విష్ణు మహా పురాణము

Table of Contents

3 - మాంధాతృ వంశ వర్ణనము. సగర చరిత్రము.

 

 

ఇటుపై మాంధాత సంతతిం దెల్పెదను. మాంధాత తనయుడగు నంబరీషునకు యువనాశ్వుడు గల్గెను. వాని వలన హరితు డుదయించెను. అతని పేరనే యంగిరసులు హారీతులను ప్రసిద్ధి గనిరి. పాతాళ మందు మౌనేయులను (కాశ్యపుని పత్ని ముని, ఆమె సంతతులు) గందర్వు లారుకోట్ల మంది యుండిరి. వారు నాగ కులముల ప్రధాన రత్నముల నపహరించి వారి యాదిపత్యములను గూడ స్వాధీనము సేసికొనిరి. గంధర్వుల బలముచే తిరస్కృతులయిన నాగేంద్రు లశేష దేవాధీశుడగు విష్ణు భగవానుని సన్నిధి కేగిరి, వారు సేసిన స్తవముల నాలించినంత కన్నుల తెఱచిన పుండరీక నయనుడు జలధిశయనుడు నిద్రావసాన మందు మెలుకువ గొనెను. వారు ప్రణతులై స్వామికి ప్రభూ! మాకీ గంధర్వుల వలన భయము పుట్టినది. ఇది యెట్లుపశమించునని విన్నవించు కొనిరి.

 

 

ఆద్యంతములు లేని వాడును, పురుషోత్తముడు నగు భగవంతుడు “యౌవనాశ్వుని కుమారుడగు నీ మాంధాత యొక్క కొడుకు పురుకుత్సుడను వాడున్నాడు గద. వానియందేను బ్రవేశించి సర్వ గంధర్వుల నుక్కడంగింప గల” ననియె. అది విని జలశాయి యగు భగవంతునికి ప్రణమిల్లి నాగేంద్రులు నాగ లోకమునకు వచ్చి పురుకుత్సునిం గొనితేర నర్మదను బ్రేరేపించిరి. ఆమెయు నతనిని బాతాళమునకు గొనిపోయెను. పురుకుత్సుడు రసాతలమున కేగి భగవత్తేజస్సు చేత తృప్తి పొందింప బడిన దేహము బలము గలవాడై సకల గంధర్వులం జంపి స్వపురమునకు దిరిగి వచ్చెను. పన్నగాదీశులపుడు నర్మదకు నిన్నెవ్వరు ఈ క్రింది విధముగా స్మరించి నీ నామగ్రహణము సేయునో వారికి సర్పవిష భయము గలుగదని వరమొసంగిరి.

 

 

ప్రాతః కాలమున నర్మదకు నమస్కారము. నిశీధమున నర్మదకు నమస్కారము. ఓ నర్మదా! నీకు నమస్కారము, విష సర్పము నుండి నన్ను రక్షింపుము. ఈ మంత్ర ముచ్చరించి రేయిం బవల్లంధకారమున జొచ్చిననేని వానిని పాములు చూడజాలావు. ఈ మంత్రాను స్మరణము చేసి భోజనము సేయువానికి విషము దినినను నది చంపదు. ఆమీదట పురుకుత్సునికి గూడ సంతతి విచ్చేదము జరుగదని నాగపతులు వర మనుగ్రహించిరి. పురుకుత్సుడు నర్మద యందు త్రసదస్యునిం గనెను. అతనికి అనరణ్యుడు పుట్టెను. వానిని రావణుడు దిగ్విజయ మందు జంపెను. అనురణ్యునికి పృషదశ్వుడు అతనికి హర్యశ్వుడును గల్గిరి. హర్యశ్వునికి హస్తుడు గలిగెను. వానికి సుమనుడు వానికి త్రిధన్వుడు వానికి త్రయ్యారిణుయుం గల్గిరి. త్రయ్యారుణికి సత్యవ్రతుడు గలిగె. ఇతడే త్రిశంకుడను పేరందె. అతడు చండాలత్వముం గూడ పొందినాడు.

