విష్ణు మహా పురాణము
14 - ఉత్తరక్రియా వివరణము
శ్రద్ధతో శ్రాద్దమును చేయు మనుజుడు బ్రహ్మ దేవేంద్ర రుద్ర అశ్వినీ దేవ సూర్య అగ్ని వసు వాయువులను విశ్వే దేవతలను పితృగణమును పశుపక్షులను మనుజులను సర్పములను ఋషి గణములను ఇంకను సమస్త భూతములతో నొప్పు సకల జగత్తును సంతోష పెట్టిన వాడగును. ప్రతిమాసము అమావాస్య నాడు కృష్ణ పక్షము నందు అష్టకల యందు (తిస్రోష్టకలు) శ్రాద్దము చేయవలెను. కాలములను చెప్పెద వినుము. శ్రాద్దమునకు తగిన ద్రవ్యము విశిష్టమైన బ్రాహ్మణుడు సంప్రాప్తము కాగా తెలిసికొని శ్రాద్దమును పెట్టవలెను. అట్లే వ్యతీపాన్నామక యోగము నందు దక్షిణోత్తరాయన కాలమందు విషువము (దివారాత్రములు సమానముగా నున్న సమయము) నందు సంక్రమణము లందు సూర్య చంద్ర గ్రహణము లందు నక్షత్ర గ్రహపీడ లందు దుష్ట స్వప్నమును కన్నను నూతనధాన్యము వచ్చినప్పుడు కామ్య శ్రాద్దములను చేయ వలయును. అమావాస్య అనూరాధా విశాఖా స్వాతి నక్షత్రములతో గూడినపుడు పెట్టిన శ్రాద్దములచే పిత్రుగానము ఎనిమిది సంవత్సరములు తృపిని పొందును. పుష్యమి ఆర్ద్ర పునర్వసు నక్షత్రములతో గూడిన యమావాస్య యందు అర్చితులై పితృదేవతలు ద్వాదశ వార్షిక తృప్తిని పొందుదురు. ధనిష్ఠ పూర్వాభాద్ర శతభిషక్ నక్షత్రములతో కూడిన యమావాస్య పితరులకు దేవతలకు తృప్తి కలుగ జేయగోరు మనుజులకు (పరమ తృప్తి హేతువగుటచే) దుర్లభమైనది. ఈ పైని చెప్పిన తొమ్మిది నక్షత్రములతో గూడిన యమావాస్య యందు పెట్టిన శ్రాదము పితృ దేవతలకు తృప్తి నిచ్చునది. అట్లె తృప్తి నిచ్చు మఱియొక శ్రాదమును చెప్పెద వినుము. ఇది వినయ వంతుడు పితృభక్తుడు మహాత్ముడు నగు నీలుడు అడుగగా సనత్కుమారునిచే చెప్ప బడినది.
వైశాఖ శుక్ల తదియ కార్తిక శుక్లనవమీ భాద్రపద కృష్ణ త్రయోదశి మాఘ కృష్ణ అమావాస్య ఈ నాలుగు తిథులు పవిత్రములు. యుగాదులు అని పురాణము లందు చెప్ప బడినది. సూర్య చంద్ర గ్రహణము లందు తిస్రోఽష్టకల (మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ కృష్ణ సప్తమి అష్టమి నవమి) యందు దక్షిణోత్తరాయనము లందు మంచి నీరైన నువ్వులతో కలిపి నియమవంతుడై పితృదేవతల కొఱకు అంజలులు సమర్పింప వలెను. అట్లు చేసిన యెడల వెయ్యి సంవత్సరములు శ్రాద్దము చేసినట్లని పితృదేవత లీ రహస్యమును చెప్పుదురు. మాఘ కృష్ణ అమావాస్య శతభిషక్ నక్షత్ర యోగము కలదగుట పితృ దేవతలకు సామాన్య పుణ్యములతో రాదు. ధనిష్ఠా నక్షత్రముతో గూడిన యాకాలమందు తత్కుల సంజాతులగు నరులచే నీయబడిన జలములు పదివేల సంవత్సరముల వరకు తృప్తి నీయగలవు. ఆకాలమే పూర్వాభాద్రతో గూడిన యెడల అట్టి సమయమున నీయబడిన శ్రాదము గొప్ప తృప్తిని కలుగ జేయును. పితృదేవతలు వేయి యుగములు గాఢముగ నిద్రింతురు. గంగ శతద్రు యమున విపాశ సరస్వతి నైమిశారణ్య గత గోమతీ నదులతో స్నానము చేసి పితృ దేవతలకు చేసిన యర్చనము తన దూరి తనాశనము చేయును. భాద్రపద కృష్ణ త్రయోదశి నాడు మాఘ నక్షత్ర యోగము నందు చేసిన శ్రాద్దము వలన తృప్తిచెంది పితరులిటుల గానము చేయుచుందురు. మాఘ క్రుష్ణపక్షమున శుభ తీర్థ జలములతో పుత్రాదులచే నీయబడిన శ్రాదముతో తృప్తిని చెందితిమి. పరిశుద్ద మగు మనసు ధనము ప్రశస్తమగు కాలము చెప్పబడిన విధి యథోక్తమగు పాత్ర (భోక్త) గొప్ప భక్తియు మనుజులకు కోరిన కోర్కెలు నీయ గలవు.
