విష్ణు మహా పురాణము

Table of Contents

27 - శంబరాసుర వధ - ప్రద్యుమ్నాగమనము

 

 

శంబరుడు ప్రద్యుమ్నునేట్లు హరించెను? ప్రద్యుమ్నుడు వాని నెట్లు వధించెను? ఈ కథ సవిస్తరముగ నాన తిండన

 

 

ఓ మునీ! ప్రద్యుమ్నుడు పుట్టిన యాఱవనాడు వీడు నన్ను జంపువాడని తెలిసి కాల (మృత్యుతుల్య) శంబరుడా శిశువును బురిటింటి నుండి గొంపోయి పెను మోసళ్ళతో సుడులతో భయంకరమైన సముద్ర మందు బడవేసెను. ఆ బాలు నొక చేప మ్రింగెను. ఆ చేప జఠరాగ్నికాతడు నశింపడయ్యె. జాలరు లా చేపను దక్కిన చేపలట్ల వలలో బడిన దానిని శంబరాసురునికి నివేదించిరి. ఆతని నామమాత్ర భార్యయగు మాయావతి సర్వగృహేశ్వరి కావున నా చేపను వంటవాంద్ర కందించెను. దానిం గోసి నంతట నందు అతిశోభన మూర్తి మున్ను దగ్దుడైన మన్మథుడనెడి తరువు యొక్క ప్రతమాంకుర మన్నట్లున్న కుమారుని జూచెను. వీడెవడు? చేప కడుపునా నెట్లు ప్రవేశించెను. అని యిట్లు వేడుకగోన యామాయావతిం గని నారదుడు ఈతడు సకల జగత్థ్సితి సంహార కారకుడగు విష్ణుని తనయుడు. శంబరునిచే పురిటింటి నుండి హరింప బడినవాడు. సముద్రమునం బడవేయ జేప మ్రింగగా చేప మూలమున నీ యింట బయలు వడిన వాడు. ఇదియొక్క మానవ రత్నము. విశ్వాసముతో వానిని బాలింపుము. అనవిని మాయావతి బాల్య నిమిత్తమైన యనురాగము పెంపునను వాని రూపాతిశయము వలని మోహమునను వానిం జక్కగ పెంచెను.

 

 

ఆతడు నిండు జవ్వనమున దీపించినంత నాగజయాన వానియంద భిలాషగలదై వానికి తాదెలిసిన సర్వమాయల నోసంగెను. ప్రద్యుమ్నుడను పేరందిన యాతనిపై ననురాగమూని వానిపైనే మనసుంజూపులు పెట్టికొనెను. ఇట్లు తనపై ఆసక్తిం జూపు నా పద్మనయనంగని కృష్ణ సుతుడు మాత్రుభావము తలగి నాయెడ నిట్లేల వర్తింతువని యడిగెను. ఆమె నీవు నాకు బుట్టిన వాడవు గావనియె. ఈ కాలశంబరుడు కృష్ణుని తనయుడ వగు నిన్ను హరించి సముద్రమునం బడవేయ చేప కడుపునం బడి నీవు దాని మూలాన నాకు లభించితివి. ఆమె నిను గన్న తల్లి నీకై యిప్పుడ డలుచును వత్సల్యాతి శయమున నేడ్చు చున్నదనియె.

 

 

ఈ మాటలాలించి ప్రద్యుమ్నుడు శంబరుని యుద్దమునకు ఆహ్వానించెను. క్రోధాకులుడై వానితో బోరెను. వాని సేనల గూల్చి వాని యేడు మాయల నతిక్రమించి తన యెనిమిదవ మాయాశక్తిం బ్రయోగించి యా రక్కసునిం గూల్చెను. ఆవల నా మాయావతిం గైకొని యాకసమున కేగిరి తండ్రి పురమున కేతెంచెను. మాయావతితో గూడ నంతఃపుర మందు వ్రాలిన యాతనింగని కృష్ణ భార్యలు ఇతడు కృష్ణుడే యనుకొనిరి. రుక్మిణి వానింగని ప్రేమతో కన్నీరు దొరుగ ఈ బిడ్డడే ధన్యురాలు కన్నవాడో కద! ఎలాప్రాయమున నున్నాడు. ప్రద్యుమ్నుడు జీవించి యుండెనేని ఈ యీడువాడై యుండువాడు. నీవంటి కొడుకుచే భూషితురాలైన యా తల్లి ధన్యురాలు. అది కాదు. నీపైనాకు నీ ప్రీతిని బట్టియు నీమేని కవళికలం బట్టియు నీవు హరి గన్నవాడవే. స్పష్టముగ నీవు హరి కుమారుడవై యుందు వనియె.

 

 

ఇంతలో నారద మహర్షి కృష్ణునితో నంతఃపురమున కేతెంచి రుక్మిణీ దేవిం గని యామె నుల్లాస పరచుచు ఓ సుందరీ! వీడు నీ కొడుకు. శంబరునిం జంపి వచ్చినాడు. పురిటింట నుండి వానిచే హరింప బడిన వాడితడే. ఈమె యీనీ కుమారుని భార్య. ఈమె శంబరుని భార్య కాదు. ఇందులకు గారణము వినుము. మును మన్మథుడు గతించిన తరువాత మరల నతడు పుట్టునను గట్టి తలంపుగొని మాయా రూపమున నీ సుందరి శంబరాసురుని మొహవశుం గావించెను. వానితోడి విహారము లందు భోగము లందును తన రూపమును మాయగొని యిరురూపులం గావించి యా దైత్యుని కామాయా రూపము దర్శింప జేసెను. ఆ నీ కుమారుడా కాముడే ప్రద్యుమ్నుడి యవతరించి నాడు. అతని భార్య రతీదేవియే యీ మాయావతి. ఇందు సంశయింప వలసినది లేదు. కల్యాణి ఈమె నీ కోడలు. అనవిని రుక్మిణీ కృష్ణు లానంద భరిత మానసులైరి. నగర మెల్ల బాగుబాగని కొనియాడెను. చిర కాలమునకు గనిపించిన కొడుకు గలిసి కొన్న రుక్మిణీ దేవింగని ద్వారకంగల జనమెల్ల ఆశ్చర్య మొందెను.