విష్ణు మహా పురాణము
9 - రజివంశ చరిత్ర
రజికి అసమాన బలవీర్య పరాక్రమము లయిదు వందల మంది కుమారు లుండిరి. దేవాసుర సంగ్రామమందు దేవతలు రాక్షసులు నొండొరులం జంపి కొననెంచి బ్రహ్మ దగ్గరకు వచ్చి మాలో నే పక్షము గెలుచుననిరి. బ్రహ్మ ఎవరివైపు రజి యాయుధమెత్తి పోరాడునో ఆపక్షము జయింప గలదనియె, అంత దైత్యులు వచ్చి రజిని దమవైపు పోరుమని యర్థించిరి. అతడు పోరేదను గాని యమరుం గెల్చి నేను మీకింద్రుడు గావలయునన విని దైత్యులు మేమింకొకలాగు మాట్లాడము ఇంకొకలాగు చేయము. మాకింద్రుడు ప్రహ్లాదుడు అతని కోసమే యీ మాయుద్యమము అని వారు జనినంత దేవతలు వచ్చి మాపక్షమున బోరుమన వారి తోడను నతడటు పలుక వారంగీకరించిరి.
రజియును దేవసైన్య సహాయమున ననేక మహాస్త్రములచే నసుర బలమును సంహరించెను. ఆమీద నిటు శత్రుపక్షముం గెలిచి దేవేంద్రుడు రజి పాదములు రెండుం దనతల నానించి యిట్లనియె. భయము నుండి రక్షించి మాకు అన్నము పెట్టినావు గాన మాకీవు తండ్రివి ఎల్లలోకాల నీవుత్త మోత్తముడవు. అట్టి నీకు ద్రిభువనాధీశ్వరుడనైన నేను పుత్రుడను. రజి మహారాజును నవ్వి యిట్లే యగుత ఇట్లేయగు గాక! అనేక మధురమయిన
మాటలతో జేసినా యీ ప్రణతి (సాష్టాంగ నమస్కారము) శత్రువేని గాదనరానిది. అని నిజ రాజధాని కరిగెను. శతక్రతువింద్ర పదవిని నిర్వహించెను.
అవ్వల రజి స్వర్గమునకరుగ రజి కుమారులు నారదుని ప్రేరణచే తమ తండ్రికి కొడుకైన శతక్రతుని (ఇంద్రుని) పిత్రుపుత్ర సంప్రదాయము ననుసరించి దేవేంద్ర రాజ్యము నడిగిరి. అతడీయకున్నంత నాతని నోడించి యా బలశాలురు తామింద్రత్వమును నిర్వహించిరి. అవ్వల పెద్దకాలము గడువ నేకాంత మందు బృహస్పతిం దర్శించి త్రైలోక్య యజ్ఞ భాగము లిట్లు రజి కొడుకులచే నపహరింప బడి యుంద్రుడు రేగు పండంతా యేని పురోడాశ ఖండము నాకీవు దయదేయ దగుదు వన గురుండీ మాటమున్నే నాకు చెప్పియున్నట్లైన నీకై జేయరాని పని ఏమున్నది? కొలది నాళ్లలో నిన్ను నీ స్థానమును బొందింతును జూడుమని యా రజి సంతానమునకు మతి చెడుటకు శక్రునికి తేజో వృద్ది యగుటకు ఆభిచారిక హోమము గావించెను. దానిచే వాండ్రు బుద్ది, మోహము చేజెడి బ్రహ్మద్వేషులై ధర్మత్యాగులై వేద విముఖులైరి. అవ్వల నింద్రుడాయ ధర్మచారుల నుక్కడగించెను. పురోహితునిచే దేజస్సాప్యాయన మొంద నింద్రుడు దివమ్ము నాక్రమించెను. ఈ యింద్రపదచ్యుతి నుండి పునరారోహణము దనుకగల కథను విన్నవాడు స్వపద భ్రష్టుడు గాడు. దౌరాత్మమునుం బొండదు (దౌర్భాగ్యము వానికి గలుగ దన్నమాట).
రంభుని సంతతి లేదు. క్షత్రవృద్దుని కొడుకు ప్రతిక్షత్రుడు వాని కొడుకు సంజయుడు. వానికి జయుడు వానికి విజయుడుం బుట్టిరి. విజయుని వాడు సహదేవుడు. వాని కొడుకు అదీనుడు. వాని తనయుడు జయత్సేనుడు. వానికి సంకృతి క్షత్ర ధర్ముడునుగా వీరు క్షత్రవృద్ద వంశీయులు. ఈ మీద నహుష వంశము దెలిపెద.
