విష్ణు మహా పురాణము
30 - పారిజాతా నయనము
గరుత్మంతుడు వారుణ చత్రమును మణి పర్వతమును సత్యభామతో శ్రీకృష్ణుని సలీలముగ వహించెను. స్వర్గ ద్వారమును జేరి హరి పాంచజన్య శంఖముం బూరించెను. అమరులర్ఘ్య పాద్యాదులం గొని ఎదురు వచ్చిరి. వారిచే అచ్యుతం డర్చితుడై దేవమాత యగు అదితి గృహమ్మున కరిగెను. తెల్లని మేఘ శిఖర మట్టి యా గృహముం బ్రవేశించి అదితిం గని యింద్రుడు దాను ప్రణమిల్ల కుండలముల నొసంగి నరకనాశన వార్త నివేధించెను. అదితియుం బ్రీతిసెంది జగద్విధాత హరి యెడల మనసుంచి ఇట్లు స్తుతించెను.
పుణ్డరీకాక్ష! భక్త భయప్రదా! సనాతనా! సర్వాత్మా భూతరూపుడవు! మహాభూత జనకుడవు! నీకు వందనము. మనోదుద్దీంద్రియములను నడపించు వాడవు. గుణాతీతుడవు కనుకనే శీతోష్ణ రహితుడవు. శుద్దసాత్త్విక హృదయవాసిని. తెలుపు నలుపు పొడవు వెడల్పు మొదలగు వికల్పములు లేని వాడవు. జన్మాది వికారములు లేని వాడవు. జాగ్రదాద్యవస్థలు లేనివాడవు. సర్గాదికర్తవు కర్తలకు పతివి. బ్రహ్మ విష్ణు శివాది మూర్తులు చరాచర ప్రపంచ మంతయు నీ స్వరూపమే. తత్త్వము నెఱుంగని వారిని మిక్కిలి మొహపెట్టు మాయ నీదే. ఆత్మ కాని దాని యందు ఆత్మజ్ఞానమే మాయ. తనది కాని దాని యందు తనదను భావము దాననే కలుగును. ఈ మాయ సంసార జనని. ఆమె చేష్టయిది. స్వధర్మపరులై నిన్ను నారాధించిన వారు ఈ మాయను దాటుదురు. బ్రహ్మాది దేవతలు, మనుష్యులు, పశువులు, విష్ణుమాయ యనెడి సుడిలో పడి మొహమను గాడాంధకారముతో చుట్టబడిన వారై నిన్నారాధించి కోరికలను కోరుదురు. కాని సంసార నాశమును గోరడు. ఇట్టి వారే మాయ. ఈ మాయ నీదే. నేను శత్రుపక్ష క్షయము సేయగోరి నీవు పుత్రుడవు కమ్మని నిన్నారాదించితిని గాని మోక్షము కొఱకు గాదు. ఇదియు మాయా విలసనమే. కల్పవృక్షమునుం గూడ గోచిపాత మాత్రముపై వాంఛ పుణ్యులు కాని వారికి కల్గుచుండుట యను అపరాధము తమ కర్మ దోషము వలన గల్గినదే. కావున నన్ను ననుగ్రహింపుము. జ్ఞానమట్లు భాసించు నజ్ఞానమును నశింప జేయుము. శారఙ్గచక్రధరునకు నీకు నమస్కారము. శంఖనందక ఖడ్గదారికి నీకు వందనము. ఈ స్థూల చిహ్నముల తోడి నీ రూపము గాంచితిని. కాని పరమార్థ రూప మెఱుంగను. అనుగ్రహింపుము.
అని యాదితి స్తుతింప నా తల్లిని సురారణిం (జన్మహేతువు) గని విష్ణువమ్మా! మాకు వరము లిమ్మని మాయామానుష వేషధారి కుమారుడర్థింప
నట్లయగు గాక యనియు సురారుల కీవజయ్యుడ వగుదువనియు మనుష్య లోకమున పుట్టుదు వనియు నదితి యచ్యుతుం దీవించెను. అంతట కృష్ణుని భార్య సత్యభామ యింద్రునితో గూడ నదితికి మ్రొక్కి దయ సూపుమ దయ సూపుమని మఱి పలికెను. ఆమె నా సాకతమున నీకు ముదిమి వైరూప్యము గలుగదు. నిత్య నవయౌవ్వనము నమ్భాసింతువు గాక యని దీవించెను.
