విష్ణు మహా పురాణము

Table of Contents

8 - ధేనుకాసుర వధ

 

 

బలకేశవులు గోపాలనము సేయుచుం దిరుగుచు నా బృందావనమునం దందమైన తాళ వనమున కేగిరి. ధేనుకుడను రాక్షసుడు గార్ధభ రూపముతో మృగ మాంసములం దినుచు నా వనమందు వసించెను. ఆ వనము పండిన తాటి పండ్లతో సమృద్ద మగుట చూచి గోపాలురా పండ్లపై కోరిక గల్గి రామ కృష్ణులతో నిట్లనిరి.

 

 

ఓ రామా! ఓ కృష్ణా! ధేనుకుని రక్షణలో నున్నందున ఈ ప్రదేశమందు పండిన ఈ తాటిపండ్లు సమృద్ధిగా నున్నవి. ఈ పండ్లు చూడు తమ సువాసనలచే దిక్కులం బరిమళింప జేయుచున్నవి. మేము వీనిం దిన గోరెదము. నీ కిష్టమేని వీనిని రాల్తము,

 

 

అని గోప కుమారులన విని సంకర్షుణుండు (బలరాముడు) ఈ పని చేయ వలసినదని యా పండ్లను రాల్చెను. కృష్ణుడును రాల్చెను. పండ్లు పడుచున్న సడి ఇని దుష్టుడు దరియరాని క్రూరుడు గర్ధభాకారుడు ధేనుకుడు కోపముతో వెనుక కాళ్ళను నేలం దాడించుచు వచ్చి యా రామకృష్ణుల రోమ్మునం గొట్టి వారికి పట్టువడెను. కృష్ణుడు వానిం జేతనెత్తి ఆకాశామునందిట్టటు త్రిప్పినంత వాడసువుల బాసెను. వాని నటనున్న పచ్చిక బయల విసరి వైచెను. వాడు తాళ వృక్షాగ్రము నుండి కూలుచు మహావాయువు మేఘముల నట్లు తాటి పండ్లను చెట్ల నుండి జలజల రాల్చెను. వాని పరివారము మరికొందరు గాడిదలు తన మీదికి రాగా కృష్ణుడు, బలభద్రుడు వారిం బట్టి యవలీలగ విసరివైచిరి. క్షణములో నా ప్రదేశము తాడి పండ్లతో ఖర రాక్షస దేహములతో మిక్కిలి శోభించెను. అవ్వల గోవులు నిరాబాధములై యాతాల వనమందు మున్నెన్నడు రుచిచూడని లేత గడ్డిని మేసినవి.