విష్ణు మహా పురాణము

Table of Contents

6 - నరక వర్ణనము

 

 

ఓ విప్రులారా! పాపాత్ములు పడవేయ బడు రౌరవాది నరకములను గూర్చి యిక వినుడు. రౌరవము, సౌకరము, రోధము, తాలము, విశసనము, మహాజ్వాల, తప్తకుంభము, మహాలోభము, విమోచనము, రుదిరాంభము, వసాతప్తము, క్రుమీశము, కృమి భోజనము, అసిపత్రవనము, కృష్ణము, లాలాభక్షము, పూయవహము, వహ్నిజ్వాల, అధశ్శిరము, సందంశము, కృష్ణ సూత్రము, తమస్సు, ఆవీచి, శ్వభోజనము, అప్రతిష్టము, మావీచి అనునవి. పరమ దారుణములైన మరిపెక్కు నరకములు గలవు. ఇవి యముని పరిపాలన దేశములు. శస్త్ర, అగ్ని, విషములం బ్రయోగించు యమభటులు పాపకర్మాసక్తి గల వారు వీని యందుందురు. 

 

 

దొంగ సాక్ష్య మిచ్చిన వాడు, పక్షపాత బుద్ధితో మాట్లాడు వాడు, అబద్ధము చెప్పువాడు రౌరవమున కేగును. భ్రూణ హత్య నగర ధ్వంసము గోహత్య చేసిన వాడు, జీవుల యూపిరి యాడకుండ చేసిన వాడు భయంకర రౌరవమున కేగుదురు. బ్రహ్మ హత్యా కారకుడు, బంగారమును దొంగిలించిన వాడు వాని స్నేహితుడు శూకర నరకమున బడుదురు. క్షత్రియ, వైశ్య ఘాతకుడు, గురు పత్నిని, అప్ప చెల్లెండ్రను గూడిన వాడు, రాజభటుని హత్య చేసిన వాడు తప్తకుంభమను నరకమున గూలును. మద్య విక్రేత, వధ్య పాలుడు, ఉరితీయు స్థానమును గాయువాడు (లేక) వధింప దగిన వానిని గాపాడిన వాడు, కేసర విక్రేత (విషమమ్ము వాడు) భక్తుని విడిచిన వాడు తప్తలోహమను నరకమున గూలుదురు.

 

 

కూతురును కోడలిని సంగమించిన వాడు మహా జ్వాలమను నరకమున పడవేయ బడును. వేద దూషకుడు, వేద విక్రయి, అగమ్యగామి, శబలమను నరకము పాలగును. దొంగ హద్దు మీరిన వాడును విమోహ నరకమున బడును. దైవ, బ్రాహ్మణ, పితృ ద్వేషియు, రత్నములను (శ్రేష్ఠ వస్తువులను) దూషించిన వాడు కృమిభక్ష్యమను నరకమును పొందును. దుర్యాగము చేసిన వాడు క్రుమీశమను నరకము పాలగును. పితృ దేవతాతిథులను విడిచి కుడిచిన వాడు లాలా (చొంగ) భక్ష్యమను నరకమున బడును. బాణములను చేయువాడు వేధక నరకమున బడును. ఖడ్గాదులను చేయు వాడును, కర్ణికారుడును, (కర్ణి - ఒక విధమైన యాయుధము) పరమ దారుణమైన విశసనమను నరకమున పడుదురు. అపాత్ర దానము పట్టిన వాడు, ఆయాజ్య యాజనము చేయ కూడని వానిచే యజ్ఞము చేయించిన వాడు, నక్షత్ర సూచకుడు, జ్యోతిష శాస్త్రము తెలియకనే జాతక ముహూర్తములు చెప్పువాడు అధోముఖ నరకము నందుండును. అతిథికి పెట్టక మృష్టాన్న మారగించు వాడు కృమిపూయ నరకమున కేగును. లాక్ష (లక్క), మాంసము, రసములు, మధుర పానీయములు, నువ్వులు, ఉప్పు అను వానినమ్ము బ్రాహ్మణుడు కూడ కృమిపూయ నరకమున పడును. పిల్లి, కోడి, మేక, కుక్క, పంది, పక్షులు వీనిని పెంచు వానికిని అదేగతి.