ఇట్లదితి యనుగ్రహ మందు అనుజ్ఞ గొని జనార్ధనుని సబహుమానముగ యథావిధిం బూజించెను. శచీదేవి దాను పారిజాత పుష్పములం బెక్కింటిని గొప్పునంగైసేసికొని, మానుష స్త్రీయని భావించి యొక్క పారిజాత కుసుమమును సత్యభామ కొసంగెను. అవ్వాల కృష్ణుడు సత్యభామతో నందనాది దేవోద్యానములను అతి హృదయములం దర్శించెను. అందు ఘుమఘుమ పరిమళ ములనించు గుత్తు గుత్తులుగా నిండపూచి నిత్యాహ్లాదము గొల్పు కుసుమములతో లేత చివుల్లతో శోభిల్లుచు బంగారు పైపట్టతో రాజిల్లుచు సముద్ర మథన సమయమందు క్షీరవారాశి నుదయించిన తరురాజముం బారిజాతముం జూచి పరమ ప్రీతి నానందించి ముచ్చట గొని సత్యభామ గోవిందుని గని యిట్లనియె. కృష్ణ! ఈ పాదపమును మనమెల ద్వారకకు గోనిపోరాదు? సత్యా! నీవు నాకెంతయుం గూర్చు దానవని యన్న నీ పలుకు సత్య మగునేని అది కేవల మౌపచారికము (వట్టి ఇచ్చకము) గాదేని నా యింటి పెరటిలో నాతుటకు దీనిం గొంపో వలయును. జాంబవతి గాదు, రుక్మిణి యుంగాదు. భామ! నీవభీష్టురాలవై నట్లేవ్వరుం గారని పలుమారులు కృష్ణా! ముచ్చటల నాడితిని. అది నిజమేని గోవింద! ఈ పారిజాతము నా గృహ విభూషణ మగుగాక! నా కొప్పునందొక వంక మెరపుగా మెరుగుగా నీపారిజాత పుష్పమంజరి జేరవికొని నా సవతు లందరిలో శోభింప వలయునని ముచ్చట పడుచున్నాను.
అన వినినదే తడవుగ కృష్ణు డల్లన నామె వంకం గని యా పారిజాత తరు రాజమును గరుత్మంతునిపై నెక్కించెను. వనపాలురు “దేవరాజ పట్టమహిషి శచీ దేవి, ఆమె సోత్తీ పారిజాత మహా వృక్షము. దీని నీవు గొంపోదగదు. ఇది దేవరాజు కొరకే పుట్టినది. అతడును దానిని మహానుభావురాలగు పట్టమహిషి శచీదేవికి వేడుక కొని యిచ్చెను. శచీదేవి నగగా నలంకరించుకొన నమృత మధన మందు దేవతలు దీనిం జనియింప జేసిరి. దీనిం కొని క్షేమముగా నీవు పోలేవు. దేవేంద్రు డేదేవి మొగముం జూచు నా ఇల్లాలి సొంత సొత్తైన ఈ పారిజాత రత్నము నీవు దెలియమిం గోరుచున్నావు. క్షేమము గల వాడెవ్వడిది గొనిపో గలడు?” సురపతి ఈ పనికిం బ్రాయశ్చిత్తాము సేయగలడు. వజ్రయుధముం జేతనెత్తిన శక్రుని నమరులు వెంబడింతురు. అందుచే అచ్యుత! దేవతలతో తగవు కోరి తెచ్చి కొనుట నీకు దగదు. పాకాదశ బరమ కటువయ్యెడు (విషమించెను) పనిం బండితులు మెచ్చారు.
అనవిని యా వనపాలురం గని యతికోపిని సత్యభామ ఆ! పారిజాతమునకు శచి యెవ్వతె? సురాధిపుడు శక్రుడెవ్వడు అమృత మథన మందు పుట్టిన యీ చెట్టు సర్వ లోకమునకు సమానము. ఇంద్రుడొక్కడే ఎలా గైకొనును? అమృతమెట్లో చంద్రుడెట్లో యట్లీ పారిజాతమును సర్వలోకముల కుమ్మడి సొమ్ము. మగని బాహుబల మూతగ గర్వమెక్కి శచి యడ్డుచున్నది. అందుచే జెప్పుడు నీ ఓరిమి చాలు. సత్య యీ తరువుం బట్టించుకొని వెళ్ళుచున్న దని చెప్పుడు. పరుగున మీరేగి పౌలోమి యేమన్నదో వచ్చి చెప్పుడు. ఈ గర్వోద్దతాక్షరము లయిన మాటలు సత్యభామవని చెప్పుడు. నీవు భర్తకు వల్లభవేని నీకు భర్త వశుడేని యీ వృక్షముం గొని పోవుచున్న నా మగని నీవడ్డ గింపుము. నీ మగడు శక్రుడని యెరుంగుదును. అతడు త్రిదశాదీశ్వరు డనియు నెరుంగుదును. అయినను మానుషీ మాత్రను నేను పారిజాతము నిదిగో పట్టించు కొనిపోవుచున్నాను. అన వన రక్షకులు శచికి సత్యభామ పలికినది నివేదించిరి. శచియును విని సురాధిపుని బ్రోత్సహించెను.
