతేయుడు ఇంతకు మున్ను నా బలమది యంతయు కృష్ణునిదే. దాననే సర్వరాజులం బాణ జాలములం గూల్చితిని. అని యతడు రెప్పవేసినంతలో నా మ్రుచ్చులాభీరులా యంగనమణుల యథేచ్చను లాగికొని పోయిరి. కొందఱాడు వాండ్రు పారిపోయిరి. ఆ మీద నమ్ములు వమ్మువోగా నర్జునుడు వింటికొప్పున నా దొంగలం గొట్టెను. ఆ దెబ్బలను గని వారు పరిహసించిరి. అతడు సూచు చుండగానే యా మ్లేచ్చులు వృష్ణ్యంధక స్త్రీ జనము నంతను గొనిపోయిరి. అందులకు జయశీలి అర్జునుడు ఎంత కష్టమెంత కష్టమని దుఃఖించి ఆహా! భగవంతునిచే నేనిట్లు బలము హరింప బడినవాడను అయితినని బోరున నేడ్చెను. అదే విల్లు, అవే యమ్ములు, అదే రథము, అవే గుఱ్ఱములు. ఇవి యెల్ల ఆ మహాత్ముడు లేమిని నొక్కయడుగున అశ్రోత్రియునికి ఇచ్చిన దానము వలె నడగారి పోయెను. ఆహా! దైవమెంత బలవంతమైనది! అసమర్థ మయిన నీచ వర్గమునకు కూడ జయము గూర్చినది. అవే బాహువులు. అదే గుప్పిలి. స్థానమదే. ఆ అర్జునుడు నేను. పుణ్యము లేమిచే వలె నాతడు లేమిచే సర్వము నసారమయి పోయినది. నా కర్జునత్వము భీమునికి భీమత్వము నిక్కముగ నాతడు సేసినది. ఆతడు లేమి నాభీరులచే రథికశ్రేష్ఠుడ నేనోటు వడితిని.

 

 

అని పలుకుచు జయశీలి యర్జునుడు ఇంద్రప్రస్థ పురమున కేగెను. అక్కడ యాదవ నందనుని వజ్రుని రాజుం జేసెను. అటుపై నతడరణ్య మందున్న వ్యాసుని దర్శించెను. అమ్మహానుభావుని జేరి వినయము మెయి మ్రోక్కెను. అమ్ముని తన యడుగుల కెక్కువ సేపు నమస్కరించు చున్న యతనిం గని ఏమిది? నీవిట్లు వన్నె దఱిగితివి! ముట్టుతం గూడితివ! లేక బ్రహ్మ హత్యా సేసితివా? ఏదో దృఢాభిలాష భంగమయి దుఃఖితుడయి నట్లిదె కాంతి దఱిగి యున్నావు. నీ సంతతి వారు జ్ఞాతులు మొదలయిన వారు నిన్ను యాచింపగా నిరాకరించితివా? అగమ్య స్త్రీ గమనము సేసితివా? ప్రభ తఱిగి యున్నావేమి? విప్రులకు బెట్టక మృష్టాన్నమీవ కుడిచితివా? దీన జనుల ధనము హరించితివా? అర్జునా! ధాన్యాదుల నెగురబోయు చేటనుండి వచ్చు గాలి కెదురైతివా? దిష్టి తగిలిన వాడనై శోభ గోల్పోయితివా? గోళ్ళ నుండి జారు నుదకము స్పర్శ పొంది కుండ నీళ్ళచే స్నానము చేసి ఛాయ తరిగితివా? నీకంటె దక్కువ వారిచే యుద్దమున నోడితివా? అని వ్యాసులు ప్రశ్నింప పార్థుండు నిట్టూర్పు చెంది స్వామీ! వినవలయునని తన పరాభవ వృత్తాంత మెల్ల పూస గ్రుచ్చినట్లు విన్నవించెను.

 

 

