విష్ణు మహా పురాణము

Table of Contents

12 - యదు వంశము

 

 

యదువు కొడుకు క్రోష్టువు. వానికి ధ్వజినీవంతుడు, వానికి స్వాతి, వానికి రుశంకువు, వానికి చిత్రరథుడు, వానికి శశిబిందువుం గల్గిరి. ఇతడు చక్రవర్తి పదునాల్గు మహారత్నము లీతని వద్ద నుండెనట వానికి నూరువేల మంది భార్యలు పది లక్షల మంది కుమారు లుండిరి. పృథుశ్రవసుడు, పృథువర్మ, పృథుకీర్తి, పృథుయశుడు, పృథుజయుడు, పృథుదాసుడు అను ఆరుగురు పుత్రులు ప్రధానులు. వీరిలో పృథుశ్రవసుని పుత్రుడు పృథుత్తముడు వానికి ఉశనుడు గల్గెను. ఇతడు నూరశ్వమేధములు చేసెను. వాని కుమారుడు శితపుపు. వానికి రుక్మకవచుడు వానికి పరావృత్తు వానికి రుక్మేషువు, పృథువు, జ్యామఘుడు, పలితుడు, హరితుడను నైదుగురు కుమారులు గల్గిరి. జ్యామఘుని గూర్చి యొక శ్లోకము కీర్తింపబడు చున్నది. భార్యకు లొంగిన వారుందురు. కొందఱు గతించి యుందురు. శైభ్యకు భర్తయగు జ్యామఘుడు శ్రేష్ఠుడు. ఆమెకు సంతతి లేదు. అయినను భయపడి మరొక భార్యను అతడు సేసికొన లేదు. అతడొకతఱి చతురంగ బలసమ్మర్ద దారుణమైన యుద్ధము నందు సర్వ శత్రుమండలమును జయించెను. ఆ శత్రుకూటమి పుత్రకలత్ర బంధు బతకోశ సమృద్ధమైన తమ రాజధానులను వదలి పారిపోయిరి. అప్పుడు భయబ్రాంతియై బెదరు చూపులనొక రాజకన్యామణిని తండ్రీ! అమ్మా అన్నా రక్షించు రక్షింపుమని యేడ్చుచున్న దానినా రాజు చూచెను. అమెం గనుట వలన నామె యందనురక్త మనస్కుడై యిట్లనుకొనెను. బాగున్నది సంతానము లేని (వంధ్యాభర్తనగు) నాకు దైవము సంతాన కారణము నొక కన్యారత్నమును సంఘటించెను. అందువలన నేనీమెం బెండ్లాడెదను లేదా ఈమెను రథమెక్కించుకొని రాజధానికిం గొనియేగెదను. ఆ శైబ్య అనుమతిగొనియే వివాహ మయ్యెదనని తన నగరమునకు వచ్చెను. శైబ్య విజయము గొని వచ్చుచున్న ప్రభువును దర్శింప పౌరభృత్య పరిజనామాత్య వర్గముతో నేదురేగి నగర ద్వారమందు నిలిచి రాజు వజ్జనున్న కన్యంగని యించుక కినుక పొడమ నధర పల్లవ మదర రాజుతో ననియె. ఓ అతి చపలచిత్తుడా! ఎవతెను రథమెక్కించుకొని వచ్చితిని? అన నీ రేడు మిగుల జడిసిపోయి యామె నా కోడలు అనెను. అంతట శైబ్య నేనా కొడుకును గనలేదు. నీకా ఇంకొక పెండ్లాము లేదు. నీ యే కొడుకు చేత నీ కోడలి చుట్టరిక మనెను. ఇట్లు అసూయా కోపకలుషితములయిన మాట వలన వివేకము కోల్పోయి జడుపు వలన తాను మును జెప్పిన తప్పుడు మాట తలగించుకొన నవనిపతి యామె కిట్లనియె.

 

 

నీకు కలుగ బోవు కుమారుని కింతదాక యవతరింపని వానికీమె కాబోవు భార్యగా నిర్దేశింప బడినదన విని యా యింతి యించుక నవ్వి యట్లే యగుగాక! యనియె. రాజుతో నగర ప్రవేశముం జేసెను. మఱియు నామీద అతి వినిర్మల శుభలగ్న హోరాంశ లందు రాజు నీకు పుత్రా లాభము గల్గునన్న వచన ప్రభావముచే వయసు గడచిన తర్వాత గూడ నారాజ్ఞి గర్భవతియై సకాలమున కుమారుని గనియె. ఆ శిశువునకు దండ్రి విదర్భుడను నామముంచెను. అతడా రాజకన్యను బెండ్లాడెను. ఆమె యందతడు క్రథుడు, కైశికుడు నను నిర్వురుం కొడుకులను కనియె. అటుపై రోమపాదుడను మూడవ పుత్రునిం గాంచె. అతడు నారదుని వలన జ్ఞాన సంపన్నుం డగును.

 

 

రోమపాదునికి బభ్రువు బభ్రువునకు ధృతియు ధృతికి కైశికుడు, కైశికునికి చేదియను కొడుకు దయించెను. అతని సంతతియే చైద్య రాజులు. జ్యామఘుని కోడలి పుత్రుడగు క్రధునకు కుంతియు. కుంతికి దృష్టి అతనికి నిధృతి అతనికి దశార్హుడు అతనికి వ్యోముడు అతనికి జీమూతుడు అతనికి వికృతి అతనికి భీమరథుడు అతనికి నవరథుడు అతనికి శకుని అతనికి కరంభి అతనికి దేవరాతుడుం కల్గిరి. దేవరాతుని కొడుకు దేవక్షత్రుడు అతనికి మధువు మధునికి కుమారా వంశుడు అతనికి అనువు అనువునకు పుర మిత్రుడుం

బుట్టిరి. అతనికి అంశుడు అతనికి సత్వతుడు గలిగిరి. అతనికి వంశపరంపర సాత్వతులన బడిరి. ఈ జామ్యఘుని సంతతిని శ్రద్ధతో విన్న యాతడు సర్వ పాపముల నుండి విడివడును.