విష్ణు మహా పురాణము

Table of Contents

35 - బలరామ పరాక్రమ వైభవము

 

 

శ్రీపరాశరులతో బలభద్రుడు సేసిన యమునాకర్షణాదులు విచిత్ర లీలలు తాము సెలవీయ నేను విన్నాను. వెండియు నా మహానుభావు డొనరించిన వింతలను దెలుపుడన నమ్మౌని యిట్లు తెలుప దొడంగె

 

 

బలరాముడన గేవల మనంతుడు ధరణిం ధరించు శేషుడే. ఆయన యప్రమేయ మూర్తి. సుయోధనుని కూతురును స్వయంవర సన్నాహము లందున్న దానిని జాంబవతి కొడుకు సాంబుడు శూరాగ్రేసరుడు బలిమినై నెత్తికొని పోయెను. దానగుపితులై మహావీరులు భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనాదులు పోర వీని బంధించుకొని పోయిరి. అది విని యాదవులెల్లరు దుర్యోధనాదులపై కినుక గొని యనికుద్యమించిరి. కృష్ణుడు నందున్నాడు. వారినాపి బలభద్రుండే నొక్కడ జాలుదు నిదె కౌరవులపై కేగెద. నా మాటం బట్టి వానిని విడిపింతురని మదాలోల మధురాక్షరముగా బలికెను. అన్న యట్లాతడేగి హస్తి నగరముం గని బాహ్యోప వనమందు విడిది సేసెను గాని పురములో మాత్రము ప్రవేశింపడయ్యె. బలరాము రాక తెలిసి దుర్యోధనాదులు గోవును, అర్ఘ్యము రామునకు నివేదించిరి. అవి యథావిధిం గైకొని కౌరవులతో ఉగ్రసేనుడాజ్ఞ యిచ్చుచున్నాడు సాంబుని వెంటనే విడుదల చేయుడనియే. భీష్మద్రోణాదులు మరి రాజులు కర్ణ దుర్యోధనాదులు క్షోభించి కుపితులై బాహ్లికాదులు కౌరవులు యదువంశము రాజ్యార్హము గాదని చూచికూడ ఓ ముసలీ! నీ విప్పుడు పలికిన మాటయేమి? కురుకులము వారికి యాదవుడెవ్వడాన యిచ్చును? ఉగ్రసేనుడు కూడా కౌరవులకు శాసించు వాడగు నేని శ్వేతచ్చాత్రములు రాజ యోగ్యములైన విడంబనము నింక చాలును. ఓ బలా! నీవు పొమ్ము. మానుము. అన్యాయవర్తనుని సాంబుని నీ యొక్క ఉగ్రసేనుని యొక్క ఆజ్ఞతో వదలి పెట్టము. మాన్యులమైన మాకు కుకురాంధకులు చేసిన ప్రణతిని కూడ మేము ప్రణతిగ స్వీకరించుట లేదు. అది చేయబడనట్లే. అట్టియెడ భృత్యులగు మీరు మాకాజ్ఞ యిచ్చుట యేమి? సహాసన సహభోజనముల వలన మీరు గర్వమెక్కింప బడినారు. మీ తప్పేమి? మీపై ప్రీతిచే నీతిని గమనింపని పొరపాటు మాది. ఓ బలరామ! నీకిప్పు డిచ్చిన అర్ఘ్యము (పూజ) ప్రేమచే నీయబడినది. ఇది మా కులము నుండి మీ కులమున కుచితమైనది కాదు. అని పలికి కురువులు హరి కుమారుని సాంబుని వదలమను నిశ్చయమునకు వచ్చి యప్పుడ హస్తినాపురముం బ్రవేశించిరి.

 

 

తిరస్కారము వలన కల్గిన కోపముచే మత్తుకొని ఘూర్ణిల్లి లేచి హలాయుధుడు మడమం భూమి నడిమి కొట్టెను. ఆ దెబ్బతో భూమి బ్రద్దలయ్యెను. ఆ మీద దిక్కులు ప్రతిధ్వనించునట్లు బాహువులు చరచెను. కనులు మిగుల నెరుపెక్క కనుబొమలు ముడువడి మోముకుటిలము కాగ నిస్సారులు దురాత్ములునగు కౌరవుల కహో! ఎంత పొగరు! వీరి దొరతనము మా కాల ప్రభావము వలన వచ్చినది. (మా గ్రహవిదశ తాత్కాలికముగ వక్రమగుటచే వచ్చినదన్న మాట) దానన గదా ఉగ్రసేనుని యాజ్ఞను గూడ యిపుడుల్లంఘింప దలచుచున్నారు. సుధర్మ సభ నధిష్టించిన వాడు ఉగ్రసేనుడు. శచీపతి కాడు, ఛీఛీ! చాలామంది మానవుల ఉచ్చిష్టమయిన రాజాసనము నందు వీరికి దుష్టి కలిగినది (ఎంత నీచము) ఎవ్వని నౌకరుల అంగనాజనము పారిజాత పుష్ప మంజరులను గోప్పులం దురుముదు రట్టివాడు మా ప్రభువు సమస్త రాజాధిరాజు సార్వభౌముడుగ్రసేను డట్లుండు గాక! ఇప్పుడుర్విని నిష్కౌరవము నొనరించి యారేని రాజధాని కరిగెదను. కర్ణుని, దుర్యోధనుని, ద్రోణుని, భీష్ముని, బాహ్లికుని, దుశ్శాసనాదులను, భూరిని, భూరిశ్రవసుని, సోమదత్తుని, శలుని, భీమార్జున, యుథిష్ఠిరులను, గవలను మఱియుం గల కౌరవులను గజాశ్వరథ బలముతో మట్టువెట్టి వరుడగు సాంబకుమారుని భార్యతో జేకొని ద్వారకాపురి కేగి ఉగ్రసేనాదులను బందుగులతో దర్శింతును. లేదా కౌరవ రాజధానిని (హస్తినాపురమును) కౌరవులతో గంగలో గలిపెదను. అని పలికి మత్తున నెరుపారుగన్నులతో ప్రాకార వప్రదుర్గముల లాగి పెల్లగించుటకై క్రింది ముఖమయియున్న నాగలిం బట్టి లాగెను. అంత నొక్కుమ్మడి ఆ ఘూర్ణితమైన యా హస్తినాపురమును గని హృదయములు సంక్షుబ్ధములై కౌరవులు మొర్రోయని యాక్రోశించిరి. రామా! రామా! మహావీరాగ్రేసరా! క్షమింపు క్షమింపుము. కోప ముపసంహరింపుము. ప్రసన్నుడవగుము. ఇదిగో సాంబుడు భార్యతో నీ బలిమిని వెడలింప బడినాడు నీ ప్రభావ మెరుంగక అపరాథము సేసిన మమ్ము క్షమింపుమనిరి. అవ్వల కౌరవులు సపత్నీకముగ సాంబుని తమ పురంబు నుండి సాగనంపిరి. అతడును భీష్మ, ద్రోణ, కృపాచార్యాదులకు నమస్కరించి మరలి వక్తగావున నేను శమించితినని పలికెను. నేటికిని అట్టిట్టు మట్టుగదలిన రూపముతో నా నగరము గనబడు చున్నది. బలరాముని బలశౌర్యోప లక్షణమైన ప్రభావమిది. బలరామునితో గూడ సాంబుని కౌరవులు పూజించి ఉద్వాహ ధనముతో (సారెతో) భార్యతో గూడ సాగనంపిరి.