విష్ణు మహా పురాణము
31 - పరమాత్మ లీలావిహార వైభవము
దేవరాజిట్లు వినుతింప భగవంతు డల్లన నవ్వి భావ గంభీరముగ
భువనేశ! నీవు దేవరాజువు. ఇంద్రుడవు. మేము మర్త్యులము. నేనపరాధము సేసితిని. నీవు క్షమింపదగును. ఈ పారిజాతము దానికుచిత మైన తావునకు గొనిపోదగును. సత్యభామా వచనముం బట్టి యిది నేను గైకొంటిని. నీవు నాపై వైచిన ఈ వజ్రమును నీవ గ్రహింపుము. శత్రు విదారమైన ఈ యాయుధము నీదే. నీ దగ్గర నుండ దగినదే. అన విని యింద్రుడిట్లనియె.
ఈశ్వర! నేను మర్త్యుడ ననుచు తబ్బిబ్బు పరతువు? నిన్నెరుంగుము. ఎవడవో యెక్కడ వగుదువు గాక! జగత్ప్రవృత్తి త్రాణములు నడపు నాథుడవు నీవు. జగమ్ము నందు శల్య నిష్కర్షము సేయు చున్నావు. (లోకములకు శల్యప్రాయులై బాధించువారి నున్మాలించు పని నీయది) కృష్ణా! ఈ పారిజాతముం ద్వారకకు గొనిపో దగును. నీవు మర్త్య లోకము వీడిన తరి నిదియు నక్కడ నుండదు. దేవదేవ! జగన్నాథ! కృష్ణా! విష్ణూ! మహాభుజ! శంఖ చక్ర గదాపాణీ! నా తప్పిదమును క్షమింపుము.
అన విని యట్లనే యనిన యింద్రుని వీడుకొలిపి హరి భూలోకమున కేతెంచెను. సిద్ధ గంధర్వులు సురలు పెక్కు రీతుల వినుతించిరి.
అవ్వల ద్వారక కేగుదెంచి హరి శంఖము పూరించి ద్వారకా వాసుల కానందముం గూర్చెను. సత్యభామతో గరుడునిండిగ్గి పారిజాత తరువు నామె పెరటియందు తాననాటెను. దానిం దరిసి జనమునకు బూర్వ జన్మ స్మృతి గల్గును. దాని పూల పరిమళము పుడమిపై మూడామడ వ్యాపించును. ఆ పారిజాత మందు దమముఖ ప్రతిబింబములం గని యాదవు లందరుం దమ ముందటి జన్మములందైన అమానుష దేహ బంధము లన్నింటిని (అనగా దాము దేవతలమని దేవాదీషునితో బాటవని నవతరించి పరమాత్మ లీలలో దాము పాల్గొనుటకు ఉపాధి దరించి వచ్చినామని) దర్శించిరి. అవ్వల కృష్ణుడు నరకుని రాజధాని నుండి కొని వచ్చిన కనకమణి రత్నాది సంపద నయ్యాదవుల కందర కప్పుడు పంచి యిచ్చెను. నరకుని చేరబడగా తాను విడిపించిన కన్యలందరం దాను గైకొనెను. అవ్వల నొకే పుణ్య లగ్నమున వారందరిం దాను బరినయ మాడెను. వారు లెక్కకు బాదారు వేల నూరుగురు. అందరు సుందరుల కందరు దానై వారితో విలసించెను. వారందరు నెవ్వెతె మట్టుకామే కృష్ణుడు నా పాణిం గ్రహించె నాకేల్వట్టి నన్నె పెండ్లాడెనని లోలోదలంచికొని మోదించిరి. శ్రీహరి విశ్వ రూపముం గొని ఓ మైత్రేయా! వింటివా! జగత్స్రష్ట కేశవుడు వారి గృహము లందురేలం బరమాత్మ నివసించెను.