రంగోపజీవి (నాటకములను నటించి జీవించు వాడు), జాలరి, కుండా భగభక్షకుడు (వీర్య పానము చేయువాడు) లేక జారాజుని అగ్రము నుతించు వాడు, విషము పెట్టువాడు, సూచీ (చాడీ కోరు), పేచీ కోరు, మహిషకుడు (దున్నపోతుల వ్యాపారి) పర్వములందు స్త్రీ సంయోగము చేసిన బ్రాహ్మణుడు, కొంప లంటించు వాడు, మిత్ర ఘాతకుడు, శకునముల చెప్పువాడు, గ్రామ పాచకుడు, సోమ విక్రయ రుదిరాంధ కూపమున పడుదురు. తేనె పుట్టలను రేపిన వాడు, గ్రామ నాశనము చేసిన వాడు వైతరిణిం బడును. 

 

 

రేతః పానము చేసిన వాడు, మర్యాదోల్లంఘనము చేసిన వాడు (సదాచారములను, కట్టుబాట్లను దప్పిన వాడు), మాయాజీవులు, ఆచారహీనులు, కృచ్చ్ర నరకమున బడుదురు. ఔరభ్రికులు (గొర్రెల మందచే జీవించు వారు) మృగవ్యాధులు వహ్నిజ్వాలమను నరకమున బడుదురు. అపాకము లందు (వండ కూడని వస్తువులకు) అగ్నిని పెట్టిన వాడు అదే నరకమునం బడును. వ్రత లోపము, ఆశ్రమ ధర్మచ్యుతి చేసిన వాడు, సందంశ యాతనమను నరకమున బడును. బ్రహ్మచారులు, కొడుకుల దగ్గర యధ్యయనము చేసిన వారు, శ్వభోజనమను నరకమున బడుదురు. ఇట్టివి నూర్ల కొలది, వేల కొలది నరకములు కలవు. పాపములను చేసిన వారు ఈ బొంది విడిచి, యాతనా శరీరముల నొంది యిందు హింసింప బడుదురు. వర్ణాశ్రమ విరుద్ధమైన కర్మను త్రికరణములచే చేసిన వారు నరకము పాలగుదురు. ద్యులోక మందలి దేవతలు, తల క్రిందులుగా నుండు నరక లోక జీవులచే చూడబడు చుందురు. దేవతలు నరక లోక వాసులను అథోముఖులుగా జూచు చుందురు. జీవులు, స్థావరములు, కృములు, జల జంతువులు, పక్షులు, పశువులు, నరులు, ధార్మికులు, దేవతలు నను వరుసలో జన్మించి క్రమముక్తి నందుదురు. 

 

