విష్ణు మహా పురాణము
5 - సృష్టి వర్ణనము
సృష్టిని గూర్చి ఆలోచించు తఱి మున్ముందు దమో మయమైన బుద్ది పూర్వకము గాని (విశేష ధ్యానము లేని) సృష్టి యారంభ మయినది. ఈ తమోగుణ సృష్టి ఆయన నుండి 1. తమో మోహము, 2. మహామోహము, 3. తామిస్రము, 4. అంధ తపస్సు, 5. అవిద్యయు నన నైదు పర్వములుగా (భాగములుగా) ప్రాదుర్భవించినది. భగవంతుడు ధ్యానించు చున్న యెడ మేల్కొనక యున్న (నిద్రాస్థితిలో నున్నట్లున్న) స్థితి యొకటి 1. తమో మోహము, 2. వెలుపల లోపలను వెలుగు లేనిది మహా మోహము, 3. సంవృతాత్మ(తామిస్రము), 4. అవిద్య(అంధ తామిస్రము) కేవల స్థావర మయిన నగాత్మకము. కొండలు ముఖ్యములు గావున వాని సృష్టి ముఖ్యసర్గ మనబడును. సృష్టికర్త యా సర్గమును జూచి యిది సర్వసృష్టి సాధకము కాదను కొనెను. అటుపై ధ్యానించు చున్న యాయనకు తిర్యక్స్రోతసము (పశుపక్ష్యాది) సృష్టి సాగినది. అందు పుట్టిన పశు పక్ష్యాదులు తమోగుణ ప్రాయములు. అవేదులు, జ్ఞానము లేని జీవులు. హద్దుమీరి నడచునవి. తెలివి లేనివైనను తెలివిగల వానివలె ప్రవర్తించునవి. అహం మానములు. (నేనే గొప్ప దానినని యహంకరించు నవి). అంతః ప్రకాశములు (అంతర్వివిదములు) అనగా వానిలో చైతన్య మున్నను నది కప్పడి యుండును. అదిగాక యవి పరస్ప రావృతములు. ఒకదాని కొకటి యావరించి యుండు స్వభావము గలవి. పరస్పర సమ్మూఢములు. (ఒక జీవి సంగతి మరొక జీవికి తెలియదన్న మాట). ఆ తిర్య క్స్రోతస్సును జూచి యిదికూడ సృష్టి సాధకము గాదని మరల ధ్యానింపగా మూడవ సృష్టి యూర్ధ్వస్రోతస్సు అనునది బయలుదేరెను. ఆ జీవులూర్ద్వముగా బోవువారు. అది సాత్వికము. (సత్వగుణ వికార మన్నమాట) ఆ జీవులు సుఖ సంతోషములు హెచ్చుగా గలవారు. లోన వెలుపలను ఆవరణ లేనివారు. బహిరంతః ప్రకాశకులు. అదే దేవసర్గము మూడవది, దాన బ్రహ్మకు సంతుష్టి కలిగెను. అయినను మరియొక సృష్టిని సాధకముగా ధ్యానించెను. లోగడ చెప్పిన ముఖ్య సర్గాదులు అసాధకము లని గ్రహించి వెండియ నిత్యవస్తు ధ్యానము చేయు నతనికి యవ్యక్తము నుండి యర్వాక్స్రోతస్సు ప్రత్యక్ష మయ్యెను. ఆ సృష్టి అడ్డముగా స్రోతోరూపము (ప్రవాహ రూపము)గా తోచినది గావున దాని కాపేరు వచ్చినది. అందలి ప్రాణులు బహు ప్రకాశములు, బహు తమఃప్రాయములు, బహు రాజసము లయ్యెను. అందువలన నా జీవులు దుఃఖప్రాయులు. బహిరంతః ప్రకాశులు మనుష్యులు. వారు సృష్టి సాధకులు. ఆరు విధముల సృష్టి యిక్కడ తెలుప బడినది. వాని వరుస యిది, బ్రహ్మయొక్క మొదటి సృష్టి మహత్సర్గము. రెండవది తన్మాత్ర సృష్టి (భూత సృష్టి). ఐంద్రియకము (వైకారికము) మూడవది.