బలము ప్రతాపము తేజస్సు పరాక్రమము వీర్యము శోభ కాంతి అన్నియు మాకే హరియో ఆ కృష్ణుడు మమ్ము విడిచి వెళ్ళినాడు. ఈశ్వరుడు మహానుభావుడు చిరునవ్వు మున్నుగ పలకరించు వాడునైన యాతడు లేని వారమై మేము తృణ ప్రాయులమయినాము. అస్త్రములు అమ్ములు నాగండీవము సారవంతము లగుట కేమూర్తి కారణమో ఆ పురుషోత్తముడు వెళ్ళి పోయినాడు. ఎవని చూపున మమ్ము శ్రీజయము సంపత్సమృద్ది విడువలేదో అట్టి గోవిందుడు భగవంతుడు మమ్ము విడిచి వెళ్ళినాడు. భీష్మ ద్రోణాంగ రాజాదులు దుర్యోధనాదులు నెవ్వని ప్రభావమున నిర్దగ్దులైరి, ఆ కృష్ణుడు భూమిని విడిచినాడు. ఆ చక్రి ఎడబాటున ప్రాయము వాసి శ్రీతఱిగి కాంతి సెడి మేదిని వెలవెల బోవుచున్నది. ఎవ్వని ప్రభావముచే భీష్మాదులు నిప్పయిన నా యందు శలభములు (మిడుతలు) అయినారో అట్టి కృష్ణుడు లేమి నేను గొల్లల కోడిపోయితిని. ఎవ్వని యనుభావముచే నా గాండీవము త్రిలోక విఖ్యాతి నందెనో అది యిపుడతడు లేమి నా భీరుల కర్రలకు చచ్చుపడి పోయినది. అనేక స్త్రీ సహస్రములు నేనే దిక్కయినవి. నేనెంత యత్నించినను నా దొంగల బడితెలకు లొంగి కొంపో బడినవి. కృష్ణాంతఃపురము కృష్ణ కృష్ణా! వట్టి కర్రలతో నా బలము వమ్ముసేసి కొనిపో బడినది. నేను శోభా హీనుడను అగుట నాకు వింత గాదు. ఇంకను నేను బ్రతికి యున్నాను. ఇది చిత్రము. తాత గారూ! నీచుల వలని యవమానమను పెందడింబడి సిగ్గు చెడియున్నాను. అనవిని వ్యాసులు

 

 

పార్థ! సిగ్గుపడకు. శోకింపకు. సర్వభూతము లందు కాలగతి యిట్టిదని యెఱుంగుము. భూతములు పుట్టుటకు గిట్టుటకు కాలము కారణము. ఇదెల్ల కాలమూల మణి తెలిసి స్థైర్యపరుడ వగుము. నదులు సముద్రములు గిరులు వసుంధర దేవతలు మనుష్యులు పశువులు తరువులు పాములు కాలము చేబుట్టి కాలముచే గిట్టును. ఇదంతయు కాలాత్మకమని తెలిసి శమింపుము. కృష్ణ భగవానుడు కమల లోచనుడు కాలరూపి. ధనుంజయ! కృష్ణ! మహాత్మా! నీవేమి యుగ్గడించితి వదియట్లే. భారావతరణమున కాతడవని నవతరించెను. మున్ను బరువోర్వ రానిదై భూమి దేవసభ కేగెను. అందులకే కాలరూపి యీ విష్ణు నవతార మెత్తెను. ఆ పని జరిపింప బడినది. అశేష రాజులు హతులయిరి. వృష్ణ్యంధక కులము కూడ నిట్లే నుపసంహృత మయినది. భూమి తలమున నా ప్రభువున కింక జేయ వలసిన దేకొంచెము లేదు. ఇందుచే కృతార్థుడై యాయన స్వేచ్చగా నేగెను. ఈయన సర్గ కాలమందు సృష్టిని స్థితికాల మందు స్థితిని తుదకంతమును జేయ సమర్థు డిపుడు వెళ్ళినాడు. కావున నీ వోటమికి సంతాప పడవలదు. ఆయా కాలమందు పురుషులకు స్తుతి కలుగును. నీ యోంటి చేత భీష్మ ద్రోణ కర్ణాదు లోడిరన్న నది వారికి కాలప్రాప్త మయిన క్రిందివాని వలననైన యోటమి కాదా! విష్ణు ప్రభావమున నంతవారికా పరాభవ మెట్లో యట్లే నీకును దొంగల వలన పరాభవము జరుప బడినది. ఆ దేవేశ్వరుడు పలుమేను లందావేశించి జగత్ స్థితి సేయును. ఆ జగత్పతి తుదకు సర్వభూత నాశముం జేయును. నీకు భాగ్యోదయ మయినది. నీకాయన సహాయు డయ్యెను. అట్లే తుదకు నీ శత్రువుల నా హరి తుద ముట్టించెను. నీవు గాంగేయాదులను కౌరవులను జంపితి వన్న నెవ్వడు నమ్మును? ఈ అభీరులచే గొల్లలచే నీ పరాభవమును మాత్రమెవ్వడు నమ్మును? సర్వము తానైన హరియొక్క లీలా విలాస మిది. నీచే కురవులు ధ్వంసమయి రన్న గొల్లలచే నీవోడితివి వన్న నీవెవ్వరి కోసము శోకించు చున్నా వా స్త్రీలు మ్రుచ్చులచే గొంపో బడిరన్న దీనికి మున్ను నడచిన కథ నీ కర్జునా! చెప్పెద వినుము

