విష్ణు మహా పురాణము

Table of Contents

21 - కంసాంగనాసమాశ్వాసనము - భగవల్లీలా ప్రదర్శనము

 

 

భగవల్లీలా దర్శనము చేసి తత్త్వజ్ఞానము వడసిన దేవకీ వసుదేవులను గని హరి యదుజనమును మొహపెట్టుటకు వైష్ణవ మాయను విస్తరింప జేసెను. అమ్మా! అయ్యా! కంసుని భయముచే నెంతో కాలము నుంచి యపేక్షతో నున్న నేను భలభద్రుడును మిమ్మీనాటికి జూడ గంటిమి. తలి దండ్రులం బూజింపని కాలము యాయుర్దాయములో వ్యర్థమైన కాలము దురదృష్టవంతులగు వారి జీవితములోనే యుండును. గురు దేవ ద్విజులను మాతా పితరుల నారాధించు జనుల కాలమే సఫలమైన దగును. కంసుని పరాక్రమ ప్రతాపములకు పరవశులమై యింతకాల మీ ధర్మమును దప్పిన మమ్మిద్దరను తండ్రీ! క్షమింపుము. అని పలికి యా తల్లిదండ్రులకు ప్రణామములు సేసి యదవృద్ధులను గూడ వరుసగా యథావిధిం బూజించి వారిద్దరు పౌర జనమును గౌరవించిరి.

 

 

అత్తఱి కంసుని భార్యలు, తల్లులను పుడమిం బడియున్న కంసుని చుట్టుం జేరి దుఃఖశోక నిమగ్నులై యేడ్చిరి. అత్తఱి పశ్చాత్తాప వివశుడై హరి తానుం కంట నీరు గ్రుక్కికొనుచు బహువిధముల నస్వస్థలైన వారి నోదార్చెను. అవ్వల హరి యుగ్రసేనుని బంధవిముక్తుం జేసెను. కొడుకుం గోల్పోయిన యతనిని స్వీయ రాజ్య మందభిషిక్తుడై కొడుకునకును మఱియు నప్పుడు గూలిన వారికిని బ్రేతకార్యములు గావించెను. అదంతయు నైనతర్వాత హరి యయానంగని ఆజ్ఞ దయ చేయగా శంకింప వలదు. యయాతి యిచ్చిన శాపముచే నీ యాదవ వంశము రాజ్యార్హము గానిదై యున్నాను నేను భృత్యుడనై చరింప నీవు దేవతలను గూడ శాసింపుము. రాజుల లెక్కేమి? అని పలికి మధువైరి వాయు భగవానునిం దలచి కొనినంత నా క్షణము వాయు వేతేర కార్య నిమిత్తముగ మానుష మూర్తియైన కేశవుండు, ఓ సమీరా! నీ వింద్రుని దరికేగి ఇంద్రా! నీ గర్వము చాలింపుము నీవు ఉగ్రసేనునికి సుధర్మసభ నిచ్చి వేయుము. కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ సభ యత్యుత్తమ మయినది రాజార్హమయినది. యదు వంశ్యులు దీని నదిష్టించుట యుక్తము. అన విని వాయువేగి శాచీపతికిది యెల్ల విన్నవింప నాతడును నా సుధర్మ సభను వాయువునకీయ నాతడాదివ్య సభం గొని వచ్చెను. సర్వరత్న సదనమయిన యా సభను గోవిందుని బాహు రక్షణ మంది యాదవు లనుభవించిరి.

 

 

బలరామ కృష్ణులు సర్వ విజ్ఞాన వేత్తలు సర్వజ్ఞులు నైనను గురుశిష్య భావమిట్లుండ వలెనని లోకమున వెల్లడింప గోరి కాశీలో జన్మించిన యవంతీ నగరము నందు వసించు చున్న సాందీపని సన్నిధానమున కయ్యిద్దరు నుపనయనము లయిన తరువాత నేగిరి. తొలుత వేదాధ్యయనము నెడ బ్రీతిగొనిరి. ధనుర్వేదమును సరహస్యముగ జదివిరి. అరువది నాల్గు రోజులలో సర్వ విద్యాగ్రహణము గావించిరి. అది చూడ నత్యద్భుత మయ్యెను. ఇతరుల కసంభవ మైనపని అనుకోని వారి యీ యమానుష చర్యను చూచి సాందీపని చంద్ర సూర్యులిట్లు వచ్చినారని యనుకొనెను. సాంగముగ నాల్గు వేదములను సర్వ శాస్త్రములను అస్త్ర గ్రామమంతయును నుపదేశ మాత్రమున నయ్యన్నదమ్ములు గ్రహించి గురు దక్షిణ యేమి సమర్పించు కొందుమని యాచార్యు నడిగిరి. ఆ మహాబుద్దిశాలి వారి యతీంద్రియ కర్మ వైభవము గాని లవణో దధియందు ప్రభాస క్షేత్రమున పోయిన కొడుకు నిండని కోరెను. ఆ యిద్దరు నస్త్రములం బట్టినంత సముద్రు డర్ఘ్యముం గైకొని సాందీపని పుత్రుని నేనపహరింప లేదు. పంచ జనుడను దైత్యుడు శంఖ రూపము దాల్చి యా బాలకుం బట్టుకొని నా యుదకము లందున్నాడు. అన విని కృష్ణుడు సాగర జలముల జొచ్చి యా పంచజనుం జంపి వాని యెముకలం బొడమిన శంఖము గైకొనెను. దాని నాదము చేత దైత్యులకు తేజో హానియు దేవతలకు తేజో వ్రుద్దియు అధర్మ క్షయము నయ్యెను. ఆ పంచజన్యము బట్టి యెత్తి శ్రీహరి యమపురికి బలభద్రునితో నేగి సూర్యపుత్రుని యమునిం గెలిచి యాతనల నున్న యాగురు బాలకుని నెప్పటి శరీరముతో నున్న వానిం గొనివచ్చి నయ్యిద్దరు సమర్పించిరి. ఉగ్రసేన పరిపాలనలో నున్న మథురకు దయచేసిరి. పౌరస్త్రీ పురుష వర్గ మానంద భరిత మగుచుండ బలరాం కృష్ణులు తిరిగి విచ్సెసిరి.