ఈ మూడును ప్రాకృత సర్గ మనబడును. ఇది బుద్ధి పూర్వకము. ముఖ్య సర్గము నాల్గవది. తిర్యక్సృష్టి యయిదవది. దేవసర్గ మారవది. మనుష్య సృష్టి ఏడవది. అర్వార్క్సోతసము ఎనిమిదవది. అనుగ్రహ సర్గము, సాత్వికము, తామసము అనునీ యైదు సర్గములు వైకృతములు. ప్రాకృతములు మూడు. కౌమారము కలిసి మొత్తము తొమ్మిది నవ సర్గములని వీనికి పేరు. ఈ ప్రాకృత వైకృత సర్గములు జగత్తునకు మూల కారణములు. మరి యేమి వినవలతు వన
దేవ సృష్టి క్లుప్తముగా తెల్పినవి సవిస్తారముగా నానతిమ్మన
కుశలురైన వారు కుశలములైన పూర్వ కర్మములచే భావితులై అనగా నాయా వేదోక్త స్వస్వ వర్ణాశ్రమాచార విహిత ధర్మానుష్ఠాన ములచే నాయా కర్మ ఫలానుభవము నందు దాదాత్మ్యము పొందిన వారై దాన నేర్పడిన ఖ్యాతి చేత సపూర్వ సిద్ధమైన సంస్కార విశేషముల చేత, వాసనల చేత విడివడక సంహార కాలమందు గూడ (లయ సమయము నందు గూడ) ఉప సంహృతు లయిరి. అనగా నుపాధి భంగము నొందింప బడియు లయ కారుడైన పరమాత్మ యందు సూక్ష్మ రూపమున నవశిష్టులైరి. వారిలో దేవతలు మొదలు స్థావరములైన పర్వతాదుల వరకు నట్లు భీజ రూపమున నున్నవారు నాల్గు విధములైన జీవులు. మఱియు, సృష్టి చేయు తరివారా బ్రహ్మ యొక్క మనసు నందు బొడమిరి. అవ్వల దేవతలు, అసురులు, పితరులు, మనుష్యులుగా నలు తెఱగుల జీవులను సృజింప నెంచి సృష్టికర్త తన నుదకము లందు సమ్మేళన మొనరించు కొనెను. అట్లు సంయోగ మందినంత మాత్రాన నాతని నుండి తమోమాత్ర తనువు (కేవల చీకటి) ఉద్రేకించినది. అపుడా సృష్టి సంకల్పము చేసిన యాతని యొక్క జఘనము (పిరిది భాగము) నుండి యసురులు పుట్టిరి.
ఆ తమోమాత్ర స్వరూపుడయిన తనువును విడిచి వేయవలె ననుకొని విడిచి వేసిన ఆయా తనువు రాత్రి (విభావరి) యయ్యెను. మరియును సృష్టి సేయ నెంచి వేరొక తనువు నందుండి యాతడు సంప్రీతి సెందెను. అంతట సత్త్వోద్రిక్తు లయిన జీవులా బ్రహ్మ ముఖము నుండి జనించిరి. ఆ తనువు (ఉపాధిని కూడా) నతడు విడువగ సత్త్వ గుణప్రాయ మగు దినము జనించెను. అందువలన రాత్రి యసురులు, పగలు సురలు బలవంతులైరి. అటుపై నా విధి సత్త్వగుణ ప్రధానమైన ఇంకొక శరీరమును స్వీకరించెను. అపుడు నేను పితను (తండ్రిని) అని యను కొన్నంతట నతనికి ఇతరులు జనించిరి. అవ్వల నతడా శరీరమును విడిచెను. అట్లు వదలిన యా శరీరమే సంధ్య. సంధ్య యనగా పగటికి రాత్రికి నడిమి స్థితి. ఆ మీద నతడు రజో గుణ మాత్రమైన శరీరమును గైకొనెను. దాన రజో గుణోద్రిక్తు లగు మనుష్యులు పుట్టురి. రజః ప్రకృతి శరీరమును గూడ నప్పటి కప్పుడే త్యజించెను. అంతట జ్యోత్స్న (వెన్నెల) ఏర్పడెను. అదే ప్రాక్సంధ్య (తొలి సంధ్య) యనబడెను. ఆ వెన్నెల ఏర్పడగనే మనుష్యులు పితరులు గూడ నా సంధ్యా సమయమందు బలవంతులగు చున్నారు. వెన్నెల రాత్రి పగలు సంధ్య యను నీ నాలుగును బ్రహ్మ యొక్క త్రిగుణా శ్రయములైన శరీరములు.