పితృ దేవతలచే గానము చేయబడిన ఈ శ్లోకములను రాజా! వినుము. నీవట్లే చేసి ఆ విషయమై దృఢ చిత్తముతో ప్రవర్తిల్లుము. మన వంశము నందు విత్తశార్యము (ఉండియు లేడను కొనుట) చేయక మనకు పిండ ప్రాదానము చేయు బుద్దిమంతుడు ధన్యుడునగు జనుడు పుట్టునా? సంపద కలిగి మనల నుద్దేశించి బ్రాహ్మణుల కొఱకు రత్నమును వస్త్రమును గొప్ప వాహనమును సర్వ భోగాదికమును ధనమును నిచ్చువాడు మన వంశమున పుట్టునా! పరిమితమగు సంపద గలవాడై తత్కాలమున భక్తినమ్రుడై యథాశక్తిగా అన్నముతో యోగ్యులగు బ్రాహ్మణులకు భోజనము పెట్టువాడు మన వంశమున పుట్టునా! అన్న ప్రదానము చేయుటకు శక్తిలేక తనశక్తి కొలది ధాన్యమును గాని అపక్వ తండులమును అల్పమైన దక్షిణను బ్రాహ్మణోత్తములకు నిచ్చువాడు పుట్టునా? అంతకు గూడా సామర్థ్యము లేక కరాగ్రమున నున్న తిలలను బ్రాహ్మణ శ్రేష్టునకు నమస్కరించి యిచ్చువాడైన పుట్టునా? లేక ఏడెనిమిది నువ్వు గింజలతో ఊడిన జలాంజలి నయిన భక్తి నమ్రుడై యిచ్చువాడైనా పుట్టునా? ఆమాత్రము గూడ లేనివాడై యెచ్చటనైన సంపాదించి గోవుల కొఱకు నొక్కదినమైన సంతుష్టిని కలిగించు గడ్డి మొదలగు దాని నయినా శ్రద్ధతో మాకు తృప్తికై యిచ్చువాడు పుట్టునా! ఏమియు లేనిచో వనమునకు వెళ్లి తనలేమిని ప్రకటించుటకి రెండు చేతుల నెత్తి సూర్యాద్యష్ట దిక్పరిపాలకుల నుద్దేశించి ఈ శోకమును బిగ్గరగా పఠింప వలెను, నాకు హిరణ్యాది రూపమున గాని జీవన ధనమగు ధాన్యాదికము గాని జీవన ధనమగు దాన్యాదికము గాని శ్రాద్దమున కుయోగపడునది లేదు. మా పితృ దేవతలకు నమస్కరించు చున్నాను. మీ ప్రీతి కొఱకై యాకసము నందు నాయీ చేతుల నెత్తితిని. నా భక్తితో దేవతలు తృప్తి చెందుదురు గాక!
భావాఽభావ ప్రయోగార్హ మగునట్లు పితృ దేవతలచే నిది చెప్పబడినది. శక్తి ఆశక్తి ప్రయుక్త కృత్యమగు దీని నాచరించిన యెడల శ్రాద్దము వానిచే చేయ బడినట్లే.