 

 

మున్ను అష్టావక్రుడను విప్రుడు సనాతన బ్రహ్మముం జపించుచు పెక్కేండ్లు నీట నివసింప నెంచెను. అసుర సంఘము లోడిపోగా మేరు పృష్ఠమందు పెద్ద యుత్సవ మయ్యెను అచటి కేగుచు సురకాంతలాతని జూచిరి. రంభా తిలోత్తమాదులు వందలు వేలు ఆ మహాత్ముని గీర్తించిరి. కొనియాడిరి. కంఠము లోతున నుండి జటాభారము దాల్చియున్న యమ్మునిని వారు వినయ వినతులై ప్రణమిల్లిరి. ఆయన ప్రసన్నుడగు నంత వరకు నయ్యెల్లరు నా ద్విజ వరిష్ఠుని స్తుతించిరి. అంత నాత డిట్లనియె.

 

 

మహానుభావలార! సంతుష్టుడ నైతిని. మీరు నావలన నేమి కోరుదురు, దుర్లభమయినది యిత్తు ననియె. రంభాది దివ్యాప్సరసలు నీవు ప్రసన్నుడ వయితేని మాకిక లోటేమి యున్న దనిరి. తదితరులు కొందఱు స్వామీ! నీవు భగవంతుడవు. ప్రసన్నుడవేని పురుషోత్తముడు మా పతి కావలయు నని కోరుచున్నా మనిరి.

 

 

అమ్ముని ఎట్లే యగునని నీటి నుండి వెలికి వచ్చెను. ఆ వచ్చిన వాని వికృత రూపము ఎనిమిది వంకరలు గల దానిని వారు చూచిరి. అతని జూచి చాటునవ్వు నవ్వెడి వారి నవ్వు

ఆయనకు వినబడెను. దాన కోపము గని ముని వికృత రూపుడ నగు నన్ను కని పరిహసించి యవమానింతిరి గావున మీకు శాపమిచ్చెద. నా సాకతమున మీరు విష్ణువుం భర్తగా బడిసి నా శాపము దగిలి మీరందఱు దస్యువుల చేజిక్కుదురు గాక! అని పలికినది విని వారు బ్రతిమాల మఱి మీరందఱు సురేంద్ర లోకమున కేగుదురు గాక యనియె. ఇట్లా ముని శాపముచే చక్రిని భర్తగ బడిసి యా దేవాంగనలిప్పుడు దస్యుల చేజిక్కిరి. పాండవ! ఇందీవించుకయు శోకింప వలదు. అఖిలనాథు డా హరి చేతనే సర్వము నుపసంహృతము. అతని చేతనే మీ యొక్కయు నుపసంహారము దగ్గరయయి యున్నది. నీ తేజో బలవీర్యాదు లాయన చేతనే యుప సంహృతము. పుట్టిన వానికి చావు తప్పదు. ఎత్తు నుండి పడుట తప్పదు. కూడుట వీడుట కొఱకే. పెఱుగుట తఱుగుటకే. ఇది బుధులెఱిగి శోకింపరు. హర్షింపరు. అట్టి వారిలో గొందరిది యితరులకు కూడ యలవరుప నుందురు. అందువలన నో నరవర! ఇది తెలిసి అన్నదమ్ములతో నఖిల తంత్రమును విడిచి తపస్సునకు వనమేగ నగును. కావున నీవేగుము. నా వచనము ధర్మరాజునకు నివేదించి ఎల్లుండి సోదరులతో గూడ వెల్లునట్టు ఏర్పాటు సేయుము.

 

 

అని వ్యాసునిచే దెలుపబడి ధర్మజ భీములకు నకుల సహదేవులకు తానట్లు జూచిన, యనుభవించిన, దెల్ల యట్లనే చెప్పెను. పాండవులు వ్యాసు వాక్యమర్జునుని ముఖమున బలుక బడిన దాలించి పరీక్షిత్తుని రాజ్యము నందు నిలిపి వనమేగిరి. మైత్రేయ! ఇట్టిది యదు వంశమందు బుట్టిన వాసుదేవుని చేష్టితమేను విస్తరించి చెప్పితిని. కృష్ణుని యీ చరితము నెవ్వడు విను నాతడు సర్వపాప విముక్తుడై విష్ణు లోకమేగును.