స్వర్గ మందేందరు జీవు లుందురో నరక మందు నందరుందురు. పాపాము చేసి ప్రాయశ్చిత్తము చేసికొనని వాడు నరకమేగును. ఆయా పాపముల కనురూపములైన ప్రాయశ్చిత్తములను పరమర్షులు స్మరించి (స్మృతులలో) పెద్ద పాపమునకు పెద్దగ, చిన్నదానికి చిన్నగా ప్రాయశ్చిత్తములను దేల్పిరి. స్వాయంభువ మనువు మొదలయిన వారా ప్రాయశ్చిత్త కాండను రచించిరి. అన్నిటికిని ప్రాయశ్చిత్తము కృష్ణ స్మరణము. దానిని మించినది లేదు. ప్రాయశ్చిత్తమనగా తపస్సు. పాపము జేసి యనుతాపము నొందేనేని హరి స్మరణ చేసేనేని దానిని మించిన పుణ్య సాధనము లేదు. దాన జీవి నారాయణుని జెందును. ప్రాతః కాలాహో రాత్రములందు సంధ్యా సమయము లందు నారాయణ స్మరణ చేసి పాప క్షయ మంది నరుడు నారాయణుని పొందును. ఎవ్వని మనస్సు జప హోమార్చనము లందు వాసుదేవు నందు లగ్నమై యుండునో వాడు ముక్తి నొందును. విష్ణువు నందప్పు డప్పుడు మనసు నిలువక చలించెనేని, వానికి దేవేంద్రాది పదవి లభించును. పునరావృత్తి లక్షణమైన స్వర్గ గమన మెక్కడ? ముక్తి భీజమైన వాసుదేవ నామ స్మరణ మెక్కడ? కావున అహర్నిశము పురుషుడు విష్ణు స్మరణ జేయుచు పాపక్షయమంది శుద్దుడైనచో నరకమును జూడడు. స్వర్గము మనః ప్రీతి గూర్చునది. దానికి వ్యతిరేకము నరకము. నరక స్వర్గము లనగా పాప, పుణ్యములే. అవి వానికి పర్యాయ పదములు, వాసు దేవిక చిత్తుడు అపునరావ్రుత్తి లక్షణ మైన సాయుజ్య యుక్తి కర్హుడన్న మాట. 

 

 

ఒకే వస్తువు దుఃఖమునకు, సుఖమునకు, ఈర్షకు, కోపమునకు కారణ మగును. కావున నే వస్తువైనను దుఃఖాత్మకమే కాదు. ఆ వస్తువే యోకప్పుడు కోపమునకు హేతువై యదే ప్రసన్నతకు గారణ మగును. కావున కేవలము దుఃఖాత్మకము, కేవలము సుఖాత్మకము నయిన వస్తువు లేనేలేదు. సుఖ, దుఃఖాది లక్షణమైన యీ పరిణామము కేవల మానసికము, బ్రహ్మ జ్ఞాన మొక్కటియే జ్ఞానము. లౌకిక మయిన జ్ఞానము బంధమునకు బ్రహ్మ జ్ఞానము, ముక్తికిని కారణ మగును. ఈ ప్రపంచ వ్యవహారము తెలివి వలననే జరుగును. కాని దీనికే మంటదు. విద్య, అవిద్య యను వానిని బ్రహ్మ జ్ఞానము, లౌకిక జ్ఞానమునుగా గ్రహింప వలెను. (మోక్ష విషయకమైన జ్ఞానమే జ్ఞానమనియు తదన్య విషయకమైన తెలివి విజ్ఞాన మనియు నమరుడు చెప్పెను.) అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయాఽమృత మశ్నుతే అనగా అవిధ్యచే జరా, మరణములను లేకుండ జేసికొని విద్యచే నమృత స్థితిని (మోక్షమును) బొందునని శృతి చెప్పినది. ఔపనిషదమైన జ్ఞానము, బ్రహ్మ జ్ఞాన మగును. వేద విద్యా శబ్ద వాచ్యమై కేవల మపునరావృత్తికమైన ముక్తికి హేతువగును. తక్కిన వేద వేదంగాది విద్యలు తదుదిత కర్మానుష్టానము నవిద్యగా బేర్కొనబడి స్వర్గాది భోగమాత్ర సాధనములగు నన్నమాట. వీనిచే జిత్తశుద్ది వడసి పునరావృత్తి సహితము లయిన పుణ్యలోక భోగములను బొందవచ్చును. కేవలము విద్య వలననే మోక్ష స్థితి కలుగునని భావము. ఈ విధముగా నాచే భూమండలము సమస్త పాతాళములు నరకములు మీకు చెప్ప బడినవి. సముద్రము, పర్వతములు, ద్వీపములు, నదులు సంక్షేపముగ చెప్ప బడినవి. ఇంకేమి వినగోరు చున్నారు.