విష్ణు మహా పురాణము

Table of Contents

16 - సదాచార వర్ణనమ్

 

శ్రాద్దమున నుపయోగింప దగిన వస్తువులు, పితృ దేవతలకు తృప్తి కలిగించు వానిని చెప్పుచున్నాడు. హవిష్యా (వ్రీహ్యా) ద్యన్నముచేత ఒక మాసము మత్య్సముచే రెండు నెలలు కుందేలు, ముంగిస, పంది, మేక, లేడి, దుప్పి, గవయ, మృగము, పొట్టేలు, గోవు వీనికి సంబంధించిన మాంసములచే మాసవృద్దిగా అనగా, కుందేలు మాంసముచే ఏడూ నెలలు, దుప్పి మాంసముచే నెనిమిది నెలలు, గవయ మృగమాంసముచే తొమ్మిది నెలలు, పొట్టేలు మాంసముచే పదినెలలు గోమామ్సముచే పదునొకండు నెలలు, నల్లని ఎఱ్ఱని శిరస్సు తెల్ల రెక్కలుగల పక్షికి వార్థసామాని పేరు. దాని మాంసముచే నిత్య తృప్తియు పితృ దేవతలకు కల్గును. ఖడ్గ మృగ మాంసము కఱివేప తేనె ఇవి శ్రాద్ధ కర్మయందు మిక్కిలి ప్రశస్తములు. మిక్కిలి తృప్తికరములు. గయా క్షేత్రమున కేగి శ్రాద్దము చేయు నాతని జన్మ పితృ దేవతలకు తృప్తి నిచ్చునదై సఫలమైంది. నల్లయవాలు నివ్వరి ధాన్యము శ్యామాకములు (శ్వేత కృష్ణములు) వన్యౌషధి ప్రధానములు శ్రాద్దార్హములు. యవలు కొఱ్ఱలు పెసలు గోధమలు వ్రీహులు తిలలు అనుములు కాంచనము ఆవాలు నిండు మంచివి. ఆగ్రయణేష్టిచే సంస్కరింప బడని ధాన్యము అలచందలు చిఱు వడ్లు (బుడమ ధాన్యము) చిఱు సెనగలు వీనిని శ్రాద్ధమున విడువ వలెను. సొర, వెల్లుల్లి, నీరుల్లి పిండమూలకము (కందమూలము), గాంధారవము (శాల విశేషము) పేలపిండి, లవణము, ఊషరక్షేత్రమున పుట్టినవి. ఎఱ్ఱనవి. ఎఱ్ఱనైన నిర్వాసనము (బంక ఇంగువ మొ॥) లవణోత్కర పదార్థములు మున్నగునవి శ్రాద్దమునందు పనికిరావు. క్రొత్తగా తీసికొని రాబడిందియు వాడనిదియు ఆవునకు తృప్తిని కలిగించనిది (అల్పోదకము) దుర్వాసన గలది నుఱుగుతో గూడినదియు నగు నీరు శ్రాదయోగ్యము కాదు. ఒక గిట్ట గల దాని పాలు ఒంటె పాలు, మేక పాలు, లేడి పాలు, గేదె పాలు శ్రాద్దము నందు విడువ వలెను. నపుంసకుడు, బహిష్కృతుడు, చండాలుడు, పాపాత్ముడు, వేదబాహ్యుడు, రోగి, కోడి, కుక్క వేదకర్మ త్యాగము చేసిన వాడు, కోతి, ఊరపంది, రజస్వల, ప్రస్వమైనది, శౌచము లేనివాడు, శవవాహనత్వముతో జీవించు వాడు వీరిచే చూడబడిన శ్రాద్దము నందు దేవతలు, పితృ దేవతలు భుజించరు. కావున సంవృతమగు ప్రదేశము నందు శ్రాద్దమును శ్రద్ధతో పెట్టవలెను. భూమిపై నువ్వులను చల్లి రాక్షసులకు పారద్రోల వలెను. గోళ్ళు, కేశములు, కీటకములు తొక్కి తీసిన రసముతోను పర్యుషితము (అతిక్రాంతకాలము) నగు నన్నము పనికిరాదు. శ్రద్ధతో గూడిన వారిచే నామ గోత్ర పూర్వకముగ నీయబడిన అన్నాదికము వారి పితృదేవతలు ఏ లోకము నందే ఆహారమును తినువారు పుట్టిరో ఆ లోకము నందాహారముగ మారి చెందును. ఓ రాజా! హిమవత్ పార్శ్వము నందలి కలాప గోమోపవనము నందు మనుపుత్రుడగు ఇక్ష్వాకు మహారాజు నుద్దేశించి పితృ దేవతలచే గీతమైన గాథ యొకటి గలదు. మా కులము నందు సన్మార్గ శీలురై గయకు వెళ్లి ఆదరముతో మాకు పిండములు వేయువారు పుట్టగలరా? మా వంశము నందు మఘా నక్షత్రయుక్త భాద్రపద కృష్ణ త్రయోదశి యందు తేనేతోను, నేతితోను గూడిన పాయసమును మాకు పెట్టువాడు పుట్టునా? పది సంవత్సరముల పిల్లను వివాహము చేయువాడు నీల వృషోత్సర్జనము చేయువాడును దక్షిణతో గూడిన అశ్వమేధ యాగమును యధావిధిగా చేయువాడును పుట్టునా? (ముఖము నందు తోక యందు గిట్టలు కొమ్ములు తెల్లనై యున్న యెఱ్ఱని యెద్దునకు నీలమణి పేరు).