అవ్వల నింద్రుడు పారిజాతమునకై దేవతలతో సైన్యముల నెల్లంగొని హరితో బోర నేగెను. ఇంద్రుడు వజ్రాయుధముం గైకొని పరిఘనిస్త్రింశగదా శూలాది దివ్యాయుధములం గొని త్రిదశులు యుద్ద సన్నద్దులైరి. అంతట హరి యైరావత మందున్న యింద్రుని యుద్దమునకు సన్నద్ధమైన యింద్ర పరివారమునుం గని దిశలు మ్రోయ శంఖముం బూరించి నిశిత శర జాలమును విసరెను. అది గని త్రిదశులునుం దీవ్ర దివ్యాస్త్రా శస్త్రములను వదలిరి. లీలగా జగత్పతి యోక్కొక్క దానిం బెక్కుతునుకలు గావించెను. ఉరగాశనుడు (పాము లందిన గరుత్మంతుడు) వరుణుని పాశమును కొన ముక్కునం బెట్టిలాగి పాముపిల్ల నట్లు బెక్కు తునకలు సేసెను. యముడు విసరిన దండమును గదా విక్షేపమున ఖండించి భగవంతుడు దేవకీ సుతుండవానిం బడనేసెను. కుబేరుని పాలకిని నువ్వు గింజంతగ నులిసేసెను. హరి సూర్యుందేరి చూచి సారము హరించెను. అమ్ముల నగ్ని చల్లారె. వసువులం దశ దిశలకుం బారదరిమె. చక్రముచే శూలముల కొనలు విరిగి రుద్రులు నేలకొరగిరి. సాధ్యులు విశ్వేదేవులు మరుత్తులు గంధర్వులు శార్ఙ్గి వదలిన సాయకములచే నింగిని బూరుగు దూదియట్లు పింజెలు పింజెలై తూలిరి. గరుడుండును దన సూది మొనవంటి ముక్కునం బొడిచి వీక్షించి ఇరు ఱెక్కలం దూల్చి గోళ్ళ గొనలర్ జీల్చి పెక్కు తెఱంగుల వీర విహారము న్నెఱపెను.
అవ్వల దేవేంద్ర మాధవులు మేఘములు జలధారల ట్లొందొరులపై శరధారలం గురిసి కొనిరి. ఐరావతముతో గరుడుండు పోరె. అన్ని బాణములు అస్త్రశస్త్రములు తెగివడ వాసవుండు వజ్రాయుధము లంబట్టెను. కృష్ణుండు సుదర్శనముం గైకొనెను. అంతట వారింగని ముల్లోకములు హాహాకార మొనరించెను. ఇంద్రుడేసిన వజ్రాయుధ మల్లన హరియందు కొనెను. నిలునిలు మని చక్రాయుధమును విసరెను. వజ్రాయుధమా నష్టమయ్యె. వాహనమా గరుడ క్షతమయ్యె. అయ్యెడ నిక పారిపోవలయు నన్న యింద్రుడు మహావీరుని గని సత్యభామ! “త్రిభువనేశ! శచీ భర్తవు గదా! నీవు పారిపోవుట తగునా! పారిజాత మాలా సంపూర్ణ వైభవ శచీదేవి నిన్ను సేవించు చున్నది. పారిజాత పుష్పమాలం గైసేసి వలపుగొని మున్నట్లు దరికేతెంచు శచీదేవిం గనుగొనని నీకు దేవరాజ్య మేపాటిది? శక్ర! ప్రయాస పడకు! సిగ్గు పడదగదు. పారిజాతమిది గోనిపోమ్ము. దేవతలు దిగులు వడవలదు. ఇంటికి వచ్చిన నన్ను పతి గర్వాతిశయముచే శచి సబహుమానముగ సోపచారముగ జూడలేదు. నేను స్త్రీ నగుటచే నుదారభావము లేని దానను. నా మగడు నన్నెపుడు బహుమానించునన్న దురభిమానమున తమతో జగడము పెట్టి కొంటిని, ఒరుల సొమ్ము హరించిన సొత్తు పారిజాతము వద్దు. ఆమె తన చక్కదనముచే మగనిచే గర్వించినది. ఏ యాడుది గర్వింపదు!” అన సత్యభామ పలుకులు విని
ఓ చండి! కోపనాస్వభావ! చాలు చాలు. మిత్రభేదము సేయు వచన విస్తర మికవలదు. సర్గస్థితి సంహార కర్తయైన విశ్వరూపి భగవంతుని చేత నోడిన నాకు సిగ్గేమి? దేవీ! సృష్టి స్థితి ప్రళయ పాలన కారణమై ఆది మధ్యాంతములు లేని పరమాత్మచే నోడిన నాకు లజ్జ యేమి. అట్టి అజుని చేసియుం జేయని వాని శాశ్వతునీ జగదుప కార నిమిత్త లీలామానుషావతారు నెవ్వడు గెలువ సమర్థుడు? అని యింద్రుడు స్తుతించె.
