విష్ణు మహా పురాణము

Table of Contents

17 - అక్రూరగమనము

 

 

శ్రీకృష్ణ దర్శనమునకు అక్రూరుడు రథముపై నంద గోకులమున కేగెను. ఏగుచు దనలో, స్వాంశముతో నవతరించిన చక్రాయుధుని ముఖముం జూడ నున్నాను. ఇప్పుడు నా జన్మము సఫల మయినది. ఈ రేయి సుప్రభాత మైనది. అప్పుడే వికసించిన తామర రేకులట్టి కన్నుల విలసిల్లు విష్ణు ముఖమును దర్శింప నున్నాను. సంకల్పనాత్మక మైనది పాపమును హరించు విష్ణుని పుండరీకముల బోలు కన్నుల నింపగు నెమ్మోము చూడ నున్నాను. ఎటనుండి వేదములు వేదాంగములు బయలు వెడలినవో యా పరంధాముని భగవంతుని ముఖము దర్శింప నున్నాను. యజ్ఞము లందు యజ్ఞ పురుషుడుగా పురుషులచే పురుషోత్తముడుగ యజింపబడు సర్వాధారుడగు జగత్పతిని దర్శింప నున్నాను. ఇంద్రుడు నూరు యజ్ఞములం దెవ్వని యజించి అమరరాజు పదవి నందె నా స్వామిం గేశవుని దర్శించెద. బ్రహ్మరుద్రా శ్విన్యాదిత్య మరుద్గణము లెవ్వని స్వరూప మెఱుంగ రాహరి నాకు ప్రత్యక్ష మగుచున్నాడు. సర్వాత్మకుడు సర్వవిదుడు సర్వభూతాంతఃస్థుడు అచింత్యుడు అవ్యయుడు సర్వవ్యాపి నాతో మాటాలాడ నున్నాడు. మత్స్యకూర్మాది రూపములచే జగముల యొక్క స్థితిని గావించిన ప్రభువు అజుడు నాతో పలుక నున్నాడు. ఇపుడు జగత్ప్రభువు తన మీదినున్న స్థితి సహారాదికార్యము నొనరింప స్వేచ్చగృహీత మనుష్యాకారుడై యున్నాడు. ఎవ్వడనంతమూర్తియై (శేషుడు) తన శిరమ్మున భూమిందాల్చునో అతడవతరించి యున్నాడు. నన్ను అక్రూరా! యని పిలువ నున్నాడు. పితృపుత్ర మిత్రకలత్రాది బంధుమోహమయ మయిన ఎవ్వని మాయను జగత్తు తరింప జాలరట్టి మాధవునకు నమస్కారము.

 

 

ఏ స్వామి హృదయము నందున్న నరుడు సర్వవ్యాపిని యైన యవిద్యను యోగామాయను తరించునట్టి యమేయాత్మునకు జ్ఞానమూర్తికి నమస్కారము. యజ్వలు యజ్ఞ పురుషుడని సాత్వతులు (ఉపాసకులు) వాసుదేవుడని వేదాంతవిదులు విష్ణుడని వర్ణింతురా పరబ్రహ్మకు నతుడనయ్యెదను.

 

 

ఎట్లు ఎచ్చట దాతయందీ సదసదాత్మక వస్తుతత్త్వము నిలువ బదినదో ఆ సత్య రూపముచే నీతడు నాయందు బ్రసన్నుడగు గాక! ఎవని స్మరించినంత పురుషుడు సకల కళ్యాణ భాజనమగునో అట్టి నిత్యుని ఆజుని హరిణి శరణొందెద.

 

 

ఇట్లు భక్తి వినమ్రమతియై విష్ణుం దలచుచు నక్రూరుదించుక ప్రోద్దుండగా గోకులమును జేరెను. అతడు తొలుత ఆవుల పాలు పిదుకుచున్న కృష్ణుని దూడల నడుమ నుండగా వికసితనీలోత్పల దలశ్యాముని హరిని దర్శించెను. బాగుగ వికసించిన పత్రముల వంటి నేత్రములు గలవానిని శ్రీవత్సాంకిత వక్షుని ఆజానుబాహుని విశాలోత్తుంగ వక్షుని ఉన్నతనాసుని సవిలాసదరహాస ముఖారవిందునితుంగ రక్తనఖమృదుల పదవిన్యాస మవనిం జేయువాని పీతాంబరధారిని వనమాలా విభూషితుని “చంద్రబింబముతో గూడిన నీలాచల మట్లు తెల్లదామరల దలపూవులుగా దాల్చిన శ్రీకృష్ణుని హంసలు మొల్లలు జాబిల్లి యు నిట్లచ్చపు తెలికాంతుళ గులుకు నెమ్మేన నల్లని వలువ ధరించి” యా కృష్ణుని వెంటనున్న యదునందనుని ఎత్తరియై ఎత్తయిన భుజ శిరస్సులు గల్గి సువికాసి ముఖ పంకజుడై మేఘమాలలు వైనలమిన రెండవ కైలాసాద్రియో యన్నట్లున్న బలభద్రుని వీరిద్దరిని జూచి యమ్మాహామతి యగు నక్రూరుడు మోముదామర విప్పార మేనెల్ల పులకింప నిట్లు భావించెను.

 

 

యా పరమతేజ మిది. ఇది పరమ పదము. వాసుదేవ భగవానుని యంశమిట రెండు రూపములై యున్నది. జగద్దాత యిట కనబడగా కన్నుల సాఫల్యము చేకూరునా? ఈ యనంతమూర్తి నావెన్ను దన కరకమలమున దట్టునా? ఎవని కరాంగుళి తాకిన పాపములు వోయి అచ్చమయిన సిద్ది కలుగుని అగ్ని మెఱపు రవి కిరణముల మాలల వలె వెలుంగు భయంకరమై అత్యుగ్రమైన చక్రాయుధమును వదలి రాక్షస రాజ చక్రమును గూల్చి దైత్యుభార్యాల కన్నుల కాటుకలు హరించెనో భూతలము నందుండియే బలి ఎవని చేతియందు నుదకము (దానధార) నునిచి మనోహర భోగములను అనగా అమరత్వమును మన్వంతరమంతదాక శత్రుశూన్య మగునట్లుగా అమరాధిపత్యమును బడసెనో అట్టి మహాప్రభువు దోష రహితమయిన నన్ను కంసుని చేరదీసి నందున దోషమునకు స్థానమైయున్న వానినిగా తలచి అవమానముచే దూషితునింగా నోనరించునా? అట్టియెడ సాధువులచే వెలివెట్ట బడిన వాని జన్మము ఛీఛీ! పరమ నికృష్టము. జ్ఞాన స్వరూపుడు. అచ్చపు సత్త్వగుణమునకు నిధి. దోషదూరుడు. ఎల్లప్పుడు స్ఫుటమై తోచువాడు సర్వజన హృదయము నందున్న వాడునైన యీ స్మామికి జగమ్మునం దెలియరాని దేమున్నది? కావున నేను భక్తిచే మనసు విధేయము గాగ నీశ్వరేశ్వరుడు అజుడు వ్యాపకుడు నగు పురుషోత్తముని యొక్క ఆదిమధ్యాంత రహితమయిన అంశావతారమును శరణం దెదను.