 

 

ద్వాదశ వర్ష క్షామము పుట్టినప్పుడు విశ్వామిత్ర భార్యాపుత్రాదుల పోషణార్థము చండాలుర వలన బ్రతిగ్రహము సేయకుండ జాహ్నవీ తీరమందను దినము మృగ మాంసముం దెచ్చి మఱ్ఱి చెట్టున గట్టుచుండెను. దాన రోహితాశ్వుడు వానికి బాహువు గల్గిరి. ఈ బాహువు హైహయ తాలజంఘాదులచే నోడింపబడి గర్భవతి యైన పత్నితో నడవిం బ్రవేశించె. ఆమెకు సవతి గర్భ స్తంభనము కొఱకు విషము పెట్టెను. దాన నామె గర్భమేడేండ్లు జఠర మందే యుండెను. బాహువు వార్దక్యముచే నౌర్వాశ్రమ సమీపమందు మరణించెను. అతని భార్య చితిపేర్చుకొని యాతనితో నను మరణము సేయ నిశ్చయించు కొనెను. అంతట అతీతా నాగతములు తెలిసిన యౌర్వుడు తన యాశ్రమము నుండి వెడలి చాలు చాలు! ఈ తప్పు పని నుండి అగుమాగుము. అఖిల భూమండలపతి అతివీర్య పరాక్రముడు అనేక యజ్ఞకర్త శత్రుక్షత కర్త చక్రవర్తి నీ కడుపులో నున్నాడు. ఈ అతి సాహసమునకు దిగకుము. ఆనినంత నామె భర్తృసహగమన నిర్భంధము నుండి విరమించెను. ఆ మహానుభావుని చేతనే యామె తన యాశ్రమమును గొంపోబడెను. కొలది రోజులలో సాగరముగా (విషముతో కూడ) అతి తేజస్వియైన బాలు డుదయించెను. అతని కౌర్వుడును జాతకర్మాది క్రియలు జరిపించి ‘సగరు’ డను పేర్వెట్టెను. ఉపనయనమైన యీతని వేదశాస్త్రము లన్నియు జడివించి భార్గవ మను పేరి యాగ్నేయాస్త్రమును గూడ యుపదేశించెను. జ్ఞానము వచ్చి యాతడు తల్లి నడిగెను. అమ్మా! చెప్పుము మనమిచట ఎందుకున్నాము. మా నాన్న యెక్కడ? అని ఈ విధముగ నుడుగుచున్న వానికాయమ్మ సర్వముం దెల్పెను. అంతట తండ్రి రాజ్య మపహరించిరని విని పగగొని యా బాలుడు హైహయ తాళ జంఘ సంహారమునకు ప్రతిజ్ఞ పూనెను. ఇంచుమించు హైహయ తాల జంఘుల నందరనుం జంపెను గూడ. శక యవన కాంభోజ పారద పప్లవులను జమ్పబోవ వారు వశిష్ఠుని శరణు జొచ్చిరి. అంతట వశిష్టుండు వీరిని జీవన్మృతులుగా (బ్రతికియుం జచ్చిన వారట్లున్న వారింగా) జేసి సాగరునితో వత్స! చాలునాగుము. వీరు జీవన్మృతులు. అనుమృతులు (పునర్మృతులు). వీరిని నీ ప్రతిజ్ఞను పాలింపనెంచి స్వధర్మ ద్విజసంగ పరిత్యాగము నేనే సేయించితిని. అన సరి యని యా గురువచన మభినందించి యా రాచబిడ్డ వారి వేషములను మార్చివైచెను. యవనుల నందరను నిండు తలబోడులను శకులను అరబోడులను పారదులను ప్రలంబ కేశులను (తల విరబోసి కొన్నవారిగను) వప్లవులను మీసాలు గడ్డాలు గల వాండ్రగను గావించెను. స్వాధ్వాయ వషట్కార శూన్యులనుగా నీ క్షత్రియులను గావించెను. వాండ్రును స్వధర్మ పరిత్యాగము వలన బ్రాహ్మణులచే వెలివేయబడి మ్లేచ్చత్వము నందిరి, సగరుడును స్వీయాధిష్టానమునకు వచ్చి యస్ఖలిత చక్రుడై (అప్రతిహత పరిపాలనుడై) సప్తద్వీప వతియైన యీ యుర్విని శాసించెను.