విష్ణు మహా పురాణము

Table of Contents

14 - భరతుడు రహూగణునకు చేసిన ఉపదేశము

 

పరమార్ధ సంపన్నమైన విప్రుని (భరతుడు) యీ వచన మాలించి వినయ వినమితుడై యిట్లనియె.

 

 

భగవంతుడా నీ పరమార్థ మయమైన పలుకు నేను వినినంత నా మనస్సులోని తలంపు లట్టిట్ల భ్రమించి నట్టున్నవి. ప్రకృతి కంటె మీదిదైన ఈ మహావివేక విజ్ఞానము సర్వజీవు లందు నీచే జూప బడినది. నేను శిబికను మోయుట లేదు, శిబిక నా మీద నున్నది. శరీరము నాకంటె వేఱు వస్తువు, అది యీ శిబికను మోయుచున్నది. భూతముల యొక్క గుణములు ప్రవర్తించుట చేత కర్మచోదితమైన ప్రవృత్తి యేర్పడును. ఈ గుణములు తమంత ప్రవర్తించును. దీనితో నాకేమి సంబంధముండదు. ఓ పరమార్థ తత్వజ ఇది చెవింబడగానే పరమార్థము నెడ లక్ష్యము గొన్న నా మనస్సట్టిట్టయినది. మున్నే నేనిక్కడ లెస్సగ వినవలసినది. పరమ శ్రేయస్సు ఏదని మహానుభావుడగు కపిల మహర్షి నడుగ వలయునని యత్నపడితిని. ఆలోగా నీవీ వాక్యముల బల్కితివి. దాననే పరమార్థ ప్రయోజనమునకై నీ యెడ మనస్సు దూకుచున్నది. కపిలర్షి సర్వమునైన విష్ణు భగవానుని యంశమున జగమ్ముల మోహము నశింపజేయ నీయవని యందవతరించిన మహానుభావుడు మాకు హితవు సేయ నా భగవంతుడే యిక్కడ సాక్షాత్కరించి నాడు. నీ విపుడానతిచ్చిన విధమదియే. కావున నోద్విజోత్తమ నీకు బ్రణతుడనైన నాకు బరమ శ్రేయస్సేదో యది దయ సేయుము. అఖిల విజ్ఞాన రస తరంగములకు సముద్రుడవు నీవు అన జడ భరతుండిట్లనియె.