అవ్వల రజోగుణ ప్రధాన మయిన మరొక శరీరము నతడు గ్రహించెను. దాన నాకలి, కోపము బుట్టినవి. అటు పైని యంధకారమున నాకలికి బక్క చిక్కిన వారిని యతడు సృష్టించెను. వారు వికృత రూపులు, గడ్డములు పెరిగిన వారునై యా సృష్టికర్త దగ్గరకు పరువెత్తిరి. మఱియు మనలను పుట్టించిన వీనిని రక్షింప వలదని వారనిరి. దాన వారికి రాక్షసులను పేరు వచ్చినది. వారిలో కొందఱు ఈ సృష్టికర్తను జక్షామ (తిని వేయుదుమని) యార్చిరి. అందుచే వారికి యక్షులని పేరు వచ్చినది. బ్రహ్మ వారిని యనిష్టముగ జూచి నంతట వారి కేశములు రాలి పోయెను. అట్లు శిరోహీన ములయి వాండ్రు బ్రహ్మ శిరస్సుపై కెగ బ్రాకిరి. అట్లు సర్పణము చేసి నందున వారికి సర్పములను పేరు వచ్చెను. శిరస్సు హీనమగుట వలన యాహి యను పేరు గూడ వచ్చెను. (అనగా పాము లయిరన్న మాట) అందుకే కృద్ధుడై జగత్కర్త క్రోధ స్వరూపులను బుట్టించెను. వారు కపిశ వర్ణులు. (పసుపు మీరిన ఎరుపు రంగు వారు) భయంకరులు నైన పిశితాశను లని పేరొందిరి.
ఆయన ప్రథమ ముఖము నుండి గాయత్ర ఛందస్సును ఋగ్వేదమును త్రివృస్తోమమును (అనగా దేవతా స్తుతి సాధన భూతములగు ఋక్కుల సముదాయము) రథంతర సామమును యజ్ఞములలో యజ్ఞష్టోమ మనెడి సోమసంస్థా విశేషమును సృష్టించెను. దక్షిణ ముఖము నుండి యజుర్వేదమును త్రైష్టుభ ఛందస్సును పంచదశ స్తోమమును బృహత్సామను ఉక్థ్యమను సోమ సంస్థను సృజించెను. పశ్చిమ ముఖము నుండి సామ వేదమును జగతీ ఛందస్సును, సప్తదశ స్తోమమును వైరూపసామాను అతిరాత్ర మనెడి సోమయాగ సంస్థను సృజించెను. ఉత్తర ముఖము నుండి యథర్వణ వేదమును, అనుష్టుభ ఛందస్సును ఏకవింశ స్తోమమును వైరాజ సామను ఆపోర్యామ మనెడి సోమయాగ సంస్థను సృజించెను. బహువిధ భూతము లాయన యవయవముల నుండి జనించెను. దేవాసుర పితరులను మనుష్యులను సృజించి ఆ మీద మరల సంకల్పము చేసి యక్ష పిశాచ గంధర్వులను, అప్సరో గణములను, నర, కిన్నర రాక్షసులను, పక్షులను, పశువులను, లేళ్ళను, పాములను, అవ్యయము వ్యయమునైన ఈ స్థావర జంగమ పంచమును సృజించెను. వాని వానికి క్రిందటి సృష్టిలో నేయే కర్మములు విహితములో వానినే ఈ సృష్టి యందవియవి పొందినవి. హింస, అహింస, మృదుత్వము, క్రౌర్యము, ధర్మము, అధర్మము, ఋతము, అనృతము ననునవెల్ల నా బ్రహ్మచే భావింప బడినవే యాయా భూతములు పొందును. అవే వానికి రుచించును. ఇంద్రియార్థముల యందు శబ్దాది విషము లందన్న మాట. శరీరము లందు నానాత్వమును వినియోగమును బ్రహ్మ స్వయముగా సృజించెను. నామ రూపములు ఆయాకృత్యముల వివరణము వేద శబ్దముల నుండియే మొదట దేవాదుల కేర్పరచెను. ఋషుల పేరులు మున్ను వేదముల యందు వినబడినవే యిప్పుడును చేసెను. అట్లే వానిని నియోగ యోగ్యములం గావించెను. అనగా వానివానికి నియోగింప బడిన (కర్మమునకు) అనుగుణముగా గావించెను. ఋతువులందు ఋతు విపర్యయ మందు (ఋతువులు మారినపుడు) ఋతు చిహ్నములు నానా రూపములై యెట్లు కనిపించునో యట్లే ఆయా కృత త్రేతాది యుగము లందు గూడ యాయా యుగ ధర్మములు వివిధ రూపముల గనిపించును. సిసృక్షతో గూడి (సృజింప నిచ్చతో) సృజింప దాగిన వస్తువుల యొక్క శక్తిచే ప్రేరేపింప బడి బ్రహ్మ సృష్టికార్యము చేయుచునే యుండును.
